Wednesday, December 31, 2008

సోమారామం

ఎడమ వైపు క్రింద సోమేశ్వరాలయం, పైన అన్నపూర్ణాదేవి ఆలయం, కుడి ప్రక్క జనార్దనస్వామి ఆలయం
గర్భగుడి విమానం, గుడి గోపురం

సోమారామం
(గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా)

సదాశివుని ఆదేశముచే కుమారస్వామిచే గురిచూసి కొట్టబడ్డ తారకేశ్వరుని కంఠంలోని అమృతలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడ్డదని చెప్పకున్నాముగదా.. అందులో ఒక ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గునుపూడి అనే ప్రాంతంలో పడ్డది. శివుని ఆదేశానుసారం, దేవగురువు బృహస్పతి సలహాపై దేవతలలో ఒకరైన చంద్రుడు దేవగణములతో వచ్చి ఆశ్వీయజ శుధ్ధ దశమి రోజున శివ లింగప్రతిష్ఠ జరిపారు. ఈ శకలాలు పడ్డచోట ఓం అనే శబ్దంతో పడ్డాయి. క్షీరారామంలో తప్ప మిగతా ప్రదేశాలలో ఒకే సమయములో వివిధ దేవతలచేత ఈ లింగాలు ప్రతిష్ఠంచబడ్డాయి.

కవి సార్వ భౌముడు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణంలో ఈ సోమారామం గురించి వర్ణించారు. అగస్త్య మహర్షి తన కాశీ వియోగ దుఖాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా కాశీ ఖండం అనే గ్రంధం లో వ్రాయబడివుంది.

మూల విరాట్ సోమేశ్వరలింగం పీఠం నుండి 2 అడుగుల ఎత్తులో వున్నది. ఇంకొక విశేషం. ఇక్కడ శివలింగం అమావాస్యకు గోధుమ, నలుపు రంగుల్లోను, పౌర్ణమికి తెల్లని రంగులోనూ ప్రకాశిస్తుంది. ఈ లింగం చంద్రుడి చేత ప్రతిష్ఠంపబడింది కనుక చంద్రుని వృధ్ధి క్షయలు లింగంలో ప్రతిబింబిస్తాయంటారు. ఈ లింగానికి వున్న నాగాభరణం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఈ ఆలయంలో దేవేరి అన్నపూర్ణ మొదటి అంతస్తులో కొలువై వున్నది. ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశగా వున్న కోనేరుని సోమగుండం లేక చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఆలయంలో జనార్దన స్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు నిత్యపూజలందుకుంటున్నాయి. అందుకే ఇది హరిహర క్షేత్రంగా పేరు పొందింది.

ఈ ఆలయం పాలకొల్లుకు 28 కి.మీ.,కైకలూరుకు 38 కి.మీ. గుడివాడకు 66 కి.మీ. దూరంలో వున్నది. ఈ ప్రదేశాల నుంచేకాక హైదరాబాదునుంచి కూడా బస్సు రైలు సౌకర్యాలున్నాయు.
























































































































Monday, December 15, 2008

అమరావతి

నిర్మాణంలో వున్న బుధ్ధ విగ్రహం
ఆలయ గోపురం
ఆలయ దృశ్యం

అమరావతి

అమరావతి గుంటూరుకి 32 కి.మీ. ల దూరంలో పవిత్ర కృష్ణవేణి నది ప్రక్కన వున్నది. గుంటూరు బస్ స్టాండునుంచి అమరావతి గుడి వరకు బస్సులు చాలానే వున్నాయి. ఇవేకాక ప్రైవేటు జీపులు, టాక్సీలు కూడా దొరుకుతాయి. అమరావతిలో వసతి, భోజన సౌకర్యాలకుఇబ్బంది లేదు. వాసవి ఆర్య వైశ్య నిత్యాన్నదాన సమాజంలో వైశ్యులకు ఉచిత భోజన ఏర్పాటు వున్నది. షిరిడి సాయి – పర్తి సాయి కపోతేశ్వర ధ్యాన మందిరం వారు కులాలకతీతంగా ఎవరు ముందువస్తే వారి పేర్లు నమోదు చేసుకుని, టోకెన్లిచ్చి, రోజూ 12 గం. లకు కొంతమందికి ఉచితంగా భోజనం పెడతారు.

ఇంక అమరావతిచరిత్ర గురించి తెలుసుకుందామా? నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది. అంతేకాదు, బౌధ్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.

అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిధ్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంగా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆవిద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు.

తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5 వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526 లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుధ్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టనయింది. కోటపాడుపడింది. అయినా అమరేశ్వరుడు మాత్రం ఆంధ్రరాజులకు ఆరాధ్యదైవంగానే వున్నాడు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి పరచినవారిలో శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ముఖ్యుడు. ఈయన హయాంలో ఆలయ పునరుధ్ధరణ చెయ్యటమేగాక అక్కడ పని చేసేవారికి, వ్యాపారులకు ఇళ్ళు కూడా కట్టించారు. క్రీ.శ. 1816 లో ఈయన మరణించిన తర్వాత స్వామివారి ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు అర్చకులు హైదరాబాదు నవాబైన నాజరుద్దౌలా గారికి చందూలాల్ అనే దివానుగారి ద్వారా పరిస్ధితి వివరించారు. నవాబు స్వామిని చెప్పమనండి చూద్దాం అన్నారుట. నవాబుకు అమరేశ్వర స్వామి కలలో కనబడి తన భక్తుల కోరిక తీర్చమని చెప్పాడుట. నవాబు సంతోషంతో ఖమ్మంజిల్లా మధిర తాలూకాలోని దెందుకూరు గ్రామంలో షుమారు 450 ఎకరాల భూమే కాక సంవత్సరానికి 1000 హాలీ రూపాయలు నగదు ఇవ్వటానికి ఫర్మానా జారీ చేశారు.

