యాత్ర కొనసాగించాలా? వద్దా??
స్వప్న@కలల ప్రపంచం, నా బ్లాగులో ఒక కామెంట్ చేశారు. మీకు ఇన్ని డబ్బులు ఎక్కడివండి మీ ఆయన బాగా సంపాదిస్తారా అన్ని చోట్లకి వెళ్ళి చూస్తారు..మీ ఓపికకి మెచ్చుకోవచ్చు అని. దీనికి నేను సమాధానం రాశాను కానీ దానిమీద ఒక్క కామెంటు కూడా రాకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా అనిపించి ఈ పోస్టు రాస్తున్నాను.
స్వప్నా, మీరు వయసులో చాలా చిన్నవారు. అందుకే ఒక పరిధిలోనే ఆలోచించారు. అవునూ, మీరూ ఉద్యోగం చేస్తున్నారు. బస్ మిస్ అయితే ఆఫీసుకి ఎవరి పర్మిషన్ అడగకుండానే ఆటోలో వెళ్తున్నారు...అంటే మీ ఉద్యోగం మీకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందనేకదా అర్ధం. అలాగే నేను కూడా అనే ఆలోచన రాలేదా నేనూ 40 ఏళ్ళు ఉద్యోగం చేశానండీ. నేను చేశానని మా ఆయన మానేయలేదులెండి...పాపం ఆయనా ఆయన ఉద్యోగం చేశారు అన్నేళ్ళూ. సంసార సాగరంలో అనేక సుడిగుండాలుంటాయండీ...వాటిలో చాలా ఇంకా మీ ఊహల్లోకి కూడా వచ్చి వుండవు. అవ్వన్నీ దాటుకుని మేము నిలదొక్కుకునేసరికి ఇద్దరం రిటైరయ్యాము. ఇన్నేళ్ళ ఇద్దరి ఉద్యోగంతో మేము మిగుల్చుకున్నది మా ఇద్దరి + మా ఇద్దరి పిల్లల చేతిలో పి.జీ. డిగ్రీ సర్టిఫికెట్లూ, వుండటానికో ఇల్లూ..అంతే. ఇలా క్లుప్తంగా చెప్తున్నానుగానీ ఈ భవసాగరాల సునామీలలో మేము సాధించిన వాటితో మాకు తృప్తి వుంది. ఎందుకంటే అన్నీ మా కష్టార్జితం. మా సంపాదన వివరాలు అయిపోయాయికదా.
ఇంక మా యాత్రల విషయానికొస్తే నాకూ, మావారికీ కొత్త ప్రదేశాలు చూడటం చాలా సరదా. మా అమ్మాయి (అమ్మాయి పెద్దదిలెండి) 9వ తరగతికి వచ్చేదాకా, పిల్లల్నికూడా ఏడాదికొకసారి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడనుంచీ, రెండేళ్ళ క్రితందాకా వాళ్ళ చదువులతో ఎటూ కదలటం కుదరలేదు. రెండేళ్ళ క్రితంనుంచీ, పిల్లలు దగ్గర లేకపోవటం, ఆఫీసులో కొంత వెసులుబాటు దొరకటం, వగైరాలతో మళ్ళీ అరికాళ్ళ దురద ఎక్కువైంది.
మొదట్లో చాలామంది కుళ్ళుకున్నారు. కొందరు ఎదురుగానే అనేవాళ్ళు. నీకేమమ్మా మీవారు కూడా చక్కగా అన్నివూళ్ళూ తిప్పుతారు, మా ఇళ్ళల్లో ఆ సరదాలు లేవు అనేవారు. కొందరు ఫోన్ చేస్తే ఏ వూరునుంచి మాట్లాడుతున్నారు అనే వాళ్ళు సరదాగా. ఎప్పుడొచ్చినా ఇల్లు తాళమే వుంటుంది అసలెప్పుడన్నా ఇంట్లో వుంటారా అనేవాళ్ళు కొందరు, అంత ఓపిక ఎక్కడనుంచొస్తుంది మీకు అనేవాళ్ళు కొందరు…ఇలా ఎన్నో. మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత స్పష్టంగా చెప్పేదాన్ని. మాకు తిరగటం సరదా, ప్రస్తుతం ఓపిక, సమయం వున్నాయి. ఓపిక లేనప్పుడు మానేస్తాంలే అనేదాన్ని. తర్వాత వాళ్ళకి అర్ధమవటమేకాదు, మా గాలి తగిలి కొందరు మరీ మాలాగా కాకపోయినా ట్రిప్స్ వెయ్యటం మొదలు పెట్టారు.
