Friday, September 7, 2012

శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు


ఏప్రిల్ 2012 భక్తిసుధ లో ప్రచురించబడిన నా వ్యాసం......





శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహా మండపే,
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్ధితం
అగ్రేవాచయతి ప్రభంజనసుతేతత్వ్తం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం.

అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రఘురామచంద్రుడు భక్త రక్షా దీక్షా బధ్ధుడై నెలకొనని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.  అలాగే మనవారు ఏ విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు.  సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అది.  అటువంటి రామచంద్రునికి దేశమంతా అనేక ఆలయాలు.  జగత్ప్రసిధ్ధి చెందిన ఆలయాలు కొన్నయితే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో.  వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వంగానీ, ఇటు మత పెద్దలుగానీ కనీసం ఆ ప్రాంత ప్రజలుగానీ  వాటి విలువ తెలుసుకుని ఆదరించకపోవటంవల్ల  వాటి గురించి తెలియచెప్పేవారు లేక, వాటి చరిత్రలతో సహ కనుమరుగవుతున్నాయి.  అలా కనుమరుగుకాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న ఇందూరులోని శ్రీ రఘునాధ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా?    
 
ఇందూరు అంటే ఇదెక్కడ వున్నదని కొందరు సందేహపడవచ్చు.  నిజామాబాదు అంటే అందరికీ తెలుస్తుంది.  క్రీ.శ. 1905 లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్ జా – 6 సమయంలో ఇందూరు పేరు నిజామాబాదుగా మార్చబడ్డది.  అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వ నామధేయాలు ఇందూరు, ఇంద్రపురి. 
రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.శ. 914-928 మధ్య కాలంలో  ఇందూరుని పరిపాలించాడు. ఆయన పేరుమీదే ఇందూరు ప్రసిధ్ధిచెందింది.  ఆ రాజే  ఆ సమయంలో  ప్రస్తుతం ఊరు శివారులో కొండపైన ఈ కోటని నిర్మించాడు.  ఈ కోట నిర్మింపబడి 1100 సంవత్సరాలపైబడ్డా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది.    

అప్పటి పోరాటాలకేకాదు..తెలంగాణా స్వాతంత్ర్యపోరాట వీరులు శ్రీ దాశరధి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి నిజాం ప్రభువునెదిరించిన పోరాటంలో వారిని ఇక్కడనే బంధించారు.     

చరిత్ర ఆధారంగా శ్రీ సమర్ధ రామదాస్ జీ (మన దేశ అత్యంత సాహస వీరుడైన  ఛత్రపతి శివాజీ గురువు)  కోటలో శ్రీ రఘునాధస్వామి   ఆలయాన్ని నిర్మింప చేశారు.
 
అతి పురాతనమైన ఈ దేవాలయంయొక్క వైశాల్యం సుమారు 3900 చ.గ.లు.  ఇక్కడి ధ్వజస్తంబము ఒకే రాతిలో మలచబడ్డది.  53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిలా ధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగంచేవారని ప్రతీతి.

రఘునాధుడనే మహర్షి ఇక్కడ చాలాకాలం తపస్సు చేసుకున్నారు.  ఈయన కోటలోగల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే వున్న బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడ్డ శిలా కట్టడముదాకా వెళ్ళి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కధనాలు ప్రచారంలో వున్నాయి. అంతేకాదు.  కోటలో పలు సొరంగ మార్గాలు వున్నాయనటానికి ఇంకో ఆధారం కోట లోపల్నించి డిచ్ వల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై వున్నాయి.   కోటలో ఈ రఘునాధ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది.  ఎ.సి. ల గురించి తెలియని ఆ కాలంలో కట్టిన ఈ ధ్యానమందిరంలో  మండు వేసవిలోకూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయిగొలుపుతూ వుండేటట్లు నిర్మింపబడింది.  ఇంజనీరింగు చదువులులేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మనవారి ప్రతిభ వేనోళ్ళ కొనియాడతగినది.

ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలివుంటాయి.  (శ్రీరామచంద్రుని అంకంపై సీతమ్మ, పక్కనే లక్ష్మణస్వామి).  అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా వున్న గర్భాలయం, గర్భాలయం ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాధ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాములవారి పాదుకలు, విశాలమైన కళ్యాణమండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను పెంపొందింపచేస్తాయి. 

కొండకిందవున్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో వుండే స్వామివారి స్ధానం ఒకే దిశల సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా వుండటం విశేషం.  ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది.

ఈ మందిరంలో అర్చనచేసి రాముని ప్రార్ధించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.

ఇంత ప్రాచీనమైన ఈ ఆలయం 2002 దాకా సరైన ఆదరణ లేక రోజూ మూసి వుండేదిట.  ఏడాదికి ఒకసారి తీసి శ్రీరామచంద్రుని కళ్యాణం చేసేవారుట.  అయితే 2002 నుంచి శ్రీ చిన్న జియ్యరు స్వామితిరిగి నిత్య పూజలు ప్రారంభించారు.  ఇలాంటి ఆదరణ నోచుకోవాల్సిన ఆలయాలు ఇంకెన్నో. 

ఇక్కడనుంచి చూస్తే చుట్టూవున్న అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.  అంతేకాదు  దేవాలయంవెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగావుండి చూపరులకు మరువరాని ఆనందాన్ని కలిగిస్తుంది.

కొండపైకి వెళ్ళేదోవలో రెండు పెద్ద కొండరాళ్ళవెనుక  ఆంజనేయస్వామికి చిన్న ఆలయం.  మార్గం గుహలోకి వెళ్తున్నట్లుంటుంది.  సహజసిధ్ధంగా ఏర్పడ్డ ఈ మార్గంగుండా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు.

ఇలాంటి ఆలయాలు వైభవోపేతంగా అలరారటానికి ప్రభుత్వము, పెద్దలేకాక ఆ ప్రాంత ప్రజలుకూడా కృషి చెయ్యాలి.  వీలయినప్పుడల్లా ఆలయాల్ని సందర్శించి అవి కళకళలాడటంలో మనవంతు పాత్ర మనమూ నిర్వహించాలి.  ఏమంటారు?
 ఆలయ దృశ్యం
 హనుమాన్ మందిరం మార్గం
 ఆలయ ముఖ ద్వారం




 


Monday, August 6, 2012

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, తొండనూరు.



శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, తొండనూరు.

తొండనూరులో శ్రీ నంబి నారాయణస్వామి ఆలయానికి అతి సమీపంలోనే వున్నది శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం.  ఇక్కడ మూల విరాట్ భూదేవీ, నీలా దేవీ సమేతుడైన శ్రీ పార్ధసారధి  చతుర్భుజుడు….ఒక చేత్తో భక్తులకు అభయప్రదానం చేస్తుండగా, వేరొక చేయి తొడపై ఆని వుంటుంది.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం దాల్చి అపురూప సౌందర్యంతో అలరారుతుంటాడు.

ఉత్సవ విగ్రహాలు శ్రీ దేవి, భూ దేవి సమేత శ్రీ వేణు గోపాల స్వామి.  ఈయన శాస్త్రీయ నాట్యంలోని త్రి భంగిమలో వున్నారు.  వేణు గోపాలస్వామి ఎక్కడ చూసినా కుడి కాలు ముందుకి మెలి వేసి వుండగా, ఎడమ కాలు వెనుక వుంటుంది.  కానీ ఇక్కడ స్వామి ఎడమ కాలు ముందు వుంటుంది.

ఈ స్వామిని ద్వాపర యుగంలో యుధిష్టరుడు ప్రతిష్టించాడంటారు.  ఆలయం చుట్టూ విశాలమైన ఆవరణ ఆకర్షణీయంగా వుంటుంది.