ఇంక ఆలయం గురించి తెలుసుకుందామా? అమృతలింగంలో పెద్దముక్క ఇక్కడ పడింది. అంతేగాక అది పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించాడుట. దానితో పెరగటం ఆగింది. అంతేగానీ శివును శిరస్సు మీద మేకు కొట్టటం నిజం కాదంటారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.

ఆలయంలో మనకు కనిపించే అర్చా మూర్తి 10 అడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి మార్బుల్ రాయిలాగా వుంటుంది. మిగతా భాగము క్రింది భాగములో భూమిలో వున్నది. స్వామికి అభిషేకం చేయటానికి వీలుగా గర్భ గుడిలో ఒక ప్రక్కనుంచి మెట్లు వుంటాయి. వాటి మీద నుంచి వెళ్తే వైన బాల్కనీలాంటి ప్రదేశంలో నుంచుని స్వామికి అభిషేకం చేస్తారు. అందరికీ గర్భ గుడిలోకి ప్రవేశం లేదు.

ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి.

పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్ఛారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుంది.







Sunday, December 14, 2008

పంచారామాల చరిత్ర

పంచారామాలు

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మహా విష్ణువు మూలంగా తమ జాతివారంతా నశించిపోతున్నారని, విష్ణువుని చంపి తమ జాతిని రక్షించాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడిని తనకు చావులేకుండా వరమివ్వమని కోరాడు. శంకరుడు సరేనని దేవ దానవులు అమృత మధనం చేసినప్పుడు లభించిన అమృత లింగాన్ని తారకుడికిచ్చి, ఈ అమృత లింగం యధాతధంగా వున్నంతమటుకు నీ ప్రాణానికి ఏ భయమూ లేదు అని వరమిచ్చాడు. తారకుడు ఆలింగాన్ని గొలుసుతో తన మెడలో ధరించాడు.

శివుడి నుంచి తనకు చావులేకుండా వరమేకాకుండా అమృత లింగాన్ని కూడా పొందిన గర్వంతో తారకుడు తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంద్రలోకంమీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలంతా మహా విష్ణు దగ్గరకి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారుట. విష్ణువు తారకుడు శివ వరము పొందినవాడు, నేనేమీ చేయలేను, ఆ శంకరుణ్ణే ఉపాయమడుగుదామనగా అందరూ మహా శివుడి దగ్గరకెళ్ళి తారకుని దుష్కృత్యాల గురించి విన్నవించుకున్నారు. శివుడు ప్రసన్నుడయ్యాడు. తారకుడికి తానే వరమిచ్చినా, లోకోధ్ధరణకోసం దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ చేయాలిగనుక దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడైన కుమారస్వామి ఈ కార్యానికి తగినవాడని, అతనిని దేవ సైన్యానికి సర్వ సేనానిని చేసి వానిని వెంటపెట్టుకుని తారకుని పై యుధ్ధానికి వెళ్ళండి మీకు జయం కలుగుతుందని.

శివుని ఆదేశాన్ని దేనతలు పాటించారు. కుమారస్వామి శరపరంపరల ధాటికి రాక్షస సైన్యం చెల్లాచెదరయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాన్తో ఉద్రిక్తుడయిన తారకుడు స్వయంగా కుమార స్వామితో యుధ్ధానికి దిగాడు. ఆ యుధ్ధములో తారకునిదే పై చెయ్యి అయింది. దానితో కుమారస్వామి ధాన్య కటకము చేరుకుని అక్కడ కొంతకాలం వున్నాడు. ఈ విషయాన్ని దేవతలు శివునికి తెలియజేశారు. ఇంకొకసారి కుమార స్వామి తారకుని మీదకు దండెత్తి మహా బలోపేతమైన శక్తిని వాని మీద ప్రయోగించాడు. అది కూడా వానినేమీ చేయలేక పోవటంతో బాధతో తిరిగి ధాన్యకటకం చేరాడు. ఈ వార్త తెలిసిన శివుడికి తానిచ్చిన ఆత్మలింగం సంగతి గుర్తువచ్చి ఆ విషయం కుమారస్వామికి తెలిపి ఆత్మలింగాన్ని గురిచూసి ఛేదించమనండి తప్పక విజయం లభిస్తుందని తెలిపాడు.

తర్వాత జరిగిన యుధ్ధంలో కుమారస్వామి తారకుని మెడలోనున్న ఆత్మ లింగాన్ని ఛేదించగా అది ఐదు ముక్కలయి ఐదు ప్రాంతాల్లో పడ్డది. వెంటనే తారకుడు ప్రాణాలొదిలాడు. అందులో పెద్దముక్క అమరారామంలో పడ్డది. ఆత్మ లింగం అమృత లింగం కనుక అవి పెరుగ సాగాయి. పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవ గురువు బృహస్పతి సలహా మీద వాటినన్నిటినీ ఆశ్వయుజ శుధ్ధ దశమి రోజున ఒకే ముహూర్తములో ప్రతిష్ఠ చేసి వాటి పెరుగుదలని అరికట్టారు. అవే పంచారామాలు. ఈ ఆరామాలు ప్రతిష్ట చేసిన వారి పేరుతో ప్రసిధ్ధికెక్కాయి. ఈ ప్రతిష్టలు ఎవరు ఏ ప్రదేశంలో చేశారో తెలుసుకుందామా?

దేవేంద్రుడు అమరారామంలో .... అదే నేటి అమరావతి
సోముడు (చంద్రుడు) సోమారామంలో ..... నేటి గునుపూడి (భీమవరం దగ్గర)
శ్రీరామచంద్రుడు క్షీరారామంలో ... నేటి పాలకొల్లు (ఇది త్రేతాయుగంలో జరిగింది అంటారు)
కుమారస్వామిచే కుమారారామంలో .... నేటి సామర్లకోట
వ్యాస భగవానునిచే ద్రాక్షారామంలో ..... నేటి ద్రాక్షారామం

పంచారామాల చరిత్ర తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఒక్కో క్షేత్రం గురించీ వివరంగా తెలుసుకుందాం.

