Thursday, February 24, 2011

స్వామి మలై



తమిళనాడులోని కుంభకోణం తాలూకా, తంజావూరు జిల్లాలో వున్న ఈ వూరుఅనేక విధాల పేరు ప్రఖ్యాతులు చెందింది. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి వున్న ఆరు ముఖ్య క్షేత్రాలలో ఇది నాలుగవది. ఇంకొక విశేషమేమిటింటే సాక్షాత్తూ పరమశివుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం బడసిన స్ధలమిది. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్ధంచెప్పిన పవిత్ర ప్రదేశమిది. ఇంత అద్వితీయమైన ప్రదేశం గురించి మనమిప్పుడు తెలుసుకుందామా మరి.

ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి బయలుదేరారు. ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు. కనబడ్డవాడు వూరుకున్నాడా. ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం చెప్పమని బ్రహ్మగారిని అడిగాడు కుమారస్వామి. పాపం దేవతలకి కూడా ఎవరి డిపార్టుమెంటు వారిదేనేమో బ్రహ్మగారు చెప్పలేకపోయారు. ఇంకేముంది కుమారస్వామి ఆయనని బందీ చేశాడు. సృష్టికర్త బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది. దేవతలందరూ శివుని దగ్గరకెళ్ళి పరిస్ధితి వివరించారు.

అందరూ కలసి కుమారస్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మ దేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఆయన ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం అడిగితే చెప్పలేదు. అందుకే బందీ చేశాను అన్నాడు తన తప్పేమి లేదన్నట్లు. అప్పడు శివుడు కుమారస్వామిని అడిగాడు..సరే ఆయనకి తెలియదని బందీని చేశావు. మరి నీకు తెలుసా దానర్ధం..అయితే చెప్పు అన్నాడు. కుమారస్వామి ఘటికుడు. అంత తేలిగ్గా చెప్తాడా. నాకు తెలుసు. నేను చెప్తాను. అయితే నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు. ఇంకేముంది. కుమారుడు గురువైనాడు. తండ్రి అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించిపోయాడు.

పరమ శివుడు జగత్తుకే స్వామి. ఆ స్వామికే గురువై, నాధుడై ఉపదేశించాడు గనుక ఇక్కడ కుమారస్వామికి స్వామి నాధుడనే పేరు వచ్చింది. ఈ స్ధలానికి స్వామి మలై అనే పేరు.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.

యీ చిన్ని కొండ పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లూ అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ

అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూడండి. కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది.

గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.

ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.

పురాణాల కధనం ప్రకారం ఈ దేవుని సన్నిధానానికి వచ్చి నిశ్చల భక్తితో ఈ స్వామిని కొలిచే వారు చేసిన పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగి పోతాయంటారు. ఈ దేవాలయంలో వివాహం చేసుకున్నవారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.

రోజూ అసంఖ్యాక భక్తులు ఈ స్వామి దర్శనార్ధం వస్తూంటారు. ఈస్వామి భక్తులు భారత దేశంలోనే కాక అనేక ఇతర దేశాలలో కూడా వున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత స్వామికి అనేక ముడుపులు పాల కావడి, పూల కావడి వగైరాలు సమర్పిస్తారు.

మీరు సాయం సమయంలో కనుక వెళ్ళిసట్లయితే 5-45 ప్రాంతంలో స్వామికి అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి సౌందర్యం వర్ణించటానికి మాటలు చాలవు.

కుంభకోణంనుంచి 3040 ని. ల్లో తేలిగ్గా బస్సులో వెళ్ళవచ్చు స్వామిమలైకి. నేలనుంచి షుమారు 60 అడుగుల ఎత్తున వున్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.



Friday, February 18, 2011

అన్నవరాలనిచ్చే అన్నవరం సత్యన్నారాయణ స్వామి

ఆలయ ప్రవేశ ద్వారం
ఆలయంలో సత్యన్నారాయణ స్వామి వ్రతం

రత్నగిరి కింద ఆలయ మహాద్వారం

శ్రీ వీర వెంకట సత్యన్నారాయణస్వామి వెలసిన అన్నవరం క్షేత్రం గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అయితే మీకందరికీ ఒక విషయం తెలుసా? ఈ ఆలయంలో పగుళ్ళు రావటం కారణంగా గర్భగుడిలో స్వామి దర్శనం తాత్కాలికంగా నిలిపివేయబడ్డది. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగటానికి ఈ చర్య తీసుకున్నారు. 4 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. గర్భగుడిలో స్వామిని దర్శిస్తేగానీ యాత్ర చేసినట్లుకాదు అనుకునేవాళ్ళు మీ ప్రయాణం కొంతకాలం వాయిదా వేసుకోండి. మేము కొన్ని సంవత్సరాలక్రితం ఈ స్వామిని దర్శించాం. మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు తిరిగి ఈ స్వామి దర్శన భాగ్యం కలిగింది.


