Sunday, January 11, 2009

కుమారారామం, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా

మాండవ్యనారాయణుని ఆలయం
దీపాలంకరణతో కుమారారామం
కుమారారామంలో ఏకశిల నంది
కుమారారామం ఆలయ ప్రాంగణం

కుమారారామం, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా

క్షేత్రంలో అమృతలింగ శకలాన్ని కుమార స్వామి ప్రతిష్ఠ చేశారు. అందుకే దీనికి కుమారారామం అని పేరు. ఈ ప్రాంతాన్ని షుమారు క్రీ.శ. 624 నుండి క్రీ.శ. 1076 వరకు వేంగీ చాళుక్యుల పరిపాలించారు. వీరి వంశానికి మూల పురుషుడైన కుబ్జ విష్ణువర్ధనుడి నుంచి చివరి రాజైన ఏడవ విజయాదిత్యుని వరకు షుమారు 30 మంది రాజులు ముందు పిష్టపురము (నేటి పిఠావురము), తరువాత రాజమహేంద్రవరము (నేటి రాజమండ్రి) రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వారి ఆదరణలో ఈ ఆలయాలు చాలా అభివృధ్ధిచెందాయి. ఈ ఆలయంలో వున్నశిల్ప సంపద వారి కాలంనాటిదే. ఈ వంశీకుడైన రాజ రాజ నరేంద్రుడే (క్రీ.శ 1060) గోదావరీ తీరాన రాజమహేంద్రవరం నిర్మించింది. అంతేకాదు. కవిత్రయంలో మొదటివాడైన నన్నయ చేత సంస్కృత మహాభారతమును తెలుగులో వ్రాయించి తెలుగు సాహిత్యంలో ఒక నూతనయుగానికి నాంది పలికినవాడుకూడా ఈయనే.

చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ..శ. 872 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కుమారారామమును రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈయన దాదాపు 300 యుధ్ధాలలో విజయం సాధించినట్లు శాసనాలవల్ల తెలుస్తోంది. బహుశా యుధ్ధాలలో ఈయన సాధించిన విజయాలకు కృతజ్ఞతతో, భీమేశ్వర స్వామిపట్ల తనకుగల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మింప చేసినట్లు తెలుస్తోంది. ఈయన పేరుతోనే ఈ ఆలయాన్ని చాళుక్య భీమారామం అన్నారు (బిర్లా కట్టించిన ఆలయాలను బిర్లామందిర్లన్నట్లు). ఊరుకూడా చాళుక్య భీమవరం అయింది (రోడ్డుకి అవతలవైపు సామర్లకోట ఇవతల భీమవరం) . ఆ కాలంలో ఇక్కడ వ్యాప్తిలో వున్న బౌధ్ధసంప్రదాయ ప్రభావం వల్లనే పంచారామాలలో ఆరామ శబ్దం వచ్చి వుండచ్చని ఒక కధనం.

ఈ ఊరి పేరు వెనుక వున్న వేరే కధలు... పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారనీ, వాళ్ళకి ఈ గ్రామం చాలా సురక్షితంగా వుండేదనీ, అందుకే స్వాముల కోట అనేవారు, అదే సామర్లకోట అయిందని ఒక కధ. ఇంకో కధ...శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోటవుండేవనీ, అందుకే శ్యామలకోట అని పిలిచేవారనీనూ. ఏ కధలు ఎలా వున్నా శ్రీనాధ కవి రచనల ద్వారానూ, లభ్యమయిన శిలా శాసనాల ద్వారానూ చాళుక్య భీమవరం, కుమారారామం అన్నవే పూర్వకాలంనుంచీ స్ధిరంగా వున్న పేర్లు అని నిరూపితమవుతోంది.

ఆలయ విశేషాలు

ఈ ఆలయం వాస్తులో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి వుంటుంది. ఈ దేవాలయం చుట్టూ ఇసుక రాతితో కట్టబడిన రెండు ప్రాకారాలున్నాయి. బయటి ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలున్నాయి. లోపలి ప్రకారంలో రెండు అంతస్తుల భీమేశ్వరాలయం వుంది. క్రింది అంతస్తులో ప్రతిష్టింపబడిన శివ లింగము చాలా ఎతైనది. పూజలు రెండవ అంతస్తులో జరుగుతాయి.

గుడి ప్రాంగణంలో భీమేశ్వరాలయాన్ని పోలిన ఒక చిన్న నమూనా గుడి వుంది. బహుశా గుడి కట్టటానికి ముందు స్ధపతి గుడి నిర్మాణంలో మార్గదర్శకంగా వుంటుందని ఈ నమూనాను చెక్కి వుండవచ్చు. ఆలయంలో ప్రవేశిస్తూనే కనిపించే నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఒక ఆద్భుత సజీవ శిల్పం. ఇక్కడి శిల్పంలో మరో విశేషమేమిటంటే ప్రతి శిలా స్తంబమూ దేనికదే ప్రత్యేకమయినది. ఏ రెండు స్తంబాలూ ఒక్కలా వుండవు. ప్రతి స్తంబములోనూ ఏదో ఒక శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు.

ఈ దేవాలయంలో క్రీ.శ. 1447 నుండి క్రీ.శ. 1494 మధ్య జారీ చేసిన 31 శాసనాలున్నాయి. వీటిలో కొన్నిటి ఆధారంగా తూర్పున వున్న ముఖ మండపం నిర్మాణం క్రీ.శ. 1394 లోనూ, శ్రీ ముఖమండపం నిర్మాణం క్రీ.శ. 1422 లోనూ జరిగినట్లు తెలుస్తోంది.

స్వామి దర్శనం కోసం రెండవ అంతస్తుకి వెళ్ళటానికి గర్భగుడికి రెండు వైపులా రెండు ద్వారాలున్నాయి. దక్షిణ ఆగ్నేయం వైపుది సూర్య ద్వారము, ఉత్తర ఈశాన్యం వైపుది చంద్ర ద్వారము. ఈ రెండు మార్గాలూ గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల్లాగా అనిపిస్తాయి. మానవుడి నాసికా రంధ్రాలలో ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగి ఈ రెండు నాడుల ద్వారా చేసే ప్రాణాయామం ప్రక్రియద్వారా తన ప్రాణమును సహస్రారమున చేర్చి, ఆ ప్రాణముతో తన మనస్సుకూడా అక్కడ చేర్చి భగవదనుభవంచేత ఆనందమయుడై విరాజిల్లుతాడు. ఇది యోగమార్గం. ఇక్కడ స్వామి యోగలింగాకృతి ధరించి వున్నాడు. ఈ స్వామి దర్శనం కూడా ఈ యోగ మార్గాన్నే వెల్లడిస్తూంటుంది.

శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవేరి శ్రీ బాలా త్రిపుర సుందరి ఈ తల్లిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆలయంచుట్టూ వున్న చిన్న చిన్న గుళ్ళల్లో బ్రహ్మ, సరస్వతి, సూర్యుడు, మహిషాసుర మర్దని మొదలగు అనేక దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఇక్కడ సరస్వతి సకల విద్యా ప్రదాయిని. మహిషాసురమర్దని విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది. దీనిని కొండవీటి రాజైన కాటయ వేమారెడ్డి 15 వ శతాబ్దిలో ప్రతిష్టించినట్లు చెబుతారు. ఈవిడకే శ్యామలా శక్తి అనే పేరు కూడా వున్నది.

ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం.. చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలనూ తాకుతాయి. ఆలయం పడమటి గోడలో వజ్ర గణపతి విగ్రహం వుంది. పూర్వం ఈయన నాభిలో ఒక వజ్రం వుండేదిట. దానినుంచి వచ్చే ఆద్భుత కాంతులే రాత్రి పూట భక్తులకు మార్గదర్శకంగా వుండేవిట. భీమేశ్వరుని ఆలయం ఎదురుగా తూర్పు దిక్కులో వున్న పుష్కరిణి పేరు భీమ పుష్కరిణి.

నిర్వహణ

ఈ మధ్య ఈ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది. 1964 నుంచీ ఈ ఆలయం కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో వున్నది. ఉత్సవ నిర్వహణ, ఆదాయ వ్యయాలు రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహణలో వున్నాయి. ఆలయాభివృధ్ధికి స్ధానికులతో ఏర్పడిన ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది.

