Wednesday, December 9, 2009

చిదంబర రహస్యం--2






చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా వుందా  అయితే చదవండి.

గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి తెర వేసి వుంటుంది.  ఇక్కడ గోడలో ఒక విశిష్ట యంత్రం బిగించబడి వుందని చెప్తారు.  అది ఏ యంత్రమో ఎవరికీ తెలియదు.  దాని పైన ఎప్పుడూ దట్టమైన చందనం పూసి వుంటుంది.  దానిని ఎవరూ తాకరాదు.  ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి ఆ యంత్రానికి పూజ చేస్తారు.  ఇంకెవరికీ పూజ చెయ్యటానికేకాదు  పూజా సమయంలో చూడటానికి  కూడా అనుమతి లేదు.  అయితే ఆసక్తిగల భక్తులు అక్కడి వూజారిని అడిగి రూ. 50 టికెటు తీసుకుంటే కిటికీగుండా కొద్ది దూరంనుంచి  ఆ యంత్ర దర్శనానికి అవకాశం వుంటుంది..  ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు.  ఆ యంత్రంపై బంగారు బిల్వ పత్రాల మాలలు కనబడుతాయి.. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి.. ఎవరి భక్తి పారవశ్యం వారిది.  ఇంతకీ ఆ స్ధలంలో ఏమి వున్నట్లు?   చూసిన భక్తులకు ఏమి కనిపించినట్లు?   ఎవరికీ అంతుబట్టని రహస్యం.  ఇదే చిదంబర రహస్యం.  అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన దేవ దేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని, ఎవరి అంతరంగ భావాలననుసరించి వారికి ఆ రూపంలో నిరాకారుడైన స్వామి దర్శనమిస్తారని తెలుయజేస్తుందని చెబుతారు.


హమ్మయ్య!  రహస్యం తెలిసిపోయిందికదా.  రేపు చిదంబరంలోనూ, చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాము.



ఆలయ గోపురం మీద శిల్ప సౌందర్యం





Tuesday, December 8, 2009

చిదంబర రహస్యం--1

                           చిదంబర రహస్యం             
                                                             

  తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో.  అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు.  దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు.  ముఖ్యంగా చోళులు.  శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం,  వెలకట్ట లేనిది.   ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.

  ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం.  అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి.  అలాంటి ఎన్నో కోవెలలో ఇప్పుడ నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన  చిదంబరం గురించి తెలుసుకుందాము.

  నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ ప్రదేశానికి కోయిల్, తిల్లయ్ వగైరా రకరకాల పేర్లు.  ఇదివరకు ఈ ప్రదేశంలో తిల్లయ్ వృక్షాలు ఎక్కువగా వుండేవట.  అందుకని ఆ పేరు.  ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారానుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారు.  పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి అనే ఐదు క్రియలను ఉద్దీపనం చేస్తారు.


  ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాలు  పైన 13 పెద్ద రాగి కలశాలతో  విశాలమైన వాకిళ్ళతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారుతూ  వుంటాయి. 

  ఈ దేవాలయంలో ఐదుసభలున్నాయి -  చిత్రాబంళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ.   చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వున్నాడు.   చిత్రాంబళానికి ముందు వున్నది పొన్నాంబళం.  ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తారు.  పెరాంబళం అంటే దేవ సభ.  ఇక్కడ ఉత్సవ విగ్రహాలు  వుంటాయి.   నృత్యసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వతాండవ నృత్యం చేశారు.  ఇక్కడ స్వామి నృత్య భంగిమ విగ్రహం ప్రతిష్టించబడింది.  రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారు. ఆణి, మార్గళి మాసాలలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని ఇతర దేవతలను ఐదు రధాలలో ఊరేగించిన తర్వాత ఇక్కడ విశ్రమింప చేస్తారు.  మర్నాడు పూజాదికాల తర్వాత మధ్యాహ్నం స్వామిని, అమ్మవారిని నాట్యరీతిలో చిత్రాంబళానికి తీసుకు వెళ్తారు.  ఈ వైభవాన్ని చూసితీరవలసినదేగానీ మాటలలో చెప్పనలవికాదంటారు చూసిన భక్తులు.

  ఇక్కడ అమ్మవారు శివ కామ సుందరీదేవి.  వెలుపలి ప్రాకారంలో ఈవిడకి ప్రత్యేక ఆలయం వున్నది.  ఇక్కడే చిత్రగుప్తుని మందిరమున్నది.  ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ బహు సుందరం.

