Friday, June 25, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 11



ప్రయాగలో దర్శనీయ స్ధలాలు - 3
       
శంకర విమాన మండపం

బడే హనుమాన్ మందిర్ నుంచి శంకర విమాన మండపం లేదా శంకర మఠం  వెళ్ళాం.  చాలా దగ్గరలోనే వుంది. 
ఈ విమాన మండపం ఇక్కడ నిర్మింపబడటానికి కారణం ఒక కధ చెప్తారు.  కంచి పీఠానికి 68వ అధిపతి అయిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు
ఒకసారి  ప్రయాగలో వున్న సమయంలో,  ఆది గురువు శ్రీ శంకరాచార్యులవారు కుమారిల భట్టు అనే విద్వాంసుని కలిసి తన అద్వైత సిధ్ధాంతాలతో ఆయనమీద విజయం పొందిన ప్రదేశంలో ఆ విజయ సూచకంగా ఒక విజయ స్తంబాన్ని స్ధాపించాలని సంకల్పించారు.  1986 లో ప్రతిష్టింపబడిన ఈ మందిరం ఎత్తు 130 అడుగులు.  ఈ మందిర నిర్మాణానికి 16 సంవత్సరాల సమయం పట్టింది.  ఒక కోటి రూపాయలు ఖర్చయినాయి.  ద్రవిడ శైలిలో నిర్మింపబడిన ఈ మండపంలో శ్రీ కామాక్షీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శంకరుడు, శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్టింపబడి వూజలందుకుంటున్నాయి.  ఇవే కాక ఇంకా అనేక దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయంగురించి.


Tuesday, June 22, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 10



ప్రయాగలో దర్శనీయ స్ధలాలు - 2

బడా హనుమాన్ మందిర్

పాతాళపుర మందిర్ నుంచి దానికి అతి సమీపంలో వున్న బడా హనుమాన్ మందిర్ కి వెళ్ళాము.  ఇక్కడ ఆంజనేయస్వామి అతి పెద్ద విగ్రహం.  నేలమీద పడుకున్నట్లు వుంటుంది.    ఈ విగ్రహం మొగలు చక్రవర్తి అక్బరు సమయంలో స్ధాపించబడినదని కొందరంటే, కొందరు  పూర్వం ఒక శైవ భక్తుని కలలో విగ్రహం ఇక్కడవున్నట్లు కనబడటంతో దానిని కనుగొని ఆలయం కట్టించారని అంటారు.  ఏది ఏమైనా ఈ ఆలయం చాలా పురాతనమైనది.  ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దది.

ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకోబెట్టినట్లు వుంటుంది.  ఇదివరకు ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని (ముస్లింలని కొందరు, బ్రిటిష్ వారని కొందరు అంటారు) ప్రయత్నించారుట.  విగ్రహాన్ని తవ్వటానికి ప్రయత్నించినకొద్దీ భూమిలో ఇంకా గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్ధిరంగా కాసాగింది.  అందుకని అలాగే వదిలేశారు.  ఇప్పుడు విగ్రహం గుంటలో వున్నట్లు వుంటుంది.  చుట్టూ కట్టిన ప్లాట్ ఫారమ్ మీదనుంచి భక్తులు స్వామిని దర్శించి అర్చిస్తారు.  కొందరు గంగనీరు తీసుకు వెళ్ళి పోస్తున్నారు, అలాగే పూవులు వగైరాలను సమర్పిస్తున్నారు.

ఇంకొక విశేషమేమిటంటే వర్షాకాలంలో గంగానదికి వరదలొచ్చినప్పుడు గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందిట.   చూసేవాళ్ళకి ఆంజనేయస్వామి గంగానదిలో స్నానం చేస్తున్నట్లు వుంటుంది.

