Thursday, January 16, 2014

విశ్వకర్మచే మలచబడ్డ ఆది తిరువరంగడు

తమిళనాడులోని అతి ప్రాచీనమైన రంగనాధస్వామి ఆలయం ఆది తిరువరంగంలో వున్నది.  ఈ ఆలయం గురించి నేను వ్రాసిన వ్యాసం ఆంధ్రప్రభ వార పత్రిక నెట్ ఎడిషన్ లో ప్రచురించబడింది.  లింకు కింద ఇస్తున్నాను.  చూడండి.

http://www.andhraprabha.com/columns/adi-ranganatha-built-by-viswakarma/9824.html

Thursday, January 3, 2013



యాత్రా దీపికవరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ

 

నా పుస్తకం యాత్రాదీపికవరంగల్ జిల్లా ఆవిష్కరణ సభ 7-12-2012 మధ్యాహ్నం 1 గం. కి హైదరాబాదులోని ఎకౌంటెంట్ జనరల్ ఆఫీస ఆరుబయలు రంగస్ధలంలో జరిగింది.  .జీ. ఆఫీసులోని సాహితీ సంస్ధ రంజని ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకి ఎకౌంటెంట్ జనరల్ శ్రీ సుందరరాజా గారు అద్యక్షత వహించగా ప్రఖ్యాత రచయిత శ్రీ  అంపశయ్య  నవీన్ గారు పుస్తకావిష్కరణ చేసి, పుస్తకం గురించి మాట్లాడారు.  ఆచార్య అయినవోలు ఉషాదేవి, పీఠాధిపతి,  భాషాభివృధ్ధి పీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్య అతిధిగా విచ్చేసి పుస్తకం గురించి తెలియజేశారు.   రంజని అద్యక్షులు శ్రీ చీకోలు సుందరయ్యగారు నిర్వహించిన ఈ సభకి వ్యాఖ్యాతగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి పద్మలతా జయరాంగారు వ్యవహరించారు.  రంజని కార్యదర్శి శ్రీ మట్టెగుంట వెంకట రమణగారి వందన సమర్పణతో మధ్యాహ్నం 2 గం. లకి సభ ముగిసింది.

 

సభ ప్రారంభించటానికి ముందు శ్రీమతి శిష్ట్లా వసంత లక్ష్మి, శ్రీమతి అన్నదానం సీత, శ్రీమతి మన్నేపల్లి సరోజ గార్ల సంగీత విభావరి ఆహూతులను అలరించింది.

 

ప్రతులకు

శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి

B 391, శ్రీ కృష్ణానగర్

యూసఫ్ గూడా

హైదరాబాదు – 500 045

ఇంకా

నవయుగ పబ్లికేషన్స్

విశాలాంధ్ర పబ్లికేషన్స్

వెల  రూ. 60

సంగీత విభావరి - శ్రీమతులు మన్నేపల్లి సరోజ, శిష్ట్లా వసంతలక్ష్మి, అన్నదానం సీత
ఎడమనుంచి కుడికి నంద్యాల మురళీకృష్ణ, చీకోలు సుందరయ్య, పి.యస్.యమ్.లక్ష్మి, ఉషాదేవి, అంపశయ్య నవీన్, సుందరరాజా, మట్టెగుంట వెంకటరమణ
రంజని సభ్యులు శ్రీ కుంపటి ఆదిశేషు తయారుచేసిన ఫ్లెక్సీ
పుస్తకం గురించి వివరిస్తున్న రచయిత్రి
సభలో ప్రసంగిస్తున్న శ్రీ నవీన్
ప్రసంగిస్తున్న ఆచార్య ఉషాదేవి
ఆహూతులులో ఒక భాగం
రచయిత్రిని సత్కరిస్తున్న ఆచార్య ఉషాదేవి
శ్రీమతి ఎ.జె.సావిత్రీ మౌళి, రచయిత్రి
ఆభినందిస్తున్న పులిగడ్డ సిస్టర్స్ .. అదేనండీ మా చెల్లెళ్ళు

అభినందిస్తున్న కాలనీ మిత్రురాళ్ళు
ఎంతో అభిమానంతో వచ్చి మా ఇద్దరినీ అభినందిస్తున్న శ్రీమతి మాలాకుమార్
శ్రీ సుందరరాజా గారిచే శ్రీ వెంకటేశ్వర్లుగారికి సన్మానం
ఎ.జి. శ్రీ సుందరరాజా, మావారు, నేను
ఆఫీసు మిత్రులలో కొందరు (ఫుల్ సపోర్ట్ వీళ్ళనుంచి)
కాలనీ మిత్రులు
బంధువులతో
రంజని మిత్రులు శ్రీయుతులు కుంపటి ఆదిశేషు, నంద్యాల మురళీకృష్ణ, మట్టెగుంట వెంకటరమణ, నేను, మా అబ్బాయి తేజస్వి, చిరకాల కుటుంబ మిత్రులు శ్రీ మహమూద్
రంజని సభ్యులతో

Wednesday, November 14, 2012

నా మూడవ ఇబుక్ పంచారామాలూ – పరిసర క్షేత్రాలు






నా మూడవ ఇబుక్  పంచారామాలూ – పరిసర క్షేత్రాలు


హలో ఫ్రెండ్స్

కార్తీక మాసం మొదలయిందికదా.  హడావిడి చెయ్యద్దూ మరి?  నదీ స్నానాలు, దీపారాధనలు, దీపదానాలు, శివాభిషేకాలు, శైవ క్షేత్ర దర్శనాలూ ...  ఓహ్ ..  ఎంతో సరదాగా వుంటుందికదా?  మరి శైవ క్షేత్ర దర్శనాలు .. ఏ ఏ క్షేత్రాలకెళ్తున్నారు?   ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదంటారా?  మీకోసమే ఈ పుస్తకం మరి.

నా మూడవ ఇబుక్  " పంచారామాలూ – పరిసర క్షేత్రాలుకినిగెవారి ద్వారా ఈ రోజే రిలీజ్ అయింది.  ఇందులో పంచారామాల గురించీ, వాటికి దగ్గరలో వున్న ఇతర పుణ్య క్షేత్రాల గురించి ఫోటోలతో సహా వివరించాను. 

 

కార్తీక మాసం సందర్భంగా ఎంతో ఉపయోగంగా వుండే ఈ పుస్తకం వెల రూ. 80.  8 రూ.    డిస్కౌంట్ పోను రూ. 72 రూ. లే.

 

లింకు ఇదుగో…

 


Friday, November 2, 2012

నా రెండవ ఇబుక్ -- యాత్రా దర్శని - వరంగల్ జిల్లా




నా రెండవ ఇబుక్  -- యాత్రా దర్శినివరంగల్ జిల్లా – temples of warangal district


కినిగె వారు నా రెండవ ఇ-బుక్ యాత్రా దర్శిని  - వరంగల్ జిల్లా – temples of warangal district –  రిలీజ్ చేశారు.  లింకు కింద ఇస్తున్నా. 


ఈ పుస్తకంలో వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ఈ మూడు నగరాల్లోని (ఇవి మూడా కలిసే వుంటాయి .. హైదరాబాదు, సికింద్రాబాదుల్లాగా) 12 ఆలయాలేగాక, వరంగల్ జిల్లాలోని 11 ముఖ్య ఆలయాలగురించి, అంటే దాదాపు అన్ని ప్రముఖ ఆలయాలగురించీ వివరణ ఇచ్చాను.  ఇ బుక్ వెల 80 రూ. (10% డిస్కౌంట్ వుంది)..అద్దెకు తీసుకుంటే రూ. 30. 

 

 ఈ పుస్తకాన్ని మీరు చదివి మీ అభిప్రాయాలతోపాటు నేను మర్చిపోయిన ఆలయాలేమైనా వుంటే వాటి వివరాలు తెలియజేస్తారుకదూ

 http://kinige.com/kbook.php?id=1267&name=Yatra+Darshini+Warangal+Zilla

 

 


 

Wednesday, October 31, 2012

శిల్పకళా నిలయం రామప్ప దేవాలయం





శిల్పకళా నిలయం రామప్ప దేవాలయం
                                                                                
                                                                                
రామప్ప దేవాలయం..కాకతీయుల కళా తృష్ణకి మరో కలికితురాయి.  కాకతీయ గణపతి దేవ చక్రవర్తి యొక్క సేనాని రేచర్ల రుద్రయ్య 800 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం అనేక ఢక్కా మొక్కీలు తిన్నప్పటికీ నేటికీ అపూర్వంగానిల్చిందంటే నాటి మనవారి నిర్మాణ కౌశలాన్నీ, శిల్ప కళా నైపుణ్యాన్నీ మెచ్చుకోకుండా వుండలేముగదా.

కాకతీయుల రాజ్య పతనానంతరం 600 ఏళ్లపాటు ఆదరణ లేక కళా విహీనమైన దేవాలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చినది హైదరాబాదుకు చెందిన అసిఫ్ జాహి రాజవంశమువారు.  వారీ ప్రాంతానికి వేటకై వచ్చినప్పుడు ఆలయం, రామప్ప చెరువు చూసి పునర్నిర్మాణము చేపట్టారు.  ప్రాంతపు పెద్దలుకూడా తమ పంటపొలాలను ఆలయ పోషణకు దానముగా ఇచ్చారు

ఈ ప్రఖ్యాత ఆలయ నిర్మాత కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రయ్య.  గుడి ఆవరణలో ఈయన వేయించిన శాసనము ప్రకారం గుడి నిర్మాణం క్రీ.. 31-3-1213 నాటికి పూర్తయినట్లు వున్నది.  ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు రావటానికి కారణం తెలియదు.  ముఖ్య శిల్పి పేరు రామప్ప అయివుండచ్చని ఒక కధనం.

గుడి ఆవరణలో నంది మంటపంతోపాటు మరో 3 ఆలయాలున్నాయి.  అవి కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం, ఇంకొకటి బహుశా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.  వీటిలో కొన్ని శిధిలావస్ధలో వున్నాయి.  ప్రధాన ఆలయం, రుద్రేశ్వరాలయంలో తప్ప మిగతావాటిలో పూజలు జరగటంలేదు.

ఇక్కడ ఆలయం వెలుపల ప్రత్యేక మండపంలో వున్న నంది విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.  నల్లరాతిలో చెక్కబడి, జీవకళ వుట్టి పడుతున్నట్లుండే  నంది గంటలు, ఆభరణాలు చెక్కటానికి శిల్పి ఎంత శ్రమించాడో అనిపిస్తుంది.  శిల్పకళలో ఆసక్తి లేనివారయినా సరే నందీశ్వరుణ్ణి చూస్తూ కొంచెంసేపు అన్నీ మరచిపోతారు.

ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా గైడ్ సహాయం తీసుకోండి.  ఆయనకి ముందే మీ ఆసక్తి చెప్పి, అన్నీ వివరించి చెప్పాలి అని చెప్పండి.  అప్పుడే ఎన్నో అద్భుత శిల్పాలను వదలకుండా, వివరాలతో చూడవచ్చు.  మీ అంతట మీరు చూస్తే కొన్ని అర్ధం కాకపోవచ్చు, కొన్ని వదిలెయ్యవచ్చు.

గుడి గోడపై చెక్కబడ్డ శిల్పాలను శ్రధ్ధగా చూడండి.  ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలో మనకు దారి చూపిస్తూ చిన్న ఏనుగుల వరస చెక్కబడివుంది.  వరసలో మొదట ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వుంటాడు.  చివరి ఏనుగు దేవుని ముందు భక్తితో తలవంచుకుని వుంటుంది.  ఏనుగుల వరసపైన రెండు విప్పారిన తామర పువ్వుల వరస చెక్కబడ్డది. వీటి మధ్య, గుడి కప్పులోవున్న సుందరీమణుల విగ్రహాల సూక్ష్మ రూపాలు చెక్కబడివున్నాయి.  అంతేకాదు.. గోడలను పరిశీలించి చూస్తే శైవ, వైష్ణవ, బౌధ్ధ, జైన మతాల దేవతలు, మహనీయుల శిల్పాలున్నాయి.  ఇవి ఆనాటి రాజుల సర్వమతసమైక్యతను తెలియజేస్తోంది.  ఇంకా ముఖ్యమైనవి, ఆకాలంలో స్త్రీల విలువని తెలియజెప్పే విగ్రహాలు, జంధ్యం ధరించిన స్త్రీ.. కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారని తెలియజేస్తుంది.  అలాగే స్త్రీలు ధర్మ ప్రచారం చేసేవారనటానికి గుర్తుగా రుద్రాక్ష మాలను జంధ్యముగా ధరించిన స్త్రీ మూర్తిని  చూడవచ్చు.  అలాగే, స్త్రీలు యుధ్ధ విద్యలలో ఆరితేరారనటానికి రెండు ఏనుగులతో పోరాడే యువతి, కత్తి ధరించిన యువతి  వగైరా.  ప్రతి బొమ్మలవరుస మొదలు, చివర మానవుడి ప్రారంభ దశ,  చేరవలసిన గమ్యములను తెలియజేస్తాయి.

