Friday, March 2, 2012

శ్రీరంగనాధస్వామి మందిరం, నానక్ రామ్ గూడా, హైదరాబాదు.


శ్రీ మహలక్ష్మీ అమ్మవారు

దేవేరులతో శ్రీ రంగనాధస్వామి

స్వామి రధం
లోపలి ప్రాకార ప్రవేశ ద్వారం -- లోపల ఎదురుగా శ్రీమహలక్ష్మి ఉపాలయం

శ్రీ ఆంజనేయస్వామి వాహనంమీద దేవేరులతో స్వామి

ఆలయం లోపల -- కుడివైపు గర్భగుడి -- ఎదురుగా ఆళ్వారుల ఉపాలయం

లోపలి ప్రాకారం -- ఇది దాటితే స్వామి నిలయం

రెండవ ప్రాకారం ముఖ ద్వారంపైన దశావతారాలు, శ్రీరంగనాధస్వామి
దూరంనుంచి ఆలయ గోపురం
ఆలయ ప్రధాన గోపురం


శ్రీరంగనాధస్వామి మందిరం, నానక్ రామ్ గూడా, హైదరాబాదు.

సింగపూర్ నుంచి సుమ ఈ ఆలయాన్ని చూసి, విశేషాలు వివరించమన్నారు. సుమ తన కళాశాల రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించారుట. అప్పటి బ్రహ్మోత్సవాలగురించి గుర్తు చేసుకున్నారు. సుమా, మీ ద్వారా మేము ఈ ఆలయంగురించి తెలుసుకుని దర్శించగలిగాము. ఇంకో విశేషమేమిటంటే మీరు చెప్పి చాలా కాలమైనా, మా అమ్మాయి పెళ్ళి హడావిడిలో మేము వెంటనే వెళ్ళలేకపోయాము. తీరిక చేసుకుని మేము వెళ్ళింది మీరు చెప్పిన బ్రహ్మోత్సవాల సమయంలో. అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని మాకు తెలియదు. ఇంత మంచి ఆలయంగురించి తెలియజేసిన మీకు మా కృతజ్ఞతలు. మీకోసం ఫోటోలు చాలా, ఇంకా మీలాగా ఆసక్తికలవారికోసం ఆ ఆలయ విశేషాలివిగో….చక్రాలు తిప్పుకుంటూ గత స్మృతుల్లోకి వెళ్ళిపొండి మరి...

హైదరాబాదులోని అమీర్ పేటకు 17 కి.మీ. ల దూరంలో రంగబాగ్ లో నెలకొన్న ఈ మందిరం 365 సంపత్సరాల క్రితం నిర్మింపబడిందని పూజారులు చెప్పారు. 1861 సం. లో చుట్టుపక్కల స్ధలాలు, భవనాలతోసహా ఈ ఆలయాన్ని సేఠ్ శివలాల్ పిత్తి అనే వ్యక్తి రూ. 70,000 కి కొనుగోలు చేశారు. 1935 లో శ్రీ శివలాల్ పిత్తి మనుమడు రాజా బహద్దూర్ సర్ బన్సిలాల్ పిత్తి రూ. 75,000 ల తో ఒక నిధిని నెలకొల్పి దానిమీద వచ్చే ఆదాయాన్ని ఆలయంకోసం వెచ్చించేలా ఏర్పాటు చేశారు.

1954 వరకూ ఈ ఆలయం స్ధలాలన్నీ పిత్తి వంశస్తుల వ్యక్తిగత ఆస్తులే. 1954 లో పిత్తి కుటుంబానికి చెందిన రాజా పన్నాలాల్ పిత్తి ఒక ట్రస్టు ఏర్పాటుచేసి, రంగనాధ ఆలయం, భూములు, నగలు, స్వామి వెండి వాహనాలు, సామగ్రి అన్నీ ట్రస్టు అధీనంలో వుంచారు. పిత్తి వంశస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ట్రస్టు ప్రస్తుత అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ బద్రీ విశాల్ పిత్తి కుమారుడు శ్రీ శరద్.బి.పిత్తి.

ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనివున్న శ్రీ రంగనాధస్వామి ఆలయం చిన్నదైనా చుట్టూ విశాలమైన ఆవరణ. మూడు ప్రాకారాలలో వున్న ఆలయం ఇది. మేము వెళ్ళిన సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. (ఈ సంవత్సరం (2012) జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తారీకుదాకా బ్రహ్మోత్సవాలు జరిగాయి. మేమీ ఆలయాన్ని ఫిబ్రవరి 5, 6 తారీకులలో రెండు రోజులు దర్శించాము). బ్రహ్మోత్సవాల సమయంకదా..ఆలయం అంతా పండుగ వాతావరణం. బ్రహ్మోత్సవ సమయంలో కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి. ప్రతిరోజూ ప్రఖ్యాత కళాకారులచే సంగీత, నృత్యప్రదర్శనలు జరుగుతాయి. ఉత్సవాలు పూర్తయిన మరునాడు స్వామి రధయాత్ర, బాణసంచా, రావణ దహనం వగైరా కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ ఆలయంలోని శ్రీరంగనాధుడు బహు సుందరమైన వాడు. తలపైన ఐదు పడగలతో ఆదిశేషుడు ఆఛ్ఛాదన ఇవ్వగా పడుకున్నట్లుంటాడు. స్వామి నాభినుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు, పాదాలచెంత శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, వెనుకనున్న రాతి ఫలకంలో దశావతారాలు చెక్కబడ్డాయి. ఇవ్వన్నీ ఒకే నల్లరాతిలో మలచబడటం విశేషం. స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారుకాబడ్డాయి. ఇవికాక గోదాదేవి పంచలోహ విగ్రహంకూడావున్నది. ఈ విగ్రహం ఆలయంలోనేగల బావిలో 100 సంవత్సరాల క్రితం దొరికింది.

గర్భాలయం బయటస్వామికి కుడిపక్క పైష్ణవ సాంప్రదాయంలో ప్రముఖులైన 12మంది ఆళ్వారుల ఉపాలయం, స్వామికి ఎడమపక్క లక్ష్మీదేవి ఉపాలయం వున్నాయి. లక్ష్మీదేవి మూల విగ్రహం నల్లరాతిదికాగా ఉత్సవమూర్తి పంచలోహాలతో చేయబడ్డది.

ఈ ఆలయంలోని ఇంకొక విశేషం..సాంప్రదాయ నృత్యంతో స్వామిని ఆరాధించే ఆలయం ప్రస్తుతం ఇదొక్కటేనేమో. ప్రాచీన సాంప్రదాయలో భాగమైన ఈ పురాతన నృత్యరీతులను ఆలయంలో నృత్యం చేసేవారి దగ్గరనుంచి పూజారుల దగ్గరనుంచి సేకరించి ఈ ఆలయంలో ప్రవేశపెట్టారు. 1996లో ఈ నృత్యం తిరిగి ప్రారంభంకావటానికి ప్రఖ్యాత నృత్యకళాకారిణి శ్రీమతి స్వప్నసుందరి విశేష కృషి కారణం.

దర్శన సమయాలు

ఉదయం 6 గం. లనుంచి 12 గం. లదాకా తిరిగి సాయంత్రం 4 గం.లనుంచి 8 గం. లదాకా.

ఎలా వెళ్ళాలి

ఇన్ఫోసిస్ (ఐ.యస్.బి.కి ఎదురుగా వుంది) దాటి 1 కి.మీ. వెళ్ళిన తర్వాత వచ్చే చౌరస్తాలో ఎడమవైపు వెళ్ళాలి. ఆ రోడ్ లో 1 కి.మీ. వెళ్ళాక కుడి వైపు తిరిగితే 2 ఫర్లాంగుల దూరంలో ఆలయం చేరుకోవచ్చు.

2 comments:

psm.lakshmi said...

I am pleasantly surprised Lakshmi garu. Office lo koodali choostu unte.. Nananramguga temple ani kanipinchi.. arrey evaro ee gudiki vellinatunaaru ani link open chesi.. photos choostu scroll down chese sariki Suma singapore chadivesariki okka saari startle ayaanu.. Tarvata gurtiki vachindi abt my email to you. I couldnt stop smiling... ventane maa husband ki link fwd chesi chudamani cheppi excitement share chesukundam anukunte tanaki telugu chadavatam raadaye.. evening intiki velaaka... pictures chupinchi.. chadivi vinipinchaanu.. :)


Photos chala baaga teesaru. swami vari darsam cheyinchinanduku many many thanks. Suma

psm.lakshmi said...

సుమా
మీ కామెంట్ శంషాబాద్ రామాలయం అనే పోస్టుకి వచ్చింది. కాపీచేసి పోస్టుచేసేసరికి నా పేరుతో వచ్చింది. అడిగిన మీరు చదివి, మీవారితో చదివించినందుకు చాలా సంతోషం.
psmlakshmi