Wednesday, April 29, 2009

మురమళ్ళ

శ్రీ వీరేశ్వరస్వామి దేవస్ధానం

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవస్ధానం, మురమళ్ళ

యానాంనుంచీ మా తదుపరి మజిలీ మురమళ్ళ బయల్దేరాము. దోవలో రొయ్యల చెరువులలో ఫౌంటెన్ల తో నీరు వెదజల్లబడుతోంది. రొయ్యల చెరువులో ఫౌంటెన్లేమిటని అడిగితే, మా టాక్సీ డ్రైవర్ చెప్పాడు. రొయ్యలు కదిలే నీళ్ళల్లో పడుకోవట. పైగా తిని తిరుగుతుంటే రొయ్యలు తొందరగా పెరుగుతాయట. అందుకని పౌంటెన్ల ద్వారా నీటిని కదిలిస్తూ వాటిని నిద్రపోనీయకుండా చేస్తారు. పాపం.

శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్ధానం, మురమళ్ళ

దక్ష యజ్ఞం ధ్వంసం చేయటానికి శివుని జటాజూటంనుంచి ఉద్భవించిన మూర్తి వీరభద్రుడు. దక్షుని సంహరించిన తర్వాత యజ్ఞ పరిసమాప్తికై దక్షుని తిరిగి బ్రతికించుటకు పలు దేవతలు వేడగా అంగీకరించాడు. గొఱ్ఱె తలను దక్షుని శరీరమునకు అంటించి దక్షుని బ్రతికించి యజ్ఞాన్ని పూర్తి చేయించారు. తర్వాత కూడా వీరభద్రుడు శాంతించలేదు. కారణం సతీదేవి ఆత్మాహుతి. వీరభద్రుని శాంతింపచెయ్యటం ఎవ్వరితరమూకాక జగదంబను ప్రార్ధించారు. ఆవిడ తన షోడశ కళలలో ఒక కళ
అయిన భద్రకాళిని పంపింది. ఆమె ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడు భద్రకాళి పక్కనేవున్న ఒక తటాకమునందు మునిగి అత్యంత సుందరమైన ఒక కన్య రూపమున సాక్షాత్కరించినది. ఆమెను చూసి వీరభద్రుడు శాంతించి ఆమెను వివాహమాడాడు. ఆ నాటినుంచీ మహామునులందరూ శ్రీ స్వామివారికి గాంధర్వ వివాహ పధ్ధితిన నిత్యకళ్యాణను చేయసాగారు. ఆ పధ్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఆ కాలంలో మహామునులందరూ గౌతమీనదీ తీరంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని వున్న ప్రదేశాన్ని మునిమండలి అనేవారు. అదే ప్రస్తుతం మురమళ్ళ.

తమ సంతానం వివాహం ఆలస్యం అయిందనుకున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే తమ సంతానం వివాహం త్వరగా అవుతుందని నమ్ముతారు. అలా కళ్యాణం చేయించే భక్తులకు ఇక్కడ సత్రంలో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.


8 comments:

బొల్లోజు బాబా said...

బాగుంది
రొయ్యలగురించి చిన్న సవరణ
రొయ్యలచెరువులలో నీళ్లని పైకి చిమ్మించే పరికరాలను ఏరేటర్లు అంటారు.
ఇవి ఎందుకంటే తెల్లవారుఝామున మరియు సాయింత్రపు వేళల్లో, చెరువు నీళ్లలో ఆక్సిజను శాతం కనిష్ట స్థాయిలకు పడిపోతుంది. (ఇతరజీవులు వినియోగించేసుకొంటాయి). అలాంటి పరిస్థితులలో రొయ్యలు మూకుమ్మడిగా చచ్చిపోతాయి. దానిని నివారించటం కోసం ఇలా చెరువునీటిని గాలిలోకి స్ప్రే చేస్తారు. తద్వారా గాలిలోని ఆక్సిజను నీటిలో కలవటం ద్వారా ఆక్సిజను శాతం పెరుగుతుంది.
అంతే తప్ప మరోటి కాదు.

సుధాకర బాబు said...