  నటరాజ ఆలయంలో తప్పక చూడవలసిన స్వామి మూలాట్టనేశ్వరార్. ఈయన స్వయంభూ.  ఈ స్వామికి ఈ పేరు రావటానికి కారణం అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలో గల స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనం కావడమేనని చెబుతారు.  ఇక్కడ అమ్మవారు ఉమాదేవి.  8 అడుగుల ఎత్తు వున్న ముక్కురుని వినాయకర్, ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడేకాకుండా, ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడదగ్గవి.

ఆలయ విశేషాలు
  నటరాజ స్వామి  ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు.  ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో. 

రవాణా సౌకర్యాలు

  ఈ ఆలయం చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగున్నాయి.  చెన్నై, తిరుచిరాపల్లి మెయిన్ రైల్వే లైనులో చిదంబరం స్టేషనులో రైలు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఆలయం వుంది.  తమిళనాడు రాష్ర్టంలోని వివిధ ప్రదేశాలనుంచి బస్సు సౌకర్యం కూడా వుంది.


ఇతర సౌకర్యాలు

   వసతికి  ఆలయ సమీపంలోనే హోటళ్ళున్నాయి. అద్దె రూ. 300 నుంచీ పైన.  చాలాహోటల్స్ లో రూమ్ సర్వీసు వుండదు.  భోజనానికి ఆలయ సమీపంలోనే  కుమరన్ భవన్ (మధ్యాహ్నం 12-30 నుంచీ 3 గం. ల దాకా మాత్రమే భోజనం దొరుకుతుంది మిగతా సమయాలలో టిఫెన్లు మాత్రమే వుంటాయి),  హోటల్ శ్రీ కృష్ణా వున్నాయి (ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం వుండదు అయితే రైస్ ఐటమ్స్ లభిస్తాయి). 

  తమిళనాడులో ఏ ఆలయంలోనైనా అర్చన టికెట్ల ధర తక్కువ వుంటుంది గానీ నైవేద్యానికి తప్పనిసరిగా ఫలములుండాలి (కొబ్బరికాయైతే మంచిది.  వేరే ఊరిలో కొబ్బరి ఏంచేసుకోవాలంటారా   ప్రసాదం ఎపరికైనా ఇవ్వచ్చు.  స్వామి దగ్గర మనం తీసుకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారంటే మనకీ సంతోషం కదా).  అది లేకపోతే అర్చన షోడశ నామాలకే పరిమితమవుతుంది.

  సాయంత్రం 6 గం. లకి చాలా ఆలయాలలో అభిషేకం జరుగుతుంది.  ఆ సమయంలో చందనాభిషేకం తర్వాత దైవ ప్రతిమ కళ్ళు, కనుబొమలు, నోరు దగ్గర చందనం తుడుస్తారు.  అప్పుడు దేవుళ్ళ దివ్య సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది.

చిదంబర రహస్యం గురించి రేపు చెప్తాను.  సరేనా? 




ఆలయం లోపలి ప్రాకారంలో శిల్ప సౌందర్యం


 రధం మీద శిల్ప సౌందర్యం

ఆలయ గోపురం
 


రధం

Friday, December 4, 2009

తిరువణ్ణామలైలో కార్తీక దీపం


ఆలయం లోపల వెలిగించిన జ్యోతి ఇది. ఇలాంటిదే ఆలయం వెలుపల కూడా వెలిగిస్తారు (కొండమీద కాకుండా)
ఆలయ ప్రధాన ముఖద్వారం (కనబడే గోపురం) షుమారు ఒక కి.మీ. దూరం వుంటుంది.
గిరి ప్రదక్షిణ
కొండమీద కార్తీక దీపం -- ఈ కొండకే ప్రదక్షిణ చేసేది
(దీపం వెలిగించక ముందు గిరి ప్రదక్షిణ)

తిరువన్నామలిలో కార్తీక దీపం

తమిళనాడులో ప్రసిధ్ధికెక్కిన శైవ క్షేత్రం తిరువణ్ణామలై. ఇక్కడ శివుడు పంచ భూతాలలో ఒకటైన అగ్ని లింగం రూపంలో వుంటాడు. పూజ్యులు రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడే వున్నది. తిరువణ్ణామలైలో ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో జరిగే అతి పవిత్రమైన, ప్రసిధ్ధికెక్కన కార్తీక దీపం చుట్టుప్రక్కల చాలా కిలో మీటర్ల దూరం వరకు కనబడుతుంది. ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరుల నివాస స్ధలంగా చెప్పబడే కొండ మీద ప్రతి తమిళ కార్తీక పౌర్ణమి నాడు సాయం సంధ్యా సమయంలో వెలిగిస్తారు.

