Monday, October 27, 2008

వాడపల్లి ఫోటోలు

మీనాక్ష్క్షీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం, వాడపల్లి
కృష్ణా మూసీ సంగమం, వాడపల్లి


లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం, వాడపల్లి


Saturday, October 25, 2008

వాడపల్లి, నల్గండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

వాడపల్లి

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి

20-1-08

9-30 కి సూర్యాపేట లో బయల్దేరి నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా 11-40 కి వాడపల్లి చేరాం. ఇండియా సిమెంట్స్ కి ఎదురుగుండా ఉన్న రోడ్ లో అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క కచ్చా రోడ్ లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది. ఈ గుడి 6000 ఏళ్ళ క్రితందట. ఈ విగ్రహాన్ని అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట. స్వామి తొడ మీద అమ్మవారు వున్నట్లు ఆనుకుని వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో వొక అఖండం కింద ఇంకో అఖండం వున్నాయి. కిందవున్న అఖండం లో దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన వున్న అఖండం లో దీపం కదులుతూ వుంటుంది. కారణం స్వామి వుచ్వాశ నిశ్వాసలని చెపుతారు. వొక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. ఆశీర్వాదం ఇంకా దుష్ట గ్రహ నివారణ కోసం ట. ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:ఈ గుడి ఎదురుగా కొంచెం దూరంలో ముచికుందా నది మరియు కృష్ణ నదుల సంగమం వుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. తెల్లగా వున్నదనిపించింది. విభూతి వల్లనేమో. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది. క్షేత్ర పురాణం:6000 ఏళ్ళ క్రితం అగస్త్య మహా ముని ప్రతిష్టించారుట ఈ లింగాన్ని. వొక రోజు వొక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాదుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాదుట. ఆ వేళ్ళ గుర్తులు స్వామి ఫాలభాగం పైన కనబడుతాయి. అక్కడ ఏర్పడిన రక్తం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట గుంటలో నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట. వొకసారి శంకరాచార్యులవారు ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని వొక బంగారం ముక్కకి తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిత గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకున్నాదుట. వసతికి వొక పెద్ద హాల్ వుంది కాని వేరే సౌకర్యాలు ఏమి లేవు. వుండటం కొంచెం కష్టమే. నదీ సంగమం కనుక ఇక్కడ కర్మకాండలు కూడా చేస్తున్నారు. అస్థికలు కూడా కలుపుతారు. మద్యాహ్నం 1-30 కి బయల్దేరి మిర్యాలగూడ రోడ్ మీద వున్న శ్రీ దుర్గా గార్డెన్ రెస్టారెంట్ లో భోజనం చేసి 2-50 కి మట్టపల్లి బయల్దేరాము.




Friday, October 24, 2008

ఫణిగిరి ఫోటోలు

పాత రామాలయం, ఫణిగిరికొత్త రామాలయం, ఫణిగిరి
గరుక్మంతుడి విగ్రహం, బంగారం దొరికిన చోటు


ఫణిగిరి, నల్గొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

ఫణిగిరి
19-1-2008

రామాలయం

పిల్లల మఱ్ఱి నుంచి ఫణిగిరి బయల్దేరాము. సూర్యాపేట జనగాం రోడ్ లో 35 కి. మీ. లు వెళ్ళాక స్తూపం దగ్గర కుడి వైపు తిరిగి ఒక కిలోమీటరు వెళ్ళాలి .. తిరుమలగిరికి ఇవతలే..వూళ్ళో కొత్త గుడి వుంది. ఇది చిన్నదయినా పురాతనమైనది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు వున్నాయి. ఇంకా ఒక కిలోమీటరు దూరం సన్నటి దోవలో వెళ్తే కొండ పక్కన పాత రామాలయం వస్తుంది. ఇక్కడ సీతా రామ లక్ష్మణులు స్వయం భూ మూర్తులు. కొండ గోడ మీద కొంచెం ఉబ్బెత్తుగా వున్నాయి ఆకారాలు. కొన్ని వేల ఏళ్ళక్రితందిట ఈఆలయం.