Thursday, December 11, 2008

శ్రీ హరి హరసుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఆలయ ప్రాంగణంలో గంగాధరుడు, అంజనీ పుత్రుడు (రెండు విగ్రహాలకీ ఎత్తులో చాలా తేడా వుంది)
ఒకే పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు

బయటనుంచి ఆలయ దృశ్యం


పాలేరు ప్రాజెక్టు



శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఖమ్మం నుంచి 23 కి.మీ. ల దూరంలో వున్నది వైరా గ్రామం. 14 ఏళ్ళ క్రితం శ్రీ యండ్రపూడి కృష్ణారావు స్వామి గారి సంకల్పంతో కట్టబడి ఆయనతో సహా 18 మంది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో దిన దిన ప్రవర్ధమానమవుతున్న క్షేత్రమిది. దూరంనుంచే రా రమ్మని పిలుస్తున్నట్లున్న 54 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం, చుట్టూ అందమైన ఆలయ సముదాయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయం

1995 లో ఈ దేవాలయంలో శబరిమల ఆలయానికి చెందిన శ్రీ కేశవన్ నంబూద్రి, శ్రీ వాసుదేవన్ నంబూద్రి గార్ల ఆధ్వర్యంలో 9 రోజుల పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో 18 సార్లు ప్రదక్షిణ చేసి విద్య, వ్యాపారం, వివాహం వగైరా విషయాలలో ఏమైనా కోరుకుని, కోరిక తీరిన తర్వాత 108 సార్లు ప్రదక్షణలు చేస్తారు భక్తులు. కొందరు కోరిన కోర్కెలు తీరితే రూపాయ నాణేలు, బెల్లం, ధాన్యాలు వగైరా తులాభారం తో తమ మొక్కు చెల్లించుకుంటారు.

ఇక్కడ అయ్యప్ప దీక్షా సమయంలో బుధ, శని వారాల్లో దీక్ష తీసుకున్న స్వాములకు రోజూ వెయ్యి మందికి దాకా అన్నదానం జరుగుతుందట.


అభయాంజనేయ స్వామి

దూరంనుంచే భక్తులకు కనువిందు చేసే ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ పీఠం ఎత్తు నేల మీదనుంచి 9 అడుగులు, స్వామి విగ్రహం ఎత్తు పీఠం మీద నుంచి 45 అడుగులు, అంటే మొత్తం 54 అడుగుల ఎత్తు విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ గుడి. పీఠానికి ముందు చిన్న మందిరంలో స్వామి చిన్న విగ్రహానికి పూజలు చేస్తారు. 2-12-1999 న శ్రీ చిన్న జియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 5 రోజులు సుదర్శన యాగం చేసిన తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఇంత ఎత్తు విగ్రహం తెలంగాణాలో ఇంక ఎక్కడా లేదని శ్రీ కృష్ణారావుగారన్నారు.

ఇప్పటిదాకా ఈ 54 అడుగుల ఎత్తైన స్వామికి అభిషేకం కేవలం వాన వచ్చినప్పడే. ఇప్పడు ఈ స్వామికి పైన గొడుగు కట్టి దానిలోంచి షవర్ ద్వారా అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారుట. డిశంబరు మొదటి వారంలో దీనికి ప్రారంభోత్సవం జరుగుతుందిట. అప్పుడు కోటి పూలతో స్వామికి పూజ చేస్తారుట.

రామ మందిరం.

2002 లో ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడా నిత్యపూజలు జరుగుతుంటాయి.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము

ఇక్కడ గర్భాలయంలో ఒకే పీఠం మీద 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ తరహా ఆలయం తెలంగాణాలో ఇక్కడే కనిపిస్తుంది. దేవాలయ ఆవరణలో, శివుడు, విఘ్నేశ్వరుడు, అంభిమాత, నవగ్రహాలు, లక్ష్మీనారాయణులకి చిన్న ఆలయాలు వున్నాయి. ఇది శివ పంచాయతనం. అంటే, శివుడు, విష్ణువు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు వుంటారు. ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

వెంకటేశ్వరస్వామి దేవాలయం
శ్రీ చిన్నజియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 7 రోజులపాటు విష్ణు సహస్రయాగం చేసిన తర్వాత 28-2-2008 న విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ ప్రతి శనివారం స్వామికి కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

ఇంక ముందు సాయిబాబా దేవాలయం, కళ్యాణ మంటపం కూడా కట్టే ఆలోచన వున్నదట.


ఇంతమటుకూ ఇక్కడ చండీయాగం, సుదర్శన యాగం, రుద్రయాగం, విష్ణు సహస్రయాగం, లక్ష్మీ నారాయణ యాగం అనే అయిదు యాగాలు జరిగాయట.

ఆలయ ప్రాంగణంలో చిన్న ఉద్యానవనం, అందమైన అనేక దేవతా విగ్రహాలు ఆలయాల అందాన్ని మరింత పెంచుతూ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతాలకెళ్ళిన ప్రతి ఒక్కరూ, దూరమైనా అవకాశాన్నిబట్టి వెళ్ళాలనుకునేవాళ్ళూ తప్పక చూడవలసిన ఆలయ సమూహమిది.

ఈ ఆలయాల్లోకూడా కొన్ని రోజులలో మాత్రమే భోజన సదుపాయం వుంటుంది కనుక మీ జాగ్రత్తలో మీరు వెళ్ళండి. అలాగే వసతి కూడా ఖమ్మంలోనే.

అదనపు ఆకర్షణలు

ఖమ్మం రోడ్డులో షుమారు 30 కి.మీ. వెళ్ళాక పాలేరు ప్రాజెక్టు వస్తుంది. విశాలమైన ఈ జలాశయం ప్రక్కనే వున్న చిన్న పార్కు దగ్గర కొంచెంసేపు సేద తీరవచ్చు.