ఇక్కడ ఈ కొండకి చేసే ప్రదక్షిణని గిరి వలం అంటారు. దీనిని చాలా పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. 14 కి.మీ. ల దూరం, చెప్పులు కూడా లేకుండా నడుస్తారు ఈ గిరి ప్రదక్షిణ కోసం. ముఖ్యంగా పౌర్ణమి నాడు షుమారు 60 అడుగుల వెడల్పు వున్న ఈ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే జనాన్ని చూస్తే తమిళనాడు మొత్తం అక్కడే వుందా అనిపిస్తుంది. అంత జనం. ఈ పర్వతాన్ని సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల రూపంగా కొంతమందంటే, పార్వతీ పరమేశ్వరులు ఈ శిఖరం మీద వుంటారని కొందరి నమ్మకం.

మా అబ్బాయి, తేజస్వి తిరువణ్ణామలైలోని అరుణై ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి అవటంతో ఆ క్షేత్రంతో కొంత అనుబంధం ముడిపడివుంది. వాడి చదువు కారణంగా మేమూ ఆ క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణ చేయగలిగాము. వాడు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడాది దీప దర్శనానికి వెళ్ళాడు. ఈ ఏడాది తమిళ కార్తీక పౌర్ణమి (రాత్రిపూట పౌర్ణమి వున్న రోజు) 1-12-2009 అయింది. ఆ ఫోటోలతో బాటు, దీపం వెలిగిన వీడియో, గిరి ప్రదక్షిణలో జన సందోహం వీడియో కూడా అప్ లోడ్ చెయ్యాలని ఉదయం నుంచి ప్రయత్నించి లాభం లేకపోయింది. ప్రస్తుతానికి ఫోటోలు చూడండి.


Saturday, November 21, 2009

షిర్డీ యాత్ర


షిర్డి యాత్ర

శ్రీ శైల్ గారు షిర్డీ యాత్ర గురించి చెప్పమన్నారు. అంతకన్నా మహద్భాగ్యం నాకేముంటుంది. శైల్ గారూ, మీరెక్కడ వుంటారో తెలియదుగానీ అనేక ప్రదేశాలనుంచీ ఆర్.టి.సీ వారూ, రైల్వేవారూ, ఇంకా ప్రైవేటు బస్సుల వాళ్ళూ షిర్డీకి టూర్ పాకేజ్ లు ప్రవేశ పెట్టారు. మొదటిసారి షిర్డీ వెళ్ళేవాళ్ళు, కొంచెం సొకర్యంగా వెళ్దామనుకునేవాళ్ళు వీటిని ఉపయోగించుకుంటే, షిర్డీలో దిగగానే ఎక్కడ వుండాలి అనే మొదటి ప్రశ్న రాదు. ఎందుకంటే వసతి వారే చూపిస్తారు. లాడ్జింగులు బాగానే వుంటాయి. చాలామటుకు గుడి పరిసర ప్రదేశాల్లోనే వుంటాయి. లేకపోయినా నడవలేనివారికి ఆటో సౌకర్యం బాగా వుంటుంది.

ఆలయ సమీపంలోనే దేవస్ధానంవారు ఇచ్చే వసతి సౌకర్యంకోసం కూడా దేవస్ధానం ఆఫీసులో సంప్రందించవచ్చు. వారివి వసతికి డార్మెంటరీల దగ్గరనుంచి విడి గదులదాకా వున్నాయి. అవకాశాన్నిబట్టి ఇస్తారు. జనం ఎక్కువగా వున్నప్పుడు ఇవ్వేమీ దొరక్కపోయినా కంగారు పడక్కరలేదు. దేవస్ధానంవారు పరుపులు అద్దెకు ఇస్తారు. విడివారు అవి తీసుకుని ఆరుబయట వేసుకుని పడుకుంటారు. చాలామందిని ఆకర్షించినవి మాత్రం నిస్సందేహంగా వసతి సౌకర్యం, తిరుగు ప్రయాణంతో కూడిన బస్ రిజర్వేషన్లే.

