Thursday, May 31, 2012

ఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరుఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరు

సుమారు 1200 సంవత్సరాల క్రితం హొయసల రాజు విష్ణవర్ధనుడిచే నిర్మింపబడిన ఈ ఆలయం నేటికీ అద్భుతంగా వున్నది.  ఇక్కడ స్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుంటాడు.  తొడపైన హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుండే స్వామి, ఎనిమిది చేతులుతో  విరాజిల్లుతుంటాడు.  రెండు చేతులు సంహారం చేస్తుంటే, ఇంకో రెండు చేతులతో హిరణ్యకశిపుని పేగులు మెడలో వేసుకుంటూవుంటాడు.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం, ఇంకో రెండు చేతులలో పాశం, అంకుశం ధరించి వుంటాడు.  స్వామి నామంకింద ముక్కుపైన మూడోకన్ను వున్నది.  స్వామికి కుడిప్రక్క ప్రహ్లాదుడు, ఎడమవైపు గరుడుడు సేవిస్తూ వుంటారు.

మహా భారత యుధ్ధం చివరి రోజులలో అర్జనుడు నరసింహ రూపం దర్శించాలని వుందని శ్రీ కృష్ణుడిని ప్రార్ధించాడుట.  అది ఉగ్ర రూపం కనుక అది సాధ్యపడదని చెప్పి, అర్జనుని కోరిక తీర్చటంకోసం బ్రహ్మచేత శిల్పం రూపొందించాడుట.  ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్టించారు.

తర్వాత కాలంలో రాజులు యుధ్ధాలలో ఉపయోగించటానికి ఇక్కడ బాంబులు తయారు చేసేవారు.  అందుకే ఈ వూరి పేరు మద్దూరు అయింది.  మద్దు అంటే కన్నడంలో బాంబు అని అర్ధం.

ప్రదక్షిణ మార్గంలో వున్న ఉపాలయాలలో యశోద ఒళ్ళో చిన్ని కృష్ణుడు, నరసింహనాయకి అమ్మవారిని దర్శించవచ్చు.  ఇంకా ఆంజనేయస్వామి, నరసింహస్వామి, వేణుగోపాలస్వామి వగైరా దేవతా మూర్తుల రంగుల చిత్రాలు గోడలమీద వున్నాయి. 

పక్కనే వున్న ఆలయంలో వరదరాజస్వామి కొలువుతీరి వున్నాడు.  ఆలయం అప్పటికే మూసేసినా పూజారిగారు మేము చాలా దూరంనుంచి వస్తున్నామని తెలిసి తలుపులు తెరిచి దర్శనం చేయించారు.  ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడినది.  కమలం మీద నుంచున్న స్వామి 16 అడుగుల ఎత్తు వున్నాడు.  శంఖ, చక్ర, గదా పద్మాలతో, ఎదపై లక్ష్మితో శోభిల్లుతున్నాడు. 

ఆలయ సమయాలు ఉదయం 8 గం. లనుంచీ 2-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచి 8-30 దాకా.

ఇంకో ముఖ్య విశేషం
మద్దూరు వడ చాలా పేరు పొందిందండోయ్.  చాలామంది చెప్పారు..మద్దూరు వెడితే అక్కడ వడ తప్పకుండా తినండి అని.  ఏ హోటల్ లో అడిగినా ఇస్తారు.  చాలా చోట్ల బోర్డులుకూడా వుంటాయి.  ఒక్కొక్కటీ 15 రూ.  రుచి కొంచెం వేరుగా వుంటుంది.  బహుశా రవ్వ వేస్తారనుకుంటాను.  బాగున్నాయి.  వెళ్ళినవాళ్ళు తప్పకుండా తినండి.  ఆలయ దర్శనం అయ్యేసరికి 2-45 అయింది.  మద్దూరులోనే భోజనం చేసి తిరిగి బయల్దేరాము.
 శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం, గోపురం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం లోపల దృశ్యం
 హొయసల రాజుల చిహ్నం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం

Wednesday, May 23, 2012

ప్రయాణంలో పదనిసలు - 4 వేసవిలో జలకాలాటలు
ప్రయాణంలో పదనిసలు - 4

వేసవిలో జలకాలాటలు - మల్లెల తీర్ధం

వేసవి..సూర్యారావుగారు అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతున్నారు..మీరేమో జలకాలాటలంటారేంటని కోప్పడుతున్నారా  మీ కోపం తగ్గించేందుకే మేము ఈనెల 14న, అంటే 14-5-2012 న వెళ్ళొచ్చిన జలపాతం గురించి చెబుతున్నాను.  మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు.  కొంచెం మెడ సారించి చూడండి.  హైదరాబాదుకు సుమారు 170 కి.మీ. ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్డులో వుంది.  అదేనండీ మల్లెల తీర్ధం.  శ్రీశైలం వెళ్ళే దోవలో ఎడమవైపు బోర్డు కనబడుతుంది.  అక్కడనుండి లోపలికి 8 కి.మీ.ల దూరం వుంటుంది.  రోడ్డు  బాగుంది.  కంకర రోడ్డు.  

దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పారు.  మా అబ్బాయేమో నువ్వా మెట్లు దిగలేవు, చాలా వున్నాయి అన్నాడు.  రోడ్డు బాగుండదని కొందరు.   కొందరేమో నీళ్ళు చాలా తక్కువ వుంటాయి.  సరే..ఇన్ని అభిప్రాయాలెందుకు..వెళ్ళు చూస్తే సరిపోతుందికదా అనుకున్నానుగానీ, దేనికన్నా టైము రావాలికదా.  ఈ మారు శ్రీశైలం ట్రిప్ లో ఆ టైము కుదిరింది.

అయితే అసలు సంగతి అక్కడకెళ్ళాక వుంది.  మరి 350 మెట్లు దిగాలి..మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఎక్కి పైకి రావాలి కూడా. భయపడకండి..మెట్లు చిన్నగానే వుంటాయి.   మెట్లు దిగిన తర్వాత దాదాపో 200 గజాల దూరం కొండపైన నడవాలి.  మరి జలపాతంలో జలకాలాడాలంటే ఆ మాత్రం కష్టపడాలండీ.  ఇంక చాలు…పైనుంచి మల్లెలలా జాలువారే జలపాతంలో హాయిగా మీ ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడండి.  ఇది చూసి వెళ్ళొచ్చినవాళ్ళుంటే చెబితే సంతోషిస్తా.

 మెట్లు దిగాక దోవ
జలపాతం

Tuesday, May 22, 2012

ప్రయాణంలో పదనిసలు
ప్రయాణంలో పదనిసలు
శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతి రోజు (15-5-2012) మేము ప్రకాంశం జిల్లాలో కొంత తిరిగాము.  సాయంత్రం భైరవకోననుంచి వచ్చేటప్పుడు  కనిగిరి  మొదట్లో కనిపించిన అంబరాలంటే సంబరాలివి.  ఇందులో అందాలొలికే విద్యుత్ అలంకరణ శ్రీ ఆంజనేయస్వామికోసం అలంకరించిన ప్రభట.  60 అడుగుల పైనే ఎత్తుగావుంది.  విద్యుద్దీపాలతో చాలాబాగా అలంకరించారు.  చూడండి.  బాగుందికదూ.  మేము చిన్నప్పుడు శివరాత్రికి ప్రభలుకట్టి తీసుకెళ్ళటం చూశాంగానీ, అవి ఇంటి దగ్గరకట్టు గుడిదాకా దేనిమీదన్నా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చేవారు.  కానీ ఇది గుడి పక్కన ఖాళీ ప్రదేశంలో కట్టారు.  తర్వాత తీసేస్తారుట.  మరి నేను చూసింది మీకూ చూపించాలికదా...

 


Saturday, May 19, 2012

ప్రయాణంలో పదనిసలు


ప్రయాణంలో పదనిసలు

శ్రీశైలంవెళ్ళే దోవలో మామిడిపళ్ళు కనబడితే తోటనుంచి అప్పుడే తెచ్చినవి, సిటీలో ఇంతమంచివి దొరకవనుకుంటూ కొనేసుకున్నాం మా వదినగారూ నేనూ.  దోవలో టీ తాగుదామని ఆగాము.  కారు కిటికీ అద్దం ముయ్యటం మరచిపోయాము.  అంతే..ఓ కోతి ఇంచక్కావచ్చి కారులో వెనుకవైపువున్న మా మామిడిపళ్ళ కవరు  తీసుకుని, మొయ్యలేక మోసుకుంటూ అక్కడే ఓ ఇంటిమీదకెక్కి కూర్చుని పండు తీసుకుని తినటం మొదలు పెట్టింది. 

