Tuesday, February 14, 2012

గౌతమ బుధ్ధుడు నడయాడిన చోటు!






(భక్తి మాసపత్రికలో మే 2011 న ప్రచురించబడిన నా వ్యాసం)

గౌతమ బుధ్ధుడు నడయాడిన చోటు!

భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి. అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్, చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా. బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.

ఇందులో బీహార్ రాష్ట్రంలోని గయకు సమీపంలో వున్న బుధ్ధగయ, వారణాసికి 18 కి.మీ. ల దూరంలో వున్న సారనాధ్ చూసే అవకాశం కలిగింది మాకు. ఇక్కడే బుధ్ధుని జీవితంలోని అతి ముఖ్యమైన రెండు సంఘటనలు, శాక్య రాజకుమారుడు సిధ్ధార్ధునికి జ్ఞానోదయమయి బుధ్ధుడుగా మారిన సంఘటన మొదటిదయితే, సారనాథ్ లో బుధ్ధుడు చేసిన మొదటి ప్రవచనం రెండవది.. అంటే బౌధ్ధమతం బీహారు రాష్ట్రంలో మొదలయి, వికసించటమేకాదు, అనేక వందల సంవత్సరాలు ఇక్కడ అత్యున్నత స్దితిలో విలసిల్లింది. ఆ సమయంలో ఇక్కడ అనేక బౌధ్ధారామాలు వుండేవి. వాటిని విహారాలు అనేవారు. బీహారు రాష్ట్రానికి ఆ పేరు విహారం నుంచే వచ్చిందంటారు. బుధ్ధగయ యాత్ర చేసిన యాత్రీకులు, అక్కడి ప్రశాంతతకు ఆనందపరవశులౌతారన్నది నిజం. ఈ పుణ్య స్ధలానికి దేశవిదేశాలనుంచి బౌధ్ధమతస్తులు వస్తుంటారు. బుధ్ధునికి ఇక్కడే జ్ఞానోదయం కలగడంతో దీనికి అంత ప్రాముఖ్యత. అందువల్లనే ఈ క్షేత్రానికి 2002 వ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ స్ధలంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కో గుర్తింపు లభించింది.

బుధ్ధగయ

క్రీస్తుపూర్వం ఐదువందల ఇరవైఎనిమిది సంవత్సరాల క్రితం, ఓ యువకుడు జ్ఞానాన్వేషణ చేస్తూ, వైశాఖమాసం పూర్ణిమరోజున ఓ చెట్టు క్రింద కూర్చుని ధ్యాన నిమగ్నుడై వున్నాడు. అప్పుడు అటుగా వెళుతున్న ఓ స్త్రీమూర్తి ఎన్నోరోజులుగా ఏమీ తినకుండా వున్నట్లున్న ఆ యువకునికోసం వెన్నతో కలిపిన ఆహారాన్ని అందించసాగింది. ఆమె అందిస్తున్న ఆహారాన్ని తీసుకుంటూ శక్తి పుంజుకున్న ఆ యువకుడు తన జ్ఞానాన్వేషణను మరింత తీవ్రతరం చేశాడు. మూడురోజుల తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగింది. తర్వాత అతను అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడువారాలు ధ్యానంలో గడిపాడు. అనంతరం అతను సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశాడు. ఆ యువకుడే గౌతమబుధ్ధుడు.

బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. క్రమంగా గౌతమ బుధ్ధుని శిష్యులు బుధ్ధునికి జ్ఞానోదయమయిన వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి రాసాగారు. కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.

బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు. ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే. అంతేకాదు. అప్పటికే ఆదరణ తగ్గిన బౌధ్ధమతాన్ని పునరుధ్ధరించటానికి అశోకుడు కృషి చేశాడు. ఆయన కట్టించిన అనేక బౌధ్ధారామాలు, అశోక స్ధంబాలుగా పిలువబడే స్ధంబాలు, ఇప్పటికీ స్ధిరంగా నిలిచి ఆనాటి గాధలను చాటుతున్నాయి.

