Thursday, January 28, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా--4పెనుగొండ


మర్నాడు ఉదయం హిందూపూర్ నుంచి ఒక గంట ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి పెనుగొండ వచ్చాం. పేరుకి తగ్గట్లే పెద్ద కొండ.  కొండమీద కోట.  కొండ దిగువ శ్రీకృష్ణ దేవరాయలవారి సమ్మర్ పేలెస్..(.చిన్నదే)..వున్నది.  అక్కడ గైడ్ వున్నారు.  గైడ్ సహాయంతో పేలెస్ చూశాం.  ఆయన ఇచ్చిన సమాచారంతో ఈ పెనుకొండ గుత్తికొండకన్నా పెద్దదనీ, కొండమీద కోటశిధిలాలు, లక్ష్మీ నరసింహస్వామి గుడి వున్నాయని తెలుసుకున్నాము.  అలసిపోయి వున్న మేము కొండ ఎక్కటం కష్టమని ఆ ప్రయత్నం చెయ్యలేదు.

ఈ ఊళ్ళో ఇంకో విశేషం...శ్రీ కాళేశ్వరరావు అనే ఆయన చాలా అందంగా, ఆధునాతనంగా షిర్డీసాయి గుడి కట్టించారు.  ఉదయం, సాయంకాలాలలో కొంచెంసేపు మాత్రమే అందరికీ దర్శనం.  విదేశీయులు చాలామంది వచ్చి అక్కడే వుండి, గుళ్ళో మెడిటేషన్ చేసుకుంటారు.  అందుకే వాళ్లకి అంతరాయం లేకుండా అందర్నీ దర్శనానికి కొంచెంసేపు మాత్రమే అనుమతిస్తారు.  మేము వెళ్ళిన సమయం దర్శన సమయం కానందున లోపల చూడలేకపోయాము.  బయటనుంచి చూస్తేనే ఆకర్షణీయంగా వుంది.

అక్కడనుంచి  ఆ ఊళ్ళోనే వున్న కుంభకర్ణ గార్డెన్స్ కి వెళ్లాం.  చాలా పెద్ద కుంభకర్ణుడి విగ్రహం,....నిద్రిస్తున్న కుంభకర్ణుణ్ణి నిద్రలేపే దృశ్యం.....ఆ శిల్పం ఒక్కటే అక్కడి ఆకర్షణ  ఆ గార్డెన్స్ ప్రక్కనే చిన్న ఆంజనేయస్వామి ఆలయం వుంటే చూసి, మధ్యాహ్నం 2-40 కల్లా బస్సులో హిందూపూర్ చేరుకున్నాం.  రాత్రి 7 గంటల బస్ లో హైదరాబాద్ తిరిగి రావటానికి రిజర్వు చేసుకున్నాం.  ఈ లోపల అక్కడికి దగ్గరలోనే వున్న లేపాక్షి చూడాలనుకున్నాం.

3-00 గంటలకు హిందూపురం బస్టాండులో ఒక ఆటో అతనికి మా హైదరాబాద్ బస్ సంగతి చెప్పి, ఈ లోపల లేపాక్షి చూపించి తీసుకు రావాలని చెప్పి ఆ ఆటోలో లేపాక్షి బయల్దేరాం.  రేపు ఆ ముచ్చట్లు.        కుంభకర్ణుడి విగ్రహం


కృష్ణదేవరాయల సమ్మర్ పెలేసు


Thursday, January 14, 2010

తాడిపత్రి -- ఆకట్టుకునే అనంతపురం – 3


తాడిపత్రి  --  ఆకట్టుకునే అనంతపురం – 3

మర్నాడు ఉదయం 9-30కి కాఫీ ఫలహారాలయ్యాక ఆటోలో  తాడిపత్రిలో వున్న దేవాలయాల దర్శనానికి బయల్దేరాం.

బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం

పురాతనకాలంనాటి శివాలయం ఇది.  శివలింగం ముందునుంచి ఎంత తోడినా వెంటనే నీరు  ఊరుతూ వుంటుంది.  అందుకే ఈ స్వామికి బుగ్గరామలింగేశ్వరుడని పేరు.  రెండు గాలి గోపురాలు కొంత శిధిలమయ్యాయి.  కానీ అద్భుతమైన శిల్ప సంపద బేలూరు, హొళెబీడు దేవాలయాలను గుర్తు తెచ్చింది.
 తర్వాత కన్యకాపరమేశ్వరి దేవాలయం.. కొత్తదే, వెళ్ళాం.  ఉదయం 10 గంటలకే మూసేస్తారుటు, దర్శనం కాలేదు.  అలాగే మార్కండేయస్వామి గుడి కూడా మూసి వున్నది.

