Tuesday, February 9, 2010

ఆనంతగిరి
ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదుకి 90 కి.మీ. ల దూరంలో, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదుకి కేవలుం 5 కి.మీ దూరంలో వున్నది ఈ అనంతగిరి. ఇది అటవీ ప్రాంతం. మీరెళ్ళి జంతువులకోసం వెతక్కండి. కనిపించవు. ఇక్కడ ఈ కొండమీద శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిశాడు.

చాలా వేల ఏళ్ళ క్రితం శివ సాక్షాత్కారం తర్వాత మార్కండేయ మహర్షి ఇక్కడ ఒక చిన్న గుహలో తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, మార్కండేయుని కోరికమీద అక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. ఈ గుహలో ఒక చిన్న ద్వారం కనబడుతుంది. అది కాశీకి సొరంగ మార్గమని, మార్కండేయ మహర్షి ఆ సొరంగంద్వారా రోజూ కాశీకి వెళ్ళ గంగా స్నానం చేసి వచ్చేవాడని చెప్తారు.

ఇక్కడే హైదరాబాదులో ప్రసిధ్ధికెక్కిన ముచికుందానది పుట్టింది. అర్ధంకాలేదా మూసీ నదండీ. ఇప్పుడర్ధమయిందికదా. ఆ కధేమిటంటారా మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలోనే ముచికుందుడు అనే ఒక రాజర్షి వుండేవాడు. ఆయన ఒకసారి రాక్షసులతో చాలాకాలం యుధ్ధం చేసి వారందరినీ సంహరించాడు. ఆ యుధ్ధంలో చాలా అలసిపోయి విశ్రాంతి తీసుకోదలచి, భూలోకంలో తనకి నిద్రాభంగంకాని ప్రదేశాన్ని చెప్పమంటాడు. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రదేశంగురించి చెప్తాడు. ముచికుందుడు ఇకొంచెం జాగ్రత్తపడి, తన నిద్ర ఎవరైనా భంగం చేస్తే, ఆ సమయంలో అతని చూపు ఎవరిమీద పడుతుందో వాళ్ళు భస్మమయిపోవాలని ఇంద్రుడినుంచి వరం పొందుతాడు. ఇంత జాగ్రత్తపడి ముచికుందుడు వచ్చి ఇక్కడ నిద్రపోయాడు.

అది ద్వాపరయుగం. శ్రీకృష్ణుడు కంస సంహారం తర్వాత తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారక మీదకు దండెత్తివచ్చి, యాదవసేనను నాశనం చేసి మధురా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
శ్రీ కృష్ణ బలరాములు అతనిని సంహరించటానికి ముచికుందుడు సరైన వాడనుకుని, వారు కాలయవనునికి భయపడినట్లు నటించి, ముచికుందుడు నిద్రిస్తున్న ఈ ప్రాంతానికి వచ్చారు. వారి వెనకే కాలయవనుడూ వచ్చాడు. శ్రీ కృష్ణుడు తన వస్త్రాలని ముచికుందుని మీద కప్పి తాను పక్కకి తప్పుకున్నాడు. కాలయవనుడు నిదురిస్తున్న ముచికుందుడే శ్రీ కృష్ణుడనుకుని అతనికి నిద్రాభంగం కావిస్తాడు. వెంటనే అతని తీక్షణమైన చూపులకు భస్మమయిపోతాడు.

ముచికుందుడికి శ్రీకృష్ణ బలరాములు ప్రత్యక్షమవుతారు. ముచికుందుడు సంతోషంతో వారి పాదాలు కడుగుతాడు. ఆ నీరే పారి ముచికుందా నదిగా (మన ఇప్పటి మూసీ) పేరుగాంచిందంటారు.

చూశారా మన సమీపంలో వున్న అనంతగిరికి ఎంత పురాణ ప్రఖ్యాతి వుందో. మరింకేం ఒక సెలవురోజు ఈ జనారణ్యానికి దూరంగా ఆ చిట్టడవిలో హాయిగా విహరించి, అక్కడి వృక్షాల వూడలమీద హాయిగా విశ్రమించి, ఊయలలూగి సరికొత్త బలాన్ని పుంజుకునిరండి. అలాగే మార్కండేయుడు తపస్సు చేసిన చిన్ని గుహలోని శ్రీ అనంత పద్మనాభుని సేవించి మానసిక సంతృప్తినికూడా పొందండి.

ఆహారాన్ని తీసుకు వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు.1 comments:

శ్రీలలిత said...

ఈ మూసీనది అసలు పేరు ముచికుందా నదా.. నేనింకా ఏ ఉర్దూ పేరో అనుకుంటున్నాను.. బలే ఉంది కథ.మూసీ నదిమీద అమాంతం భక్తి పుట్టుకొచ్చెస్తోంది. మంచి విషయాలు చెప్పారు...