Sunday, May 31, 2009

శ్రీ సిధ్ధివినాయక దేవాలయము, ఐనవల్లి





శ్రీ సిధ్ధి వినాయక దేవాలయం, ఐనవల్లి

ఆకాశం మేఘావృతమైవుంది. చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. సన్నని రోడ్డుకటూ ఇటూ పచ్చని పొలాలూ, కొబ్బరి తోటలూ పిల్లగాలుల వింజామరలు వీస్తుంటే ప్రకృతి అందాలు మనసునిండా నింపుకుంటూ ముమ్మిడివరంనుంచీ 12 కి.మీ. ల దూరంలో వున్న ఐనవల్లి శ్రీ సిధ్ధి వినాయక దేవాలయానికి చేరుకున్నాము.

అతి పురాతన కాలంనుంచీ భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఈ బొజ్జ గణపయ్యను దక్షప్రజాపతి దక్ష యజ్ఞం ప్రారంభించటానికి ముందు పూజించాడని అంటారు. వ్యాసమహర్షి తన దక్షిణాపధ యాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని ఇంకో కధనం.

ఏ కధ నిజమైతే మనకెందుకుగానీ పురాణకాలంనుంచీ లబ్ధ ప్రతిష్టుడయిన ఈ దేవదేవుని, దక్ష ప్రజాపతి, వ్యాస మహర్షి వంటి మహనీయులు పూజించిన ఈ గణాధిపతిని ఇవాళ మేము దర్శించుకున్నామని ఆనందించాము.

ఈ దేవాలయంలో ఇంకా అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, క్షేత్రపాలకుడైన కాలభైరవస్వాముల ఉపాలయాలు వున్నాయి.

పురాతన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని పెద్దాపురం రాజులు పునరుధ్ధరించారు. ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో వున్నది.

ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలోనూ, వినాయక చవితి, నవరాత్రి, కార్తీక మాసం మొదలగు పర్వదినాలలోనూ విశేష పూజలు జరుగుతాయి.

ఇక్కడ భక్తులు రాత్రిపూట గుళ్ళో నిద్ర చేస్తారు. ఉదయం ఆలయంలో భక్తులకోసం అన్నదానం వుంది. గెస్టు హౌస్, హోటళ్ళల్లో బసచేయదలుచుకున్నవారికి అమలాపురంలో సౌకర్యంవుంది.

కాకినాడనుంచి 70 కి.మీ (వయా యానాం, ముమ్మిడివరం, ముక్తేశ్వరం), రాజాంనుంచి 55 కి.మీ. (వయా రావులపాలెం, కొత్తపేట, వానపల్లి), అమలాపురంనుంచి 14 కి.మీ ల దూరంలో వున్న ఈ దివ్య క్షేత్రం చిరునామా
ఎక్జిక్యూటివ్ ఆఫీసరు,
శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవస్ధానం,
ఐనవల్లి (గ్రామం మరియు మండలం)
పిన్ 533211
తూర్పు గోదావరి జిల్లా
ఫోన్ నెంబరు 08856 – 225812

ఆలయం తెరచి వుంచు సమయాలు
ఉదయం 6 గం. ల నుంచీ 12-30 దాకా
సాయంత్రం 4-30 నుంచీ 7-30 దాకా
అభిషేక సమయం ఉదయం 6 గం. ల నుంచీ 11-30 దాకా.

Tuesday, May 5, 2009

ముమ్మిడివరం

భగవాన్ శ్రీ బాలయోగి మందిరం

ముమ్మిడివరం

సాయంత్రం 4 గం. లకు మురమళ్ళ లో బయల్దేరాము. త్రోవలో ముమ్మిడివరం బోర్డు చూసి మా చిన్నతనంలో బాలయోగిగారి గురించి చెప్పుకునే విశేషాలు గుర్తుకొచ్చి వాళ్ళు ఎంతోకాలం తపస్సు చేసిన ఆ ప్రదేశాన్ని సందర్శించటానికి చాలా సంతోషంగా వెళ్ళాము. మా ప్రయాణాలు చాలా వింతగా వుంటాయి లెండి. ఏవో రెండు మూడు చోట్లనుకుని బయల్దేరుతాము. త్రోవలో అంతకు ముందు మేము చదివిన విశేషాలేమైనా గుర్తొస్తే, ఆ ప్రదేశాలూ, ఇంకా ఆ ప్రాంతాల్లో కనుక్కోగా తెలిసే ప్రదేశాలు, ఒక్కోసారి మా ఆసక్తి గమనించి స్ధానికులు తెలిపే కొత్త ప్రదేశాలూ చాలానే చుట్టబెడతాము. ముందుగా మా ప్లానులో లేనివాటన్నిటినీ బోనసులనుకుంటాము. ముమ్మిడివరం మాకు బోనసే. దూరమేమో అనుకున్నాముగానీ మురమళ్ళనుంచి కేవలం 15 ని.ల కారు ప్రయాణం.

ఇద్దరు బాలయోగీశ్వరులు తపస్సుచేసిన పుణ్య స్ధలం ఇది. బహుశా చిన్నతనంలోనే వారు తపస్సు ప్రారంభించటంతో వారిని బాలయోగీశ్వరులన్నారేమో. భగవాన్ పెద్ద బాల యోగీశ్వరుల జననం 23-10-1930. ఆయన 16వ ఏటనే, 22-6-1946లో తపస్సు ప్రారంభించారు. ఆయన ఆహార పానీయాలు కూడా విసర్జించి తపోనిష్టలో నిమగ్నులయ్యారు. ఫిబ్రవరి 1949లో తమ తపస్సుకు అంతరాయం కలుగకుండా తలుపులు తాళం వేసి వుంచమని భక్తులకు చెప్పారు. ఆయన ఎపరికీ దర్శనమివ్వక నిరంతరం తపస్సులో మునిగి వుండటంతో భక్తులు నిరాశ చెందారు. ఒకసారి దర్శనమిచ్చినప్పుడు కనీసం ఏడాదికి ఒకసారైనా తమకు దర్శనమివ్వాలని భక్తులు ప్రాధేయపడటంతో వారి కోరిక మన్నించి, ఏడాదికొకసారి, మహా శివ రాత్రి మరునాడు ఉదయే 4 గం. లనుంచి, రాత్రి 12 గం. లదాకా భక్తులకు దర్శనమివ్వటానికి అంగీకరించారు. అప్పుడు కూడా ఆయన తపస్సులో నిమగ్నమై వుండేవారు. భక్తులు నిశ్శబ్దంగా అలతి దూరంనుంచి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు.

ఇంక భగవాన్ శ్రీ చిన్న బాలయోగిగారి జననం 3-11 1941. ఆయన తన 8వ ఏటనే 26-3-1950లో తపస్సు ప్రారంభించారు. ఈయనకూడా తాళం వేసివున్న గదిలో ఆహార పానీయాలు లేకుండా అనేక సంవత్సరాలు తపస్సుచేసి 28-10-1991 లో సమాధి చెందారు.

ఆహార పానీయాలు లేకుండా, తాళం వేసివున్న గదిలో నిరంతరం తపోనిష్టలో మునిగి ఆ ప్రాంతాన్ని పునీతం చేసిన ఈ మహానుభావుల గురించి మా చిన్నతనంలో అనేక కధలు చెప్పుకునేవారు. వారి దర్శనానికి వెళ్ళినవారిలో కొందరికి ఆ ప్రదేశంలో వారి తపో మహిమల వలన వింత దృశ్యాలు కనిపించేవట. అలాంటి పావన ప్రదేశాన్న దర్శించుకుని అలౌకిక ఆనందంతో మా తదుపరి మజిలీ ఐనవిల్లికి బయల్దేరాము.