రెండు గుళ్ళకూ పూజారి ఒకరే. యువకుడు. మేము వెళ్ళేసరికి అప్పుడే బయటనించి వచ్చారు. మమ్మల్ని చూసి 5 ని. ల లో స్నానం చేసి వస్తానని అలాగే తొందరగానే వచ్చారు. (వీరి ఇల్లు కొత్త గుడికి ఎదురుగానే నాలుగు ఇళ్ళ ఇవతల వుంటుంది. మీరు వెళ్ళినపప్పుడు గుడి మూసి వుంటే అక్కడ కనుక్కోండి.) చిన్నవాడయినా గుళ్ళో ఆయన పాటించిన నియమాలు సంతోషమనిపించాయి. ఆయన తన బైకు మీద మాతో వచ్చి పాత గుడి కూడా తెరిచి హారతి ఇచ్చారు. ఆయన చెప్పిన స్ధల పురాణం----

భద్రాచలంలో ఉత్సవవిగ్రహాలను ఊరేగిస్తున్నప్పుడు సీతామ్మవారి విగ్రహం జారి నీళ్ళలో పడిందట. ఇంకొక విగ్రహం తయారు చేయిద్దామని ప్రయత్నిస్తే విగ్రహం పొడుగో పొట్టో అయ్యేదిటగానీ సరిగ్గా రాలేదుట. భద్రాచలం వాళ్ళు ఇటు వచ్చినపుడు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూసి సరిగ్గా వుందని విగ్రహాన్ని ఇవ్వమని అడిగారుట. వీళ్ళు ఇవ్వక పోవటంవలన దొంగతనంగా తీసుకు వెళ్ళి భద్రాచలంలో పెట్టారుట. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి ఆవిగ్రహాన్ని భద్రాచలంవాళ్ళు తీసుకు వెళ్ళారని తెలిసి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారుట.

తర్వాత ఒకరికి కలలో అమ్మవారు కనబడి గుడి పక్కనే గరుక్మంతుడి విగ్రహం వున్నచోట తవ్వితే బంగారం దొరుకుతుంది, దానితో ఇంకో విగ్రహం చేయించండని చెప్పిందట. అమ్మవారు చెప్పిన చోట తవ్వితే బంగారం దొరికిందట. దానితో ఇంకో పంచలోహ విగ్రహం తయారు చేయిస్తే అది కూడా పొడుగయిందట. ఏం చెయ్యాలనుకుంటే అమ్మవారు మళ్ళీ కలలో కనబడి ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని కొన్నాళ్ళు వుంచమని చెప్పందట. అలాగే ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని వుంచితే కొన్నాళ్ళకు ఆ విగ్రహం సరైన ఎత్తుకు రావటం చూసి గుళ్ళో ప్రతిష్టించారుట. పొడుగు దానంతట అదే కరిగి పోయిందట. అందుకే ఆవిడని అక్షయ సీత అంటారుట.

అక్కడ వుంటే ఇలాగే దొంగతనాలు జరుగుతాయని భద్రతా కారణాల దృష్ట్యా వూళ్ళో రామాలయం నిర్మించి ఉత్సవ విగ్రహాలను అక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు. మార్చి లో పౌర్ణమినాడు 10—15 రోజులు పెద్ద జాతర జరుగుతుందట. హోలీ నాడు కళ్యాణం జరుగుతుందట.

ప్రస్తుతం పాతగుడి దగ్గర యాగశాల నిర్మాణంలో వున్నది.

స్వామి వెలసిన కొండమీద తవ్వకాలలో బౌద్ధమతానికి చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా వాటినికూడా ఊళ్ళో గుడి దగ్గర ఒక స్కూల్ లో పెట్టి కాపాడుతున్నారు. వాటన్నిటితో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆలోచనట.

ఆకొండమీదే సీతమ్మవారి పాదం అని ఒక పెద్ద బండరాయి కింద చిన్న పాదం గుర్తు వుంది.