Friday, September 10, 2010

యాత్ర చేసొచ్చేశా


వాఘా బార్డర్
 యాత్ర చేసొచ్చామని తెగ సంబర పడుతున్నారు....ఇదేమన్నా కొత్త విషయమా, ఓ పది రోజులు ఇంట్లో కుదురుగా కూర్చుంటే చెప్పండి అదొక విశేషమవుతుంది మీ విషయంలో అంటారా?    అనండి అనండి...మీరు కాకపోతే ఎవరంటారు?  అయినా ఈ మధ్య మనుషుల మాటలు పట్టించుకోవటం మానేశానులెండి.  ఇంతకీ ఈ ఉత్సాహానికి కారణం చెప్పమంటారా?  

కాళ్ళు నేలమీద ఆన్చలేక పోయినా  వైష్ణోదేవి దాకా ప్రయాణం పెట్టుకున్నామా,  వెళ్ళేవరకూ వెళ్ళగలనో లేదో అనే భయం.  పోనీ వాయిదా వేసుకోండని హితుల సలహా.  సాయిబాబా లాగానే వైష్ణోదేవి కూడా ఆవిడ పిలిపించుకుంటేనే వెళ్ళగలమట.  ఆవిడ నన్ను చాలా ఘట్టిగా రమ్మని ఆర్డరు వేసింది.  అందుకే బయల్దేరాను.  మా వారు ముందే ఆపీసు పనిమీద ఢిల్లీ వెళ్ళారు...వెనకే నేను.  ఢిల్లీలో కూడా మూసిన కన్ను తెరవనంత జ్వరం.  అయితే ఒకసారి యాత్ర ప్రారంభం అయ్యాక  కాళ్ళు మాత్రం ఏ ఇబ్బందీ పెట్టలేదు.  జ్వరం ఇద్దరినీ చెరో రెండు రోజులూ ఇబ్బంది పెట్టినా యాత్రలో ఏ ఒక్కటీ వదిలి పెట్టకుండా అన్నీ చూశాము.  ఆ విశేషాలు కుంటుపడ్డ కాశీ కబుర్లు పూర్తి చేశాక చెబ్తాను.

ఈ లోపల ఒక విశేషం మీతో పంచుకోవటానికి అప్పటిదాకా ఆగలేక ఇప్పుడే  చెప్పేస్తున్నా.  యాత్రలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ బార్డరు (వాఘా బార్డరు అంటారు) వెళ్ళాము.  మన వైపు ప్రతి రోజూ కనీసం 30,000 మంది జనం వస్తారుట.  పాపం పాకిస్తాన్ వైపు మేము వెళ్ళిన రోజు ఒక రెండు వందల మందికూడా లేరు..బహూశా రంజాన్ ప్రభావమేమో.  ఇంతమంది జనం భారత దేశం గురించి జయజయధ్వానాలు చేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.  ఉత్సాహం ఉరకలు వేసింది.

అక్కడ  ప్రతి రోజూ సాయం సమయంలో ఏ దేశం జెండాని ఆ దేశంవారు అవనతం చేసి భద్రపరుస్తారు.  ఆ కార్యక్రమం మొదలయ్యేలోపల పిల్లలు పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని పాకిస్తాన్ బార్డరు దాకా పరిగెత్తి తిరిగి వచ్చారు.  వాళ్ళని చూస్తుంటే మేమింక ఆగలేకపోయాము. అంతమంది జనంలో పైనెక్కడో వున్నవాళ్ళం నేనూ, మరో ఇద్దరు, శ్రీమతి హైమవతీ,  శ్రీమతి వాణి, (వీళ్ళిద్దరూ కూడా హైదరాబాదునుంచి మాతో టూర్ కి వచ్చినవారే ... దోవలో బాగా స్నేహంకలిసింది...ట్రిప్ అంతా సరదాగా గడిచింది) అందరి మధ్యనుంచీ దోవ చేసుకుని కిందకి దిగి వచ్చి మేమూ జెండా తీసుకెళ్తామని అడిగాం.  వెంటనే ఒక జెండా మాచేతిలో.....మేము వాఘా బార్డరుదాకా పరుగెత్తలేదుకానీ, ఆ జెండా పట్టుకుని నడిచాం.  ఆ జెండాలో ఏముందో, మా అందరి ముఖాలలో గర్వం తొణికిసలాడింది.  ఏదో సాధించినట్లే, చెప్పలేనంత సంతోషం వేసింది.  ఐదు నిముషాలు జెండా పట్టుకున్నందుకే మాకంత సంతోషం, గర్వం వేస్తే, దేశం కోసం అనేక ఇబ్బందుల్లో ప్రాణం ఒడ్డి పోరాడుతున్న రక్షణ దళాలు ఇంకెంత గర్వపడాలి.  నిజంగా వాళ్ళ జన్మలు ధన్యంకదా.   మెరుపులా కదిలే వారి శరీరాలను చూస్తుంటే అనిపించింది  ఆ వేగాలు సాధించటానికి ఎంత కష్టపడతారోనని.

మరి ఒక్కసారి మీరంతాకూడా మన వీర జవాన్లకి, మన భారత దేశానికీ జేజేలు చెప్పండి.
విన్యాసాలు చూడవచ్చిన భారతీయులు
జెండాలతో పిల్లలు
గోడ అవతల పాకీస్తానీయులు
 బార్డరులో సైనికుల విన్యాసాలు

6 comments:

Rani said...

very interesting.
I wish I can go there some time.

శ్రీలలిత said...

జై బోలో భారత్ కీ...
మీకు హృదయపూర్వక అభినందనలు..

చందు said...

bagundi lakshimi garu !!!
వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

పరిమళం said...

మన వీర జవాన్లకి, మన భారత దేశానికీ జేజేలు అక్కడ వారి త్యాగ ఫలమే ఇక్కడ మన నిర్భయ జీవితం!మీ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు థాంక్స్ !

మాలా కుమార్ said...

మీరు చాలా అదృష్టవంతులు . మీ అదృష్టాన్ని మాకూ పంచినందుకు థాంక్ యు .

రాజ్యలక్ష్మి.N said...

ఇప్పుడే ఈ టీవి 2 సఖి లో మీ ప్రోగ్రాం చూశానండీ.
ఇప్పటిదాకా మీ యాత్రా విశేషాలు మీ బ్లాగ్ లో తెలుసుకున్నాము.
ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూడటం చాలా సంతోషంగా అనిపించింది.
మీ యాత్రల పుణ్యాన్ని అందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు.
Congrats psmlakshmi గారూ..
Happy senior citizens Day.