Monday, September 17, 2012

భక్తులపాలిట భద్రకాళి




భక్తులపాలిట భద్రకాళి
                                                                                  
సాధారణంగా మనవాళ్ళు గయ్యాళి స్త్రీలను భద్రకాళి అంటారు.  కానీ అది సరికాదు.  భద్రకాళి అంటే భక్తుల భద్రత చూసే కాళి.  అంటే భక్తులను బ్రోచే తల్లి.  మరి భద్రకాళి అనగానే వరంగల్ గుర్తొస్తోందా  అవునండీ హనుమకొండ, వరంగల్ మధ్య వెలసిన భద్రకాళి గురించే చెప్తున్నా.
భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది.  అసలు ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో,   అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు.  అతి పురాతనమైన దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట.  పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట.  అలాగే  చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ దేవిని పూజించి వెళ్ళాడుట.  విజయం సాధించిన తర్వాత క్రీ.. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు. 

తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు.  తదనంతరం  కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు.  అంతేకాదు,  ఆలయ నిర్వహణకిగాను  కొంత భూమిని కూడా ఇచ్చాడు.  కాలగమనంలో ఢిల్లీ బాదుషా అల్లావుద్దీన్ ఖిల్జి చేతిలో కాకతీయులు ఓడింపబడటంతో, సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది.  ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి తర్వాత బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల సమయంలో  దేవస్ధానం వైభవం ఇంకా క్షీణించింది..

 క్రీ.. 1940లో శ్రీ గణపతి శాస్త్రి అనే దేవీ ఉపాసకులు కర్ణాటక నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ ప్రాంతానికి వచ్చారు.  ఆలయం చూసి, దానిని పునరుధ్ధరించాలనే కోరికతో ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని వున్నారు.  ఆయన శ్రీ ముదుంబాయి రామానుజాచార్యులతో కలిసి స్ధానిక వర్తకులైన శ్రీ మగన్ లాల్ సమేజాగారిని కలిశారు.  శ్రీ సమేజాగారికి కలలో అమ్మవారు కనబడి ఆలయాన్ని పునరుధ్ధరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారికి సహాయం చెయ్యమని ఆదేశించినదట.  ఆదేశం ప్రకారం శ్రీ సమేజాగారు, ఇంకా ఇతర పెద్దలు కలిసి  ఆలయ పునర్నిర్మాణం తలపెట్టి 1950 లో పూర్తిచేశారు.

113 సంవత్సరాలు జీవించి తన జీవితంలో చాలా భాగం ఆలయానికి పూర్వ వైభవం తేవటానికి కృషిచేసిన శ్రీ గణపతి శాస్త్రిగారు నవంబరు 11 తారీకు 2011లో స్వర్గస్ధులైనారు.  2011 శ్రావణమాసంలో వారిని, వారి శ్రీమతిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం నాకు కలిగింది.

1950 సంవత్సరం ముందు ఇక్కడ జంతు బలులు జరిగేవి.  కానీ ఆలయ పునర్నిర్మాణం తర్వాత వాటిని నిషేధించారు.  అంతేకాదు.  అంతకుముందు అమ్మవారుకూడా భయంకరమైన కళ్ళతో, వేళ్ళాడే నాలుకతో చాలా భీకరంగా వుండేదిట.  భక్తులు అమ్మ రూపాన్ని తట్టుకోలేరని ఆలయ పునరుధ్ధరణ సమయంలో అమ్మవారి నాలుకమీద అమృత బీజాక్షరాలు రాసి, నాలుకను సరిచేశారుట.  చండీ యంత్రం స్ధాపించి అమ్మవారి భయంకరమైన మహాకాళి రూపాన్ని మార్చి మహా త్రిపుర సుందరిగా చేశారుట.  త్రిపుర సుందరి అంటే మూడు పురములలోనా (మూడు లోకములలోనా) అత్యంత సౌందర్యవతి అని.  అప్పటినుంచీ అమ్మ భక్తులను బ్రోచే భద్రకాళి అయింది.

అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పుతో కూర్చుని వున్నట్లు వుంటుది.  అమ్మ అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూ వుంటుంది.  ప్రసన్నవదనంతో అలరారే అమ్మని ఎంత సేపుచూసినా తనివితీరదు.  అమ్మవారి ముందు శ్రీ చక్రం, ఉత్సవ విగ్రహాలుంటాయి.

ఆలయంలో వున్న ఉపాలయాలు ప్రదక్షిణ మార్గంలోశ్రీ వల్లభ గణపతి, ఆంజనేయస్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు.  ఆలయం ముందు విశాలమైన మండపంలో అమ్మవారి చిన్న విగ్రహంపెట్టి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యమిస్తున్నారు వచ్చిన మహిళలంతా.  శ్రావణ మాసంలో ఒడిబియ్యం ఇచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ.  తెలంగాణా ప్రాంతంలో ఇంటి ఆడబడుచులకు ఒడి బియ్యం పెట్టే ఆచారం వుంది.  అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి ఆవిడకి ఒడిబియ్యంపెట్టి తరిస్తారు ఇక్కడి మహిళలు.
 చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవం, ఆశ్వీయుజమాసంలో శరన్నవరాత్రులు, ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు.
విశాలమైన ఆలయం  ఇంకా విశాలమైన ప్రాంగణంతో, సుందరమైన పరిసరాలతో  చాలా ఆకర్షణీయంగా వుంటుంది.  ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.  పక్కనే వున్న తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది.  సాయం సమయంలో ఇక్కడి చెరువుమీదనుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ, సూర్యాస్తమయం తిలకించటం ఒక అద్భుతమైన అనుభవం.   ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.


 

(ఆశ అభినవ మాస పత్రిక మే 2012 సంచికలో ప్రచురించబడింది.)


Friday, September 7, 2012

శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు


ఏప్రిల్ 2012 భక్తిసుధ లో ప్రచురించబడిన నా వ్యాసం......





శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహా మండపే,
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్ధితం
అగ్రేవాచయతి ప్రభంజనసుతేతత్వ్తం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం.

అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రఘురామచంద్రుడు భక్త రక్షా దీక్షా బధ్ధుడై నెలకొనని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.  అలాగే మనవారు విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు.  సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అది.  అటువంటి రామచంద్రునికి దేశమంతా అనేక ఆలయాలు.  జగత్ప్రసిధ్ధి చెందిన ఆలయాలు కొన్నయితే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో.  వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వంగానీ, ఇటు మత పెద్దలుగానీ కనీసం ప్రాంత ప్రజలుగానీ  వాటి విలువ తెలుసుకుని ఆదరించకపోవటంవల్ల  వాటి గురించి తెలియచెప్పేవారు లేక, వాటి చరిత్రలతో సహ కనుమరుగవుతున్నాయి.  అలా కనుమరుగుకాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న ఇందూరులోని శ్రీ రఘునాధ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా?    
 
ఇందూరు అంటే ఇదెక్కడ వున్నదని కొందరు సందేహపడవచ్చు.  నిజామాబాదు అంటే అందరికీ తెలుస్తుంది.  క్రీ.. 1905 లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్ జా – 6 సమయంలో ఇందూరు పేరు నిజామాబాదుగా మార్చబడ్డది.  అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వ నామధేయాలు ఇందూరు, ఇంద్రపురి. 
రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.. 914-928 మధ్య కాలంలో  ఇందూరుని పరిపాలించాడు. ఆయన పేరుమీదే ఇందూరు ప్రసిధ్ధిచెందింది.  ఆ రాజే  ఆ సమయంలో  ప్రస్తుతం ఊరు శివారులో కొండపైన కోటని నిర్మించాడు.  కోట నిర్మింపబడి 1100 సంవత్సరాలపైబడ్డా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది.    

అప్పటి పోరాటాలకేకాదు..తెలంగాణా స్వాతంత్ర్యపోరాట వీరులు శ్రీ దాశరధి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి నిజాం ప్రభువునెదిరించిన పోరాటంలో వారిని ఇక్కడనే బంధించారు.     