లక్ష్మి గారూ! నమస్కారం. చక్కని యాత్రా విశేషాలు అందిస్తున్నందుకు అభినందనలు. మీకు తెలుగు వికీపిడియా గురించి తెలిసే ఉండవచ్చును. ఒకమారు క్రింది లింకు చూడగలరు.

http://te.wikipedia.org/wiki/

తెలుగునాట అన్ని గ్రామాల గురించీ వ్రాయాలన్నది తెలుగు వికీ లక్ష్యాలలో ఒకటి. మీరు వ్రాస్తున్న యాత్రా విశేషాలు, ఫొటోలు ఆయా వూళ్ళ పేజీలలోకి సరిగ్గా సరిపోతాయి. మరిందరు వాటిని చూసే అవకాశం లబిస్తుంది.

(1) మీరు స్వయంగా తెలుగు వికీలో సభ్యులుగా చేరి ఈ సమాచారాన్ని, ఫొటోలను ఆయా పేజీలలో కూర్చితే చాలా బాగుంటుంది.

(2) లేదా మీరు అనుమతిస్తే గనుక నేను ఈ సమాచారాన్ని మీ బ్లాగునుండి కాపీ చేసి తెలుగు వికీలో పెట్టగలను. కనుక మీ అనుమతిని కోరుతున్నాను.

ఇక్కడ మీరు తప్పక గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మీ వ్రాతలు, ఫొటోలు కూడా తెలుగు వికీలో "ఉచిత లైసెన్సు"తో చేర్చవలసి ఉంటుంది. అంటే వాటిని ఇతరులు (వ్యాపారావసరాలకైనా సరే) వాడుకోవడానికి మీకు అభ్యంతరం ఉండకూడదు. ఈ నియమంతో గనుక మీరు సమ్మతించ గలిగితే పై రెండు విధానాలలో ఏదో ఒకటి ప్రయత్నించవచ్చును. దయచేసి తెలియజేయగలరు.

- సుధాకరబాబు

psmlakshmiblogspotcom said...

బొల్లోజు బాబాగారూ
నాకే కాదు, నాలాంటి ఎందరికో మీ వివరణ చదివాక అసలు సంగతి తెలుస్తుంది. లేకపోతే టాక్సీ డ్రైవరు మాటే నిజమనుకునేదాన్ని. పాపం అతను మాత్రం ఏంచేస్తాడులెండి. నాకుమల్లే అతనికి తెలిసింది అతను చెప్పాడు.
నేను తప్పుగా వ్రాసినదానిని సరి చేసినందుకు ధన్యవాదాలు.
psmlakshmi

psmlakshmiblogspotcom said...

సుధాకర్ బాబుగారూ,
మీరు చూపించిన శ్రధ్ధకి చాలా సంతోషం. నేను వికీపీడియాలో చేర్యటానికి ఇదివరకు ప్రయత్నించాను. సాధ్యపడలేదు. తిరిగి మా అమ్మాయి రిజిస్టరు చేశానంది కానీ సమయాభావంవల్ల పట్టించుకోలేదు. అదేకాదు. ఇ బుక్స్ కూడా చెయ్యాలనివుంది. నా తర్వాతకూడా అవి అందరికూ ఉపయోగపడాలని చిన్న దురాశ. ఇవ్వన్నీ బహుశా జూన్ చివరికి ఒక దశకి రావచ్చు. నా వల్ల కాకపోతే తప్పక మీ సహాయం కోరతాను. ఎందుకంటే ఇది ఒక రోజుతో అయిపోయేదికాదు. నేను బ్లాగులో పెట్టవలసినవే ఇంకా చాలా వున్నాయి.

అందరి గురించీ ఆలోచించిన మీ సహృద్భావానికి కృతజ్ఞతలు.
psmlakshmi

పరిమళం said...

అది దురాశ ఎందుకౌతుందండీ ...బహుళ జన ప్రయోజనం ..
మీ ఆశయం తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాను .

సుధాకర బాబు said...

కృతజ్ఞతలు.

తెలుగు వికీపిడియాలో చేరడానికి, లేదా వ్రాయడానికి ఏమైనా సమస్యలు వస్తే గనుక తప్పక నన్ను సంప్రదించగలరు

psmlakshmiblogspotcom said...

తప్పకుండా సుధాకర్ బాబుగారూ
psmlakshmi

రసజ్ఞ said...

శైవ క్షేత్రాలలో నిత్య కల్యాణం పచ్చ తోరణం కనిపించేది కేవలం ఇక్కడేనేమో! చాలా బాగుంటుంది!