Wednesday, November 26, 2008

యాదగిరి, నల్గొండ జిల్లా

యాదగిరిగుట్ట

తెలంగాణాలో ప్రఖ్యాతి చెందిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగురించి తెలియనివారు వుండరంటే అతిశయోక్తికాదు. అయితే దీని చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే నాకు తెలిసిన విషయాలు చెప్తాను.

ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనంనుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. ఆప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పనుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. ఆది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్ధించి, భక్తులకు ఏవిధమైన బాధలూ కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే వుండిపొమ్మని కోరగా ఆ సుదర్శనము అనతికాలములోనే అక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ వుంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడుట.

తర్వాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రిందవున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా వున్నాడు.

ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కధ. ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంబాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై వుండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై వుండటం లోక విరుధ్ధమని అక్కడికి సమీపంలో వున్న యాదగిరిలో ల క్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్ధం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయనవెంట ప్రహ్లాదుడూ, సకల దేవతలూ వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ వచ్చారుట.

రాక్షస సంహారంచేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం వుంది. ఇందులో స్నానంచేసి స్వామిని సేవించినవారికి సకల కోరికలూ తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృ దేవతలు తరిస్తారు.

చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంచేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.

ఇక్కడ యాత్రీకులకు సకల సౌకర్యాలూ వున్నాయి. శని, ఆది వారాలలో, పర్వదినాలలో జన సందోహం చాలా ఎక్కువగా వుంటుంది. కొండ మీదదాకా పెద్ద బస్సులు తప్ప అన్ని వాహనాలూ వెళ్తాయి.

మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

ఇన్ని విశేషాలున్న ఈ పుణ్య క్షేత్రాన్ని మీరు దర్శించారా? లేకపోతే ఆలస్యం ఎందుకు? వెంటనే బయల్దేరండి.

(ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను. మేము వెళ్ళింది 9-11-2008, ఆదివారం, కార్తీక శుధ్ధ ఏకాదశి అవటం వలన విపరీతమైన జనసందోహంతో యాదగిరి కళ కళలాడటమేకాదు కిటకిటలాడింది. వాహనాలను పైకి పంపిచటం కూడా క్రమబధ్ధీకరించి ఆపి ఆపి పంపారు. సాయంత్రానికి రద్దీ తగ్గుతుందన్నారు. అందుకని మేము గుట్టపైకి వెళ్ళలేక మధ్యలో బయటకివచ్చి సురేంద్రపురి వెళ్ళి సాయంత్రందాకా అక్కడ ఆగి తిరిగి గుట్టకి వెళ్ళేసరికి రద్దీ కొంచెం తగ్గింది. మనిషికి 100 రూ. టికెట్ తీసుకుంటే దర్శనానికి 40 నిముషాలు పట్టింది. ఆ చీకటిలో, ఆ రద్దీలో ఫోటోలు తీయలేకపోయాను.)

Wednesday, November 19, 2008

సురేంద్రపురి, నల్గొండ district

నవగ్రహాల గుడులు

పంచముఖ ఆంజనేయస్వామి


ఆలయ బయట దృశ్యం

సురేంద్రపురి బయటనుంచి దృశ్యం -- గాయత్రి అమ్మవారి ప్రక్కనుంచి మ్యూజియం ప్రవేశం

సురేంద్రపురి

హైదరాబాదుకి 60 కి.మీ. ల దూరంలో యాదగిరిగుట్టకి కొంచెం ఇవతలే కనబడే సురేంద్రపురి లో ఎత్తైన శివ, ఆంజనేయస్వామి, గాయత్రీ దేవి విగ్రహాలు, పూర్ణకలశం చూపరులను ఆకట్టుకుని ముందుకి కదలనివ్వవు. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీ పంచముఖ ఆంజనేయుస్వామి, నేపాల్ పశుపతినాధస్వామిని బోలిన శ్రీ పంచముఖ పరమేశ్వరుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వార్లు ఒకే మహా మండపంలో మూడు ఆలయాలలో కొలువుదీరిన ఆలయమిది.

అంతేగాకప్రపంచంలో ప్రప్రధమంగా అధిదేవత, ప్రత్యధిదేవత, వాహన, సతీ సమేతముగా విడి విడిగా నవగ్రహ ఆలయాలు ప్రతిష్ఠింపబడి ప్రత్యేక పూజలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ గ్రహ దోష నివారణార్ధం పూజలు కూడా చేస్తారు.

ఇక్కడి ఇంకో ఆకర్షణ ఆలయం ప్రక్కనేవున్న కుందా సత్యన్నారయణ కళాక్షేత్రము. దీని ప్రవేశరుసుం 100 రూ. దర్శన సమయం కనీసం రెండుగంటలు పడుతుంది. ఇందులో బాలభారతం, బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, నరకలోకం, పాతాళలోకం, మణిద్వీపం, హనుమంతుని చరిత్ర,, ఇంకా అనేక దేవతామూర్తులేకాక, రామాయణ, భారత, భగవద్గీత లో ఘట్టాలు, పద్మవ్యూహం కూడా .... అన్నీ బొమ్మలతో నిర్మంపబడి చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఇంకా కొన్ని ఘట్టాలు నిర్మాణంలో వున్నాయి.Tuesday, November 11, 2008

కొలనుపాక, నల్గొండ జిల్లా

జైన్ మందిరం మోడల్
జైన్ మందిరం

జైన్ మందిరం ప్రవేశ మార్గం


జైన్ మందిరం బయటనుంచి
శ్రీ రేణుకాచార్య, వీర శైవ మత ప్రచారకులు

మ్యూజియంలో కళాఖండం

నటరాజు, మ్యూజియంలో కళాఖండం

ళ్రీ చండికాంబ సహిత సోమేశ్వరస్వామి దేవస్ధానం
కొలనుపాక

హైదరాబాదు హనుమగొండ మార్గంలో వున్నది జనగాం. క్రీ.శ. 1 వ శతాబ్దమునుంచే ఈ ప్రాంతాలు జైన మతానికి ప్రసిధ్ధికెక్కాయి. ఆ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల నుండి జైన యాత్రీకులు ఇక్కడకు వచ్చేవారు. వారిలో చాలామంది ఇక్కడ స్ధిర నివాసం ఏర్పరుచుకున్నారు. జైనులు ఎక్కువగా వుండే వూరు గనుక జైన్ గావ్ అని పిలిచేవారు. క్రమేపీ జైన్ గావ్ జనగాం క్రింద మారింది.

శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్ధానం, కొలనుపాక

జనగాంకి 10 కి.మీ. ల దూరంలో వున్నది కొలనుపాక. హైదరాబాదు నుంచి ఇక్కడికి 84 కి.మీ. ల దూరం వుంది. కొలనుపాక రైల్వే క్రాసింగ్ దాటాక కుడివైపు తిరిగి 6 కి.మీ. ల దూరం వెళ్ళిన తర్వాత రాజంపేట రోడ్ లో వెళ్తే వస్తుంది 12 వ శతాబ్దంలో నిర్మింపబడ్డ శ్రీ జగద్గురు రేణుకాచార్య లింగోద్భవ మూర్తి శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్ధానం.

11 వ శతాబ్దములో కొలనుపాక కళ్యాణి చాళుక్యులకు రెండవ రాజధాని. ఆ సమయంలో ఇది గొప్ప శైవ క్షేత్రం కూడా. సుప్రసిధ్ధ వీర శైవ ప్రచారకుడు శ్రీ రేణుకాచార్య జన్మ స్ధలం ఇదే. శ్రీ రేణుకాచార్య ఇక్కడ స్వయంభూ లింగం నుంచి పుట్టి, వీరశైవ మత ప్రచారం చేశారని, తర్వాత ఆలింగంలోనే ఐక్యమయిపోయారనీ అంటారు.

మన రాష్ట్రంనుంచేకాకుండా కర్ణాటక రాష్ట్రంనుంచి కూడా ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఆర్కియాలజీ మరియు మ్యూజియంస్ డిపార్టుమెంటు వాళ్ళ ప్రదర్శన శాల వున్నది. ఇందులో వురాతన శిల్పాలు, శాసనాలూ చూడవచ్చు.

