Thursday, December 23, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 26గంగా తీరంలో స్నాన ఘట్టాలు

పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి.  కొత్తవి ఇంకా కొన్ని చేరాయి.  యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ  స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు.  డబ్బు, ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది.  మేము ముగ్గురం  ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము.  దానికి 250 రూ. తీసుకున్నాడు.

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.

ఎక్కువమంది  యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు.  వీటిని గురించి కొంచెం వివరంగా........

మణికర్ణికా ఘాట్
పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట.  అంతే..ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది.  సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది.  తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు.  ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది.  అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు.   ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట.  అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు.

ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి.  కొందరు పితృకార్యాలు చేస్తున్నారు.
 మణికర్ణికా ఘాట్
 చక్ర తీర్ధం

దశాశ్వమేధ ఘాట్
ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు.  ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.  రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.
 ప్రయాగ మరియు దశాశ్వమేధ ఘాట్స్

హరిశ్చంద్ర ఘాట్
హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే.  ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.  దీని ప్రక్కనే కేదార్ ఘాట్.


కేదార్ ఘాట్
ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది,  ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారుట.
 మెట్లకి ఎదురుగా ఒడ్డున కేదారేశ్వర మందిరం (ఎఱ్ఱ బిల్డింగ్ పక్కన)

ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ,  ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ.  బయల్దేరగానే అలా మధ్యలో ఆపి అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు.  దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పినవాడు తర్వాత ఏమీ చెప్పలేదు.  ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం.  పుణ్యక్షేత్రానికి వెళ్ళారుకనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు.  వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు.  అనుభవంతో మాకు తెలిసిందిది.

గంగానదిమీదు పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు.  వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బాగుంటుంది.  సమయముంటే సాయంకాలాలు ఘాట్ లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.
 మేమూ బోటింగ్ చేస్తున్నామోచ్

కాశీలో చూడవలసిన దేవతల గురించి వచ్చే పోస్టులో.


1 comments:

Buchchi Raju said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.