Friday, January 20, 2012

వేడిన వరాలిచ్చే వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి



వేడిన వరాలిచ్చే వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరస్వామి.


నల్గొండ జిల్లా, మిర్యాలగూడ తాలూక, దామరచర్ల మండలంలో వున్నదీ వాడపల్లి క్షేత్రం . ఇక్కడ కృష్ణా ముచికుందా (మూసీ) నదీ సంగమతీరాన హరిహరులకు బేధంలేదని నిరూపిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ అగస్త్యేశ్వరుడు కొలువుతీరి వున్నారు . నల్గొండ అద్దంకి హై వే లో భీమవరం గుండా వాడపల్లికి చేరుకోవచ్చు.. ఈ రోడ్డులో వున్న ఇండియా సిమెంట్స్ కి ఎదురుగా వచ్చే రోడ్ లోకి తిరిగి అర కిలో మీటర్ వెళ్ళాక ఎడమ పక్క వచ్చే మట్టి రోడ్డు లో వెళ్తే ఈ ఆలయం వస్తుంది.

పూర్వము తీరప్రాంతములో పడవలు నడుపు పల్లెకారులు కట్టుకున్న పల్లె వాడపల్లె కాలక్రమానా వాడపల్లిగా మారింది.

6000 సంవత్సరాలక్రితం అగస్త్య మహాముని తీర్ధయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ కృష్ణా, ముచికుందా నదీ సంగమంలో స్నానంచేసి, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు. అగస్త్య మహామునిచే ప్రతిష్టింపబడిన లింగంగనుక అగస్త్యేశ్వరుడయ్యాడు. శివ కేశవులకు బేధములేదని అగస్త్య మహాముని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ప్రతిష్టించారు. తర్వాత కొంతకాలానికి రక్షణలేని కారణంగా విగ్రహాలచుట్టూ పుట్టలు లేచాయి.

రెడ్డిరాజులకాలంలో ఈ ప్రదేశంలో రెండు వైపుల నీరు, ఒక వైపే త్రోవ వున్నదని గుర్తించి, ఈ ప్రదేశంలో కోట, ఇళ్ళు కట్టుకుంటే సురక్షితంగా వుంటాయనే వుద్దేశ్యంతో బాగు చేస్తున్న సమయంలో లింగాన్ని చూసి, గుడి కట్టించి పూజించసాగారు. రెడ్డి రాజులిక్కడ కోటలు, ఊళ్ళూ నిర్మించుకుని చాలాకాలం పరిపాలించారు. ఆ కాలంలో ప్రసిధ్ధ పట్టణంగా పేరుపొందిన ఈ పట్టణాన్ని అగస్త్యపురము, నర్సింహాపురం, వీరభద్రపురం అను పేర్లతో పిలిచేవారు. 11వందల సంవత్సరాలు సురక్షితంగా వున్న ఈ పట్టణం నిజాం మేనల్లుడయిన వజీరు సుల్తాను ముట్టడిలో సర్వనాశనమైంది. వజీరు సుల్తాను గుళ్ళని మాత్రం ఏమీ చేయలేదు.

లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, వాడపల్లి

దక్షిణ ముఖంగా వున్న ఈ ఆలయం చిన్నదయినా స్వామి భక్తుల అభీష్టాలను నెరవేర్చే స్వామిగా ప్రఖ్యాతి చెందారు. స్వామి తొడ మీద అమ్మవారు కూర్చుని వున్నట్లు వుంటుంది. గర్భ గుడి లో స్వామి ముఖం ఎదురుగా అదే ఎత్తులో ఒక దీపం, కింద ఇంకో దీపం వుంటాయి. కిందవున్న దీపం కదలదు. నిశ్చలంగా వుంటుంది. పైన స్వామి ముఖానికి ఎదురుగా వున్న దీపం చిరుగాలికి రెప రెపలాడుతున్నట్లుంటుంది. ఆ కదలికకి కారణం స్వామి వుఛ్ఛ్వాశ నిశ్వాసలని చెపుతారు.

ఈ ఆలయంలో ఒక దండం లాంటి దానితో పూజారి భక్తుల వీపు మీద కొడతారు. దుష్టగ్రహ నివారణకోసం అలా చేస్తారుట.

ఈ ఆలయం ఎదురుగా వున్న దోవ లో కొంత దూరం వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరాలయం వస్తుంది.