శ్రీ మహలక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయం

ఊళ్ళో ప్రవేశించిన తర్వాత ముందు కనిపించే ఆలయం ఇదే. ఈ ఆలయం కూడా 12 వ శతాబ్దమునాటిదే. ఈ ఆలయం వెనుక ఎల్లమ్మ, సాయిబాబాల చిన్న ఆలయాలున్నాయి.
శ్వేతాంబర జైన్ దేవాలయం, కుల్ పాక్

ఇది క్రీ.శ. 1 వ శతాబ్దంనుంచే దక్షిణ భారత దేశంలో ప్రసిధ్ధికెక్కిన జైన పుణ్య క్షేత్రం. 2000 ఏళ్ళనాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం లో వున్న మహావీరుని మరకత విగ్రహం ఐదవ ఎత్తైన విగ్రహం. అతి సుందరమైన ఈ ఆలయంలో మహావీర్ స్వామి భగవాన్, ఋషభదేవ్ భగవాన్, నేమినాధ్ భగవాన్ల విగ్రహాలతోబాటు, ఇంకా అనేక తీర్ధంకరుల విగ్రహాలున్నాయి.

కొలనుపాక గ్రామాన్ని (నల్గొండ జిల్లా) ఆనుకుని వుండే ఈ కుల్ పాక్ గుంటూరు జిల్లాలోకి వస్తుంది.

Friday, November 7, 2008

మేళ్లచెరువు, నల్గొండ డిస్ట్రిక్ట్

స్వయంభూశంభులింగేశ్వరుడుఇష్టకామేశ్వరీదేవిమేళ్లచెరువు

మట్టపల్లి -- హుజూర్ నగర్ రోడ్ లో హుజూర్ నగర్ లోకి వెళ్ళకుండా కుడివైపు బైపాస్ రోడ్ లో వెళ్తే మేళ్ళచెరువు చేరుకోవచ్చు. మట్టపల్లి ఆలయ ధర్మకర్తలలో ఒకరైన శ్రీ వెంకటేశ్వర్లుగారు, వారి ధర్మ పత్ని మాతో కారులో వచ్చారు. దోవలో మాటల సందర్భంలో, మేళ్ళచెరువు లోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పి దర్శనం చేసుకుని వెళ్ళమని సలహా ఇచ్చారు. వారికి మా కృతఙతలు. వారి మూలంగానే మేమీ ఆలయ విశేషాలు తెలుసుకోగలిగాము. మరి మీకూ ఆ విశేషాలు తెలుసుకోవాలని వుంది కదూ. మరి చదవండి.

చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూ వుండేవిట. హనుమకొండ వెయ్యి స్ధంబాల గుడిలోని శివుడు ఆక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టటం, గో హింసలు చెయ్యటంతో కోపించి అక్కడనుండి వచ్చి ఆవులమంద మధ్యలో వెలిశాడుట. ఒక ఆవు శివలింగంమీద పాలు కురిపించటంచూసి యవనులు 11 సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేశారుట. ప్రతిసారీ మళ్ళీ యధాతధంగా ఆ లింగం వచ్చిందట. తర్వాత కాలంలో వూజలు జరగటం మొదలయినాయి.

అంతే కాదండీ. ఈ స్వామి విశేషాలు ఇంకా చాలా వున్నాయి. చెప్పమంటారా....


లింగం కుడివైపు వెనక ప్రక్క చిన్న గుంట వుంది. దానిలో నీరు ఎప్పడూ వుంటుంది. దీనిలోనికి దారానికి రాయి కట్టి వేసినా అంతు కనుక్కోలేక పోయారు. అక్కడ పూజారిగారు చెప్పిన సమాచారం ప్రకారం ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పడు ఎండౌమెంట్స డిపార్టుమెంటువాళ్ళు అక్కడ పైప్ లైన్ ఏదో వుండి వుంటుంది, గుడి కట్టేటప్పడు చూసుకోకుండా కట్టేసి వుంటారు, అందుకే ఆ నీళ్ళలా వస్తున్నాయని ఆ నీళ్ళన్నింటినీ తోడేయించి, గుడికి తాళం వేయించి వాళ్ళ మనుషులను కాపలా పెట్టారుట. అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట.

