అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో. త్రేతా యుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది. తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు.
ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది.
ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి. ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట. సమయాభావంవల్ల పార్కు చూడలేదు.
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనశ్రీ మాధవేశ్వరీ దేవి మందిరం ప్రయాగలోనే వుంది. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.
ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా.
ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు. ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.
అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడనుండి బయల్దేరాము.
మాధవేశ్వరీదేవి మందిరం పార్వతీదేవి ముంజేయి తెగి పడుతున్న దృశ్యం
బడే హనుమాన్ మందిర్ నుంచి శంకర విమాన మండపం లేదా శంకర మఠం వెళ్ళాం. చాలా దగ్గరలోనే వుంది.
ఈ విమాన మండపం ఇక్కడ నిర్మింపబడటానికి కారణం ఒక కధ చెప్తారు. కంచి పీఠానికి 68వ అధిపతి అయిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు
ఒకసారి ప్రయాగలో వున్న సమయంలో, ఆది గురువు శ్రీ శంకరాచార్యులవారు కుమారిల భట్టు అనే విద్వాంసుని కలిసి తన అద్వైత సిధ్ధాంతాలతో ఆయనమీద విజయం పొందిన ప్రదేశంలో ఆ విజయ సూచకంగా ఒక విజయ స్తంబాన్ని స్ధాపించాలని సంకల్పించారు. 1986 లో ప్రతిష్టింపబడిన ఈ మందిరం ఎత్తు 130 అడుగులు. ఈ మందిర నిర్మాణానికి 16 సంవత్సరాల సమయం పట్టింది. ఒక కోటి రూపాయలు ఖర్చయినాయి.ద్రవిడ శైలిలో నిర్మింపబడిన ఈ మండపంలో శ్రీ కామాక్షీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శంకరుడు, శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్టింపబడి వూజలందుకుంటున్నాయి. ఇవే కాక ఇంకా అనేక దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయంగురించి.
పాతాళపుర మందిర్ నుంచి దానికి అతి సమీపంలో వున్న బడా హనుమాన్ మందిర్ కి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయస్వామి అతి పెద్ద విగ్రహం. నేలమీద పడుకున్నట్లు వుంటుంది. ఈ విగ్రహం మొగలు చక్రవర్తి అక్బరు సమయంలో స్ధాపించబడినదని కొందరంటే, కొందరు పూర్వం ఒక శైవ భక్తుని కలలో విగ్రహం ఇక్కడవున్నట్లు కనబడటంతో దానిని కనుగొని ఆలయం కట్టించారని అంటారు. ఏది ఏమైనా ఈ ఆలయం చాలా పురాతనమైనది.ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దది.
ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకోబెట్టినట్లు వుంటుంది. ఇదివరకు ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని (ముస్లింలని కొందరు, బ్రిటిష్ వారని కొందరు అంటారు) ప్రయత్నించారుట. విగ్రహాన్ని తవ్వటానికి ప్రయత్నించినకొద్దీ భూమిలో ఇంకా గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్ధిరంగా కాసాగింది. అందుకని అలాగే వదిలేశారు.ఇప్పుడు విగ్రహం గుంటలో వున్నట్లు వుంటుంది. చుట్టూ కట్టిన ప్లాట్ ఫారమ్ మీదనుంచి భక్తులు స్వామిని దర్శించి అర్చిస్తారు. కొందరు గంగనీరు తీసుకు వెళ్ళి పోస్తున్నారు, అలాగే పూవులు వగైరాలను సమర్పిస్తున్నారు.
ఇంకొక విశేషమేమిటంటే వర్షాకాలంలో గంగానదికి వరదలొచ్చినప్పుడు గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందిట. చూసేవాళ్ళకి ఆంజనేయస్వామి గంగానదిలో స్నానం చేస్తున్నట్లు వుంటుంది.
ఆలయంలో అక్కడి మహంత్ అనుమతితో ఫోటో తీసుకోవచ్చని బోర్డు చూసి ప్రయత్నించాను. మహంత్ ఆఫీసులో లేరు. వేరే ఒకాయన అక్కడ చరిత్ర ఏదో చెప్పారు కానీ నా కర్ధమయింది ఆంజనేయ స్వామి యుధ్ధానంతరం ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు, అందుకనే విగ్రహం అలా పడుకున్నట్లుంటుంది అని. అడిగిన వెంటనే ఫోటోకి అనుమతి ఇవ్వక పోయినా ఆయనకి తెలిసిన విషయాలు చెప్పారు..అర్ధం చేసుకోలేక పోవటం నా దురదృష్టం. ఆయనకి ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము చూడవలసినవి ఇంకా చాలా వున్నాయిగా మరి.
త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట వున్నది. దీనిలోకి అందరికీ ప్రవేశం లేదు. ఆర్మీ వున్నది ప్రస్తుతం ఆ కోటలో. అయితే ఈ కోటలో వున్న పాతాళ పుర మందర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళి రావచ్చు. ఫోటోలు తియ్యనియ్యరు.
ఇక్కడ- వున్న వట వృక్షం అతి పురాతనమయినది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే వుండేదట. చైనా యాత్రీకుడు హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు ఈ వటవృక్షం బయట ఆవరణలోనే వుండేదిట. అక్బర్ కోట కట్టించేటప్పుడు స్ధలం ఎత్తు పెంచవలసి రావటంతో ఇవి భూ గర్భంలోకి వెళ్ళాయి. అయితే అంత పెద్ద కోట కట్టించేటప్పుడుకూడా అక్బర్ ఈ ఆలయాన్ని యధాతధంగా అట్టిపెట్టి తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు.
ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వకాలంలో ఈ చెట్టు మీదనుంచి కింద వుండే కామ్య కూపంలో దూకి ఆత్మాహుతు చేసుకునేవాళ్ళట. తన పూర్వ జన్మలో అక్బర్ చక్రవర్తి కూడా ఈ చెట్టుమీదనుంచి దూకి ప్రాణ త్యాగం చేశాడుట. అయితే ఆ సమయంలో ఆయన భారత దేశానికి చక్రవర్తిని కావాలని కోరుకున్నాడనీ అందుకే మరు జన్మలో చక్రవర్తి అయ్యాడనీ అక్కడి గాధ. హిందువులే కాదు, ముసల్మాన్ ఫకీర్లు కూడా ఈ చెట్టునుంచీ హుక్ లకి వేళ్ళాడేవాళ్ళుట. అయితే ఇది అక్బర్ మాన్పించాడు.
పూర్వం ఈ ఆలయంలోకి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా వుండేది. మార్గంలోను, లోపల తగిన వెలుతురు కూడా వుండేది కాదు. అయితే స్ధానికి ప్రజల పట్టుదలవల్ల సందర్శకులు తేలికగా వెళ్ళటానికి సరైన మార్గం, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చెయ్యబడ్డవి.
84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా వుంటుంది ఈ పాతాళపురి మందిర్. దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం, వేద వ్యాసుడు, అర్ధ నారీశ్వరుడు, వాల్మీకి, సనక సనందులు వగైరా అనేక ఋషులు, దేవతా విగ్రహాలున్నాయి. ఇవి అన్నీ అంత పురాతనంగా అనిపించలేదు.
ఇక్కడే వట వృక్షం మొదలు కూడా వుంది. ఈ వట వృక్షానికున్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలని ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి వాటిని కౌగలించుకోమంటారు. వట వృక్షం మొదలు మాత్రమే ఇక్కడ వుంటుంది. పై భాగం భూమి వుపరితలం మీదే వుంటుంది.
శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఈ వట వృక్షం కింద కూర్చున్నాడని, ఇక్కడ తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడని అంటారు. భరతుడు శ్రీ రాముని వెతుక్కుంటూ వచ్చి, ఆయన ఇక్కడ ఆగాడని తెలుసుకుని ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు విగ్రహం వున్నది.
ఈ కోటలోనే ప్రసిధ్ధికెక్కిన అశోక స్ధంబం వున్నది. దీనిని కౌశంబినుంచి తెచ్చి ఇక్కడ స్ధాపించారు.
కనీసం ఒక గంట సమయం వుంటే ఈ ఆలయాన్ని చూడవచ్చు. అంత సమయం లేనప్పుడు, వటవృక్షాన్ని చూసి ఒక్కసారి వాతాళ మందిర్ లోకి తొంగి చూసి వచ్చేయచ్చు ఆ విగ్రహాలన్నీ ఎవరివని వివరంగా చూడకుండా. మా వేన్ డ్రైవర్ దీన్ని చూడకుండా తీసుకుపోదామని చూశాడు. అది కోట. పర్మిషన్ లేకుండా వెళ్ళనవ్వరు అని. నాకు హింది చదవటం రావటం వల్ల పేరు చదివి అది మందిర్, మందిర్ కి పర్మిషన్ అక్కరలేదు ఒకసారి చూసొచ్చేస్తాము కోటలోకి వెళ్ళొచ్చినట్లుంటుందని పట్టుబట్టి వెళ్ళాను. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఇలాంటివి వున్నాయని ఈ డ్రైవర్లల్లో కొందరికి తెలియదు, కొందరు ఈ ట్రిప్ త్వరగా పూర్తి చేసుకుని ఇంకో బేరం చూసుకుందామనే హడావిడో ఏమిటోగానీ కొన్ని ప్రదేశాలు మనల్ని చూడనివ్వరు. అలా మేము వదిలేసినవన్నీ చివరికి వ్రాస్తాను. మీకు వీలయితే చూడండి.
దూరంనుంచి అక్బరుకోట
(పడవలోంచి తీశాను. సరైన దృశ్యం రాలేదు. సర్దుకు పొండి)