చింతల వెంకట రమణమూర్తి ఆలయం

ఈ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి చింతలే వుండవంటారు.  అందరి చింతలూ తీర్చేవాడు కనుక ఆ స్వామికి ఆ పేరు.  ఈ ఆలయం శిల్పకళ కూడా బాగుంది. 


ఇక్కడనుంచీ దగ్గరలోనే వున్న ఆదూరుకోన శ్రీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు మా ఆటో డ్రైవర్.  లోకల్ ఆటోవాళ్ళు మనకి చూడదగ్గ ప్రదేశాల గురించి మంచి సమాచారం ఇస్తారు.  మేము చూసిన ఈ ఆదూరుకోనలోని పురాతన నరసింహస్వామి ఆలయం, దీని తర్వాత కట్టబడిన ఓబులేశుకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూడగలిగామంటే మా ఆటో డ్రైవర్ వల్లనే.

మధ్యాహ్నం 2-15 గం. లకి హోటల్కి చేరుకుని రెండు గంటల విశ్రాంతి తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు.  అనంతపూర్ దాకా ఒక బస్ (1 గంట 15 నిమిషాల ప్రయాణం), ఆక్కడనుంచీ హిందూపూర్ బస్ ఎక్కి పెనుకొండలో దిగేసరికి రాత్రి 8 గంటలు దాటింది.  అక్కడ వుండటానికి సరైన హోటల్ దొరక్కపోవటంతో మళ్లీ వేరే బస్ ఎక్కి హిందూపూర్ చేరుకుని (ఒక గంట ప్రయాణం) అక్కడ హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

తదుపరి పోస్టులో పెనుకొండలో చూసినవీ చూడనివీ.

Sunday, January 3, 2010

గుత్తికొండ -- ఆకట్టుకునే అనంతపురం – 2


గుత్తికొండ 

రెండో రోజు గుత్తికొండ చూడటానికి బయల్దేరాం.  కొండదాకా ఆటోలో వెళ్ళాము.  కొండ ఎత్తు ఎక్కువగానే వుంది.  దోవ, పైదాకా రోడ్డులాగా విశాలంగా వుంది.  దోవ అంతా ఆ కాలంలోనే పెద్ద పెద్ద గ్రెనేట్ రాళ్ళు (గోడ పునాదులకి వుపయోగించేలాంటివి) వేశారు.  ఎక్కటానికి తేలిగ్గా వుంది, కానీ దిగేటప్పుడు స్లోపు మూలంగా కాలికి పట్టు దొరక్క కొంచెం ఇబ్బంది అనిపించింది.  కొంచెం దూరం ఎక్కిన తర్వాత దోవలో సయ్యద్ సాహెబ్ దర్గా వుంది.

గుత్తికొండ మీద వున్ కోటకి 17 ద్వారాలు వున్నాయి.  నీటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు బాగున్నాయి.  బావులు చాలా వున్నాయి.  మేము 6 బావులు చూశాం.  అంత ఎత్తయిన కొండ మీద నీటి నిల్వకి ఆ రోజుల్లో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, ఎంత ముదుచూపుతో ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నరోనని ఆశ్చర్యం వేస్తుంది.  ఒక ఏడాది దాకా అక్కడ కోటలో వాళ్ళెవరూ బయటకు రాకపోయినా దేనికీ ఇబ్బంది రాని విధంగా ఏర్పాటు చేసుకున్నారు.  చాలా పెద్ద అశ్వశాల, ధాన్యాగారం, పైన పేలెస్ ఇప్పుడు లేదు కానీ శిఖరాగ్రాన ఒక గుండ్రటి స్టేజ్ లాగా ఎత్తయిన రాతి కట్టడం వుంది.

సందర్శకులెవరూ లేరు.  అంత పెద్ద కొండమీద మేమిద్దరమే అయ్యేసరికి పైదాకా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే అనంతపురం నుంచి వచ్చిన ఒక కుటుంబం కలిశారు.  అందులో ఒకరు శ్రీ భాస్కర్, గుత్తిలో సిండికేట్ బ్యాంకులో పని చేస్తున్నారు.  వాళ్ళుకూడా రావటంతో పైదాకా ఎక్కాం.  అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా పైకి ఎక్కేసరికి 2-30 గంటల సమయం పట్టింది మాకు.