ఈ లింగం పెరుగుతూ వున్నదిట. దానికి ఋజువు లింగం మీద బొట్ల సంఖ్య పెరగటమే. శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆ వూర్లో 30 ఏళ్ళ నుంచీ వుంటున్నారుట. ఆయన వచ్చినప్పుడు లింగం మీద మూటు బొట్లు వున్నాయిట. ఇప్పుడు ఐదయినాయి, నేనే చూశాను ఆ తేడా అన్నారు ఆయన. లింగం మీద గుండ్రటి ఆకారంలో పలుచని గుంటల్లాగా వున్నాయి. ఇవే బొట్లు. ఫోటోలో మీరు కూడా చూడవచ్చు.

ఇక్కడ శివలింగం తెల్లరాతి లింగం. ఈ లింగానికి వెనకాల జడ వున్నది. ఈయన అర్ధనారీశ్వర రూపం అందుకే అలా వున్నదంటారు. అందరికీ అద్దంలో చూపిస్తారు గుంటలో వున్న గంగనీ, జడనీ. బ్రాహ్మలు పట్టుబట్టలతో వెళ్తే మగవారిని గర్భగుడిలోకి అనుమతిస్తారు.

తర్వాత కాలంలో అమ్మవారు ఇష్టకామేశ్వరిని ప్రతిష్టించారు. స్వామి, అమ్మ ఇద్దరూ చాలా అందంగా వున్నారు. సోమవారం కావటంతో జనాలు బాగానే వున్నారు. అభిషేకం చేయించి, వాళ్ళ అనుమతితో ఫోటోలు తీసుకుని, ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము.

Wednesday, November 5, 2008

శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, మట్టపల్లి

ఆలయ దృశ్యం
ఆలయం లోపల దృశ్యం

మట్టపల్లి

సాయంత్రం 4-30కి మట్టపల్లి చేరుకున్నాము. ఇక్కడ బ్రహ్మణ, వైశ్య వగైరా కుల ప్రాతిపదికపైన సత్రాలున్నాయి. గది అద్దె రోజుకి వంద రూపాయలు. భోజనం గురించి ముందు చెప్తే ఆ సత్రాలవాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక దానిలో గది తీసుకుని సామాను పెట్టి దేవాలయానికి బయల్దేరాము.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మట్టపల్లి

గర్భ గుడిలో స్వామికి ఎడమ ప్రక్కన ఒక గుహ ద్వారం వుంది. అక్కడనుండి సప్త ఋషులు, ఇతర మునులూ కృష్ణలో స్నానంచేసి స్వామి దర్శనానికి వస్తారుట. వాళ్ళు ఇప్పటికీ రోజూ వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్ధం తర్వాత కట్టింది. ఇదివరకు ఈయనను దేవతలు, మునులు మాత్రమే పూజించేవారుట. స్వామి మానవులకు కూడా దర్శనమియ్యాలని, ఒకరికి కలలో కనిపించి తన ఉనికిని చెప్పగా వారు బిలద్వారాన్ని తెరిచారుట.

ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రంయొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే మట్టపల్లి స్వామివారే స్వయంగా చెప్పారుట. సంపూర్ణమైన విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నేను తీరుస్తాను అని. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు వున్నవారు, సంతానము లేనివారు నా క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడుపూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో మీ అన్ని కోర్కెలు తీరుస్తాను అని చెప్పారుట. ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు.

ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింప చేయటానికి తర్వాత ప్రతిష్టించారుట.

21-1-2008
ఉదయం కృష్ణ స్నానం, ప్రదక్షిణలు, దర్శనం అయ్యాక 10 గంటలకు బయల్దేరి 11-20 కి మేళ్ళ చెరువు చేరుకున్నాము.