చరిత్ర ఆధారంగా శ్రీ సమర్ధ రామదాస్ జీ (మన దేశ అత్యంత సాహస వీరుడైన  ఛత్రపతి శివాజీ గురువు)  కోటలో శ్రీ రఘునాధస్వామి   ఆలయాన్ని నిర్మింప చేశారు.
 
అతి పురాతనమైన ఈ దేవాలయంయొక్క వైశాల్యం సుమారు 3900 ..లు.  ఇక్కడి ధ్వజస్తంబము ఒకే రాతిలో మలచబడ్డది.  53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిలా ధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగంచేవారని ప్రతీతి.

రఘునాధుడనే మహర్షి ఇక్కడ చాలాకాలం తపస్సు చేసుకున్నారు.  ఈయన కోటలోగల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే వున్న బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడ్డ శిలా కట్టడముదాకా వెళ్ళి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కధనాలు ప్రచారంలో వున్నాయి. అంతేకాదు.  కోటలో పలు సొరంగ మార్గాలు వున్నాయనటానికి ఇంకో ఆధారం కోట లోపల్నించి డిచ్ వల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై వున్నాయి.   కోటలో ఈ రఘునాధ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది.  .సి. ల గురించి తెలియని ఆ కాలంలో కట్టిన ఈ ధ్యానమందిరంలో  మండు వేసవిలోకూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయిగొలుపుతూ వుండేటట్లు నిర్మింపబడింది.  ఇంజనీరింగు చదువులులేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మనవారి ప్రతిభ వేనోళ్ళ కొనియాడతగినది.

ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలివుంటాయి.  (శ్రీరామచంద్రుని అంకంపై సీతమ్మ, పక్కనే లక్ష్మణస్వామి).  అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా వున్న గర్భాలయం, గర్భాలయం ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాధ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాములవారి పాదుకలు, విశాలమైన కళ్యాణమండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను పెంపొందింపచేస్తాయి. 

కొండకిందవున్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో వుండే స్వామివారి స్ధానం ఒకే దిశల సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా వుండటం విశేషం.  ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది.

ఈ మందిరంలో అర్చనచేసి రాముని ప్రార్ధించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.

ఇంత ప్రాచీనమైన ఈ ఆలయం 2002 దాకా సరైన ఆదరణ లేక రోజూ మూసి వుండేదిట.  ఏడాదికి ఒకసారి తీసి శ్రీరామచంద్రుని కళ్యాణం చేసేవారుట.  అయితే 2002 నుంచి శ్రీ చిన్న జియ్యరు స్వామితిరిగి నిత్య పూజలు ప్రారంభించారు.  ఇలాంటి ఆదరణ నోచుకోవాల్సిన ఆలయాలు ఇంకెన్నో. 

ఇక్కడనుంచి చూస్తే చుట్టూవున్న అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.  అంతేకాదు  దేవాలయంవెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగావుండి చూపరులకు మరువరాని ఆనందాన్ని కలిగిస్తుంది.

కొండపైకి వెళ్ళేదోవలో రెండు పెద్ద కొండరాళ్ళవెనుక  ఆంజనేయస్వామికి చిన్న ఆలయం.  మార్గం గుహలోకి వెళ్తున్నట్లుంటుంది.  సహజసిధ్ధంగా ఏర్పడ్డ ఈ మార్గంగుండా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు.

ఇలాంటి ఆలయాలు వైభవోపేతంగా అలరారటానికి ప్రభుత్వము, పెద్దలేకాక ఆ ప్రాంత ప్రజలుకూడా కృషి చెయ్యాలి.  వీలయినప్పుడల్లా ఆలయాల్ని సందర్శించి అవి కళకళలాడటంలో మనవంతు పాత్ర మనమూ నిర్వహించాలి.  ఏమంటారు?
 ఆలయ దృశ్యం
 హనుమాన్ మందిరం మార్గం
 ఆలయ ముఖ ద్వారం