వైరా దాటిన తర్వాత జంక్షన్ లో ఎడమ వైపు తిరిగి లోపలికి 3, 4 కి.మీ. లు వెళ్తే వైరా రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు దాకా వెళ్ళేటప్పుడు వాహనం లో బండ్ పైనించి వెళ్ళచ్చట తిరిగి వచ్చేటప్పుడు ప్రక్కనే వున్న రోడ్డు మీదనుంచి రావాలిట. బండ్ మీదనుంచి వెళ్తే సరదాగా వుంటుంది. మాకు తెలియక రెండుసార్లూ ప్రక్క రోడ్డు మీదనుంచే వెళ్ళాము.










Wednesday, November 26, 2008

యాదగిరి, నల్గొండ జిల్లా

యాదగిరిగుట్ట

తెలంగాణాలో ప్రఖ్యాతి చెందిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగురించి తెలియనివారు వుండరంటే అతిశయోక్తికాదు. అయితే దీని చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్తాను.

ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనంనుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. ఆప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. ఆది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.

తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.

ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కధ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంబాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో ల క్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

ఇక్కడ యాత్రీకులకు సకల సౌకర్యాలూ వున్నాయి. శని, ఆది వారాలలో, పర్వదినాలలో జన సందోహం చాలా ఎక్కువగా వుంటుంది. కొండ మీదదాకా పెద్ద బస్సులు తప్ప అన్ని వాహనాలూ వెళ్తాయి.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

ఇన్ని విశేషాలున్న ఈ పుణ్య క్షేత్రాన్ని మీరు దర్శించారా? లేకపోతే ఆలస్యం ఎందుకు? వెంటనే బయల్దేరండి.

(ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను. మేము వెళ్ళింది 9-11-2008, ఆదివారం, కార్తీక శుధ్ధ ఏకాదశి అవటం వలన విపరీతమైన జనసందోహంతో యాదగిరి కళ కళలాడటమేకాదు కిటకిటలాడింది. వాహనాలను పైకి పంపిచటం కూడా క్రమబధ్ధీకరించి ఆపి ఆపి పంపారు. సాయంత్రానికి రద్దీ తగ్గుతుందన్నారు. అందుకని మేము గుట్టపైకి వెళ్ళలేక మధ్యలో బయటకివచ్చి సురేంద్రపురి వెళ్ళి సాయంత్రందాకా అక్కడ ఆగి తిరిగి గుట్టకి వెళ్ళేసరికి రద్దీ కొంచెం తగ్గింది. మనిషికి 100 రూ. టికెట్ తీసుకుంటే దర్శనానికి 40 నిముషాలు పట్టింది. ఆ చీకటిలో, ఆ రద్దీలో ఫోటోలు తీయలేకపోయాను.)

Wednesday, November 19, 2008

సురేంద్రపురి, నల్గొండ district

నవగ్రహాల గుడులు

పంచముఖ ఆంజనేయస్వామి


ఆలయ బయట దృశ్యం

సురేంద్రపురి బయటనుంచి దృశ్యం -- గాయత్రి అమ్మవారి ప్రక్కనుంచి మ్యూజియం ప్రవేశం

సురేంద్రపురి

హైదరాబాదుకి 60 కి.మీ. ల దూరంలో యాదగిరిగుట్టకి కొంచెం ఇవతలే కనబడే సురేంద్రపురి లో ఎత్తైన శివ, ఆంజనేయస్వామి, గాయత్రీ దేవి విగ్రహాలు, పూర్ణకలశం చూపరులను ఆకట్టుకుని ముందుకి కదలనివ్వవు. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ పంచముఖ ఆంజనేయుస్వామి, నేపాల్ పశుపతినాధస్వామిని బోలిన శ్రీ పంచముఖ పరమేశ్వరుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వార్లు ఒకే మహా మండపంలో మూడు ఆలయాలలో కొలువుదీరిన ఆలయమిది.

అంతేగాకప్రపంచంలో ప్రప్రధమంగా అధిదేవత, ప్రత్యధిదేవత, వాహన, సతీ సమేతముగా విడి విడిగా నవగ్రహ ఆలయాలు ప్రతిష్ఠింపబడి ప్రత్యేక పూజలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ గ్రహ దోష నివారణార్ధం పూజలు కూడా చేస్తారు.

ఇక్కడి ఇంకో ఆకర్షణ ఆలయం ప్రక్కనేవున్న కుందా సత్యన్నారయణ కళాక్షేత్రము. దీని ప్రవేశరుసుం 100 రూ. దర్శన సమయం కనీసం రెండుగంటలు పడుతుంది. ఇందులో బాలభారతం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, పాతాళలోకం, మణిద్వీపం, హనుమంతుని చరిత్ర,, ఇంకా అనేక దేవతామూర్తులేకాక, రామాయణ, భారత, భగవద్గీత లో ఘట్టాలు, పద్మవ్యూహం కూడా .... అన్నీ బొమ్మలతో నిర్మంపబడి చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇంకా కొన్ని ఘట్టాలు నిర్మాణంలో వున్నాయి.



























































































Tuesday, November 11, 2008

కొలనుపాక, నల్గొండ జిల్లా

జైన్ మందిరం మోడల్
జైన్ మందిరం

జైన్ మందిరం ప్రవేశ మార్గం


జైన్ మందిరం బయటనుంచి




శ్రీ రేణుకాచార్య, వీర శైవ మత ప్రచారకులు

మ్యూజియంలో కళాఖండం

నటరాజు, మ్యూజియంలో కళాఖండం

ళ్రీ చండికాంబ సహిత సోమేశ్వరస్వామి దేవస్ధానం
కొలనుపాక

హైదరాబాదు హనుమగొండ మార్గంలో వున్నది జనగాం. క్రీ.శ. 1 వ శతాబ్దమునుంచే ఈ ప్రాంతాలు జైన మతానికి ప్రసిధ్ధికెక్కాయి. ఆ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల నుండి జైన యాత్రీకులు ఇక్కడకు వచ్చేవారు. వారిలో చాలామంది ఇక్కడ స్ధిర నివాసం ఏర్పరుచుకున్నారు. జైనులు ఎక్కువగా వుండే వూరు గనుక జైన్ గావ్ అని పిలిచేవారు. క్రమేపీ జైన్ గావ్ జనగాం క్రింద మారింది.

శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్ధానం, కొలనుపాక

జనగాంకి 10 కి.మీ. ల దూరంలో వున్నది కొలనుపాక. హైదరాబాదు నుంచి ఇక్కడికి 84 కి.మీ. ల దూరం వుంది. కొలనుపాక రైల్వే క్రాసింగ్ దాటాక కుడివైపు తిరిగి 6 కి.మీ. ల దూరం వెళ్ళిన తర్వాత రాజంపేట రోడ్ లో వెళ్తే వస్తుంది 12 వ శతాబ్దంలో నిర్మింపబడ్డ శ్రీ జగద్గురు రేణుకాచార్య లింగోద్భవ మూర్తి శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్ధానం.

11 వ శతాబ్దములో కొలనుపాక కళ్యాణి చాళుక్యులకు రెండవ రాజధాని. ఆ సమయంలో ఇది గొప్ప శైవ క్షేత్రం కూడా. సుప్రసిధ్ధ వీర శైవ ప్రచారకుడు శ్రీ రేణుకాచార్య జన్మ స్ధలం ఇదే. శ్రీ రేణుకాచార్య ఇక్కడ స్వయంభూ లింగం నుంచి పుట్టి, వీరశైవ మత ప్రచారం చేశారని, తర్వాత ఆలింగంలోనే ఐక్యమయిపోయారనీ అంటారు.

మన రాష్ట్రంనుంచేకాకుండా కర్ణాటక రాష్ట్రంనుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఆర్కియాలజీ మరియు మ్యూజియంస్ డిపార్టుమెంటు వాళ్ళ ప్రదర్శన శాల వున్నది. ఇందులో వురాతన శిల్పాలు, శాసనాలూ చూడవచ్చు.

శ్రీ మహలక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయం

ఊళ్ళో ప్రవేశించిన తర్వాత ముందు కనిపించే ఆలయం ఇదే. ఈ ఆలయం కూడా 12 వ శతాబ్దమునాటిదే. ఈ ఆలయం వెనుక ఎల్లమ్మ, సాయిబాబాల చిన్న ఆలయాలున్నాయి.








శ్వేతాంబర జైన్ దేవాలయం, కుల్ పాక్

ఇది క్రీ.శ. 1 వ శతాబ్దంనుంచే దక్షిణ భారత దేశంలో ప్రసిధ్ధికెక్కిన జైన పుణ్య క్షేత్రం. 2000 ఏళ్ళనాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం లో వున్న మహావీరుని మరకత విగ్రహం ఐదవ ఎత్తైన విగ్రహం. అతి సుందరమైన ఈ ఆలయంలో మహావీర్ స్వామి భగవాన్, ఋషభదేవ్ భగవాన్, నేమినాధ్ భగవాన్ల విగ్రహాలతోబాటు, ఇంకా అనేక తీర్ధంకరుల విగ్రహాలున్నాయి.

కొలనుపాక గ్రామాన్ని (నల్గొండ జిల్లా) ఆనుకుని వుండే ఈ కుల్ పాక్ గుంటూరు జిల్లాలోకి వస్తుంది.

Friday, November 7, 2008

మేళ్లచెరువు, నల్గొండ డిస్ట్రిక్ట్

స్వయంభూశంభులింగేశ్వరుడుఇష్టకామేశ్వరీదేవి



మేళ్లచెరువు

మట్టపల్లి -- హుజూర్ నగర్ రోడ్ లో హుజూర్ నగర్ లోకి వెళ్ళకుండా కుడివైపు బైపాస్ రోడ్ లో వెళ్తే మేళ్ళచెరువు చేరుకోవచ్చు. మట్టపల్లి ఆలయ ధర్మకర్తలలో ఒకరైన శ్రీ వెంకటేశ్వర్లుగారు, వారి ధర్మ పత్ని మాతో కారులో వచ్చారు. దోవలో మాటల సందర్భంలో, మేళ్ళచెరువు లోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పి దర్శనం చేసుకుని వెళ్ళమని సలహా ఇచ్చారు. వారికి మా కృతఙతలు. వారి మూలంగానే మేమీ ఆలయ విశేషాలు తెలుసుకోగలిగాము. మరి మీకూ ఆ విశేషాలు తెలుసుకోవాలని వుంది కదూ. మరి చదవండి.

చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూ వుండేవిట. హనుమకొండ వెయ్యి స్ధంబాల గుడిలోని శివుడు ఆక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టటం, గో హింసలు చెయ్యటంతో కోపించి అక్కడనుండి వచ్చి ఆవులమంద మధ్యలో వెలిశాడుట. ఒక ఆవు శివలింగంమీద పాలు కురిపించటంచూసి యవనులు 11 సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేశారుట. ప్రతిసారీ మళ్ళీ యధాతధంగా ఆ లింగం వచ్చిందట. తర్వాత కాలంలో వూజలు జరగటం మొదలయినాయి.

అంతే కాదండీ. ఈ స్వామి విశేషాలు ఇంకా చాలా వున్నాయి. చెప్పమంటారా....


లింగం కుడివైపు వెనక ప్రక్క చిన్న గుంట వుంది. దానిలో నీరు ఎప్పడూ వుంటుంది. దీనిలోనికి దారానికి రాయి కట్టి వేసినా అంతు కనుక్కోలేక పోయారు. అక్కడ పూజారిగారు చెప్పిన సమాచారం ప్రకారం ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పడు ఎండౌమెంట్స డిపార్టుమెంటువాళ్ళు అక్కడ పైప్ లైన్ ఏదో వుండి వుంటుంది, గుడి కట్టేటప్పడు చూసుకోకుండా కట్టేసి వుంటారు, అందుకే ఆ నీళ్ళలా వస్తున్నాయని ఆ నీళ్ళన్నింటినీ తోడేయించి, గుడికి తాళం వేయించి వాళ్ళ మనుషులను కాపలా పెట్టారుట. అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట.