ఇంక తిరగటానికి అన్ని డబ్బులెక్కడనుంచి వస్తాయి అనే ప్రశ్నకి ....
మాకు బట్టలు, నగలు కొనుక్కోవటం, ఆస్తులు కూడబెట్టుకోవటం వగైరాలకన్నా యాత్రలు చెయ్యటంలోనే ఆసక్తి ఎక్కువ. ఈ డబ్బులుంటే ఇంకో రెండు నగలు చేయించుకునేదాన్నేమోగానీ, వాటిని కాపలాకాయటం నాకు చాలా చికాకు. ఏదయినా అవసరానికుంటే చాలు. కానీ ఈ యాత్రల విషయంలో ఎంత తిరిగినా మాకు తృప్తి వుండటంలేదు. పిల్లలు దగ్గర లేకపోవటంవల్ల వచ్చిన ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి కూడా కొంత తిరిగేవాళ్ళం.
ఇండియాలో మేము తిరిగిన ప్రదేశాలు ఎక్కువ ఖర్చయ్యేవికాదు. పెద్ద యాత్రలింకా ఏమీ చేయలేదు. ప్రస్తుతానికి ఒక కారు, మా వారికి దానిని డ్రైవ్ చేసే ఆసక్తి వున్నాయి. చాలా మటుకు దానిలో తిరిగినవే. ఖర్చు తక్కువ అవ్వటానికి కారణాలు ఇంకొన్ని
- ఉదయం బయల్దేరి సాయంత్రం 6, 7 గం. ల దాకా తిరగటం, ఆ టైముకి ఎక్కడో అక్కడ స్టే చెయ్యటం,
- సాధారణంగా వెళ్ళే రోజు ఆహారం ఇంట్లోంచే పేక్ చేసుకెళ్తాం
- స్టేకి స్టార్ హోటల్స్ చూసుకోం. కుటుంబీకులు వుండగలిగేవి, నీట్ గా వుండేవి చాలు.
- పెద్దవాళ్ళం కనుక బయట చిరుతిండి, చూసినదల్లా కొనటం వగైరా అనవసర ఖర్చులు వుండవు.
- ఎక్కడా షాపింగ్ చెయ్యం
- రష్ తక్కువగా వుండే సమయాల్లో వెళ్తాం కనుక స్పెషల్ దర్శనానికి వెళ్ళం.
- సొంత వాహనంలో వెళ్ళటంవల్ల దగ్గర దగ్గర స్ధలాలన్నీ ఒకేసారి చూస్తాం
- కారు కాకపోతే సమయాభావ సమస్య లేదు కనుక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడతాం కానీ ఇద్దరి కోసం టాక్సీలు తీసుకోం.
- ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు చూసినవే కాదు. రెండేళ్ళనుంచి చూస్తున్నవన్నీ. నేను బ్లాగు మొదలు పెట్టకముందు చూసినవి కూడా వున్నాయి.
ఈ పోస్టులు చూసి మేము హ్యాపీగా తిరుగేస్తున్నాము, ఎక్కడా ఏ ఇబ్బందులూ వుండవనుకోకండి. చిన్న ప్రదేశాలలో కొన్ని చోట్ల తినటానికేమీ దొరకదు. కొన్ని చోట్ల వుండటానికి అవకాశం వుండదు. కొన్ని చోట్ల మేము వెళ్ళేసరికి చూడాల్సిన ప్రదేశాలు మూసేసి వుండేవి. ఈ పోస్టులు చదివి అక్కడికి వెళ్ళే వాళ్ళు మాలా ఇబ్బంది పడకూడదని వాటి వివరాలు కూడా ఇస్తుంటాను.
ఇంకో విషయం. రాసినవాటికన్నా రాయాల్సినవి ఇంకా చాలా ఎక్కువ వున్నాయి!!!!. అందుకే ఒక్కసారి అందరి అనుమానాలూ తీర్చాలని ఈ పోస్టు. అమ్మయ్య. అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి మేము చూసిన ప్రదేశాలగురించి ఇంకా రాయమంటారా వద్దంటారా?????????