మూల విరాట్ కి మామూలుగానే నిత్యపూజలు, నైవేద్యాలు జరుగుతూంటాయి. మరి స్వామి దర్శనార్ధం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే భక్తుల మాటేమిటంటారా? వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవ మూర్తులను ధ్వజస్ధంబం దగ్గర ప్రతిష్టించి, నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వారు భక్తులకోసం చేసిన సూచన మీరూ గమనించండి.



ఎటూ అన్నవరం గురించి చెప్పుకుంటున్నాము గనుక, ఈ స్వామి చరిత్ర కొంచెం తెలుసుకుందామా? ఇక్కడ స్వామి మనం అన్న (అంటే కోరిన) వరాలను ఇచ్చేవాడు కనుక ఈ ఊరుకి అన్నవరం అని పేరు వచ్చింది. పావన పంపానదీ తీరాన, రత్నగిరిపై, సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున వెలసిన క్షేత్రమిది. ఈ రత్నగిరికి ఒక కధ వున్నది. పర్వత రాజయిన మేరువుకి, ఆయన భార్య మేరు దేవికి కలిగిన సంతానం భద్రాచలము, రత్నాచలము, వగైరా. భద్రాచలము శ్రీరామ భక్తుడై ఆ స్వామిని తనపై నిలుపుకుని జగద్విఖ్యాతి చెందాడు. రత్నాచలము కూడా తన సోదరునిలాగానే శ్రీ మహావిష్ణువుకోసం తపస్సుచేసి, ఆయనని మెప్పించి ఆ స్వామి తనపైనే నివసించేటట్లు వరంపొందాడు. రత్నాచలమునకిచ్చిన వరం ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు వీర వెంకట సత్యన్నారాయణమూర్తిగా, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతి సమేతంగా అక్కడ కొలువైవున్నాడు. అదెలా జరిగిందంటే…..


క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891, ఆగస్టు 6 వతారీకున ప్రతిష్టించి, ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటూంటాడు.


ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు.


ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటంకన్నా భాగ్యమేముంటుంది. ఆలయంలో స్వామివారి వ్రతానికి 200 రూ. నుంచి రూ. 1116 దాకా వివిధ రకాల రుసుం వసూలు చేస్తారు


క్షేత్రపాలకుడు శ్రీ రామచంద్రమూర్తి ఆలయం, వనదుర్గ ఆలయాలుకూడా రత్నగిరి మీద భక్తులు దర్శించవచ్చు.


విజయవాడ – విశాఖపట్నం రైలు మార్గంలోవున్న అన్నవరానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలున్నాయి. కొండపైదాకా వాహనాలు వెళ్తాయి. నడిచి వెళ్ళాలనుకునేవాళ్ళకి మెట్ల మార్గం వున్నది. కొండపైనే వసతికి, భోజనానికి వివిధ రకాల సదుపాయాలున్నాయి. కొండపైనుంచి చూస్తే పంపానది సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి.

త్వరలో ఆలయ మరమ్మత్తులు పూర్తయి స్వామి దర్శనం అందరికీ లభిస్తుందని కోరుకుందాము.

Monday, February 14, 2011

పుట్టింటి కులదేవత

అన్నయ్య శ్రీ రాధాకష్ణమూర్తి, వదిన శ్రీమతి అనంత వరలక్ష్మి
కులదేవత -- అంకమ్మ పూజ
మాలో కొందరు
శ్రీచక్రార్చన సందర్భంగా సువాసినీ పూజ

శ్రీచక్రాధిదేవతకు సువాసినుల కుంకుమార్చన

మేము --మేమే
పూజలకిముందు గణపతి పూజ


పుట్టింటిమీద అభిమానంలేని ఆడవారెవరుంటారు చెప్పండి!!?? వారి ఆప్యాయతానురాగాలకి తపించని వాళ్లుంటారా? మేమేమో అంతా ఆడ పిల్లలమే. చిన్నప్పుడు మా అమ్మ శ్రీమతి జయలక్ష్మీ సుశీల మేమంతా ఆడపిల్లలమని ఒకే ఒక్క విషయానికి దిగులు పడేది. ఇంటికి అల్లుళ్ళొస్తే సరదాగా గడపటానికి బావ మరిది లేడనీ, మమ్మల్ని అప్పుడప్పుడూ ఇంటికి పిలిచి పసుపూ కుంకుమ పెట్టటానికి మగ తోడు లేడనీ. మా నాన్నగారు శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారు, మేము సరదాగా తీసేసేవాళ్ళం..ఒకళ్ళో ఇద్దరో వుంటే ఇంతమందికీ పసుపు కుంకుమ పెట్టటానికి వాడికి ఎంత జీతం వచ్చినా సరిపోదులే..దానికి దడిసే వాడీ భూమ్మీదకి రావటంలేదు.. అని.

మా అమ్మ ఆవేదన కనుక్కున్నాడేమో ఆ భగవంతుడు మా పెదనాన్నగారి పిల్లల రూపంలో మాకీలోటులేకుండా చేశాడు. మా పెదనాన్నగారు కీ. శే. శ్రీ పులిగడ్డ వెంకట సుబ్బారావుగారు శ్రీవిద్యోపాసకులు...సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కృష్ణా జిల్లా గన్నవరంలోని చిదానందాశ్రమములోని పీఠాధిపతులుగా వ్యవహరించారు. పీఠాధిపత్యం స్వీకరించిన అనతికాలంలోనే ఆశ్ర్రమంలో శ్రీచక్రాన్ని, భువనేశ్వరీ అమ్మవారినీ స్ధాపించి, భువనేశ్వరీ పీఠమని నామకరణ చేసి, నిత్యార్చనలు చేశారు.

మా పెదనాన్నగారి అబ్బాయి శ్రీ హనుమంతరావు, కళ్యాణానంద పీఠము, హైదరాబాదు. ఈయనకూడా శ్రీ విద్యోపాసకులు. మా పెదనాన్నగారు, మానాన్నగారులాగానే (అన్నట్లు మా నాన్నగారు కూడా శ్రీ విద్యోపాసకులే) శ్రీ చక్ర నవావరణార్చనలు అనేకమార్లుచేశారు…ఇంకా చేస్తున్నారు. మా నాన్నగారు పోయినప్పుడు ఆయన అంత్యక్రియలు వీరే నిర్వహించారు. మా నాన్నగారు గతించి 13 సంవత్సరాలయినా ఇప్పటివరకూ ఒక్క సంవత్సరంకూడా తప్పకుండా ప్రతి సంవత్సరమూ శ్రధ్ధగా ఆబ్దీకములు కూడా పెడుతున్నారు. ఆ విధంగా మా నాన్నగారికి పుత్రులు లేని లోపం లేకుండా చేశారు. అంతేకాదు…మా ఏడుగురు అక్క చెల్లెళ్ళను వారి సోదరీమణులతో సమానంగా ఆదరించి, ఆభిమానించటమేకాదు, ఎవరూ ఊహించనివిధంగా తరచూ పసుపు కుంకుమలు, చీరె సారెలతో మమ్నల్ని ఆదరిస్తున్నారు. మా తమ్ముడికి అన్నివిధాలా సహకరిస్తూ, మమ్మల్నందరినీ ఆప్యాయతాభిమానాలతో ఆదరించే మా మరదలు శ్రీమతి గిరిజ మాకు మరదలు కన్నా సన్నిహిత స్నేహితురాలులాంటిది. మాకు సొంత సోదరుడు వున్నా ఇలా చేసేవాడుకాదేమో. అందుకే ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా పెదనాన్నగారి అబ్బాయి అనటంకన్నా మా తమ్ముడు/అన్నయ్య అనే చెబుతాం మా అక్క చెల్లెళ్ళం. వయసులో నాకన్నా చిన్నవాడుగనుక చేతులెత్తి నమస్కరించలేనుగానీ ఆ భువనేశ్వరీమాత తన చల్లని చూపులు వీరి కుటుంబంమీద నిరంతరం ప్రసరింపచేయాలని ప్రార్ధిస్తున్నాను.

ప్రస్తుతం విషయానికి వస్తే మా పెదనాన్నగారి పెద్ద కుమారుడు శ్రీ పులిగడ్డ రాధాకృష్ణమూర్తి విశాఖ పట్టణం జిల్లాలో రెవెన్యూ డిపార్టుమెంటులో మండల రెవెన్యూ అధికారిగా రిటైరు అయి, ప్రస్తుతం నర్సీపట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి శ్రీమతి, మా వదిన శ్రీమతి అనంత వరలక్ష్మి దగ్గరనుంచి ఫోను వచ్చింది. మన ఇంట్లో శ్రీ చక్రార్చన, అంకమ్మ నైవేద్యం పెట్టుకుంటున్నాము. ఆడబడుచులంతా తప్పక రావాలి అని. వదినగారి ఆహ్వానంకన్నా ఆడబడుచులకి ఆనందమింకేముంటుంది. మా కుటుంబాలలో ఏమైనా కార్యక్రమాలయినప్పుడు ఎప్పుడైనా కలుస్తూనే వుంటాంగానీ5, వారింటికి మేము వెళ్ళటం మొదటిసారి.