Sunday, July 15, 2012

నంబి నారాయణ ఆలయం, తొండనూరు




నంబి నారాయణ ఆలయం, తొండనూరు
మద్దూరు నుంచి తొండనూరు చేరుకున్నాము.
పాండవపుర తాలూకాలోని ఈ వూరి పూర్వ నామధేయం కిరై తొండూరు. తొండనూరు అంటే చాలామంది చెప్పలేకపోయారు.  చివరికి ఒకరు ఈ  పాత పేరు చెప్పి దోవ చెప్పారు.   విశిష్టాద్వైత మత ప్రచారకుడు శ్రీ రామానుజులు వూర్వం ఇక్కడ చాలాకాలం నివసించి, తన మత ప్రచారాన్ని ఇక్కడనుంచే కొనసాగించారు.  ఆయన ఇక్కడ ఎన్నో మహిమలను చూపించారు.  ఆ కాలంలో హొయసాల రాజైన బిట్టి దేవర జైన మతస్తుడు.  ఆయన కూతురికి దయ్యం పట్టి  ఎన్ని రకాల  వైద్యులకి చూపించినా నయంకాక తల్లడిల్లుతున్న సమయంలో శ్రీ రామానుజులు  చిటికెలో నయం చేశారు.  శ్రీ రామానుజులవారి తేజోస్వరూపానికి,  ఆయన బోధలు, మహిమలకు ఆకర్షితులైన బిట్టిదేవర తన భార్యతోసహా వైష్ణవ మతం తీసుకుని విష్ణువర్ధనుడయ్యాడు.

ఆ సమయంలో విష్ణువర్ధనునిచే నిర్మింపబడిన ఈ ఆలయం బేలూరులోని చెన్నకేశవాలయంలాగానే వుంటుంది.  వెయ్యి సంవత్సరాలపైన చరిత్రగల ఈ ఆలయం లోపు కళాత్మకంగా తీర్చి దిద్దబడ్డ స్ధంబాలు బేలూరు ఆలయాన్ని పోలి వుంటాయి.  ఈ ఆలయంలో నాలుగు స్తంబాలు అమరశిల్పి జక్కన్న చెక్కినవంటారు.  శ్రీ రామానుజాచార్యులవారు తొండనూరులో ఒక సుందర తటాకం కూడా నిర్మించారు.  ఈ తటాకంలో నీరు ఎప్పుడూ ఎండి పోదు.  చాలా స్వఛ్ఛంగా వుంటుందికూడా.   ఒకసారి టిప్పుసుల్తాన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మెడలోని ముత్యాల హారం తెగి ముత్యాలు నీటిలో పడ్డాయిట.  ఆ ముత్యాలను పైనున్నవారు స్పష్టంగా చూడగలిగారుట.  అందుకే టిప్పు సుల్తాను ఈ తటాకాన్ని మోతీ తలాబ్ అని పిలిచారు.

ఈ ఆలయంలో నంబి నారాయణుని విగ్రహం 18 అడుగుల ఎత్తు వుంటుంది.  శ్రీ రామానుజుడు ప్రతిష్టించిన ఈ నారాయణుడు చతుర్భుజుడై,   శంఖం, చక్రం, గద, పద్మాలతో అలరారుతున్నాడు.  నంబి అంటే నమ్మకం.  నమ్మి కొలిచేవారిని రక్షించే నారాయణుడు. అమ్మ అరవిందనాయకి.  ఇక్కడ శ్రీ రామానుజులవారు తపస్సు చేసిన ప్రదేశంలో పాదాలు, శంఖం, చక్రం, నామాలు వున్నాయి. 

 గర్భగుడి ముందు మండపంలో ఉపాలయాలలో విష్వక్సేనుడు, రామానుజుడి శిష్యుడు తొండనూరు నంబి, ఇంకా ఇతర ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.  సువిశాలమైన ఆలయం, పెద్ద పెద్ద స్తంబాలతో విరాజిల్లుతోంది.  ప్రహరీ కోట గోడలా వున్నది.

మేము వెళ్ళినప్పుడు కరెంటు లేదు.  మేము ఆలయం బయటకురాగానే అక్కడవున్న ఒక వ్యక్తి ఒక పెద్ద అద్దం తీసుకుని లోపలకి ఫోకస్ చేసి మమ్మల్ని పిలిచి చూపించాడు.  ఎంత అద్భుతమైన దృశ్యమది.  చుట్టూ చీకటి..స్వామి మూర్తి అద్దం ఫోకస్ లో వెలిగిపోతోంది.  స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యారా అన్నట్లుంది ఆ దృశ్యం.

ఈ ఆలయం ఫోటోలు కావాలంటే శ్రీరంగపట్నంనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి.  అది లేకుండా ఫోటోలు తియ్యనియ్యరు.  అందుకే బయటనుంచి తీసిన ఫోటో మాత్రమే ఇవ్వగలుగుతున్నాను.

దర్శన సమయాలు  ఉదయం 9-30 నుంచి సాయంత్రం 5-30 దాకా.
 