కోతుల గుంపులోకూడా అయినవాళ్ళూ, కానివాళ్ళూ వుంటారేమో.  కొన్ని కోతులు పళ్ళు చూసి వచ్చినా దూరంగానే కూర్చున్నాయి.  కొన్ని కోతులని ఈ తినే కోతి తరిమి కొట్టింది.  మధ్యలో వచ్చిన ఓ పెద్ద కోతికి మాత్రం పండిచ్చింది.  మొత్తానికి అవి మా మామిడిపళ్ళు తినేసినా వాటి విన్యాసాలు ఆ ఎండలో నా కెమేరాకి అందినంతమటుకూ బంధించి మీకు కూడా చూపిస్తున్నాను.  చూడండి మరి.
 
హమ్మయ్య
 
 అంతా నాకే.  నీకేం ఇవ్వను ఫో…

 
అసమదీయులు..షేర్ చెయ్యాలి..తప్పదు
 
 విందు భోజనం
 
 ఇంకా లేవా                     

Thursday, May 10, 2012

శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం, హోణన్ గిరిశ్రీ యోగ నరసింహస్వామి ఆలయం, హోణన్ గిరి

దొడ్డమల్లూరు దాటాక 2 కి.మీ.ల తర్వాత ఎడమవైపు కమాను కనబడుతుంది.  దానిలోపలకి వెళ్ళాలి.  రోడ్డు అంత బాగుండదు..మట్టి రోడ్డు..కొంచెం గతుకులు..నిర్మానుష్యంగా వుంటుంది.  ఘాట్ రోడ్డే కాకుండా అరణ్య మార్గంకూడా.    వీటన్నింటితో వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్ళామనిపించింది.  ఇంతా చేస్తే వెళ్ళింది 5 కి.మీ.లే.  మీరు భయపడాల్సినంత దట్టమైన చెట్లుకానీ, గుంటల రోడ్లుకానీ వుండవండీ.

ఇక్కడ కొండమీద  శ్రీ  యోగ నరసింహస్వామి వున్నారు.  పూర్వం కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు.  ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమైనారు.  పూర్వం ఋషులు భగవంతుడు ప్రత్యక్షమైనా వారికోసం ఏమీ కోరుకునేవారుకాదు.  సమాజ శ్రేయస్సుకోసం ప్రత్యక్షమైన భగవంతుని అక్కడే వుండి ప్రజలను కాపాడమని కోరేవారు.  కణ్వ మహర్షికూడా అలాగే కోరటంతో నరసింహస్వామి అక్కడే వెలిశాడు.  తర్వాత కణ్వమహర్షి అక్కడనుంచి వెళ్ళిపోయారు. 

ఇక్కడ స్వామిదగ్గరవున్న గరుడ స్తంబం గురించి అక్కడి పూజారి ఏదో చెప్పారుకానీ కన్నడ భాషా జ్ఞానం లేనందున అర్ధం చేసుకోలేకపోయాను.  నాకు అర్ధం అయినంతమటుకూ గరుడ స్తంబం ఆలయ గోపురానికన్నా ఎత్తుగా వుంది.  బహుశా స్వామి ఆ స్తంబంలో ప్రత్యక్షమయ్యారేమో.  అందరికీ ఈ ఆలయం గురించి చెప్తానంటే, స్వామి ఫోటో దగ్గరనుంచి పూజారిగారే స్వయంగా తీసిచ్చారు.    ఫోటోలో స్వామి వెనుకవున్న గరుడస్తంబాన్ని గమనించండి.

చాలాకాలం ఆదరణకి నోచుకోని ఈ ఆలయాన్ని 30 ఏళ్ళక్రితం దాసప్ప అండ్ సన్స్, టాడీ కాంట్రాక్టరు, బెంగుళూరు వారు పునర్నిర్మాణంగావించారు.  అప్పటినుంచి భక్తుల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి.  శని, ఆదివారాలలో జన సందోహం బాగానే వుంటుంది.  శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ఎక్కువ భక్తులు వస్తారు.  వచ్చిన అందరికీ ఆ రోజుల్లో భోజనాలు పెడతారు.  నరసింహ జయంతికి స్వామి కళ్యాణం జరుగుతుంది.
ఆలయం చిన్నదే.  చుట్టూతా నిర్మానుష్యంగా వుంటుంది.  ప్రశాంత పరిసరాలు.  ఆహ్లాదకరమైన వాతావరణం, సరైన సమయం దొరికితే కొంత సమయం సంతోషంగా గడపవచ్చు.  ఈ పరిసరాల్లో ఏమీ దొరకవు.  వాహనంకూడా మీదయితేనే నయం.  ఆటోలవీ దొరికేట్లు కనబడలేదు.
దర్శన సమయాలు
ఉదయం 9 గం. లనుంచీ 4 గం. ల దాకా.
శని, ఆదివారాలలో ఉదయం 9గం. లనుంచీ 6 గం. ల దాకా.