హైదరాబాదు నుంచి సాయంత్రం 5 గం. నుంచి బయల్దేరటం మొదలు ఈ బస్సులు. ఇక్కడనుంచి 14 గం. ల ప్రయాణం. త్రోవలో భోజనాలు, కాఫీ, టీలు, దేనికీ ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం టిక్కెట్టు కూడా ముందు తీసుకున్నవాళ్ళకి మాత్రమే వసతి సౌకర్యం. కనుక మీరు తిరుగు ప్రయాణం ఎప్పుడో ముందే నిర్ణయించుకోవాలి. మర్నాడే బయల్దేరి రావచ్చు, లేదా మీ ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ప్రదేశాలన్నీ చూసి తర్వాత బయల్దేరచ్చు. బస్లో వెళ్తే ఖచ్చితమైన ప్రయాణం తేదీ, బస్ నెంబరూ, సీట్ల నెంబర్లు వేసిన టికెట్ మీరు భద్ర పరచుకోండి, బస్ రాంగానే మీ సీట్లు ఆకుపై చెయ్యండి. టూరిస్టు ప్రదేశాలు కదండీ పొరపాట్లు ఎవరికైనా సహజం.

ఇంక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు

1. సాయిబాబా సమాధి మందిరం. ఇక్కడే బాబా విగ్రహం కూడా వుంటుంది. ఈ హాల్లోనే ముందువైపు బాబాకి ఉదయం భక్తులు పాల్గొనే ఆభిషేకాదులు నిర్వర్తిస్తారు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

2. ద్వారకామాయి (మసీదు)..ఇక్కడ బాబా మొదటిసారి వెలిగించిన ధుని ఇంకా వెలుగుతూనే వుంది. బాబా ఉపయోగించిన వస్తువులు కొన్ని, ఆయన కూర్చున్న ప్రదేశాలు, అన్నీ బోర్డులు పెట్టి వుంటాయి. చూడండి.

3. చావడి..బాబా కొన్ని రాత్రులు ఇక్కడ నిద్రించేవారు. చెక్కబల్లకి పాత గుడ్డపీలికలు కట్టి ఎత్తుగా వేలాడదీసి దాని మీదకెక్కి నిద్రించినది ఇక్కడే.

4. గురుస్ధాన్. ఇక్కడే నేలలో తవ్వినప్పుడు వెలిగించిన దీపాలు కనబడ్డాయంటారు.

5. లెండీ తోట, మందిర పరిసర ప్రాంతంలోనే బాబా శిష్యుల సమాధి మందిరాలు, శివ, గణేష్, శనీశ్వరుని ఆలయాలు, దత్త మందిరం, పారాయణ హాల్ అన్నీ దర్శనీయ స్ధలాలే.

6. కొద్ది దూరంలో లక్ష్మీబాయి ఇల్లు వుంది. అక్కడ ఆవిడకి బాబా ఇచ్చిన తొమ్మిది వెండి రూపాయి నాణేలు ఒక ఫ్రేమ్ లో బిగించి పెట్టారు వారి కుటుంబీకులు భక్తుల సందర్శానార్ధం.

7. మసీదుకి చావిడికి మధ్యలో ఆంజనేయస్వామి ఆలయం. ఇవి ఆలయ పరిసరప్రాంతంలో చూడదగ్గవి. షాపుల గురించి నేను చెప్పలేదండీ అవ్వెటూ మీరో, మీతో వచ్చినవారో చూస్తారుగదా.

8. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గవి అంటే ముఖ్యంగా చెప్పతగ్గది శనిసింగడాపూర్. ఇక్కడ శనీశ్వరుడు ఒక నిలువెత్తు రాయి రూపంలో కొలువబడతాడు. ఆయనకి ఆలయం లేదు. అంటే ఆ రాయి ఆరుబయలే వుంటుంది. శని దోషం వున్నవారు ఇక్కడకి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి వస్తారు. దీనికి మగవారిని మాత్రమే అనుమతిస్తారు. వారు కూడా అక్కడ ఇచ్చే ధోవతులు కట్టుకుని, స్నానం చేసి వెళ్ళి అభిషేకం చేసి, మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు. స్త్రీలు ఆభిషేకం చెయ్యకూడదు కానీ, చూడవచ్చు. ఇక్కడ ఇళ్ళకి తలుపులూ, తాళాలూ వుండవు. ఆ ఊళ్ళో దొంగతనాలు అస్సలు జరగవు. అంత మహిమగల ప్రాంతంగా చెప్తారు. షిర్డీనుంచి జీపులో వెళ్ళి అదే రోజు తిరిగి రావచ్చు. బహుశా 70, 80 కి.మీ. ల దూరం వుంటుంది.. గుడి దగ్గరే జీపుల వాళ్ళు అరుస్తూ వుంటారు. మనిషికింతని తీసుకుంటారు. ఎంత సమయం పడుతుందో ముందు కనుక్కోండి.