Wednesday, June 6, 2012

ప్రయాణంలో పదనిసలు - 5

ప్రయాణంలో పదనిసలు
ఎంకి నాయుడుబావ ఇల్లా?

శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?



Thursday, May 31, 2012

ఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరు



ఉగ్ర నరసింహస్వామి దేవాలయం, మద్దూరు

సుమారు 1200 సంవత్సరాల క్రితం హొయసల రాజు విష్ణవర్ధనుడిచే నిర్మింపబడిన ఈ ఆలయం నేటికీ అద్భుతంగా వున్నది.  ఇక్కడ స్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుంటాడు.  తొడపైన హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుండే స్వామి, ఎనిమిది చేతులుతో  విరాజిల్లుతుంటాడు.  రెండు చేతులు సంహారం చేస్తుంటే, ఇంకో రెండు చేతులతో హిరణ్యకశిపుని పేగులు మెడలో వేసుకుంటూవుంటాడు.  మరి రెండు చేతులలో శంఖం, చక్రం, ఇంకో రెండు చేతులలో పాశం, అంకుశం ధరించి వుంటాడు.  స్వామి నామంకింద ముక్కుపైన మూడోకన్ను వున్నది.  స్వామికి కుడిప్రక్క ప్రహ్లాదుడు, ఎడమవైపు గరుడుడు సేవిస్తూ వుంటారు.

మహా భారత యుధ్ధం చివరి రోజులలో అర్జనుడు నరసింహ రూపం దర్శించాలని వుందని శ్రీ కృష్ణుడిని ప్రార్ధించాడుట.  అది ఉగ్ర రూపం కనుక అది సాధ్యపడదని చెప్పి, అర్జనుని కోరిక తీర్చటంకోసం బ్రహ్మచేత శిల్పం రూపొందించాడుట.  ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్టించారు.

తర్వాత కాలంలో రాజులు యుధ్ధాలలో ఉపయోగించటానికి ఇక్కడ బాంబులు తయారు చేసేవారు.  అందుకే ఈ వూరి పేరు మద్దూరు అయింది.  మద్దు అంటే కన్నడంలో బాంబు అని అర్ధం.

ప్రదక్షిణ మార్గంలో వున్న ఉపాలయాలలో యశోద ఒళ్ళో చిన్ని కృష్ణుడు, నరసింహనాయకి అమ్మవారిని దర్శించవచ్చు.  ఇంకా ఆంజనేయస్వామి, నరసింహస్వామి, వేణుగోపాలస్వామి వగైరా దేవతా మూర్తుల రంగుల చిత్రాలు గోడలమీద వున్నాయి. 

పక్కనే వున్న ఆలయంలో వరదరాజస్వామి కొలువుతీరి వున్నాడు.  ఆలయం అప్పటికే మూసేసినా పూజారిగారు మేము చాలా దూరంనుంచి వస్తున్నామని తెలిసి తలుపులు తెరిచి దర్శనం చేయించారు.  ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడినది.  కమలం మీద నుంచున్న స్వామి 16 అడుగుల ఎత్తు వున్నాడు.  శంఖ, చక్ర, గదా పద్మాలతో, ఎదపై లక్ష్మితో శోభిల్లుతున్నాడు. 

ఆలయ సమయాలు ఉదయం 8 గం. లనుంచీ 2-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచి 8-30 దాకా.

ఇంకో ముఖ్య విశేషం
మద్దూరు వడ చాలా పేరు పొందిందండోయ్.  చాలామంది చెప్పారు..మద్దూరు వెడితే అక్కడ వడ తప్పకుండా తినండి అని.  ఏ హోటల్ లో అడిగినా ఇస్తారు.  చాలా చోట్ల బోర్డులుకూడా వుంటాయి.  ఒక్కొక్కటీ 15 రూ.  రుచి కొంచెం వేరుగా వుంటుంది.  బహుశా రవ్వ వేస్తారనుకుంటాను.  బాగున్నాయి.  వెళ్ళినవాళ్ళు తప్పకుండా తినండి.  ఆలయ దర్శనం అయ్యేసరికి 2-45 అయింది.  మద్దూరులోనే భోజనం చేసి తిరిగి బయల్దేరాము.
 శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం, గోపురం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం లోపల దృశ్యం
 హొయసల రాజుల చిహ్నం
 శ్రీ వరదరాజస్వామి ఆలయం