Saturday, September 19, 2009

యాత్ర కొనసాగించాలా? వద్దా??

స్వప్న@కలల ప్రపంచం, నా బ్లాగులో ఒక కామెంట్ చేశారు. మీకు ఇన్ని డబ్బులు ఎక్కడివండి మీ ఆయన బాగా సంపాదిస్తారా అన్ని చోట్లకి వెళ్ళి చూస్తారు..మీ ఓపికకి మెచ్చుకోవచ్చు అని. దీనికి నేను సమాధానం రాశాను కానీ దానిమీద ఒక్క కామెంటు కూడా రాకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా అనిపించి ఈ పోస్టు రాస్తున్నాను.

స్వప్నా, మీరు వయసులో చాలా చిన్నవారు. అందుకే ఒక పరిధిలోనే ఆలోచించారు. అవునూ, మీరూ ఉద్యోగం చేస్తున్నారు. బస్ మిస్ అయితే ఆఫీసుకి ఎవరి పర్మిషన్ అడగకుండానే ఆటోలో వెళ్తున్నారు...అంటే మీ ఉద్యోగం మీకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందనేకదా అర్ధం. అలాగే నేను కూడా అనే ఆలోచన రాలేదా నేనూ 40 ఏళ్ళు ఉద్యోగం చేశానండీ. నేను చేశానని మా ఆయన మానేయలేదులెండి...పాపం ఆయనా ఆయన ఉద్యోగం చేశారు అన్నేళ్ళూ. సంసార సాగరంలో అనేక సుడిగుండాలుంటాయండీ...వాటిలో చాలా ఇంకా మీ ఊహల్లోకి కూడా వచ్చి వుండవు. అవ్వన్నీ దాటుకుని మేము నిలదొక్కుకునేసరికి ఇద్దరం రిటైరయ్యాము. ఇన్నేళ్ళ ఇద్దరి ఉద్యోగంతో మేము మిగుల్చుకున్నది మా ఇద్దరి + మా ఇద్దరి పిల్లల చేతిలో పి.జీ. డిగ్రీ సర్టిఫికెట్లూ, వుండటానికో ఇల్లూ..అంతే. ఇలా క్లుప్తంగా చెప్తున్నానుగానీ ఈ భవసాగరాల సునామీలలో మేము సాధించిన వాటితో మాకు తృప్తి వుంది. ఎందుకంటే అన్నీ మా కష్టార్జితం. మా సంపాదన వివరాలు అయిపోయాయికదా.

ఇంక మా యాత్రల విషయానికొస్తే నాకూ, మావారికీ కొత్త ప్రదేశాలు చూడటం చాలా సరదా. మా అమ్మాయి (అమ్మాయి పెద్దదిలెండి) 9వ తరగతికి వచ్చేదాకా, పిల్లల్నికూడా ఏడాదికొకసారి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడనుంచీ, రెండేళ్ళ క్రితందాకా వాళ్ళ చదువులతో ఎటూ కదలటం కుదరలేదు. రెండేళ్ళ క్రితంనుంచీ, పిల్లలు దగ్గర లేకపోవటం, ఆఫీసులో కొంత వెసులుబాటు దొరకటం, వగైరాలతో మళ్ళీ అరికాళ్ళ దురద ఎక్కువైంది.

మొదట్లో చాలామంది కుళ్ళుకున్నారు. కొందరు ఎదురుగానే అనేవాళ్ళు. నీకేమమ్మా మీవారు కూడా చక్కగా అన్నివూళ్ళూ తిప్పుతారు, మా ఇళ్ళల్లో ఆ సరదాలు లేవు అనేవారు. కొందరు ఫోన్ చేస్తే ఏ వూరునుంచి మాట్లాడుతున్నారు అనే వాళ్ళు సరదాగా. ఎప్పుడొచ్చినా ఇల్లు తాళమే వుంటుంది అసలెప్పుడన్నా ఇంట్లో వుంటారా అనేవాళ్ళు కొందరు, అంత ఓపిక ఎక్కడనుంచొస్తుంది మీకు అనేవాళ్ళు కొందరుఇలా ఎన్నో. మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత స్పష్టంగా చెప్పేదాన్ని. మాకు తిరగటం సరదా, ప్రస్తుతం ఓపిక, సమయం వున్నాయి. ఓపిక లేనప్పుడు మానేస్తాంలే అనేదాన్ని. తర్వాత వాళ్ళకి అర్ధమవటమేకాదు, మా గాలి తగిలి కొందరు మరీ మాలాగా కాకపోయినా ట్రిప్స్ వెయ్యటం మొదలు పెట్టారు.

ఇంక తిరగటానికి అన్ని డబ్బులెక్కడనుంచి వస్తాయి అనే ప్రశ్నకి ....

