ఉగ్ర నరసింహస్వామి
దేవాలయం, మద్దూరు
సుమారు 1200
సంవత్సరాల క్రితం హొయసల రాజు విష్ణవర్ధనుడిచే నిర్మింపబడిన ఈ ఆలయం నేటికీ అద్భుతంగా
వున్నది. ఇక్కడ స్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుంటాడు. తొడపైన హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నట్లుండే స్వామి,
ఎనిమిది చేతులుతో విరాజిల్లుతుంటాడు. రెండు చేతులు సంహారం చేస్తుంటే, ఇంకో రెండు చేతులతో
హిరణ్యకశిపుని పేగులు మెడలో వేసుకుంటూవుంటాడు.
మరి రెండు చేతులలో శంఖం, చక్రం, ఇంకో రెండు చేతులలో పాశం, అంకుశం ధరించి వుంటాడు. స్వామి నామంకింద ముక్కుపైన మూడోకన్ను వున్నది. స్వామికి కుడిప్రక్క ప్రహ్లాదుడు, ఎడమవైపు గరుడుడు
సేవిస్తూ వుంటారు.
మహా భారత యుధ్ధం
చివరి రోజులలో అర్జనుడు నరసింహ రూపం దర్శించాలని వుందని శ్రీ కృష్ణుడిని ప్రార్ధించాడుట. అది ఉగ్ర రూపం కనుక అది సాధ్యపడదని చెప్పి, అర్జనుని
కోరిక తీర్చటంకోసం బ్రహ్మచేత శిల్పం రూపొందించాడుట. ఆ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్టించారు.
తర్వాత కాలంలో
రాజులు యుధ్ధాలలో ఉపయోగించటానికి ఇక్కడ బాంబులు తయారు చేసేవారు. అందుకే ఈ వూరి పేరు మద్దూరు అయింది. మద్దు అంటే కన్నడంలో బాంబు అని అర్ధం.
ప్రదక్షిణ మార్గంలో
వున్న ఉపాలయాలలో యశోద ఒళ్ళో చిన్ని కృష్ణుడు, నరసింహనాయకి అమ్మవారిని దర్శించవచ్చు. ఇంకా ఆంజనేయస్వామి, నరసింహస్వామి, వేణుగోపాలస్వామి
వగైరా దేవతా మూర్తుల రంగుల చిత్రాలు గోడలమీద వున్నాయి.
పక్కనే వున్న
ఆలయంలో వరదరాజస్వామి కొలువుతీరి వున్నాడు.
ఆలయం అప్పటికే మూసేసినా పూజారిగారు మేము చాలా దూరంనుంచి వస్తున్నామని తెలిసి తలుపులు తెరిచి దర్శనం చేయించారు. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడినది.
కమలం మీద నుంచున్న స్వామి 16 అడుగుల ఎత్తు వున్నాడు. శంఖ, చక్ర, గదా పద్మాలతో, ఎదపై లక్ష్మితో శోభిల్లుతున్నాడు.
ఆలయ సమయాలు ఉదయం
8 గం. లనుంచీ 2-30 దాకా తిరిగి సాయంత్రం 4-30 నుంచి 8-30 దాకా.
ఇంకో ముఖ్య విశేషం
మద్దూరు వడ చాలా
పేరు పొందిందండోయ్. చాలామంది చెప్పారు..మద్దూరు
వెడితే అక్కడ వడ తప్పకుండా తినండి అని. ఏ హోటల్
లో అడిగినా ఇస్తారు. చాలా చోట్ల బోర్డులుకూడా
వుంటాయి. ఒక్కొక్కటీ 15 రూ. రుచి కొంచెం వేరుగా వుంటుంది. బహుశా రవ్వ వేస్తారనుకుంటాను. బాగున్నాయి.
వెళ్ళినవాళ్ళు తప్పకుండా తినండి. ఆలయ దర్శనం అయ్యేసరికి 2-45 అయింది. మద్దూరులోనే భోజనం చేసి తిరిగి బయల్దేరాము.
శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయం, గోపురం
శ్రీ వరదరాజస్వామి ఆలయం లోపల దృశ్యం
హొయసల రాజుల చిహ్నం
శ్రీ వరదరాజస్వామి ఆలయం