ఆలయంలో అక్కడి మహంత్ అనుమతితో ఫోటో తీసుకోవచ్చని బోర్డు చూసి ప్రయత్నించాను.  మహంత్ ఆఫీసులో లేరు.  వేరే ఒకాయన అక్కడ చరిత్ర ఏదో చెప్పారు కానీ నా కర్ధమయింది ఆంజనేయ స్వామి యుధ్ధానంతరం ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు, అందుకనే విగ్రహం అలా పడుకున్నట్లుంటుంది అని.   అడిగిన వెంటనే ఫోటోకి అనుమతి ఇవ్వక పోయినా ఆయనకి తెలిసిన విషయాలు చెప్పారు..అర్ధం చేసుకోలేక పోవటం నా దురదృష్టం.  ఆయనకి ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము చూడవలసినవి ఇంకా చాలా వున్నాయిగా మరి.
 బడే హనుమాన్ ఆలయం ముందు దృశ్యాలు

Monday, June 21, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 9




ప్రయాగలో దర్శనీయ స్ధలాలు 1

పాతాళపుర మందిర్

త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట వున్నది.  దీనిలోకి అందరికీ ప్రవేశం  లేదు.  ఆర్మీ వున్నది ప్రస్తుతం ఆ కోటలో.  అయితే ఈ కోటలో వున్న పాతాళ పుర మందర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళి రావచ్చు.  ఫోటోలు తియ్యనియ్యరు.

ఇక్కడ- వున్న వట వృక్షం అతి పురాతనమయినది.  మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే వుండేదట.  చైనా యాత్రీకుడు హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు ఈ వటవృక్షం బయట ఆవరణలోనే వుండేదిట.  అక్బర్ కోట కట్టించేటప్పుడు స్ధలం ఎత్తు పెంచవలసి రావటంతో ఇవి భూ గర్భంలోకి వెళ్ళాయి.  అయితే అంత పెద్ద కోట కట్టించేటప్పుడుకూడా అక్బర్ ఈ ఆలయాన్ని యధాతధంగా అట్టిపెట్టి తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు.

ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వకాలంలో ఈ చెట్టు మీదనుంచి కింద వుండే కామ్య కూపంలో దూకి ఆత్మాహుతు చేసుకునేవాళ్ళట.  తన పూర్వ జన్మలో అక్బర్ చక్రవర్తి కూడా ఈ చెట్టుమీదనుంచి దూకి ప్రాణ త్యాగం చేశాడుట.  అయితే ఆ సమయంలో ఆయన భారత దేశానికి చక్రవర్తిని కావాలని కోరుకున్నాడనీ అందుకే మరు జన్మలో చక్రవర్తి అయ్యాడనీ అక్కడి గాధ.  హిందువులే కాదు, ముసల్మాన్ ఫకీర్లు కూడా ఈ చెట్టునుంచీ  హుక్ లకి వేళ్ళాడేవాళ్ళుట.  అయితే ఇది అక్బర్ మాన్పించాడు.

పూర్వం ఈ ఆలయంలోకి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా వుండేది.  మార్గంలోను, లోపల  తగిన వెలుతురు కూడా వుండేది కాదు.  అయితే స్ధానికి ప్రజల పట్టుదలవల్ల సందర్శకులు తేలికగా వెళ్ళటానికి సరైన మార్గం, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చెయ్యబడ్డవి.

84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా వుంటుంది ఈ పాతాళపురి మందిర్.  దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం, వేద వ్యాసుడు, అర్ధ నారీశ్వరుడు, వాల్మీకి, సనక సనందులు వగైరా అనేక ఋషులు, దేవతా విగ్రహాలున్నాయి.  ఇవి అన్నీ అంత పురాతనంగా అనిపించలేదు.

ఇక్కడే వట వృక్షం మొదలు కూడా వుంది.   ఈ వట వృక్షానికున్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలని ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి వాటిని కౌగలించుకోమంటారు.  వట వృక్షం మొదలు మాత్రమే ఇక్కడ వుంటుంది.  పై భాగం భూమి వుపరితలం మీదే వుంటుంది.

శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఈ వట వృక్షం కింద కూర్చున్నాడని, ఇక్కడ తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడని అంటారు.  భరతుడు శ్రీ రాముని వెతుక్కుంటూ వచ్చి, ఆయన ఇక్కడ ఆగాడని తెలుసుకుని ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు విగ్రహం వున్నది.

ఈ కోటలోనే ప్రసిధ్ధికెక్కిన అశోక స్ధంబం వున్నది.  దీనిని కౌశంబినుంచి తెచ్చి ఇక్కడ స్ధాపించారు.

