Showing posts with label ప్రయాణంలో పదనిసలు. Show all posts
Showing posts with label ప్రయాణంలో పదనిసలు. Show all posts

Wednesday, June 6, 2012

ప్రయాణంలో పదనిసలు - 5

ప్రయాణంలో పదనిసలు
ఎంకి నాయుడుబావ ఇల్లా?

శ్రీశైలం నుంచి మద్దిమడుగు వెళ్ళివచ్చే దోవలో పొలాలలో ఇలాంటి మంచె ఇళ్ళు కనిపించాయి.  ఎందుకో వాటిని చూడగానే ఎంకి, నాయుడుబావ గుర్తుకొచ్చారు.  ఒక్కసారి కారుదిగి ఆ మంచె ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి రావాలనే తాపత్రయాన్ని చాలా కష్టపడి అణుచుకున్నాను.  మరి మీకేమనిపిస్తోంది దీన్ని చూస్తే?



Wednesday, May 23, 2012

ప్రయాణంలో పదనిసలు - 4 వేసవిలో జలకాలాటలు




ప్రయాణంలో పదనిసలు - 4

వేసవిలో జలకాలాటలు - మల్లెల తీర్ధం

వేసవి..సూర్యారావుగారు అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతున్నారు..మీరేమో జలకాలాటలంటారేంటని కోప్పడుతున్నారా  మీ కోపం తగ్గించేందుకే మేము ఈనెల 14న, అంటే 14-5-2012 న వెళ్ళొచ్చిన జలపాతం గురించి చెబుతున్నాను.  మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు.  కొంచెం మెడ సారించి చూడండి.  హైదరాబాదుకు సుమారు 170 కి.మీ. ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్డులో వుంది.  అదేనండీ మల్లెల తీర్ధం.  శ్రీశైలం వెళ్ళే దోవలో ఎడమవైపు బోర్డు కనబడుతుంది.  అక్కడనుండి లోపలికి 8 కి.మీ.ల దూరం వుంటుంది.  రోడ్డు  బాగుంది.  కంకర రోడ్డు.  

దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పారు.  మా అబ్బాయేమో నువ్వా మెట్లు దిగలేవు, చాలా వున్నాయి అన్నాడు.  రోడ్డు బాగుండదని కొందరు.   కొందరేమో నీళ్ళు చాలా తక్కువ వుంటాయి.  సరే..ఇన్ని అభిప్రాయాలెందుకు..వెళ్ళు చూస్తే సరిపోతుందికదా అనుకున్నానుగానీ, దేనికన్నా టైము రావాలికదా.  ఈ మారు శ్రీశైలం ట్రిప్ లో ఆ టైము కుదిరింది.

అయితే అసలు సంగతి అక్కడకెళ్ళాక వుంది.  మరి 350 మెట్లు దిగాలి..మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఎక్కి పైకి రావాలి కూడా. భయపడకండి..మెట్లు చిన్నగానే వుంటాయి.   మెట్లు దిగిన తర్వాత దాదాపో 200 గజాల దూరం కొండపైన నడవాలి.  మరి జలపాతంలో జలకాలాడాలంటే ఆ మాత్రం కష్టపడాలండీ.  ఇంక చాలు…పైనుంచి మల్లెలలా జాలువారే జలపాతంలో హాయిగా మీ ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడండి.  ఇది చూసి వెళ్ళొచ్చినవాళ్ళుంటే చెబితే సంతోషిస్తా.

 మెట్లు దిగాక దోవ
జలపాతం

Tuesday, May 22, 2012

ప్రయాణంలో పదనిసలు




ప్రయాణంలో పదనిసలు
శ్రీ హనుమజ్జయంతి

శ్రీ హనుమజ్జయంతి రోజు (15-5-2012) మేము ప్రకాంశం జిల్లాలో కొంత తిరిగాము.  సాయంత్రం భైరవకోననుంచి వచ్చేటప్పుడు  కనిగిరి  మొదట్లో కనిపించిన అంబరాలంటే సంబరాలివి.  ఇందులో అందాలొలికే విద్యుత్ అలంకరణ శ్రీ ఆంజనేయస్వామికోసం అలంకరించిన ప్రభట.  60 అడుగుల పైనే ఎత్తుగావుంది.  విద్యుద్దీపాలతో చాలాబాగా అలంకరించారు.  చూడండి.  బాగుందికదూ.  మేము చిన్నప్పుడు శివరాత్రికి ప్రభలుకట్టి తీసుకెళ్ళటం చూశాంగానీ, అవి ఇంటి దగ్గరకట్టు గుడిదాకా దేనిమీదన్నా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చేవారు.  కానీ ఇది గుడి పక్కన ఖాళీ ప్రదేశంలో కట్టారు.  తర్వాత తీసేస్తారుట.  మరి నేను చూసింది మీకూ చూపించాలికదా...