ఈ లింగం పెరుగుతూ వున్నదిట. దానికి ఋజువు లింగం మీద బొట్ల సంఖ్య పెరగటమే. శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆ వూర్లో 30 ఏళ్ళ నుంచీ వుంటున్నారుట. ఆయన వచ్చినప్పుడు లింగం మీద మూటు బొట్లు వున్నాయిట. ఇప్పుడు ఐదయినాయి, నేనే చూశాను ఆ తేడా అన్నారు ఆయన. లింగం మీద గుండ్రటి ఆకారంలో పలుచని గుంటల్లాగా వున్నాయి. ఇవే బొట్లు. ఫోటోలో మీరు కూడా చూడవచ్చు.

ఇక్కడ శివలింగం తెల్లరాతి లింగం. ఈ లింగానికి వెనకాల జడ వున్నది. ఈయన అర్ధనారీశ్వర రూపం అందుకే అలా వున్నదంటారు. అందరికీ అద్దంలో చూపిస్తారు గుంటలో వున్న గంగనీ, జడనీ. బ్రాహ్మలు పట్టుబట్టలతో వెళ్తే మగవారిని గర్భగుడిలోకి అనుమతిస్తారు.

తర్వాత కాలంలో అమ్మవారు ఇష్టకామేశ్వరిని ప్రతిష్టించారు. స్వామి, అమ్మ ఇద్దరూ చాలా అందంగా వున్నారు. సోమవారం కావటంతో జనాలు బాగానే వున్నారు. అభిషేకం చేయించి, వాళ్ళ అనుమతితో ఫోటోలు తీసుకుని, ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము.

Wednesday, November 5, 2008

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి

ఆలయ దృశ్యం
ఆలయం లోపల దృశ్యం

మట్టపల్లి

సాయంత్రం 4-30కి మట్టపల్లి చేరుకున్నాము. ఇక్కడ బ్రహ్మణ, వైశ్య వగైరా కుల ప్రాతిపదికపైన సత్రాలున్నాయి. గది అద్దె రోజుకి వంద రూపాయలు. భోజనం గురించి ముందు చెప్తే ఆ సత్రాలవాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక దానిలో గది తీసుకుని సామాను పెట్టి దేవాలయానికి బయల్దేరాము.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మట్టపల్లి

గర్భ గుడిలో స్వామికి ఎడమ ప్రక్కన ఒక గుహ ద్వారం వుంది. అక్కడనుండి సప్త ఋషులు, ఇతర మునులూ కృష్ణలో స్నానంచేసి స్వామి దర్శనానికి వస్తారుట. వాళ్ళు ఇప్పటికీ రోజూ వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్ధం తర్వాత కట్టింది. ఇదివరకు ఈయనను దేవతలు, మునులు మాత్రమే పూజించేవారుట. స్వామి మానవులకు కూడా దర్శనమియ్యాలని, ఒకరికి కలలో కనిపించి తన ఉనికిని చెప్పగా వారు బిలద్వారాన్ని తెరిచారుట.

ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రంయొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారుట. సంపూర్ణమైన విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నేను తీరుస్తాను అని. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు.

ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింప చేయటానికి తర్వాత ప్రతిష్టించారుట.

21-1-2008
ఉదయం కృష్ణ స్నానం, ప్రదక్షిణలు, దర్శనం అయ్యాక 10 గంటలకు బయల్దేరి 11-20 కి మేళ్ళ చెరువు చేరుకున్నాము.


Monday, October 27, 2008

వాడపల్లి ఫోటోలు

మీనాక్ష్క్షీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం, వాడపల్లి
కృష్ణా మూసీ సంగమం, వాడపల్లి


లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం, వాడపల్లి


Saturday, October 25, 2008

వాడపల్లి, నల్గండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

వాడపల్లి

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి

20-1-08

9-30 కి సూర్యాపేట లో బయల్దేరి నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా 11-40 కి వాడపల్లి చేరాం. ఇండియా సిమెంట్స్ కి ఎదురుగుండా ఉన్న రోడ్ లో అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క కచ్చా రోడ్ లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది. ఈ గుడి 6000 ఏళ్ళ క్రితందట. ఈ విగ్రహాన్ని అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట. స్వామి తొడ మీద అమ్మవారు వున్నట్లు ఆనుకుని వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో వొక అఖండం కింద ఇంకో అఖండం వున్నాయి. కిందవున్న అఖండం లో దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన వున్న అఖండం లో దీపం కదులుతూ వుంటుంది. కారణం స్వామి వుచ్వాశ నిశ్వాసలని చెపుతారు. వొక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. ఆశీర్వాదం ఇంకా దుష్ట గ్రహ నివారణ కోసం ట. ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:ఈ గుడి ఎదురుగా కొంచెం దూరంలో ముచికుందా నది మరియు కృష్ణ నదుల సంగమం వుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. తెల్లగా వున్నదనిపించింది. విభూతి వల్లనేమో. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది. క్షేత్ర పురాణం:6000 ఏళ్ళ క్రితం అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట ఈ లింగాన్ని. వొక రోజు వొక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాదుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాదుట. ఆ వేళ్ళ గుర్తులు స్వామి ఫాలభాగం పైన కనబడుతాయి. అక్కడ ఏర్పడిన రక్తం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట గుంటలో నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట. వొకసారి శంకరాచార్యులవారు ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని వొక బంగారం ముక్కకి తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిత గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకున్నాదుట. వసతికి వొక పెద్ద హాల్ వుంది కాని వేరే సౌకర్యాలు ఏమి లేవు. వుండటం కొంచెం కష్టమే. నదీ సంగమం కనుక ఇక్కడ కర్మకాండలు కూడా చేస్తున్నారు. అస్థికలు కూడా కలుపుతారు. మద్యాహ్నం 1-30 కి బయల్దేరి మిర్యాలగూడ రోడ్ మీద వున్న శ్రీ దుర్గా గార్డెన్ రెస్టారెంట్ లో భోజనం చేసి 2-50 కి మట్టపల్లి బయల్దేరాము.




Friday, October 24, 2008

ఫణిగిరి ఫోటోలు

పాత రామాలయం, ఫణిగిరికొత్త రామాలయం, ఫణిగిరి
గరుక్మంతుడి విగ్రహం, బంగారం దొరికిన చోటు


ఫణిగిరి, నల్గొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

ఫణిగిరి
19-1-2008

రామాలయం

పిల్లల మఱ్ఱి నుంచి ఫణిగిరి బయల్దేరాము. సూర్యాపేట జనగాం రోడ్ లో 35 కి. మీ. లు వెళ్ళాక స్తూపం దగ్గర కుడి వైపు తిరిగి ఒక కిలోమీటరు వెళ్ళాలి .. తిరుమలగిరికి ఇవతలే..వూళ్ళో కొత్త గుడి వుంది. ఇది చిన్నదయినా పురాతనమైనది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు వున్నాయి. ఇంకా ఒక కిలోమీటరు దూరం సన్నటి దోవలో వెళ్తే కొండ పక్కన పాత రామాలయం వస్తుంది. ఇక్కడ సీతా రామ లక్ష్మణులు స్వయం భూ మూర్తులు. కొండ గోడ మీద కొంచెం ఉబ్బెత్తుగా వున్నాయి ఆకారాలు. కొన్ని వేల ఏళ్ళక్రితందిట ఈఆలయం.

రెండు గుళ్ళకూ పూజారి ఒకరే. యువకుడు. మేము వెళ్ళేసరికి అప్పుడే బయటనించి వచ్చారు. మమ్మల్ని చూసి 5 ని. ల లో స్నానం చేసి వస్తానని అలాగే తొందరగానే వచ్చారు. (వీరి ఇల్లు కొత్త గుడికి ఎదురుగానే నాలుగు ఇళ్ళ ఇవతల వుంటుంది. మీరు వెళ్ళినపప్పుడు గుడి మూసి వుంటే అక్కడ కనుక్కోండి.) చిన్నవాడయినా గుళ్ళో ఆయన పాటించిన నియమాలు సంతోషమనిపించాయి. ఆయన తన బైకు మీద మాతో వచ్చి పాత గుడి కూడా తెరిచి హారతి ఇచ్చారు. ఆయన చెప్పిన స్ధల పురాణం----

భద్రాచలంలో ఉత్సవవిగ్రహాలను ఊరేగిస్తున్నప్పుడు సీతామ్మవారి విగ్రహం జారి నీళ్ళలో పడిందట. ఇంకొక విగ్రహం తయారు చేయిద్దామని ప్రయత్నిస్తే విగ్రహం పొడుగో పొట్టో అయ్యేదిటగానీ సరిగ్గా రాలేదుట. భద్రాచలం వాళ్ళు ఇటు వచ్చినపుడు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూసి సరిగ్గా వుందని విగ్రహాన్ని ఇవ్వమని అడిగారుట. వీళ్ళు ఇవ్వక పోవటంవలన దొంగతనంగా తీసుకు వెళ్ళి భద్రాచలంలో పెట్టారుట. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి ఆవిగ్రహాన్ని భద్రాచలంవాళ్ళు తీసుకు వెళ్ళారని తెలిసి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారుట.

తర్వాత ఒకరికి కలలో అమ్మవారు కనబడి గుడి పక్కనే గరుక్మంతుడి విగ్రహం వున్నచోట తవ్వితే బంగారం దొరుకుతుంది, దానితో ఇంకో విగ్రహం చేయించండని చెప్పిందట. అమ్మవారు చెప్పిన చోట తవ్వితే బంగారం దొరికిందట. దానితో ఇంకో పంచలోహ విగ్రహం తయారు చేయిస్తే అది కూడా పొడుగయిందట. ఏం చెయ్యాలనుకుంటే అమ్మవారు మళ్ళీ కలలో కనబడి ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని కొన్నాళ్ళు వుంచమని చెప్పందట. అలాగే ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని వుంచితే కొన్నాళ్ళకు ఆ విగ్రహం సరైన ఎత్తుకు రావటం చూసి గుళ్ళో ప్రతిష్టించారుట. పొడుగు దానంతట అదే కరిగి పోయిందట. అందుకే ఆవిడని అక్షయ సీత అంటారుట.

అక్కడ వుంటే ఇలాగే దొంగతనాలు జరుగుతాయని భద్రతా కారణాల దృష్ట్యా వూళ్ళో రామాలయం నిర్మించి ఉత్సవ విగ్రహాలను అక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు. మార్చి లో పౌర్ణమినాడు 10—15 రోజులు పెద్ద జాతర జరుగుతుందట. హోలీ నాడు కళ్యాణం జరుగుతుందట.

ప్రస్తుతం పాతగుడి దగ్గర యాగశాల నిర్మాణంలో వున్నది.

స్వామి వెలసిన కొండమీద తవ్వకాలలో బౌద్ధమతానికి చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా వాటినికూడా ఊళ్ళో గుడి దగ్గర ఒక స్కూల్ లో పెట్టి కాపాడుతున్నారు. వాటన్నిటితో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆలోచనట.

ఆకొండమీదే సీతమ్మవారి పాదం అని ఒక పెద్ద బండరాయి కింద చిన్న పాదం గుర్తు వుంది.

Monday, August 4, 2008

చర్చి, మెదక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా




మెదక్ చర్చి

భారత దేశం లో రెండవ పెద్ద చర్చి ఇది. రెవరెండ్ ఛార్లెస్ వాకర్ దీనిని కట్టించారుట. ఇందులో 5000 మంది వోకే సారి కూర్చుని ప్రార్ధన చేసేందుకు వీలుంది. ఈ చర్చి కట్టి సుమారు 100 సం. లు అయింది. చర్చి శిఖరం ఎత్తు 173 అడుగులు. ఈ చర్చి గంటలు చాలా దూరం వరకు వినిపిస్తాయిట. కిటికీలపైన గాజు పనితనం చాలా బాగుంటుంది.




కంది, మెదక్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్,ఇండియా



చెరువు, గంగమ్మ ఆలయం

ఆలయ ముఖద్వారం


కంది

శ్రీ రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయం

హైదరాబాదు తిరిగివస్తూ సంగారెడ్డకి 4 కి. మీ. ల దూరంలో వున్న ఈ ఆలయం దర్శించాం. ఇది కూడా 250 సంవత్సరాల క్రతం కట్టిన ఆలయం. పెద్ద ప్రవేశ ద్వారం, చుట్టూ నివాస గృహాలు (అన్నీ ప్రస్తుతం నివాసయోగ్యంగా వున్నట్లులేవు), మధ్యలో చిన్న ఆలయం...ప్రహరీ గోడ దాటాక పక్కనే చెరువు, గంగమ్మ, లక్ష్మీనారాయణులకేకాక ఇంకా గుర్తు తెలియని ఆలయాలు ఇంకో రెండు వున్నాయి.

సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు ఎన్నో. మనసంపద విలువని గుర్తించి ఆదరించాల్సిన బాధ్యత మనకు కూడా వుందనుకుంటే వీలు చూసుకుని ఈ ఆలయాలను దర్శించండి.

మీ వాహనంలో హైదరాబాదునుంచి ఉదయం బయల్దేరితే, కంది, నందికండి, కలబగూరు, చిట్కుల్ చూసి సాయంకాలానికి ఇంటికి చేరుకోవచ్చు. అయితే భోజనం వేళకి చిట్కుల్ చేరుకోండి లేకపోతే భోజనం మంచినీళ్ళు తీసుకు వెళ్ళండి.

నందికండి, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్



ఆలయ ప్రవేశ ద్వారం

ఆవరణలో వున్న శాసనం


ఆలయం లో స్తంభాలమీద శిల్ప సౌందర్యం



ఆలయం









నందికండి

రామలింగేశ్వరాలయం

సంగారెడ్డికి 15 కి. మీ. ల దూరంలో వుంది ఈ ఆలయం. సాయంత్రం 5.00 అయింది మేము వెళ్ళేసరికి. ఆలయం మూసి వుంది. కటకటాలలోంచి స్వామి దర్శనం. శిల్ప కళ చాళుక్యుల శైలి లో వున్నది. సరైన ఆదరణకు నోచుకోని ఇలాంటి కళాఖండాలు మనదేశం లో ఎన్నో.






కలబగూర్, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

ఆలయం ముందు మంటపం

ఆలయం
ఆలయ ముఖ ద్వారం
కలబగూర్
శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం
చిట్కుల్ నుంచి వస్తూ వెళ్ళాము ఈ ఆలయానికి.
ఈ ఆలయం దర్శించి తర్వాత చిట్కుల్ వెళ్ళవచ్చు. సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే రోడ్ లో, సంగారెడ్డి జడ్. పి. ఆఫీసు దాటగానే (రోడ్ కి ఎడమ ప్రక్కనే వస్తుంది ఈ ఆఫీసు) ఎడమ వైపు రోడ్ లోకి తిరిగి సుమారు 3 కి. మీ. ల దూరం వెళ్తే వస్తుంది ఈ ఆలయం. మేము వెళ్ళేసరికి సాయంత్రం 3.40 అయింది. శివాలయం మూసివుంది గానీ అక్కడవున్న పూజారి తలుపు తీశారు. కరెంటు లేకపోవటంవల్ల బ్యాటరీ లైటుతో స్వామిని చూపించారు.
త్రికూట ఆలయంలో శివ కేశవులు వొక్కటే అని నిరూపించటానికా అన్నట్లు కాశీ విశ్వేశ్వరుడితోపాటు అనంతపద్మనాభస్వామి, వేణుగోపాలస్వామి కోలువుతీరి వున్నారు.

ఇది మంజీరా బ్యారేజ్ కి చేరువలో వున్నదట.

14వ శతాబ్దంలో కాకతీయులు దీన్ని నిర్మించారుట. వరంగల్ లోని వెయ్యి స్తంబాల మంటప నిర్మాణ శైలి ఈ కట్టడంలో కనిపిస్తుంది.

ఈ ఆలయాల్లో పూజాదికాలూ, అభిషేకాలూ ఇప్పటికీ జరుగుతున్నాయి.


చిట్కుల్, మెదక్ డిస్ట్రిక్ట్, ఆంధ్ర ప్రదేశ్


శ్రీ చాముండేశ్వరీ ఆలయం





చిట్కుల్
3-8-2008
శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయం
రాత్రి పెద్ద వాన కురిసి వెలిసింది..ఉదయం వాతావరణం చల్లగా హాయిగా వుంది. పులిహార, పెరుగన్నం పేక్ చేసుకుని బయల్దేరాం. మదటి మజిలీ..చిట్కుల్ శ్రీ చాముండేశ్వరీదేవి ఆలయం..ఇది సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్ళే దోవలో, సంగారెడ్డికి 31 కి. మీ. దూరంలో వుంది. ఆందోల్ దాటిన తర్వాత కుడి వైపు తిరగాలి. బస్సు సౌకర్యం బాగా వుంది.

25 ఏళ్ళ క్రితం, కీ.శే. శ్రీ అయిలావఝుల వేంకట రమణయ్య గారు ఈఆలయ నిర్మాణానికి నడుంకట్టారు. నిర్మాణం ఇంకా సాగుతోంది. ప్రతిష్టింపబడి ఎక్కువ కాలం కాక పోయినా, భక్తులకు కొంగు బంగారం అయింది ఈతల్లి. అందుకే భక్తుల రాకపోకలు బాగానే వున్నాయి.

10 అడుగుల ఎత్తయిన అమ్మవారి నల్లరాయి విగ్రహం 18 చేతులతో చూపరులను అనుగ్రహిస్తున్నట్లు వుంటుంది.

12.30 నుంచి 2.00 గం. ల దాకా నిత్యాన్నదానం జరుగుతూవుంటుంది. ఆహారం తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు.

ఆలయం తెరచి వుంచు వేళలుః ఉదయం 6.00 గం. ల నుంచి రాత్రి 8.00 గం. ల దాకా.