Friday, April 20, 2012

శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం



శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం

దొడ్డమల్లూరులోని శ్రీ రామాప్రమేయస్వామి ఆలయంనుంచి ఉదయం 10-05కి బయల్దేరి జాతీయ రహదారిమీదకి రాగానే, రోడ్డుదాటి ఎదురుగావున్నరోడ్డులో వెళ్ళాము.  గుంటలతోకూడిన మట్టి రోడ్డు..చుట్టూ పొలాలు, చెట్లూ .. ప్రకృతి సౌందర్యం చూస్తూ రోడ్డుసంగతి మర్చిపోయాము.  దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వెళ్ళాక చేరాము శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం.  ఆలయం చిన్నదే. 

దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ ఆలయంలో స్వామిని కణ్వ మహర్షి ప్రతిష్టించాడంటారు.  ఆలయం పక్కనే కణ్వనది ప్రవహిస్తున్నది.      కణ్వ మహర్షి ఈ  నది ఒడ్డున కొంతకాలం తపస్సు చేసుకున్నారుట.  అందుకే ఈ నదికి కణ్వా నది అని పేరు.  ఎగువ కట్టిన ఆనకట్టవల్ల ప్రస్తుతం ఈ నదిలో నీరు లేదు.  వర్షాకాలంలో రిజర్వాయరు నిండిన తర్వాత మాత్రమే ఈ నదిలోకి నీరు వస్తుంది.

ఈ స్వామి అత్యంత మహిమాన్వితుడని భక్తుల నమ్మిక.  ఇక్కడ 48 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ ముడుపుకట్టిన వారి కోరికలు శీఘ్రమే నెరవేరుతాయని నమ్మకం.

మేము వెళ్ళేసరికి ఆలయం మూసి వున్నది.  పూజారిగారు అప్పుడే అల్పహారంకోసం ఇంటికి వెళ్ళారని, తొందరగానే వచ్చేస్తారని అక్కడ కొబ్బరికాయలు అమ్మే ఆవిడ చెప్పింది.  గోడమీద వున్న పూజారిగారి సెల్ నెంబరుకు దర్శనానికి వచ్చినవారు ఫోన్ చేశారు.  వచ్చేస్తున్నానన్నారని 15 నిముషాలు వేచి చూశాము.  సమయాభావమువల్ల ఇంకా వేచివుండలేక బయల్దేరాము.  దాదాపు మైన్ రోడ్డుకి వచ్చాక ఒక పంతులుగారు బైక్ మీద లోపలకి వెళ్ళటము చూశాము.  బహుశా ఆయనే అయ్యుంటారనుకున్నాంకానీ ఇంకా చూడవలసినవి చాలా వున్నాయిగనుక ముందుకే సాగాము.


0 comments: