Friday, September 7, 2012

శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు


ఏప్రిల్ 2012 భక్తిసుధ లో ప్రచురించబడిన నా వ్యాసం......





శ్రీ రఘునాధుడు నెలకొన్న ఇందూరు

వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహా మండపే,
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్ధితం
అగ్రేవాచయతి ప్రభంజనసుతేతత్వ్తం మునిభ్యఃపరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం.

అందరికీ ఆదర్శ పురుషుడు శ్రీ రఘురామచంద్రుడు భక్త రక్షా దీక్షా బధ్ధుడై నెలకొనని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు.  అలాగే మనవారు విషయం రాయాలన్నా, ఆఖరికి ఒక కార్డు రాయాలన్నా మొదట శ్రీరామ అని రాయకుండా మొదలుపెట్టరు.  సకల గుణాభిరాముడైన శ్రీరామునికి మనమిచ్చే గౌరవం అది.  అటువంటి రామచంద్రునికి దేశమంతా అనేక ఆలయాలు.  జగత్ప్రసిధ్ధి చెందిన ఆలయాలు కొన్నయితే ఊరూరా నిర్మింపబడ్డ ఆలయాలు ఎన్నో.  వీటిలో అనేక పురాతన ఆలయాలు అటు ప్రభుత్వంగానీ, ఇటు మత పెద్దలుగానీ కనీసం ప్రాంత ప్రజలుగానీ  వాటి విలువ తెలుసుకుని ఆదరించకపోవటంవల్ల  వాటి గురించి తెలియచెప్పేవారు లేక, వాటి చరిత్రలతో సహ కనుమరుగవుతున్నాయి.  అలా కనుమరుగుకాబోయి తిరిగి వైభవాన్ని పుంజుకుంటున్న ఇందూరులోని శ్రీ రఘునాధ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా?    
 
ఇందూరు అంటే ఇదెక్కడ వున్నదని కొందరు సందేహపడవచ్చు.  నిజామాబాదు అంటే అందరికీ తెలుస్తుంది.  క్రీ.. 1905 లో హైదరాబాదును పరిపాలిస్తున్న అసఫ్ జా – 6 సమయంలో ఇందూరు పేరు నిజామాబాదుగా మార్చబడ్డది.  అంటే ప్రస్తుత నిజామాబాదు పూర్వ నామధేయాలు ఇందూరు, ఇంద్రపురి. 
రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.. 914-928 మధ్య కాలంలో  ఇందూరుని పరిపాలించాడు. ఆయన పేరుమీదే ఇందూరు ప్రసిధ్ధిచెందింది.  ఆ రాజే  ఆ సమయంలో  ప్రస్తుతం ఊరు శివారులో కొండపైన కోటని నిర్మించాడు.  కోట నిర్మింపబడి 1100 సంవత్సరాలపైబడ్డా, ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది.    

అప్పటి పోరాటాలకేకాదు..తెలంగాణా స్వాతంత్ర్యపోరాట వీరులు శ్రీ దాశరధి రంగాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి నిజాం ప్రభువునెదిరించిన పోరాటంలో వారిని ఇక్కడనే బంధించారు.     

చరిత్ర ఆధారంగా శ్రీ సమర్ధ రామదాస్ జీ (మన దేశ అత్యంత సాహస వీరుడైన  ఛత్రపతి శివాజీ గురువు)  కోటలో శ్రీ రఘునాధస్వామి   ఆలయాన్ని నిర్మింప చేశారు.
 
అతి పురాతనమైన ఈ దేవాలయంయొక్క వైశాల్యం సుమారు 3900 ..లు.  ఇక్కడి ధ్వజస్తంబము ఒకే రాతిలో మలచబడ్డది.  53 అడుగుల ఎత్తున్న ఈ అఖండ శిలా ధ్వజస్తంభముపై గరుడ దీపం వెలిగిస్తే చుట్టుపక్కల గ్రామాలలో దీపాలు వెలిగంచేవారని ప్రతీతి.

రఘునాధుడనే మహర్షి ఇక్కడ చాలాకాలం తపస్సు చేసుకున్నారు.  ఈయన కోటలోగల ఒక ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా పక్కనే వున్న బొడ్డెమ్మ చెరువులో నిర్మించబడ్డ శిలా కట్టడముదాకా వెళ్ళి అక్కడ స్నానమాచరించి వచ్చేవారని పలు కధనాలు ప్రచారంలో వున్నాయి. అంతేకాదు.  కోటలో పలు సొరంగ మార్గాలు వున్నాయనటానికి ఇంకో ఆధారం కోట లోపల్నించి డిచ్ వల్లి, సారంగపూర్ ప్రాంతాలకు సొరంగ మార్గాలను సూచించే గుర్తులు కోట గోడలపై వున్నాయి.   కోటలో ఈ రఘునాధ మహర్షి ధ్యాన మందిరం విశిష్టమైనది.  .సి. ల గురించి తెలియని ఆ కాలంలో కట్టిన ఈ ధ్యానమందిరంలో  మండు వేసవిలోకూడా సహజమైన చల్లదనంతో ఎంతో హాయిగొలుపుతూ వుండేటట్లు నిర్మింపబడింది.  ఇంజనీరింగు చదువులులేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కట్టిన మనవారి ప్రతిభ వేనోళ్ళ కొనియాడతగినది.