 


Saturday, May 19, 2012

ప్రయాణంలో పదనిసలు






ప్రయాణంలో పదనిసలు

శ్రీశైలంవెళ్ళే దోవలో మామిడిపళ్ళు కనబడితే తోటనుంచి అప్పుడే తెచ్చినవి, సిటీలో ఇంతమంచివి దొరకవనుకుంటూ కొనేసుకున్నాం మా వదినగారూ నేనూ.  దోవలో టీ తాగుదామని ఆగాము.  కారు కిటికీ అద్దం ముయ్యటం మరచిపోయాము.  అంతే..ఓ కోతి ఇంచక్కావచ్చి కారులో వెనుకవైపువున్న మా మామిడిపళ్ళ కవరు  తీసుకుని, మొయ్యలేక మోసుకుంటూ అక్కడే ఓ ఇంటిమీదకెక్కి కూర్చుని పండు తీసుకుని తినటం మొదలు పెట్టింది. 

కోతుల గుంపులోకూడా అయినవాళ్ళూ, కానివాళ్ళూ వుంటారేమో.  కొన్ని కోతులు పళ్ళు చూసి వచ్చినా దూరంగానే కూర్చున్నాయి.  కొన్ని కోతులని ఈ తినే కోతి తరిమి కొట్టింది.  మధ్యలో వచ్చిన ఓ పెద్ద కోతికి మాత్రం పండిచ్చింది.  మొత్తానికి అవి మా మామిడిపళ్ళు తినేసినా వాటి విన్యాసాలు ఆ ఎండలో నా కెమేరాకి అందినంతమటుకూ బంధించి మీకు కూడా చూపిస్తున్నాను.  చూడండి మరి.
 
హమ్మయ్య
 
 అంతా నాకే.  నీకేం ఇవ్వను ఫో…

 
అసమదీయులు..షేర్ చెయ్యాలి..తప్పదు
 
 విందు భోజనం
 
 ఇంకా లేవా                     

Wednesday, March 30, 2011

ప్రయాణంలో పదనిసలు - 1








ఆసలే ఎండాకాలం!!!

బయట ప్రపంచంలోకెళ్తే ఎన్నో పరిచయాలవుతాయి. అనేక సంఘటనలు చూస్తాము. కొన్ని కలకాలం గుర్తుండేవి, కొన్ని సరదాగా నవ్వుకునేవి, కొన్ని ఆశ్చర్యంగా చూసేవి, కొన్ని బాధ కూడా పెడతాయనుకోండి. అవ్వే ప్రయాణంలో పదనిసలు. మరి అలాంటి సంఘటనలూ, దృశ్యాలూ మీకోసం ఈ ప్రయాణంలో పదనిసలు శీర్షికలో. ఆశ్చర్యకరమైన ఈ దృశ్యం 28-3-11 న శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం, ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లాలో (5 వ శక్తి పీఠం జోగులాంబ ఆలయం పక్కనే) చూశాను. ఆ దృశ్యాలు మీకోసం…ఎలా వున్నాయ్????

ఎండ మండిపోతోంది..దాహం వేస్తోంది..నీళ్ళు తాగాలి

అయ్యో రావటంలేదే. ఏం చెయ్యాలి?

మళ్ళీ తిప్పి చూస్తా…

బలే బలే…ఇప్పుడొస్తున్నాయ్!!

హమ్మయ్య. దాహం తీరింది.

నీళ్ళు వృధా చెయ్యకూడదు. అసలే ఎండాకాలం. పైగా యాత్రీకులు పాపం ఎండలో వస్తారు. కట్టేద్దాం.

ఉహ్..కట్టేశానోచ్!!!