ఉత్సవాలు

కార్తీక, మార్గశిర మాసాలలో నిత్యం అభిషేకాలు జరుగుతూంటాయి. కార్తీక మాసంలో దీపాలంకరణ, సంకీర్తన, అన్నదానాది కార్యక్రమాలు జరుగుతూంటాయి. మాఘ బహుళ ఏకాదశినాడు స్వామి వారికి గ్రామోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఆ రోజు నుంచి మహా శివరాత్రి వరకూ ఉత్సవములు, అభిషేకములు, పూజలు పాంచాహ్నిక దీక్షతో జరుపబడతాయి.

దర్శన సమయాలు

ఉదయం 5 గం. ల నుంచి 12 గంటల దాకా, సాయంత్రం 4 గం. ల నుంచి 9 గం. ల వరకు.

మాండవ్య నారాయణ స్వామి ఆలయం

భీమేశ్వరాలయానికి 200 గజాల దూరంలో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది. ఈ స్వామిని త్రేతాయుగంలో మాండవ్యముని ప్రతిష్టించారు. క్రీ.శ. 650 లో విజయాదిత్యచోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.



Monday, January 5, 2009

క్షీరారామం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా

ఆలయ విమానం, ముందు మండపం
రాజ గోపురం
క్షీరారామం, పాలకొల్లు

తారకాసురుని సంహారానికి పూర్వంనుంచే ఇక్కడ శివారాధన జరుగుతూవుండేదని ప్రతీతి. సప్త మహర్షులలో కౌశిక మహర్షి ఒకరు. ఆయన కుమారుడు ఉపమన్యుడు ఇక్కడ శివారాధన చేస్తూ, శివునికి అభిషేకము చేయటానికి పాలు లభించకపోవటంతో ఆ పరమేశ్వరుడినే ప్రార్ధించాడు. ఫరమేశ్వరుడు భక్తునికోరిక తీర్చటానికి తన త్రిశూలంతో నేలపై గ్రుచ్చగా అక్కడ పాలకొలను ఏర్పడింది. అప్పటినుండీ ఆ వూరి పేరు పాలకొలను అయింది. వాడుకలో పాలకొల్లుగా మారింది.

ఐదు భాగాలయిన అమృత లింగంలో ప్రధాన భాగమైన శిరో భాగమిక్కడ పడ్డదని, శివలింగానికి కొప్పు భాగంలో వున్న ఆకారం దీనికి ఋజువంటారు. అంతేగాక అక్కడ లభించిన శాసనాలలో కూడా ఈ స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా వర్ణించారు.

ఒక కధనం ప్రకారం మిగతా నాలుగు ఆరామాలలో అమృతలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తానికి వివిధ దేవతలచే జరపబడినా, క్షీరారామంలో మటుకూ, శివాదేశంతో ఆ శకలము పెరగకుండా కాపాడబడి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడింది.

దేవస్ధాన ప్రచురణ దివ్య పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామం లో శ్రీ క్షీరారామలింగేశ్వరుడి ప్రతిష్ఠ శ్రీ మహా విష్ణువుచే కావింపబడిందని వ్రాశారు. ఆపుస్తకం ఆధారంగా శ్రీ మహా విష్ణువు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిని త్రిపురసుందరి (పార్వతీదేవి) సమేతంగా ప్రతిష్ఠించి శివుని కోర్కెపై క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీసమేతుడై, శ్రీ జనార్దనస్వామిగా ఈ క్షీరారామంలో కొలువైనాడు. అంతేగాక వివిధ క్షేత్రాలలో అక్కడి దేవతలను సంవత్సరాలతరబడి భక్తితో సేవిస్తే వచ్చే ఫలితం ఈ క్షేత్రంలో ఒక నిద్రతోనే లభిస్తుందని, ఈ స్వామి దర్శనంతో బ్రహ్మ హత్యాది సకల పాపాలూ పోతాయని శ్రీ మహావిష్ణువు క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠించినప్పుడు ఈ క్షేత్ర విశిష్టతను గూర్చి తెలిపారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ప్రయోగించి సర్వ పాప నాశనకరమైన రామగుండం పుష్కరిణిని ఏర్పరిచారు.

ఆలయ విశేషాలు

ఈ ఆలయ విశేషాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది రాజగోపురం, ప్రజల భాషలో పెద్ద గోపురం. దీనిని 1777 సంవత్సరంలో శ్రీ బచ్చు అమ్మయ్యగారు నిర్మింపచేశారని కొందరంటే రెడ్డి రాజుల కాలంనాటిదని ఇంకొందరి కధనం. దీని ఎత్తు షుమారు 120 అడుగులు. 9 అంతస్తుల నిర్మాణం ఇది. చివరి అంతస్తుదాకా వెళ్ళటానికి లోపలనుంచి మెట్లు వున్నాయి. ఆలయ గోపురాలలో మొదటి లేక రెండవ ఎత్తైన గోపురం ఇదని ఒక రికార్డు వున్నట్లు నేను విన్నాను. కానీ ఆలయంవారు ప్రచురించిన పుస్తకంలో ఈ విశేషాన్ని మరిచారు. ఈ గోపురం మీద అనేక సుందర శిల్పాలు చెక్కబడి వున్నవి. ఈ గోపురాన్ని 2000 సంవత్సరంలో స్ధానిక శాసన సభ్యులు శ్రీ అల్లు వెంకట సత్యనారాయణగారి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో పునరుధ్ధరించారు. ఫ్రాచీన కాల శిల్ప సంపదని కాపాడటానికి ప్రభుత్వం చేసిన కృషి కొనియాడదగింది. అలాగే చరిత్ర గురించి కూడా ఇలాంటి ప్రముఖ ఆలయాల కమిటీలు శ్రధ్ధ తీసుకుని తగు పరిశోధనల తర్వాత సరియైన విశేషాలను పుస్తక రూపంలో ప్రచురిస్తే మన పూర్వీకులు మనకందించిన అద్భుతమైన పౌరాణిక చారిత్రాత్మక కళాఖండాల వారసత్వాన్ని తర తరాలకు అందించగలరు.

ఇప్పుడు ఇక్కడ కొలువైన దేవతల గురించి తెలుసుకుందాము. ఫ్రధాన దైవం క్షీరా రామ లింగేశ్వరుడు తెల్లగా పాలలాగా అద్భుతమైన వర్ణంతో దర్శనమిచ్చే రెండున్నర అడుగుల ఎత్తైన లింగం. స్వామిని చూడగానే భక్తి ప్రపత్తులతో చేతులు జోడించకుండా వుండలేము. ఇంకొక విశేషం. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యని కిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్తునుండి శివలింగంపై పడటం.

స్వామి ఎదురుగా ప్రాకారమండపం మధ్యలో చిరు గంటల పట్టీతో, కాలి మువ్వలతో అందంగా వున్ననల్లరాతి నందీశ్వరుడున్నాడు.

అమ్మవారు పార్వతీ దేవి రామలింగేశ్వరునికు ఎదురుగా వున్న మండపంలో కుడివైపు కొలువు తీరింది. పూర్వం శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇదివరకు ఈవిడని త్రిపుర సుందరీదేవిగా కూడా వ్యవహరించేవారు. ఇక్కడ నిత్య కుంకుమార్చనలు జరుగుతాయి.

క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి అని చెప్పాను కదా. ఆయన చుట్టూవున్న వెండి మకర తోరణం మీద వున్న దశావతారాలనుకూడా చూడండి మరి. ఈయన దేవేరి లక్ష్మీదేవి మందిరంకూడా దర్శించండి.

ప్రధానాలయంలో పశ్చిమ ముఖంగా ఋణహర గణపతి వున్నాడు. ఈయన్ని పూజిస్తే ఋణ విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. కానివ్వండి మరి.

రావణ వధానంతరం శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి రామేశ్వరలింగంతోపాటు కాశీ నుంచి తెచ్చిన 106వ శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శిస్తే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినట్లేనని భక్తులు భావిస్తారు. ఇంకా ఈ ప్రాకారంలో వున్న ఆంజనేయస్వామి, వీరభద్రేశ్వరుడు వంటి అనేక దేవీ దేవతా మూర్తులనేకాక ఆలయ స్తంబాలపై చెక్కిన పురాణ ఘట్టాలను, చాళుక్య, రెడ్డి రాజుల, కాకతీయ రాజుల శాసనాలు కూడా వీక్షించండి.







Wednesday, December 31, 2008

సోమారామం

ఎడమ వైపు క్రింద సోమేశ్వరాలయం, పైన అన్నపూర్ణాదేవి ఆలయం, కుడి ప్రక్క జనార్దనస్వామి ఆలయం
గర్భగుడి విమానం, గుడి గోపురం

సోమారామం
(గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా)

సదాశివుని ఆదేశముచే కుమారస్వామిచే గురిచూసి కొట్టబడ్డ తారకేశ్వరుని కంఠంలోని అమృతలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడ్డదని చెప్పకున్నాముగదా.. అందులో ఒక ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గునుపూడి అనే ప్రాంతంలో పడ్డది. శివుని ఆదేశానుసారం, దేవగురువు బృహస్పతి సలహాపై దేవతలలో ఒకరైన చంద్రుడు దేవగణములతో వచ్చి ఆశ్వీయజ శుధ్ధ దశమి రోజున శివ లింగప్రతిష్ఠ జరిపారు. ఈ శకలాలు పడ్డచోట ఓం అనే శబ్దంతో పడ్డాయి. క్షీరారామంలో తప్ప మిగతా ప్రదేశాలలో ఒకే సమయములో వివిధ దేవతలచేత ఈ లింగాలు ప్రతిష్ఠంచబడ్డాయి.

కవి సార్వ భౌముడు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణంలో ఈ సోమారామం గురించి వర్ణించారు. అగస్త్య మహర్షి తన కాశీ వియోగ దుఖాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా కాశీ ఖండం అనే గ్రంధం లో వ్రాయబడివుంది.

మూల విరాట్ సోమేశ్వరలింగం పీఠం నుండి 2 అడుగుల ఎత్తులో వున్నది. ఇంకొక విశేషం. ఇక్కడ శివలింగం అమావాస్యకు గోధుమ, నలుపు రంగుల్లోను, పౌర్ణమికి తెల్లని రంగులోనూ ప్రకాశిస్తుంది. ఈ లింగం చంద్రుడి చేత ప్రతిష్ఠంపబడింది కనుక చంద్రుని వృధ్ధి క్షయలు లింగంలో ప్రతిబింబిస్తాయంటారు. ఈ లింగానికి వున్న నాగాభరణం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఈ ఆలయంలో దేవేరి అన్నపూర్ణ మొదటి అంతస్తులో కొలువై వున్నది. ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశగా వున్న కోనేరుని సోమగుండం లేక చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఆలయంలో జనార్దన స్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు నిత్యపూజలందుకుంటున్నాయి. అందుకే ఇది హరిహర క్షేత్రంగా పేరు పొందింది.

ఈ ఆలయం పాలకొల్లుకు 28 కి.మీ.,కైకలూరుకు 38 కి.మీ. గుడివాడకు 66 కి.మీ. దూరంలో వున్నది. ఈ ప్రదేశాల నుంచేకాక హైదరాబాదునుంచి కూడా బస్సు రైలు సౌకర్యాలున్నాయు.
























































































































Monday, December 15, 2008

అమరావతి

నిర్మాణంలో వున్న బుధ్ధ విగ్రహం
ఆలయ గోపురం
ఆలయ దృశ్యం

అమరావతి

అమరావతి గుంటూరుకి 32 కి.మీ. ల దూరంలో పవిత్ర కృష్ణవేణి నది ప్రక్కన వున్నది. గుంటూరు బస్ స్టాండునుంచి అమరావతి గుడి వరకు బస్సులు చాలానే వున్నాయి. ఇవేకాక ప్రైవేటు జీపులు, టాక్సీలు కూడా దొరుకుతాయి. అమరావతిలో వసతి, భోజన సౌకర్యాలకుఇబ్బంది లేదు. వాసవి ఆర్య వైశ్య నిత్యాన్నదాన సమాజంలో వైశ్యులకు ఉచిత భోజన ఏర్పాటు వున్నది. షిరిడి సాయి – పర్తి సాయి కపోతేశ్వర ధ్యాన మందిరం వారు కులాలకతీతంగా ఎవరు ముందువస్తే వారి పేర్లు నమోదు చేసుకుని, టోకెన్లిచ్చి, రోజూ 12 గం. లకు కొంతమందికి ఉచితంగా భోజనం పెడతారు.

ఇంక అమరావతిచరిత్ర గురించి తెలుసుకుందామా? నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది. అంతేకాదు, బౌధ్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.

అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిధ్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంగా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆవిద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు.

తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5 వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526 లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుధ్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టనయింది. కోటపాడుపడింది. అయినా అమరేశ్వరుడు మాత్రం ఆంధ్రరాజులకు ఆరాధ్యదైవంగానే వున్నాడు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి పరచినవారిలో శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ముఖ్యుడు. ఈయన హయాంలో ఆలయ పునరుధ్ధరణ చెయ్యటమేగాక అక్కడ పని చేసేవారికి, వ్యాపారులకు ఇళ్ళు కూడా కట్టించారు. క్రీ.శ. 1816 లో ఈయన మరణించిన తర్వాత స్వామివారి ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు అర్చకులు హైదరాబాదు నవాబైన నాజరుద్దౌలా గారికి చందూలాల్ అనే దివానుగారి ద్వారా పరిస్ధితి వివరించారు. నవాబు స్వామిని చెప్పమనండి చూద్దాం అన్నారుట. నవాబుకు అమరేశ్వర స్వామి కలలో కనబడి తన భక్తుల కోరిక తీర్చమని చెప్పాడుట. నవాబు సంతోషంతో ఖమ్మంజిల్లా మధిర తాలూకాలోని దెందుకూరు గ్రామంలో షుమారు 450 ఎకరాల భూమే కాక సంవత్సరానికి 1000 హాలీ రూపాయలు నగదు ఇవ్వటానికి ఫర్మానా జారీ చేశారు.

ఇంక ఆలయం గురించి తెలుసుకుందామా? అమృతలింగంలో పెద్దముక్క ఇక్కడ పడింది. అంతేగాక అది పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించాడుట. దానితో పెరగటం ఆగింది. అంతేగానీ శివును శిరస్సు మీద మేకు కొట్టటం నిజం కాదంటారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.

ఆలయంలో మనకు కనిపించే అర్చా మూర్తి 10 అడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి మార్బుల్ రాయిలాగా వుంటుంది. మిగతా భాగము క్రింది భాగములో భూమిలో వున్నది. స్వామికి అభిషేకం చేయటానికి వీలుగా గర్భ గుడిలో ఒక ప్రక్కనుంచి మెట్లు వుంటాయి. వాటి మీద నుంచి వెళ్తే వైన బాల్కనీలాంటి ప్రదేశంలో నుంచుని స్వామికి అభిషేకం చేస్తారు. అందరికీ గర్భ గుడిలోకి ప్రవేశం లేదు.

ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి.

పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్ఛారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుంది.







Sunday, December 14, 2008

పంచారామాల చరిత్ర

పంచారామాలు

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మహా విష్ణువు మూలంగా తమ జాతివారంతా నశించిపోతున్నారని, విష్ణువుని చంపి తమ జాతిని రక్షించాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడిని తనకు చావులేకుండా వరమివ్వమని కోరాడు. శంకరుడు సరేనని దేవ దానవులు అమృత మధనం చేసినప్పుడు లభించిన అమృత లింగాన్ని తారకుడికిచ్చి, ఈ అమృత లింగం యధాతధంగా వున్నంతమటుకు నీ ప్రాణానికి ఏ భయమూ లేదు అని వరమిచ్చాడు. తారకుడు ఆలింగాన్ని గొలుసుతో తన మెడలో ధరించాడు.

శివుడి నుంచి తనకు చావులేకుండా వరమేకాకుండా అమృత లింగాన్ని కూడా పొందిన గర్వంతో తారకుడు తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంద్రలోకంమీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలంతా మహా విష్ణు దగ్గరకి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారుట. విష్ణువు తారకుడు శివ వరము పొందినవాడు, నేనేమీ చేయలేను, ఆ శంకరుణ్ణే ఉపాయమడుగుదామనగా అందరూ మహా శివుడి దగ్గరకెళ్ళి తారకుని దుష్కృత్యాల గురించి విన్నవించుకున్నారు. శివుడు ప్రసన్నుడయ్యాడు. తారకుడికి తానే వరమిచ్చినా, లోకోధ్ధరణకోసం దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ చేయాలిగనుక దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడైన కుమారస్వామి ఈ కార్యానికి తగినవాడని, అతనిని దేవ సైన్యానికి సర్వ సేనానిని చేసి వానిని వెంటపెట్టుకుని తారకుని పై యుధ్ధానికి వెళ్ళండి మీకు జయం కలుగుతుందని.

శివుని ఆదేశాన్ని దేనతలు పాటించారు. కుమారస్వామి శరపరంపరల ధాటికి రాక్షస సైన్యం చెల్లాచెదరయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాన్తో ఉద్రిక్తుడయిన తారకుడు స్వయంగా కుమార స్వామితో యుధ్ధానికి దిగాడు. ఆ యుధ్ధములో తారకునిదే పై చెయ్యి అయింది. దానితో కుమారస్వామి ధాన్య కటకము చేరుకుని అక్కడ కొంతకాలం వున్నాడు. ఈ విషయాన్ని దేవతలు శివునికి తెలియజేశారు. ఇంకొకసారి కుమార స్వామి తారకుని మీదకు దండెత్తి మహా బలోపేతమైన శక్తిని వాని మీద ప్రయోగించాడు. అది కూడా వానినేమీ చేయలేక పోవటంతో బాధతో తిరిగి ధాన్యకటకం చేరాడు. ఈ వార్త తెలిసిన శివుడికి తానిచ్చిన ఆత్మలింగం సంగతి గుర్తువచ్చి ఆ విషయం కుమారస్వామికి తెలిపి ఆత్మలింగాన్ని గురిచూసి ఛేదించమనండి తప్పక విజయం లభిస్తుందని తెలిపాడు.

తర్వాత జరిగిన యుధ్ధంలో కుమారస్వామి తారకుని మెడలోనున్న ఆత్మ లింగాన్ని ఛేదించగా అది ఐదు ముక్కలయి ఐదు ప్రాంతాల్లో పడ్డది. వెంటనే తారకుడు ప్రాణాలొదిలాడు. అందులో పెద్దముక్క అమరారామంలో పడ్డది. ఆత్మ లింగం అమృత లింగం కనుక అవి పెరుగ సాగాయి. పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవ గురువు బృహస్పతి సలహా మీద వాటినన్నిటినీ ఆశ్వయుజ శుధ్ధ దశమి రోజున ఒకే ముహూర్తములో ప్రతిష్ఠ చేసి వాటి పెరుగుదలని అరికట్టారు. అవే పంచారామాలు. ఈ ఆరామాలు ప్రతిష్ట చేసిన వారి పేరుతో ప్రసిధ్ధికెక్కాయి. ఈ ప్రతిష్టలు ఎవరు ఏ ప్రదేశంలో చేశారో తెలుసుకుందామా?

దేవేంద్రుడు అమరారామంలో .... అదే నేటి అమరావతి
సోముడు (చంద్రుడు) సోమారామంలో ..... నేటి గునుపూడి (భీమవరం దగ్గర)
శ్రీరామచంద్రుడు క్షీరారామంలో ... నేటి పాలకొల్లు (ఇది త్రేతాయుగంలో జరిగింది అంటారు)
కుమారస్వామిచే కుమారారామంలో .... నేటి సామర్లకోట
వ్యాస భగవానునిచే ద్రాక్షారామంలో ..... నేటి ద్రాక్షారామం

పంచారామాల చరిత్ర తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఒక్కో క్షేత్రం గురించీ వివరంగా తెలుసుకుందాం.