మాకు బట్టలు, నగలు కొనుక్కోవటం, ఆస్తులు కూడబెట్టుకోవటం వగైరాలకన్నా యాత్రలు చెయ్యటంలోనే ఆసక్తి ఎక్కువ. ఈ డబ్బులుంటే ఇంకో రెండు నగలు చేయించుకునేదాన్నేమోగానీ, వాటిని కాపలాకాయటం నాకు చాలా చికాకు. ఏదయినా అవసరానికుంటే చాలు. కానీ ఈ యాత్రల విషయంలో ఎంత తిరిగినా మాకు తృప్తి వుండటంలేదు. పిల్లలు దగ్గర లేకపోవటంవల్ల వచ్చిన ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి కూడా కొంత తిరిగేవాళ్ళం.

ఇండియాలో మేము తిరిగిన ప్రదేశాలు ఎక్కువ ఖర్చయ్యేవికాదు. పెద్ద యాత్రలింకా ఏమీ చేయలేదు. ప్రస్తుతానికి ఒక కారు, మా వారికి దానిని డ్రైవ్ చేసే ఆసక్తి వున్నాయి. చాలా మటుకు దానిలో తిరిగినవే. ఖర్చు తక్కువ అవ్వటానికి కారణాలు ఇంకొన్ని

  1. ఉదయం బయల్దేరి సాయంత్రం 6, 7 గం. ల దాకా తిరగటం, ఆ టైముకి ఎక్కడో అక్కడ స్టే చెయ్యటం,
  2. సాధారణంగా వెళ్ళే రోజు ఆహారం ఇంట్లోంచే పేక్ చేసుకెళ్తాం
  3. స్టేకి స్టార్ హోటల్స్ చూసుకోం. కుటుంబీకులు వుండగలిగేవి, నీట్ గా వుండేవి చాలు.
  4. పెద్దవాళ్ళం కనుక బయట చిరుతిండి, చూసినదల్లా కొనటం వగైరా అనవసర ఖర్చులు వుండవు.
  5. ఎక్కడా షాపింగ్ చెయ్యం
  6. రష్ తక్కువగా వుండే సమయాల్లో వెళ్తాం కనుక స్పెషల్ దర్శనానికి వెళ్ళం.
  7. సొంత వాహనంలో వెళ్ళటంవల్ల దగ్గర దగ్గర స్ధలాలన్నీ ఒకేసారి చూస్తాం
  8. కారు కాకపోతే సమయాభావ సమస్య లేదు కనుక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడతాం కానీ ఇద్దరి కోసం టాక్సీలు తీసుకోం.
  9. ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు చూసినవే కాదు. రెండేళ్ళనుంచి చూస్తున్నవన్నీ. నేను బ్లాగు మొదలు పెట్టకముందు చూసినవి కూడా వున్నాయి.

ఈ పోస్టులు చూసి మేము హ్యాపీగా తిరుగేస్తున్నాము, ఎక్కడా ఏ ఇబ్బందులూ వుండవనుకోకండి. చిన్న ప్రదేశాలలో కొన్ని చోట్ల తినటానికేమీ దొరకదు. కొన్ని చోట్ల వుండటానికి అవకాశం వుండదు. కొన్ని చోట్ల మేము వెళ్ళేసరికి చూడాల్సిన ప్రదేశాలు మూసేసి వుండేవి. ఈ పోస్టులు చదివి అక్కడికి వెళ్ళే వాళ్ళు మాలా ఇబ్బంది పడకూడదని వాటి వివరాలు కూడా ఇస్తుంటాను.

ఇంకో విషయం. రాసినవాటికన్నా రాయాల్సినవి ఇంకా చాలా ఎక్కువ వున్నాయి!!!!. అందుకే ఒక్కసారి అందరి అనుమానాలూ తీర్చాలని ఈ పోస్టు. అమ్మయ్య. అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి మేము చూసిన ప్రదేశాలగురించి ఇంకా రాయమంటారా వద్దంటారా?????????

Wednesday, September 16, 2009

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లాశ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లా

ఇస్సన్నపల్లికి 15 కి.మీ. ల దూరంలో అడవి ప్రాంతంలో వున్న చిన్న వూరిది. త్రోవంతా పచ్చని చెట్లతో అందంగా వుంది. ఇక్కడి బుగ్గ రామలింగేశ్వరుని గుడి చిన్నదయినా చాలా మహత్యం కలదని భక్తుల విశ్వాసం. చుట్టు ప్రక్కల వూళ్లనుంచే కాకుండా దూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు స్వామి దర్శనానికి వస్తారు.

ఇక్కడి శివ లింగం దగ్గరనుంచీ నీళ్ళు వస్తాయిట. ఆ నీరు ఎక్కడనుంచి వస్తుందో తెలియదుగానీ ఆలయం వెనుక వైపు వున్న పెద్ద గుంటలోకి వచ్చి అక్కడనుంచి గుడి పక్కగా కొంచెం దూరం పారి తర్వాత కనబడవు. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు కానీ ఏ కాలంలోనైనా వుంటాయిట. ఆందుకే స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడని పేరు. ప్రక్కనే వేరే మండపంలో పార్వతి అమ్మవారు. విగ్రహం చిన్నదే అయినా పచ్చగా చాలా కళగా వున్నది.