సాయంత్రం 4-30 కల్లా హోటల్ కి వచ్చి రూమ్ వెకేట్ చేశాం.  తాడిపత్రి వెశ్దామని ప్లాన్.  దోవలో తొండపాడు చెన్నకేశవ స్వామి గుడి బాగుంటుందంటే చూసి వెళ్దామని ఆటోలో బయల్దేరాం.  అరగంటలో తొండపాడు చేరాం.  కానీ అసలు గుడి కొండమీద వున్నది.  కింద చిన్న గుళ్ళో ఉత్సవ విగ్రహాలు వున్నాయి.  చుట్టూ యాత్రికులు వుడటానికి గదులున్నాయి.  కొండమీదకి చాలా మెట్లున్నాయి.  గుత్తికొండ ఎక్కి దిగాంకదా, ఇంక ఎక్కలేకపోయాం.  ఆ గుడి దగ్గరే తాడిపత్రి బస్ ఎక్కాం.  అక్కడినుంచి తాడిపత్రికి గంటన్నర ప్రయాణం.  తాడిపత్రిలో బస్టాండు దగ్గరే హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

తాడిపత్రి వివరాలు తర్వాత పోస్టులో.
                                                                                                       
                                                                                                      అశ్వశాల ఎంత పెద్దదో ఫోటోలో అంతా రాలా

నీటి బావి 

 కొండమీద దృశ్యంకొండ పైకి వెళ్ళే ద్వారం

Saturday, January 2, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా--1అనంతపురం జిల్లాలో దర్శనీయ స్ధలాలు చాలా వున్నాయి.  అయితే వీటికి సరైన ప్రచారం లేక కావచ్చు, సరైన వసతులు లేక కావచ్చు....అంత ప్రసిధ్ధికెక్కలేదు.

మేము ఉదయం 7-30 గం. లకు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే బస్ లో బయలుదేరి మధ్యాహ్నం 2-50 గం. లకి అనంతపురం జిల్లాలోని గుత్తి చేరుకున్నాం.  హోటల్ లో రూమ్ తీసుకున్నాం.  సాయంత్రం  4-00 గంటల బస్ లో గుంతకల్ బయల్దేరాం.  గుంతకల్లు సమీపంలో కసాపురంలో వున్న నెట్టికంటి ఆజనేయస్వామి దర్శనం కోసం.  కసాపురం ఆంజనేయ స్వామి, నెట్టికంటి ఆంజనేయస్వామిగా ప్రసిధ్ధికెక్కిన ఈ దేవాలయం వున్న ప్రదేశం పేరు నెట్టికంటి.

నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్ధానం

5-00 గంటలకు గుంతకల్ చేరాం.  గుంతకల్ కి అతి దగ్గరలో వుంది కసాపురం.  గుంతకల్లునుంచి షేర్డ్ ఆటోలు, బస్సు వగైరాల సౌకర్యం ఉన్నది.  ఆటోలో 15 నిమిషాల ప్రయాణం మాత్రమే.

గుంతకల్లు సమీపంలోని ఈ ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది.  పెద్ద విగ్రహం.  దర్శన మాత్రాన మన ఆందోళనలన్నీ పోగొట్టి ఆభయమిస్తున్నట్లనిపిస్తుంది.

తిరుమలరాయలు ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ చాలాచోట్ల ఆంజనేయస్వామి దేవస్ధానాలు కట్టించి ఆంజనేయస్వామి విగ్రహాలని స్ధాపించారు.  అందులో ఇది ఒకటి.  స్ధలపురాణం ప్రకారం తిరుమలరాయలు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఒక చోట నిద్రిస్తుండగా కలలో స్వామి కనబడి ఆయన వెళ్ళే దోవలో ఎండిపోయిన వేపచెట్టు చిగురించినచోట తనకి గుడి కట్టి ప్రతిష్టించమన్నారుట.  ఆయన ప్రయాణంలో ఇక్కడ అలాంటి వేప చెట్టు కనబడి గుడి నిర్మించారు.

గుడి ప్రాంగణం పెద్దది.  ఆకు పూజకి అంటే దగ్గరలోని షాపులో 500 తమలపాకులు ఇచ్చారు.  గుళ్ళోనే వున్న ఇద్దరు ఆడవాళ్ళు (ఆలయ ఉద్యోగస్తులు) వాటిని అడిగి తీసుకుని త్రిభుజాకారంలో వున్న వెదురు చట్రంలో గుచ్చి ఇచ్చారు. ఆకు పూజలో తమలపాకులు విడి విడిగా పూజ చేయరు. పూజలో ఆ చట్రం స్వామి దగ్గర పెట్టి మనకిస్తారు.  గుళ్ళో కోతులు ఎక్కువ. వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త.

ఆ రోజుకి గుత్తి వచ్చి విశ్రాంతి తీసుకున్నాం.

మేము చీకటిపడి వెళ్ళటంతో ఫోటోలు తియ్యలేదు.  అందుకే ఫోటోలు లేవు. 

రేపటి విశేషాలు రేపు చెప్తానేం.