భారత దేశంలో బౌధ్ధమత ప్రాశస్త్యం తగ్గిన తర్వాత బౌధ్ధగయలోని ఈ ఆలయానికి కూడా ఆదరణ తగ్గటంతో ఆలయం మట్టి, ఇసకలతో కప్పబడిపోయింది. 1883 లో బ్రిటిష్ ఆర్కియాలజీ సొసైటీ కోసం అలెగ్జాండర్ కన్నిక్హామ్ తన సహచరులతో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపించి ఈ ప్రదేశ ఔన్నత్యాన్ని పునరుధ్ధరించారు.

ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు. అశోక చక్రవర్తి పరిపాలనలో బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు. బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది. ఇక్కడే ఆయన తపస్సు చేసింది.

ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి. ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 64 అడుగుల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద బుధ్ధ విగ్రహాలలో ఇదొకటని చెబుతారు.


సారనాధ్


సిధ్ధార్ధునికి జ్ఞానోదయమయిన తర్వాత ఇక్కడికి వచ్చి మొట్టమొదట ఐదుగురు వ్యక్తులకు తన సిధ్ధాంతాలను బోధించాడు. అందుకే ఈ ప్రదేశం బౌధ్ధులకు అత్యంత పవిత్ర స్ధానం. వీరి విగ్రహాలు ఇక్కడ వున్నాయి.

సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం 143 అడుగుల ఎత్తు, 93 అడుగుల చుట్టుకొలతతో విలసిల్లుతోంది. దీనిలోని రాళ్ళు ఇనప లింకులతో కలపబడ్డాయి.
దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా, ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.


20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది. దీనిపేరు మూల గంధ కుటి విహార్. ఇందులో బుధ్ధుడి విగ్రహం వున్నది. ఈ విగ్రహం పాలరాతితో చేయబడి పైన బంగారు రేకు తాపడం చెయ్యబడింది. ఈ ఆలయం లోపల గోడలపైన జపాన్ కళాకారులు వేసిన చిత్రాలు వున్నాయి. తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.

ఇక్కడ ఒక పెద్ద గంట వున్నది. దీని శబ్దం 2 కి.మీ. ల దూరం వినబడుతుందిట. ఆ గంటనిండా టిబెటన్ మంత్రాలు చెక్కబడివున్నాయి. ఈ గంటను జర్నన్ మహిళలు బహూకరించారుట.
ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది. ఈ మ్యూజియంలోకి ప్రవేశించగానే అశోకస్ధూపాన్ని దర్శించుకుంటాం. ఆ అశోకస్ధూపమే మన జాతీయచిహ్నంగా భాసిస్తోంది. ఇక్కడ ధర్మరాజకస్ధూపం, ధమేకస్ధూపం వున్నాయి. ఈ ధమేకస్ధూపం దగ్గరే బుధ్ధుడు తన రెండవ ప్రవచనాన్ని చేశాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

7 వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ, సారనాధ్, ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు.

ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి?

ఈ క్షేత్రానికి ఆగస్ట్ నుంచి మార్చి మధ్యకాలంలో వెళితే బాగుంటుంది. బీహారురాష్ట్రంలో వున్న బుధ్ధగయకు దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు, విమాన మార్గాలలో చేరుకోవచ్చు. ఇక్కడ యాత్రీకుల అవసరాలకు తగ్గట్లు బస, వసతి సౌకర్యాలు లభిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో నున్న సారనాధ్, కాశీక్షేత్రానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో వుంది. సారనాధ్లో కూడ బస వసతి సౌకర్యాలకు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు.