కనీసం ఒక గంట సమయం వుంటే ఈ ఆలయాన్ని చూడవచ్చు.  అంత సమయం లేనప్పుడు, వటవృక్షాన్ని చూసి ఒక్కసారి వాతాళ మందిర్ లోకి తొంగి చూసి వచ్చేయచ్చు ఆ విగ్రహాలన్నీ ఎవరివని వివరంగా చూడకుండా.  మా వేన్ డ్రైవర్ దీన్ని చూడకుండా తీసుకుపోదామని చూశాడు.  అది కోట.  పర్మిషన్ లేకుండా వెళ్ళనవ్వరు అని.  నాకు హింది చదవటం రావటం వల్ల పేరు చదివి అది మందిర్, మందిర్ కి పర్మిషన్ అక్కరలేదు ఒకసారి చూసొచ్చేస్తాము కోటలోకి వెళ్ళొచ్చినట్లుంటుందని పట్టుబట్టి వెళ్ళాను.  ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఇలాంటివి వున్నాయని ఈ డ్రైవర్లల్లో కొందరికి తెలియదు, కొందరు ఈ ట్రిప్ త్వరగా పూర్తి చేసుకుని ఇంకో బేరం చూసుకుందామనే హడావిడో ఏమిటోగానీ కొన్ని ప్రదేశాలు మనల్ని చూడనివ్వరు.  అలా మేము వదిలేసినవన్నీ చివరికి వ్రాస్తాను.  మీకు వీలయితే చూడండి.

దూరంనుంచి అక్బరుకోట 
(పడవలోంచి తీశాను.  సరైన దృశ్యం రాలేదు.  సర్దుకు పొండి)

Wednesday, June 16, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు--8



కాశీ కబుర్లు మధ్యలోనే ఆపేశాననుకుంటున్నారా?  ఏం చేద్దాం  కొన్ని భవసాగరాలవల్ల కొంత ఆలస్యమయింది.  ఈ మారు ఆలస్యం లేకుండా పూర్తి చెయ్యాలని ప్రయత్నం.

ప్రయాగ లేక అలహాబాద్

ప్రయాగలో దర్శనీయ స్ధలాల గురించి తెలుసుకునే ముందు అసలు ప్రయాగ చరిత్రని గురించి కొంచెం చెప్తాను. 

పురాతన కాలంనుంచీ ప్రయాగ తీర్ధరాజంగా కొనియాడబడుతున్నది.  దీనికి ముఖ్య కారణం మూడు జీవ నదుల సంగమం ఇక్కడ వుండటం.  అవి గంగ, యమున, సరస్వతి.  ప్రస్తుతం సరస్వతి మనకి కనబడదు.  ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేలా జరుగుతుంది.  ప్రతి 12 సంవత్సరాలకీ కుంభ మేలా,  144 సంవత్సరాలకి మహా కుంభ మేలా జరుగుతాయి.  భారత దేశం నలు మూలలనుంచీ అనేకమంది భక్తులు విచ్చేసి ఈ సంగమంలో స్నానం చేసి భక్తి భావనతో పునీతులవుతారు. 

ఈ మేలాలు నిర్వహించటానికి వెనుక ఒక పౌరాణిక గాధ వుంది.  దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందని అందరికీ తెలుసు.  ఆ అమృతాన్ని అసురులబారినుండి రక్షించటానికి ఇంద్రుడు స్త్రీ అవతారంలో వచ్చి అమృత భాండాన్ని అసురులకందకుండా కాపాడబోయాడుట.  ఆ సమయంలో ఇంద్రుడికీ, సురాసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండంలోంచి అమృతం తొణికి కొన్ని చుక్కల అమృతం నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లో పడ్డాయిట.  ఇంక ప్రయాగ లోని ఈ త్రివేణీ సంగమంలో ఆ అమృత భాండమే పడిందిట.  అందుకనే ఈ సంగమ ప్రాంతం అంత ప్రాధాన్యతను సంతరించుకుంది.  అప్పటినుంచీ ఈ మేలాలు జరుపబడుతున్నాయిట.