ఆలయం స్తంబములకు, పై కప్పుకు మధ్యగల ప్రదేశంలో ప్రస్తుతం 26 ఏనుగు పైన సింహము వున్న విగ్రహాలున్నాయి.    కాకతీయ రాజుల బిరుదాలయిన రాయగజకేసరి, అరిగజకేసరిలకు గురుతుగా ఇవి చెక్కబడి వుండవచ్చు.  ఇవికాక ఆలయానికే పేరు తెచ్చిపెట్టిన 12 సాలభంజికలు.  మూర్తులు అపురూపాలు.  ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణమైన హావభావాలతో చెక్కబడ్డాయి.   సుందర మూర్తులే రామప్ప దేవాలయానికి ప్రధాన ఆకర్షణ.  ఇవ్వన్నీ నల్లరాతి శిల్పాలు.  విగ్రహముల వస్త్రములు, ఆభరణములు, హావ భావాలు, భంగిమలు, కేశములు నాటి శిల్పుల కళానైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి.  ఒక మదనికి ఎత్తయిన పాదరక్షలు ధరించింది.  ఈనాడు స్త్రీలు వాడుతున్న హైహీల్స్, ప్లాట్ ఫారమ్ చెప్పులు కాలంలోనే వున్నాయనటానికి రుజువులివ్వి.

ఆలయంలోపలకి ప్రవేశించగానే రంగమంటపం కనబడుతుంది.  ఇక్కడ దైవారాధనలో నృత్యప్రదర్శనలు జరుగుతుండేవి.  మంటపానికి స్తంభములకు, దూలాలకి, కప్పుకు నల్లరాళ్ళు వాడబడ్డాయి.   చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి రాయి దొరకదు.  మరి ఇంతపెద్ద నల్లరాళ్ళు ఎక్కడనుంచి, వాహనాలలో తెచ్చారో, వాటిని పైకి ఎత్తి ఎలా అమర్చారో ఆశ్చర్యం వేస్తుంది.  మంటపంలో కొన్ని రాళ్ళు విరిగి ఎత్తుపల్లాలుగా తయారయ్యాయి.  భూకంపాలవల్ల అలా అయినాయన్నారు.  మంటపంకప్పు మధ్యలో నటరాజు పదిచేతులతో వున్నాడు.  ఆయనకి ఎనిమిది దిక్కులలో దిక్పాలకులు వారి వాహనాలతో వున్నారు.  ఎంతటి ఎండాకాలమైనా మండపంలో చల్లగా వుంటుంది.

గర్భగుడి ద్వారమునకు ఆనుకుని వున్న రెండు శిలాఫలకాలమీద నాట్య, మృదంగ వాద్యకారుల బొమ్మలు రకరకాల భంగిమలలో ఆద్భుతంగా మలచబడ్డాయి.  వీటిని చూసే ప్రముఖ నాట్య విద్వాంసులు శ్రీ నటరాజ రామకృష్ణ, పేరిణి నాట్యాన్ని పునరుధ్ధిరించారు.

ఇంత గొప్ప శిల్ప సంపదతోకూడిన ఆలయాన్నిప్రతి ఒక్క తెలుగువారూ తప్పక దర్శించాలి. దేవాలయం వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలం, పాలంపేట గ్రామంలో, వరంగల్ కు 60 కి.మీ. దూరంలో వున్నది.  బస్సు సౌకర్యం వున్నది.

(ఈ వ్యాసం జూలై 2012 ఆశ అభినవ మాస పత్రికలో ప్రచురించబడింది.)







(రామప్ప అపురూప కళాఖండాలు.  స్త్రీ మూర్తి ధరించిన చెప్పులు, చెప్పుకి, కాలికి మధ్య ఖాళీ చూడండి.)