Friday, October 24, 2008

ఫణిగిరి, నల్గొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా

ఫణిగిరి
19-1-2008

రామాలయం

పిల్లల మఱ్ఱి నుంచి ఫణిగిరి బయల్దేరాము. సూర్యాపేట జనగాం రోడ్ లో 35 కి. మీ. లు వెళ్ళాక స్తూపం దగ్గర కుడి వైపు తిరిగి ఒక కిలోమీటరు వెళ్ళాలి .. తిరుమలగిరికి ఇవతలే..వూళ్ళో కొత్త గుడి వుంది. ఇది చిన్నదయినా పురాతనమైనది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు వున్నాయి. ఇంకా ఒక కిలోమీటరు దూరం సన్నటి దోవలో వెళ్తే కొండ పక్కన పాత రామాలయం వస్తుంది. ఇక్కడ సీతా రామ లక్ష్మణులు స్వయం భూ మూర్తులు. కొండ గోడ మీద కొంచెం ఉబ్బెత్తుగా వున్నాయి ఆకారాలు. కొన్ని వేల ఏళ్ళక్రితందిట ఈఆలయం.

రెండు గుళ్ళకూ పూజారి ఒకరే. యువకుడు. మేము వెళ్ళేసరికి అప్పుడే బయటనించి వచ్చారు. మమ్మల్ని చూసి 5 ని. ల లో స్నానం చేసి వస్తానని అలాగే తొందరగానే వచ్చారు. (వీరి ఇల్లు కొత్త గుడికి ఎదురుగానే నాలుగు ఇళ్ళ ఇవతల వుంటుంది. మీరు వెళ్ళినపప్పుడు గుడి మూసి వుంటే అక్కడ కనుక్కోండి.) చిన్నవాడయినా గుళ్ళో ఆయన పాటించిన నియమాలు సంతోషమనిపించాయి. ఆయన తన బైకు మీద మాతో వచ్చి పాత గుడి కూడా తెరిచి హారతి ఇచ్చారు. ఆయన చెప్పిన స్ధల పురాణం----

భద్రాచలంలో ఉత్సవవిగ్రహాలను ఊరేగిస్తున్నప్పుడు సీతామ్మవారి విగ్రహం జారి నీళ్ళలో పడిందట. ఇంకొక విగ్రహం తయారు చేయిద్దామని ప్రయత్నిస్తే విగ్రహం పొడుగో పొట్టో అయ్యేదిటగానీ సరిగ్గా రాలేదుట. భద్రాచలం వాళ్ళు ఇటు వచ్చినపుడు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని చూసి సరిగ్గా వుందని విగ్రహాన్ని ఇవ్వమని అడిగారుట. వీళ్ళు ఇవ్వక పోవటంవలన దొంగతనంగా తీసుకు వెళ్ళి భద్రాచలంలో పెట్టారుట. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి ఆవిగ్రహాన్ని భద్రాచలంవాళ్ళు తీసుకు వెళ్ళారని తెలిసి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వమన్నారుట.

తర్వాత ఒకరికి కలలో అమ్మవారు కనబడి గుడి పక్కనే గరుక్మంతుడి విగ్రహం వున్నచోట తవ్వితే బంగారం దొరుకుతుంది, దానితో ఇంకో విగ్రహం చేయించండని చెప్పిందట. అమ్మవారు చెప్పిన చోట తవ్వితే బంగారం దొరికిందట. దానితో ఇంకో పంచలోహ విగ్రహం తయారు చేయిస్తే అది కూడా పొడుగయిందట. ఏం చెయ్యాలనుకుంటే అమ్మవారు మళ్ళీ కలలో కనబడి ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని కొన్నాళ్ళు వుంచమని చెప్పందట. అలాగే ధాన్యం కుప్ప లో ఆ విగ్రహాన్ని వుంచితే కొన్నాళ్ళకు ఆ విగ్రహం సరైన ఎత్తుకు రావటం చూసి గుళ్ళో ప్రతిష్టించారుట. పొడుగు దానంతట అదే కరిగి పోయిందట. అందుకే ఆవిడని అక్షయ సీత అంటారుట.

అక్కడ వుంటే ఇలాగే దొంగతనాలు జరుగుతాయని భద్రతా కారణాల దృష్ట్యా వూళ్ళో రామాలయం నిర్మించి ఉత్సవ విగ్రహాలను అక్కడ పెట్టి పూజలు చేస్తున్నారు. మార్చి లో పౌర్ణమినాడు 10—15 రోజులు పెద్ద జాతర జరుగుతుందట. హోలీ నాడు కళ్యాణం జరుగుతుందట.

ప్రస్తుతం పాతగుడి దగ్గర యాగశాల నిర్మాణంలో వున్నది.

స్వామి వెలసిన కొండమీద తవ్వకాలలో బౌద్ధమతానికి చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా వాటినికూడా ఊళ్ళో గుడి దగ్గర ఒక స్కూల్ లో పెట్టి కాపాడుతున్నారు. వాటన్నిటితో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆలోచనట.

ఆకొండమీదే సీతమ్మవారి పాదం అని ఒక పెద్ద బండరాయి కింద చిన్న పాదం గుర్తు వుంది.

0 comments: