Tuesday, January 4, 2011

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 27



కాశీలో  ముఖ్యంగా దర్శించవలసిన దేవతలు

కాశీలో గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనమేకాక, తప్పనిసరిగా దర్శించవలసిన ఇతర దేవతల గురించి తెలుసుకుందాం.  కాశీలో చిన్నా, పెద్దా అనేక ఆలయాలున్నాయి.  వీటిలో కాల చరిత్రలో శిధిలమైనవి అయిపోగా, మిగిలినవాటిని దర్శించటానికి కూడా చాలా సమయం పడుతుంది.  ఎక్కువకాలం కాశీలోనే నివసించేవారికి వారి ఆసక్తినిబట్టి ఇది సానుకూలపడవచ్చు కానీ, అందరికీ సాధ్యం కాదు.  తప్పనిసరిగా చూడవలసినవాటి గురించి ముందు చెప్పుకుందాం.

కాశీలో మూల విరాట్ విశ్వేశ్వరుడి ఆలయంలోనే అనేక దేవీ దేవతల ఉపాలయాలు వున్నాయి.  ప్రదక్షిణ మార్గంలో పార్వతీ దేవి, అన్నపూర్ణాదేవి, కుబేరస్వామి, ఒక మందిరంలో గుంటలో కుబేరేశ్వరలింగం వుంటాయి.  దాటితే ఆవముక్తేశ్వర మహాదేవుడు, నందీశ్వరుడు, ఏకాదశేశ్వర లింగం వున్నాయి.  ఇంకా గణపతి, విష్ణు, మహాలక్ష్ములనుకూడా దర్శించవచ్చు. 

ప్రధాన ఆలయంలో గర్భగుడిలోపల నాలుగు గోడలమీద వున్న పాలరాతి ఫలకాలలో మూర్తులను దర్శించండి.  అవి సీతారామ లక్ష్మణులు, పూజారి కూర్చునే గూటిపై లక్ష్మీ నారాయణులు, ఒక గోడపై దశ భుజ వినాయకుడు,  పార్వతీ పరమేశ్వరులు.

ఆలయం లోపల ప్రాంగణంలో పార్వతీదేవి ఉపాలయం తర్వాత వచ్చే దోవలో బయటకు వెళ్తే అనేక శివలింగాలు, బావి, మసీదు కనబడతాయి.  కొన్ని లింగాలు, విగ్రహాలదగ్గర పేర్లు వున్నాయి.  పూర్వం మహమ్మదీయుల దండయాత్ర సమయంలో విశ్వేశ్వర లింగాన్ని భద్రతకోసం ఆ బావిలోనే పడవేసి తిరిగి తీసి ప్రతిష్టించారంటారు. 

విశ్వేశ్వర ఆలయం  బయటకురాగానే కుడివైపు శనీశ్వరాలయం కనబడుతుంది.  ఇక్కడ భక్తులు నిరంతరం దీపాలు వెలిగిస్తూంటారు.  దీపాలు అక్కడ లభిస్తాయి.   సమీపంలోనే సాక్షి వినాయకుడు, డింఢి వినాయకుడు, అన్నపూర్ణ మందిరాలుంటాయి.  ఒక కిలోమీటరు దూరంలో కాశీ విశాలాక్షి. ఆలయం వుంది.  అన్నపూర్ణ, విశాలాక్షి మందిరాలలో ఉపాలయాలను కూడా దర్శించండి. ఇవ్వన్నీ తప్పక దర్శించవలసిన ఆలయాలు.  ఈ సందుల్లో వాహనాలు తిరగవు.  నడవవలసినదే.

ఇవికాక కేదారేశ్వరఘాట్ లోని కేదారేశ్వర మందిరాన్ని తప్పక దర్శించండి.  వీలు కుదిరితే విశాలాక్షి ఆలయానికి వెళ్ళే దోవలో (కనుక్కుంటూ వెళ్ళాల్సిందే) వారాహీ దేవి ఆలయం వుంది.  ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి.  ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో


వుంటుందినేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే.  ఈవిడ గ్రామదేవత.  ఉగ్రదేవత.  ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది.  అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.   



కాలభైరవాలయం తప్పనిసరిగా దర్శించాలి. 

ఇంకా మేము చూడనివి, అవకాశం వుంటే చూడవలసినవి, తిలభాండేశ్వర్ మందిర్ (ఈయన రోజూ నువ్వు గింజంత పెరుగుతాడట).  ఇంకొక మందిరం భారతమాత మందిర్.   ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ కి 1.5 కి.మీ. దూరంలో వున్నది.  పాలరాతితో చెక్కిన మొత్తం బారతదేశం పటం ఇందులో వున్నదిట. 

వచ్చే పోస్టుతో కాశీ కబుర్లు ముగియబోతున్నాయి.