బుధ్ధగయకు వెళ్ళినవారు అక్కడకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోనున్న రాజ్ గిర్ ను తప్పక దర్శించుకోవాలి. ఇక్కడున్న కొండపై విశ్వశాంతి స్ధూపం యాత్రీకులను అమితంగా ఆకర్షిస్తుంది. ఆ స్ధూపానికి దగ్గర్లోనే వేణువనం అనే వెదురు ఉద్యానవనం వుంది. అక్కడకు గౌతమబుధ్ధుడు అప్పుడప్పుడు వచ్చేవాడట. ఈ రాజ్ గిర్ లోనే సప్తపర్ణి గుహ వుంది. బుధ్ధుని నిర్యాణం తరువాత ఇక్కడే మొదటి బౌధ్ధ సమావేశం జరిగిందట. సుమారు వెయ్యిమెట్లను ఎక్కి పైకి చేరుకున్న భక్తులు అక్కడున్న వేడినీటి జలపాతంలో స్నానం చేస్తుంటారు. ఈ ఊర్లో మరో విశేషం. ఈ నగరంలో మోటారు వాహనాలకు అనుమతి లేదు. టాంగాలు అనబడే గుర్రపుబండ్లకే అనుమతి వుంది. అలాగే బుధ్ధగయను దర్శించుకున్న భక్తులు అక్కడికి సమీపంలోనున్న శిధిల నలందా విశ్వ విద్యాలయాన్ని కూడ దర్శించుకోవచ్చు.

Friday, February 10, 2012

శ్రీ సూర్య భగవాన్ దేవాలయం, తిరుమలగిరి, సికిందరాబాద్




ఉదయంనుంచి అస్తమయందాకా (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు. కానీ ఆ సూర్యనారాయణునికి ఆలయాలలు మాత్రం అతి తక్కువ వున్నాయి.


మన రాష్ట్రంలోవున్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. అలాగే సికింద్రాబాదులో తిరుమల గిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్య భగవాన్ దేవాలయం దిన దిన ప్రవర్ధమానమపుతూ అనేకమంది భక్తులనాకర్షిస్తున్నది. శ్రీ సూర్యశరణ్ దాస్ మహరాజ్ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్ దాస్ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.


చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్కరించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు.


పక్కనే అశ్వధ్ధ, వేప చెట్లు కలిసివున్న వేదిక. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయలే అత్యంత సుదరంగా వెలసిన శివ లింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్పామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి.


ఆదివారాలు, సెలవు రోజులు, పర్వ దినాలలో భక్త జన సందోహం ఎక్కువగా వుంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులలో చాలామంది వేయించిన శనగలు, గోధుమలు స్వామికి సమర్పిస్తున్నారు. అలాగే కొందరు భక్తులు పాయసం, పులిహోర నైవైద్యాలు పెట్టించి అక్కడకొచ్చిన భక్తులకు ప్రసాదాలు పంచుతున్నారు. మేమొక గంటపైన వున్నాము. అంతసేవూ ఆలయంవారో, భక్తులో అందరికీ ప్రసాదాలు పంచుతూనే వున్నారు.


ముఖ్య ఉత్సవాలు

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రధ సప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

ఇక్కడ భక్తులు మొక్కుకుని తమ కోరికలు తీరుతే 12 ఆదివారాలు 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు.

దర్శన సమయాలు

సోమవారం నుంచి శనివారందాగా ఉదయం 7 గం. లనుంచీ 11 గం. లదాకా, సాయంద్రం 5 గం. నుంచీ 7 గం.లదాకా.

ఆదివారం 6-30 నుంచి 12-30 దాకా, సాయంత్రం 5 గం. ల నుంచీ 7-30 దాకా.

మార్గము -- సికింద్రాబాదు డయమండ్ పాయింట్ నుంచి తిరుమలగిరి వెళ్ళే దోవలో, బౌనేపల్లి మార్కెట్ యార్డ్ ముందునుచి వెళ్తుంటే ఎడమపక్క ఫుడ్ వరల్డ్ వస్తుంది. అది దాటగానే, దానిని ఆనుకుని వున్న సందులో లోపలకెళ్తుంటే కుడిచేతిపక్క 6వ సందులోకి తిరిగి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. సందు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. పొరబాటున సందు గుర్తుపెట్టుకోలేక ముందుకు వెళ్తే వచ్చేది టి జంక్ష్షన్. అక్కడ వెనక్కితిరిగి, తిరిగి వచ్చేటప్పుడు ఎడమవైపు మొదటి సందు తిరగండి. పార్కింగుకి పెద్ద ఇబ్బందిలేదు.

మన సమీపంలో వున్న శ్రీ సూర్యనారాయణస్వామిని ఆయనకి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో సేవించి తరిద్దాం.