9. తర్వాత సాకురీ అనే చోట ఉపాసినీ బాబా ఆశ్రమం వున్నది. దీనికి వెళ్ళి రావటానికి జట్కా సౌకర్యం కూడా వుంది. మేము వెళ్ళి చాలా రోజులయింది. అందుకే వివరాలు పూర్తిగా ఇవ్వలేక పోతున్నాను. ప్రదేశం తెలిస్తే అన్నిచోట్లకీ వాహన సౌకర్యం వుంటుంది.

10. తర్వాత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వుంది అన్నారు కానీ మేమింత మటుకు చూడలేదు.

11. నాసిక్, త్రయంబకేశ్వరం (జ్యోతిర్లింగం) కూడా షిర్డీకి దగ్గరే. అయితే దీనికి రెండు రోజులుంటే తీరిగ్గా చూడవచ్చు.

12. అలాగే కొందరు పండరీపూర్, తుల్జాపూర్ కూడా ఈ యాత్రలో కలుపుకుంటారు.

మేము వెళ్ళి మూడేళ్ళపైనే అయింది. షిర్డీ గురించి అడిగారు కదాని నాకు గుర్తున్నంత మటుకూ చెప్పాను. క్షేమంగా వెళ్ళి బాబా ఆశీస్సులతో రండి.


Sunday, November 1, 2009

రామాలయం, డిచ్ పల్లి





జోరు వానలో కారు ప్రయాణం


ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

నిజామాబాదుకు 12 కి.మీ ల దూరంలో ప్రకృతి రామణీయకత మధ్య కొండమీద కొలువైవున్న రామయ్యతండ్రి ఆలయం ఇది. 11వ శతాబ్దంనాటి ఈ ఆలయాన్ని చాళుక్యులు జైనమత ప్రేరణతో కట్టించారు. కొండమీదికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా వుంటాయి. పూజాదికాల సమయానంతరం పూజారి వుండకపోవచ్చు. కటకటాల వాకిలిలో నుంచి పగలు ఏ సమయలోనైనా స్వామి దర్శనం చేసుకోవచ్చు.

ఆలయం చిన్నదయినా అద్భతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతున్నది. చుట్టూ పచ్చని చెట్లు. పైగా మేము వెళ్ళినప్పుడు వాతావరణం చల్లగా వుండి సన్నగా తుపర పడుతోంది. ఆ వాతావరణంలో ఆ ప్రదేశాన్ని వదిలి రాబుధ్ధి కాలేదు. అందుబాటులోవున్న ఇలాంటి కళాఖండాల విలువ తెలుసుకుని ఆదరించి వాటి వైభవాన్ని నిలపవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు...మనందరిదీ కూడా.

ఆలయాలేకాదు, ఆలీ సాగర్, శారదా సాగర్ లాంటి పిక్నిక్ ప్రదేశాలు కూడా వున్నాయి నిజామాబాదులో. మేము 21-3-2008 ఉదయం 7 గం. లకు ఇంట్లో బయల్దేరిన వాళ్ళం ఏడుపాయలు, మెదక్ చర్చ్, బికనూరు, ఇస్సన్నపల్లి, బుగ్గరామేశ్వరం, ఇందూరు, సారంగాపూర్, జానకంపేట, బాసర, నిజామాబాదులో ఆలయాలు, డిచ్ పల్లి ఇన్ని చూసి 23-3-2008 రాత్రి 7 గం. లకి ఇంటికి చేరాం. చాలా చూశాం కదూ. వచ్చేటప్పుడు నిజామాబాదునుంచి హైదరాబాదు ఇంకో పది కిలోమీటర్లు వుంది అనేదాకా చాలా పెద్ద వాన. నాకైతే కొంచెం భయంకూడా వేసింది. వానలో మా కారు ప్రయాణం ఫోటోలు కూడా చూడండి. మరింకేం బయల్దేరండి...నిజామాబాదు దర్శనానికి.