మీనాక్షి అగస్త్యేశ్వరాలయం, వాడపల్లి:

ఈ ఆలయం తూర్పు దిక్కుగా, సంగమాభిముఖంగా వుంటుంది. గుళ్ళో శివుడి పానుపట్టం ఎత్తుగా వుంటుంది. దానిమీద లింగం ఇంకో రెండు అడుగుల ఎత్తు వున్నది. వెండి కళ్లు, వెండి నాగు పాము పడగ, అలంకరణ బాగుంది. ఈ లింగము మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు వూరుతూవుంటుంది. నీటిమట్టానికి అంత ఎత్తునవున్న లింగం పైనుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తోందో, ఎంత లోతులోవున్నదో ఎవరికీ తెలియదు. దానికి సంబంధించిన ఒక కధమాత్రం ప్రచారంలో వున్నది.

క్షేత్ర పురాణం

ఒక రోజు ఒక బోయవాడు పక్షి ని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కుందట. బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడుట. బోయవాడు మరి నాకు ఆకలిగా వున్నది ఎలాగ అంటే శివుడు కావాలంటే నా తలనుంచి కొంత మాంసం తీసుకోమన్నాడుట. అప్పుడు బోయవాడు రెండు చేతులతో స్వామి తల మీదనుంచి మాంసం తీసుకున్నాడుట. ఆ వేళ్ళ గుర్తులు శివ లింగం పైన ఇప్పటికీ కనబడుతాయి. స్వామి శిరస్సున ఏర్పడ్డ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందిట. బోయ కండలు తీసిన చోట ఏర్పడిన గుంటలో ఎప్పుడూ నీళ్లు వుంటాయి. ఆ నీరు ఎక్కడనించి వస్తోందో తెలియదుగాని ఎంత తీసినా ఆ నీరు అలాగే వుంటుందట.

క్రీ.శ. 1524 సం. లో శ్రీ శంకరాచార్యులవారు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని దర్శించారుట. ఆ బిలం లోతు ఎంత వుందో కనుక్కుందామని ఒక ఉధ్ధరిణకి తాడు కట్టి ఆ బిలం లో వదిలారుట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలకి వెళ్ళటము చూసి పైకి తీసారుట. ఆ ముక్కకి రక్త మాంసాలు అంటుకున్నయిట గాని శివయ్య తల మీద గుంట లోతు తెలియలేదుట. శంకరాచార్యులవారు నిన్ను పరీక్షించటానికి నేనెంతవాడను, క్షమించమని వేడుకుని, పూజలు జరిపి వెళ్ళారుట. ఈ విషయంలో శ్రీ శంకరాచార్యులవారు రాయించిన శాసనం (పాళీ భాషలో) దేవాలయంలో ఇప్పటికీ వున్నది.

నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం చెయ్యటం, కర్మకాండలు కూడా చేస్తుంటారు.

రెండు నదుల సంగమంలో వున్న మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనానికి హైదరాబాదునుంచీ బస్సులున్నాయి. పిడుగురాళ్ళ వెళ్ళే బస్సులు వాడపల్లి మీదనుంచే వెళ్తాయి. రైలు మార్గం మిర్యాలగూడా వరకే. అక్కడనుంచీ బస్ లో వెళ్ళాలి.

ఇక్కడ వసతికీ, భోజనానికి సౌకర్యాలు లేవు. ఒక పెద్ద హాల్ వుంది కాని దానిలో వేరే ఏర్పాట్లేమీ లేవు. వుండటం కొంచెం కష్టమే.

7 comments:

Ramu S said...

అమ్మా,
మీరు చాలా బాగా రాశారు. నేను నల్గొండ లో ది హిందూ పత్రికకు రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఈ ఆలయం గురించి పెద్ద వ్యాసం రాశాను. అది చూసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారా‍యణ రావు అక్కడికి వచ్చారు. ఆ ఆలయం దగ్గర చెట్ల కింద మంచి ప్రశాంత వాతావరణం ఉంటుంది.
రాము
apmediakaburlu.blogspot.com

సిరి said...

చాలా బాగా ఆలయ విశిష్టతని వర్ణించారు!!

psm.lakshmi said...

రాము గారూ
మీలాంటివారు నేను రాసినదానిని బాగుందనటం నా అదృష్టం. ధన్యవాదములు.
psmlakshmi

psm.lakshmi said...

సిరి శ్రీనివాస్ గారూ
ధన్యవాదాలండీ.
psmlakshmi

శ్రీలలిత said...

పుణ్యస్థలం గురించి బాగా వివరించారు.
వెళ్ళి చూడాలనుకునేవారికి చాలా ఉపయోగకరంగా వుంది.

Sridevi Aduri said...

చాలా బాగా రాశారు.

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
వాడపల్లి గురించి బాగా వివరించారండి . మేము వెళ్ళినప్పుడు ఎవరూ ఇంత విపులంగా చెప్పలేదు .