12-50కి తిరిగి ప్రయాణం మొదలైంది.


Friday, May 4, 2012

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, చిక్ మళూరుశ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, చిక్ మళూరు

రహదారికి దగ్గరలో వున్న ఆలయం ఇది.  చిక్ మళూరు రోడ్డులోకి తిరిగిన వెంటనే కుడివైపు సందులో కొంచెం లోపలకి వెళ్తే వస్తుంది ఈ అతి పురాతన ఆలయం.  ఈ ఆలయం 3000 సంవత్సరాల క్రితందని పూజారిగారు చెప్పారు.  ఇక్కడ శ్రీ వేణుగోపాలస్వామి రుక్మిణీ సత్యభామా సమేతంగా దర్శనమిస్తాడు. 

రాజ రాజ మార్తాండ మహారాజు, మృకండ మహర్షిచేత ప్రతిష్టింప చేయించాడు ఈ స్వామిని.  ఈ స్వామిని సేవించినవారికి సత్వరం కళ్యాణం జరుగుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ ప్రతీతి.

పూజారిగారు చెప్పినదాని ప్రకారం…కణ్వానదికి పూర్వం నిర్మల అనే పేరుండేది.  కణ్వ మహర్షి ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తే స్వామి ప్రత్యక్షమైనాడు.  అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామి దయాళుడు.  సంతానం కోసం, పెళ్ళికోసం, కోరిన కోర్కెలు నెరవేరటం కోసం ఈ స్వామిని ఆశ్రయించే భక్తులపాలిటి కల్పవృక్షం.

కణ్వ మహర్షి ఇప్పటికీ తెల్లవారుఝామున 2-30 ప్రాంతాల్లో వచ్చి స్వామికి పూజ చేస్తారని ఇక్కడివారి నమ్మకం.

ఆలయం మరీ పెద్దదికాదు. పూజారిగారు  ఆలయం ప్రాంగణంలోనే వుంటారు.  ఆలయం మూసిన తర్వాత ఎవరైనా వెళ్తే ఆయనని సంప్రదించవచ్చు.

 ఆలయం బయట ద్వారం
 లోపల ఆలయం
 రుక్మణీ సత్యభామా సమేత శ్రీకృష్ణుడు

Thursday, May 3, 2012

కూడ్లూరుకూడ్లూరు

నదీ నరసింహస్వామి ఆలయంనుంచి మళ్ళీ మైసూరు రోడ్డులో బయల్దేరాము.  తెలుసుకున్నవి కొన్నీ, అస్సలు తెలియనివి కొన్నీ..మొత్తానికి ఆ ప్రాంతంలో ఏమీ వదిలి పెట్టకుండా చూడాలనే తాపత్రయం ఒకటి.  వీటితో దోవలో ఎక్కడ ఏ ఆలయం బోర్డు కనబడ్డా వెళ్దామనేదాన్ని.  ఇలా అయితే ఈ చిన్న ఆలయాలు తప్పితే ఏమీ చూడం అని శ్రీవారి విసుగులు.  అలా వెళ్ళిన ఆలయం ఈ మంగళేశ్వరస్వామి ఆలయం.  రహదారి మీదనుంచి లోపలికి చాలా దూరమే వెళ్ళాము.

700  -  800 సంవత్సరాల క్రితం ఆలయాలివి.  చాలా చిన్నవి.  కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారు.  పంచ లింగాలకు ఐదు చిన్న చిన్న ఆలయాలున్నాయి.  మేము వెళ్ళేసరికి స్వామి ముందు తెర వేసివుంది.  పూజారిగారు పది నిముషాలు కూర్చోమన్నారు.  సమయంలేదని వచ్చేయబోతుంటే తెర తొలిగించారు.  అంత అతి చిన్న ఆలయంలో కూడా స్వామిని దర్శిస్తుంటే  ఒక పవిత్ర ప్రదేశంలో వున్నట్లు భక్తి భావం తొణికిసలాడింది.  పురాతన ఆలయాలలో వున్న మహత్యం ఇదేననిపించింది.

ఉదయం 11-10 కి తిరిగి బయల్దేరాము.