ఫిబ్రవరి 4 వ తారీకు సాయంత్రం 5-15 గం. ల కు వైజాగ్ వెళ్ళే బస్ లో బయల్దేరి మర్నాడు ఉదయం 7 30కు తునిలో దిగి, అక్కడనుండీ నర్సీపట్నం బస్ లో ఎక్కి 8-45 కి నర్సీపట్నంలో దిగాం. తునినుంచి నర్సీపట్నందాకా పచ్చని ప్రకృతి, పొగ మంచు..ప్రకృతికాంత సౌందర్యారాధనలో మనసంతా సంతోష భరితమైపోయింది. మమ్మల్ని చూడగానే పరుగున వాకిట్లోకొచ్చిన వదిన ఆత్మీయ ఆలింగనం, బంధువుల పలకరింపులతో అంతా సందడే..ఎటుచూసినా హడవిడే..సంతోషమే…

ఆ రోజు…ఫిబ్రవరి 5 వ తేదీ శ్రీ చక్రార్చన జరిగింది. అమ్మవారు సువాసిన్యర్చన ప్రీత. అందుకే శ్రీ చక్రార్చన సందర్భంగా తప్పనిసరిగా శ్రీవిద్యలో కొంత అర్హత సంపాదించుకున్న ముత్తయిదువని అమ్మవారి రూపంగా ఆహ్వానించి షోడశోపచార పూజ చేస్తారు.


మా పెదనాన్నగారి మిగతా అబ్బాయిలు శ్రీ ఉమామహేశ్వరరావు, (వీరి శ్రీమతి, విజయ వదిన చెప్పారనే ఈ కార్యక్రమాలగురించి పోస్టు రాస్తున్నా), శ్రీరామచంద్రమూర్తి (కవి), మనవళ్ళు శ్రీ రాజు, శ్రీ శ్రీనివాస్, ఇంకా కూతుళ్ళూ, మనవళ్ళూ, మనవరాళ్ళూ అందరూ కలిసి ముక్తకంఠంతో చేసిన లలితా సహస్రనామ స్తోత్రంతో ఇల్లు మారుమ్రోగింది. మా వాళ్ళందరివీ భలే కంఠాలు..అంతా ఒకే స్వరంతో సహస్రనామాలు చదువుతుంటే, దేవుడంటే ఇష్టంలేనివాళ్ళుకూడా అలా వింటారు.

మా అన్నయ్యగారి వియ్యంకులు నర్సీపట్నంలో విశాఖ మానవ వనరుల సంస్ధ (యన్.జీ.ఓ) సంస్ధాపకులు. ఆ సంస్ధ పెద్ద హాలులో మా విడిది. అందరం ఒకచోట చేరేసరికి పెళ్ళిసందడి మించిపోయింది మా సందడి. పైగా పెళ్లి కార్యక్రమాల హడావిడి ఏమీ లేదయ్యే. ఎన్ని కబుర్లో మా పెదనాన్నగారి అమ్మాయి శ్రీమతి ఉదయశ్రీ కవయిత్రి. తను రాసిన పాటలు పాడింది.

మర్నాడు మా పుట్టింటి కులదైవం అంకమ్మ నైవేద్యం. పుట్టింట్లో ఏశుభకార్యక్రమమైనా, ఏ ఆపదలను గట్టెక్కించటానికైనా ఈ తల్లిని కొలుస్తారు. ఇంటి కోడళ్ళల్లో పెద్దవాళ్ళు నలుచదరం చెక్కకి పసుపురాసి, మధ్యలో గుండ్రంగా కుంకంతో బొట్లు పెడతారు. ఆ బొట్టు పెట్టేటప్పుడు వారు మాట్లాడరు. తర్వాత పూజాదికాలు నిర్వర్తించి, వండిన పదార్ధాలన్నీ అన్నపురాశిమీద అమర్చి నివేదన చేస్తారు.

పూజా కార్యక్రమం తర్వాత మా అన్నయ్యనీ వదిననీ కూర్చోపెట్టి చిన్ని సత్కారం చేశాం. అందరం అన్నా వదినలు పెట్టిన కొత్త బట్టలతో సందడి చేశాం. భోజనానంతరం, తిరుగు ప్రయాణం. తునిదాకా వాళ్ళ వెహికల్ లో దింపితే అక్కడనుంచీ విశాఖ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ చేరాం. రెండు రోజులు అన్నీ, అందరినీ మరచిపోయి ఎంతో సంతోషంతో గడిపి వస్తుంటే మాకెవ్వరికీ తిరిగి ఇళ్ళకి రాబుధ్ధికాలేదు.

అప్పుడప్పుడూ బంధుమిత్రులూ, స్నేహితులూ కలిసి అలా చెప్పుకునే కబుర్లు మళ్ళీ కొన్నాళ్ళు ఉత్సాహభరిత జీవితాలు గడపటానికి గొప్ప టానిక్ లా పని చేస్తాయికదా