అదేమిటి అమృతం ఆవిర్భవించినప్పుడు మహా విష్ణువు మోహినీ రూపంలో వచ్చి దేవతలకి మాత్రమే అమృతం ఇచ్చాడంటారుకదా, మరి ఇంద్రుడు స్త్రీ రూపంలో రావటమేమిటంటారా  మనవాళ్ళు చెప్పే కధ మనం విన్నాము.  మరి అక్కడి కధ ఇది.  నమ్మండి, నమ్మకపొండి మీ ఇష్టం.

మరి అప్పుడెప్పుడో, మనమెవ్వరం పుట్టకముందు బ్రహ్మదేవుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడుట.  అప్పుడే ఆ స్ధలం పేరు ప్రయాగ అయిందిట.

రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు, దశరధ మహారాజు మంత్రి సుమంతుడు శ్రీ రామచంద్రుని, సీతా దేవిని, లక్ష్మణుడిని ఈ ప్రాంతందాకా సాగనంపాడుట.  వారు గంగదాటి  ప్రయాగలోని  భరద్వాజ ఆశ్రమాన్ని దర్శించారని ప్రతీతి.  తరువాత వారు భరద్వాజ ఆశ్రమంనుంచీ అక్కడికి 131 కి.మీ. ల దూరంలో వున్న చిత్రకూట్ కి వెళ్ళారు.

సముద్రగుప్తుడు ప్రయాగలో 12 సంవత్సరాలు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడుట.  ఈ యజ్ఞాలవల్ల ఋషులు, సాధువులు, భక్తులు ఇక్కడే తమ నివాసస్ధానాన్ని శాశ్వతంగా ఏర్పరుచుకోవటంతో ప్రయాగ దిన దినాభివృధ్ధి చెందసాగింది.

644 బి.సి.లో చైనా యాత్రికుడు హుయాన్ స్వాంగ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం గురించి తన పుస్తకంలో వ్రాశాడు.  ఇక్కడి గంగా యమునా నదుల గురించీ, అనేక ఆలయాల గురించీ, అశోక స్ధంబం గురించీ వ్రాశాడు.

ఇంకొక ఆసక్తికరమైన విషయం.  1575 సంవత్సరంలో అక్బర్ నదీ మార్గాన ప్రయాగ చేరాడు.  ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బరు దాని పేరు తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇల్-ఇలాహీ కలసి వచ్చేటట్లు అలహాబాద్ అని మార్చాడు.  అప్పటినుంచీ ప్రయాగ అలహాబాదుగా కూడా పిలవబడుతోంది.

భారత దేశ స్వాతంత్ర్య  సమరంలోకూడా అలహాబాద్ కి ప్రముఖ పాత్ర వున్నది.  1857 లో మొదలైన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అలహాబాద్ నుంచి శ్రీ లియాకత్ ఆలీ నాయకత్వం వహించారు.  1857 తరువాత కాంగ్రెసు పార్టీ సమావేశాలు అనేకం ఇక్కడ జరిగాయి.  స్వతంత్ర భారత దేశం యొక్క మొట్టమొదటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ తమ బాల్యాన్ని ఇక్కడి ఆనంద భవన్ లో గడిపారు.  తర్వాత ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, అలహాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ కి చెందినవారే.  అంతేకాదు, తర్వాత ప్రధాన మంత్రులైన శ్రీమతి ఇందిరా గాంధీ,  శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీ వి.పీ. సింగ్ ఇక్కడ పుట్టినవారే.

సాహిత్యపరంగాకూడా వన్నెకెక్కింది ఈ అలహాబాద్.  సుప్రసిధ్ధ హిందీ కవులు, రచయితలు ఇక్కడ పుట్టినవారు, తమ జీవితాలను ఇక్కడ గడిపినవారు ఎందరో.  వారిలో కొందరు ఫిరాక్ గోరక్పూరీ, హరివంశరాయ్ బచ్చన్, మహాదేవీ వర్మా, డా. రామ్ కుమార్ వర్మ, సచ్చిదానంద హీరానంద్ వాత్సాయన్, భగవతీ చరన్ వర్మ, సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా.

ఇన్ని విధాల ప్రసిధ్ధికెక్కిన ప్రయాగని దర్శించటానికి అనుకూల సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు. 

ప్రయాగ గురించి నేను తెలుసుకున్న కధలు మీకు చెప్పాను.  ప్రయాగలో దర్శనీయ స్ధలాల గురించి వచ్చే పోస్టుల్లో.