పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుధ్ధంలో అతనిని సంహరించింది. తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసినది. దుర్గుని సంహరించినది కనుక దుర్గాదేవిగా ప్రసిధ్ధిగాంచినది. ఇక్కడ భక్తుల రద్దీ ఎల్ల వేళలా వుంటుంది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో దేవీ దర్శనం చేసుకుంటారు. సమీపంలో దుర్గా కుండము వున్నది.
ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం. నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా. భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది. రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి. రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి.
కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది. అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే. వాటి మహత్యమే అత్యున్నతం. ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడనిఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ. ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం. ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు. అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.
లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి. సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు.
కాశీలో దేవాలయాలు అనేకం. ఎన్ని చూసినా ఇంకా చూడనివి వుంటాయి. ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు. సమయం ఒక పూట పడుతుంది. అందులో మొదటిది
కాలభైరవ మందిరం
పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు. ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు. బ్రహ్మగారిని తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది. పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది. చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి.
ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు. ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి. కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాల మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే. వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే. కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా. కాశీలో మరణించటమే ఆ అర్హత. వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారు పనే. మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా. దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు. అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు. కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.
విశ్వనాధుని ఆలయంనుంచి రెండు కిలో మీటర్ల దూరం లోపే వుంది ఈ ఆలయం.