సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం ఎత్తు 143 అడుగులు. దీనిలోని రాళ్ళు ఇనప క్లాంప్స్ తో కలపబడ్డాయి.
దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా, ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.
20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది. ఇక్కడ తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.
ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది. మహాబోధి లైబ్రరీలో బుధ్ధుని గురించి అనేక పుస్తకాలు, వ్రాత ప్రతులు వున్నాయి.
7 వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు.
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము. ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది. భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి. అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్, చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా. బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.
500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు. తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.
బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు. కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.
బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు. ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.
ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు. అశోక చక్రవర్తి పరిపాలనలో బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.
బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది. ఇక్కడే ఆయన తపస్సు చేసింది.
ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.
ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.
7 వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.