ఆలయంలో గర్భగుడిలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలు భద్రాచలంలో వాటిని పోలివుంటాయి.  (శ్రీరామచంద్రుని అంకంపై సీతమ్మ, పక్కనే లక్ష్మణస్వామి).  అంతేకాదు, అతి విశాలమైన మంటపములు, సశాస్త్రీయంగా వున్న గర్భాలయం, గర్భాలయం ఎదురుగా ఆంజనేయస్వామి మందిరం, శ్రీ రఘునాధ మహర్షి అద్భుత ధ్యాన మందిరం, శ్రీ రాములవారి పాదుకలు, విశాలమైన కళ్యాణమండపం, కోనేరు, వంటశాల వగైరా పురాతన కట్టడాలు ఆలయ విశిష్టతను పెంపొందింపచేస్తాయి. 

కొండకిందవున్న ఆలయ ముఖద్వారం, కొండపైన ఏనుగుల ద్వారం, గజలక్ష్మి చిహ్నములతో గర్భాలయంలో వుండే స్వామివారి స్ధానం ఒకే దిశల సమాంతర రేఖతో తూర్పునకు అభిముఖంగా వుండటం విశేషం.  ఆలయ శిఖరం నూతనంగా నిర్మింపబడింది.

ఈ మందిరంలో అర్చనచేసి రాముని ప్రార్ధించిన భక్తులకు శ్రీరాముడు మనశ్శాంతిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం.

ఇంత ప్రాచీనమైన ఈ ఆలయం 2002 దాకా సరైన ఆదరణ లేక రోజూ మూసి వుండేదిట.  ఏడాదికి ఒకసారి తీసి శ్రీరామచంద్రుని కళ్యాణం చేసేవారుట.  అయితే 2002 నుంచి శ్రీ చిన్న జియ్యరు స్వామితిరిగి నిత్య పూజలు ప్రారంభించారు.  ఇలాంటి ఆదరణ నోచుకోవాల్సిన ఆలయాలు ఇంకెన్నో. 

ఇక్కడనుంచి చూస్తే చుట్టూవున్న అందమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి.  అంతేకాదు  దేవాలయంవెనుక సూర్యాస్తమయం దృశ్యం చాలా అందంగావుండి చూపరులకు మరువరాని ఆనందాన్ని కలిగిస్తుంది.

కొండపైకి వెళ్ళేదోవలో రెండు పెద్ద కొండరాళ్ళవెనుక  ఆంజనేయస్వామికి చిన్న ఆలయం.  మార్గం గుహలోకి వెళ్తున్నట్లుంటుంది.  సహజసిధ్ధంగా ఏర్పడ్డ ఈ మార్గంగుండా వెళ్ళి ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపిస్తారు.

ఇలాంటి ఆలయాలు వైభవోపేతంగా అలరారటానికి ప్రభుత్వము, పెద్దలేకాక ఆ ప్రాంత ప్రజలుకూడా కృషి చెయ్యాలి.  వీలయినప్పుడల్లా ఆలయాల్ని సందర్శించి అవి కళకళలాడటంలో మనవంతు పాత్ర మనమూ నిర్వహించాలి.  ఏమంటారు?
 ఆలయ దృశ్యం
 హనుమాన్ మందిరం మార్గం
 ఆలయ ముఖ ద్వారం




 


2 comments:

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
మీ రెండు పోస్ట్ లూ చదివానండి . చాలా బాగా వివరించారు . మీరు వ్రాసింది చదవగానే ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ దేవాలయాలు చూడాలని వుంది . భద్రకాళి చూసాననుకోండి . నిజామాబాద్ రఘునాథ ఆలయం చూడలేదు . ఓసారి నిజామాబాద్ లో రోజంతా ఒకరింట్లో వుండాల్సి వచ్చింది . అప్పుడు వారి ని ఇక్కడేమైనా చూడవలసిన పురాతన ఆలయాలున్నాయా అని అడిగాను కూడా . ఏమీ లేవన్నారు :( మీరు మటుకు అన్నీ భలే శోధిస్తారు .

psm.lakshmi said...

మాలాగారూ
నచ్చినందుకు ధన్యవాదాలు. ఈమారు ఎ.పి. లో ఏ వూరు వెళ్ళినా నాకో ఫోన్ చెయ్యండి. నాకు తెలిస్తే అక్కడ చూడాల్సిన ఆలయాలగురించి చెప్తాను.
psmlakshmi