గుడి ప్రక్కనే అన్నదాన సత్రం వుంది. ప్రతి రోజూ వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో వేరే సౌకర్యాలు లేని కారణంగా, ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాటు.Monday, September 14, 2009

శ్రీ కాలభైరవాలయం, ఇస్సన్నపల్లిశ్రీ కాల భైరవాలయం, ఇస్సన్నపల్లి

శ్రీ సిధ్ధ రామేశ్వర స్వామి ఆలయం నుంచి బయల్దేరి, కామారెడ్డి, రామారెడ్డి మీదుగా బికనూరుకి 20 కి.మీ. ల దూరంలో నిజామాబాదు జిల్లాలోనే ఇస్సన్నపల్లి గ్రామంలో వున్న శ్రీ కాలభైరవాలయం చేరాము. శివ జటాజూటోద్భవుడయిన కాలభైరవునికి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక ఆలయాలు తక్కువగా వున్నాయి. వాటిలో ఇది ఒకటి. ఈ ఆలయంకూడా పురాతనమైనదేకానీ ఈ మధ్య పునరుధ్ధరించారు. కాలభైరవుని పెద్ద విగ్రహం భక్తులని ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. శివుని జటాజూటంనుంచి ఉద్భవించాడు కనుక శివ పుత్రుడని కొందరు, శివాంశ సంభూతుడని కొందరు, శివుని ఇంకొక అవతారమని కొందరు కాలభైరవుని ఆరాధిస్తారు.

ఇక్కడ పూజాదికాలు అయిన తర్వాత ఇక్కడి సీ.ఈ.ఓ. శ్రీ లక్ష్మీకాంతంగారు చెప్పిన ఇంకో దేవాలయం, బుగ్గ రామలింగేశ్వరుడు కొలువై వున్న బుగ్గరామేశ్వరం బయల్దేరాము. దాని గురించి రేపటి పోస్టులో.Saturday, September 12, 2009

నిజామాబాదు జిల్లా


నిజామాబాదు జిల్లా

మన చుట్టు ప్రక్కలే వున్న అనేక అపురూప కళాఖండాలను గురించి మనం తెలుసుకునే ఉత్సాహం చూపించటంలేదు. అందుకే అతి పురాతనమైన అద్భుత కళా ఖండాలు నామ రూపాల్లేకుండా పోతున్నాయి. కొత్తవి వస్తున్నందుకు సంతోషం. కానీ ఏ విదేశాల్లోనూ లేని, మనకే స్వంతమైన, అతి పురాతనమైన ఈ అపురూప సంపదను అతి భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది. అసలు వీటిలో ఎన్నింటిని....కనీసం మీ చుట్టువ్రక్కల వున్న వాటిలో ఎన్నింటిని మీరు చూశారు. ఇంతకు ముందు చూడలేదా? సరే. ఇప్పుడు బయల్దేరండి. అలా నిజామాబాదు పరిసర ప్రాంతాలను చుట్టి వద్దాము.

నిజామాబాదు జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన, అపురూపమైన ఆలయాలు వున్నాయి. వాటిని చూద్దామని ఉదయం కారులో బయల్దేరాం.

శ్రీ సిధ్ధ రామేశ్వర స్వామి దేవాలయం, బికనూరు

హైదరాబాదు, కామారెడ్డి రోడ్డులో కామారెడ్డికి 12 కి. మీ. లు ఇవతలే వస్తుంది బికనూరు. ఇక్కడ వెలిసిన శ్రీ సిధ్ధ రామేశ్వరస్వామి ఆలయ విశేషమేమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా శివలింగం పానువట్టం పైన కనబడదు. చిన్ని శివ లింగం పానువట్టం లోపలే వుంటుంది. స్వయంభూ లింగం. అంతేకాదు. అభిషేక జలం బయటకు వెళ్ళే మార్గంగుండా ఉదయ సూర్యుని కిరణాలు లింగం మీద పడతాయి. లింగం వెనుక ఈశ్వరుని విగ్రహం, అటూ ఇటూ సిధ్ధగిరి, రామగిరి అనే వాళ్ళ విగ్రహాలు. వీరి హయాంలోనే ఇక్కడ లింగం ఉద్భవుంచిందట. వాళ్ళే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందుకే శివుడు కూడా వీరి పేర్లతోనే సిధ్ధరామలింగేశ్వరుడయ్యాడు. అమ్మవారు భువనేశ్వరి. దినదినాభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయానికి వీరి వంశీకులే పూజారులు.

ఈ ఆలయానికి ఇన్ ఛార్జ్ సీ ఈ ఓ, ఇస్సన్నపల్లి సీఈఓ శ్రీ లక్ష్మీకాతం గారు మా ఆలయ దర్ళనాభిలాష గమనించి త్రోవలోనే వున్న ఇస్సన్నపల్లి, శ్రీ కాల భైరవాలయం, దాని సమీపంలోనే వున్న బుగ్గ రామేశ్వరం చూడమని సలహా ఇవ్వటమేగాక అవసరమైన సహాయం చేశారు. వారి సలహా వల్లనే మేమీ రెండు ప్రదేశాలూ చూశాము. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

రేపటి పోస్టు ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవాలయం.