Friday, November 7, 2008

మేళ్లచెరువు, నల్గొండ డిస్ట్రిక్ట్

స్వయంభూశంభులింగేశ్వరుడుఇష్టకామేశ్వరీదేవిమేళ్లచెరువు

మట్టపల్లి -- హుజూర్ నగర్ రోడ్ లో హుజూర్ నగర్ లోకి వెళ్ళకుండా కుడివైపు బైపాస్ రోడ్ లో వెళ్తే మేళ్ళచెరువు చేరుకోవచ్చు. మట్టపల్లి ఆలయ ధర్మకర్తలలో ఒకరైన శ్రీ వెంకటేశ్వర్లుగారు, వారి ధర్మ పత్ని మాతో కారులో వచ్చారు. దోవలో మాటల సందర్భంలో, మేళ్ళచెరువు లోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభు లింగేశ్వర ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పి దర్శనం చేసుకుని వెళ్ళమని సలహా ఇచ్చారు. వారికి మా కృతఙతలు. వారి మూలంగానే మేమీ ఆలయ విశేషాలు తెలుసుకోగలిగాము. మరి మీకూ ఆ విశేషాలు తెలుసుకోవాలని వుంది కదూ. మరి చదవండి.

చాలా కాలం క్రితం ఇక్కడ ఆవులు తిరుగుతూ వుండేవిట. హనుమకొండ వెయ్యి స్ధంబాల గుడిలోని శివుడు ఆక్కడ వారు గోమాంసం నైవేద్యం పెట్టటం, గో హింసలు చెయ్యటంతో కోపించి అక్కడనుండి వచ్చి ఆవులమంద మధ్యలో వెలిశాడుట. ఒక ఆవు శివలింగంమీద పాలు కురిపించటంచూసి యవనులు 11 సార్లు ఆ లింగాన్ని కొట్టిపారేశారుట. ప్రతిసారీ మళ్ళీ యధాతధంగా ఆ లింగం వచ్చిందట. తర్వాత కాలంలో వూజలు జరగటం మొదలయినాయి.

అంతే కాదండీ. ఈ స్వామి విశేషాలు ఇంకా చాలా వున్నాయి. చెప్పమంటారా....


లింగం కుడివైపు వెనక ప్రక్క చిన్న గుంట వుంది. దానిలో నీరు ఎప్పడూ వుంటుంది. దీనిలోనికి దారానికి రాయి కట్టి వేసినా అంతు కనుక్కోలేక పోయారు. అక్కడ పూజారిగారు చెప్పిన సమాచారం ప్రకారం ఒకసారి మరమ్మత్తులు చేసేటప్పడు ఎండౌమెంట్స డిపార్టుమెంటువాళ్ళు అక్కడ పైప్ లైన్ ఏదో వుండి వుంటుంది, గుడి కట్టేటప్పడు చూసుకోకుండా కట్టేసి వుంటారు, అందుకే ఆ నీళ్ళలా వస్తున్నాయని ఆ నీళ్ళన్నింటినీ తోడేయించి, గుడికి తాళం వేయించి వాళ్ళ మనుషులను కాపలా పెట్టారుట. అయినా మర్నాటికి యధాతధంగా నీరు వచ్చిందట.

ఈ లింగం పెరుగుతూ వున్నదిట. దానికి ఋజువు లింగం మీద బొట్ల సంఖ్య పెరగటమే. శ్రీ వెంకటేశ్వరరావు గారు ఆ వూర్లో 30 ఏళ్ళ నుంచీ వుంటున్నారుట. ఆయన వచ్చినప్పుడు లింగం మీద మూటు బొట్లు వున్నాయిట. ఇప్పుడు ఐదయినాయి, నేనే చూశాను ఆ తేడా అన్నారు ఆయన. లింగం మీద గుండ్రటి ఆకారంలో పలుచని గుంటల్లాగా వున్నాయి. ఇవే బొట్లు. ఫోటోలో మీరు కూడా చూడవచ్చు.

ఇక్కడ శివలింగం తెల్లరాతి లింగం. ఈ లింగానికి వెనకాల జడ వున్నది. ఈయన అర్ధనారీశ్వర రూపం అందుకే అలా వున్నదంటారు. అందరికీ అద్దంలో చూపిస్తారు గుంటలో వున్న గంగనీ, జడనీ. బ్రాహ్మలు పట్టుబట్టలతో వెళ్తే మగవారిని గర్భగుడిలోకి అనుమతిస్తారు.

తర్వాత కాలంలో అమ్మవారు ఇష్టకామేశ్వరిని ప్రతిష్టించారు. స్వామి, అమ్మ ఇద్దరూ చాలా అందంగా వున్నారు. సోమవారం కావటంతో జనాలు బాగానే వున్నారు. అభిషేకం చేయించి, వాళ్ళ అనుమతితో ఫోటోలు తీసుకుని, ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము.