Wednesday, October 20, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 19


సారనాధ్

సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం ఎత్తు 143 అడుగులు.  దీనిలోని రాళ్ళు ఇనప క్లాంప్స్ తో కలపబడ్డాయి.

దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు.  12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది.  ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా,  ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.

 20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది.  ఇక్కడ తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు.  ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.

ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది.   మహాబోధి లైబ్రరీలో బుధ్ధుని గురించి అనేక పుస్తకాలు, వ్రాత ప్రతులు వున్నాయి.

7 వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో  ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు. 
 సారనాధ్ స్ధూపం
 బుధ్ధుడు మొదట బోధించిన స్ధలం
 నూతన బుధ్ధ దేవాలయం  
దేవాలయం లోపల దృశ్యం

Friday, October 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 18


 బుధ్ధ గయ
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము.  ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది.  భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి.  అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్,  చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా.  బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.

500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని  ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు.  మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది.  తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు.  తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.

బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు  వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు.  కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి.  కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.

బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు  ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు.  ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.

ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు.  అశోక చక్రవర్తి పరిపాలనలో  బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు.  తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.

బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది.  ఇక్కడే ఆయన తపస్సు చేసింది.

ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.

ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.

7 వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.
 బుధ్ధుడి ఆలయం
 ఆలయంలో బుధ్ధుడు
బోధి వృక్షం
 టిబెట్ వారి కట్టడం
 25 మీ, ఎత్తైన బుధ్ధుడి విగ్రహం


Wednesday, September 29, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 17


మంగళగౌరి ఆలయం, గయ, బీహార్

గదాధరసహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని
త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడిశక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి..  అందులో ముఖ్యమైన శరీర భాగాలు పడిన ప్రదేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు.   గయలో అమ్మవారి తొడ భాగం పడ్డది.

ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది.  ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.  మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన  చిన్న ఆలయం ఇది. 

గర్భగుడి చాలా చిన్నది.  లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె  లాగా వుంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది.  దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.

 ఎడమవైపు కనబడుతున్న గోపురం ఆమ్మవారి గుడి..చిన్న కొండమీద వుంది

Wednesday, September 22, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 16

గయ

బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా ముఖ్య కేంద్రం గయ.  గయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది పితృ కార్యాలు.  చనిపోయినవారికి ఇక్కడ శ్రాధ్ధ కర్మలు చేస్తే చాలా మంచిదని, పితృదేవతలు తరిస్తారని అంటారు.  కొందరైతే ఇక్కడ ఒకసారి శ్రాధ్ధ కర్మలు చేస్తే తిరిగి ప్రతి ఏడాదీ చెయ్యక్కరలేదు అంటారుగానీ అది నిజం కాదని అక్కడివారన్నారు.
గయకు చేరుకోవటానికి రైలు, బస్ సౌకర్యాలున్నాయి.  సాధారణంగా కాశీ వెళ్ళినవాళ్ళు అక్కడనుండి ప్రైవేటు వాహనం మాట్లాడుకుని గయ వెళ్ళి వస్తారు.  మేమూ అలాగే ఒక వాహనంలో  రాత్రి  1 గం. కి బయల్దేరి ఉదయం 7 గం. లకు గయ చేరుకున్నాము.  మా వేన్ డ్రైవరు సరాసరి ఒక తెలుగు బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళాడు.  ఇల్లు పెద్దదే.  4, 5 ఆవులు కూడా ఆ ఇంట్లో వున్నాయి.

గయలో వుండటానికి అనేక వసతులు వున్నట్లే ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులుకూడా యాత్రీకుల అవసరానికి ఉచితంగా వసతి ఇస్తారు.  ముందే చెప్పి డబ్బు కడితే కార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తారు.  ఇవ్వన్నీ ఎలా వుంటాయని అడగద్దు.  మన అవసరార్ధం ఒక రోజు గడిపి వచ్చెయ్యటమే.

 వెళ్ళిన వెంటనే అక్కడవున్న బ్రాహ్మణుడు మా గ్రూప్ లో వారంతా వచ్చిన పని, మా కార్యక్రమాలు తెలుసుకుని మా కందరికీ ఒక గది ఇచ్చి స్నానాలు కానిచ్చి త్వరగా వస్తే కార్యక్రమాలు మొదలు పెట్టచ్చన్నారు.  బయట 5, 6 స్నానాల గదులు, వాష్ బేసిన్లు, పంపులు వున్నాయి.   కొందరు మగవారు పంపుల దగ్గరే స్నానాలు కానిస్తున్నారు. 

అక్కడ రేట్లు బేరం ఆడటం లేదు.  బాగానే వుంది.  కానీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుని, కూర, కాయ, పండు వదలనన్నానని నా మీద ఆ బ్రాహ్మణునికి కొంచెం కోపం వచ్చింది.  అలా వదిలితే మళ్ళీ ఆ వస్తువు తిన కూడదు.  మే మా దేశ దిమ్మరులం.  ఏ రోజు ఎక్కడ తింటామో తెలియదు.  వెళ్ళిన చోటల్లా ఆ వంటల్లో నేను వదిలేసినవి వేశారేమో ఎక్కడ కనుక్కోను.  ఆ అవస్తలు పడేకన్నా ఆ పని చేయకపోవటమే నాకు ఉచితం అనిపించింది.  పైగా ఈ మధ్య నలుగురూ చెప్పేవి విని కొంచెం బుఱ్ఱ పెంచుకుంటున్నానులెండి.  మన అహంకార మమకారాలన్నీ వదిలి భగవంతుని చేరుకోవటానికి చేసే ప్రయత్మంలో అలా మనకిష్టమయిన వస్తువులు వదిలిపెట్టటం  మొదటి మెట్టు అని ఎక్కడో విన్నాను.  ఏదో పండూ, కూరా బదులు నా అహంకారం కొంచెంకాకపోతే కొంచెమన్నా వదలటమే నాకు తేలిక అనిపించింది. 

అన్నట్లు గయలో పితృకార్యాలేకాక, మనం అప్పటిదాకా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పండూ, కూరా వగైరాలను వదిలి పెట్టటం చేస్తారు.

స్నానాలయ్యాక కొంచెం దూరంలో వున్న విష్ణుపాదం ఆలయానికి నడిచే వెళ్ళాము.  కొంచెం ఎత్తులో ఆలయం.  ఆ ఆలయానికి చేరుకునే లోపలే వున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు పురోహితులు.  చాలామందే వున్నారు.  పురోహితుడు మా కార్యక్రమాలకని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళటంతో మేము గుడికి వెళ్తున్నట్లు, అక్కడ ఆలయం వున్నట్లుకూడా ముందు తెలియలేదు.  మా వాళ్ళ కార్యక్రమాలయ్యాక దేవాలయానికి వెళ్ళిరమ్మని పురోహితుడు చెబితే ఇక్కడే వుందా అనుకున్నా.  ఈ ప్రదేశానికి ప్రక్కనే ఫల్గుణీ నది.  ఒక్క చుక్క కూడా నీరు లేదు. 

దేవాలయంలో ఒక పెద్ద బేసిన్ లాంటి దాని మధ్యలో పెద్ద విష్ణు పాదం ఆకారం వుంది.  ఆ బేసిన్ చుట్టూ  వెండి రేకు తాపడం చేశారు.  అందరూ ఆ పాదం తాకి నమస్కారం చేస్తున్నారు.  మేమూ  ఫాలో అయిపోయాము.  అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 1787 లో రాణీ అహల్యాబాయి పునర్నిర్మించారు.  ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ పునర్నిర్మాణమే.

ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలేకాక ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది.  భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు.  ఈ వృక్షం కింద  గౌతమ బుధ్ధుడు చాలాకాలం తపస్సు చేశాడుట.  అందుకే ఈ క్షేత్రం హిందువులకేకాక బౌధ్ధ మతస్తులకు కూడా  పుణ్య క్షేత్రం.

ఈ విష్ణుపాదం ఆలయం గురించి ఒక చిన్న కధ....పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు.  శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి తన పాదంతో తొక్కి చంపాడుట.  అప్పుడు గయాసురుడి శరీరం చిన్న కొండలుగా రాళ్ళ గుట్టలుగా మారిందిట.  గయాసురుడు రాక్షస శ్రేష్ఠుడు.  ఆయనవంక చూసినా, ఆయనని తాకినా వారి పాపాలన్నీ పటాపంచలయిపోయేవిట.  అందుకే, అంత పుణ్యాత్ముడయిన గయాసురుడి శరీరం  కొండలు గుట్టలుగా మారిపోయాక అనేక దేవీ దేవతల ఆలయాలు అక్కడంతా వెలిశాయిట.  ఇక్కడ అనేక ఆలయాలు వున్నాయి.  సమయం వున్నవారు వాటిగురించి కనుక్కుని దర్శించవచ్చు.

ఇక్కడ షాపుల్లో విష్ణుపాదాలు అమ్ముతారు.  అవి దేవుడిదగ్గర పెట్టి పూజిస్తే మంచిదని అందరూ తెచ్చుకుంటారు.  కొందరు శ్రాధ్ధ కర్మ చేసేటప్పుడు పిండాలని వాటిమీద పెడతారు.

ఉదయం 11 గం. కల్లా అక్కడ కార్యక్రమం అయిపోయి మా విడిదికి వచ్చాము.  భోజనం, కొంచెం విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం 2 గం. లకు తిరుగు ప్రయాణం మొదలైంది.

గయలో వెలిసిన మంగళ గౌరి ఆలయం గురించి వచ్చే పోస్టులో.  ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.

 ఫల్గుణీ నది (నీళ్ళు లేవు) 
 కార్యక్రమాలు (ఎడమవైపు స్త్రీలు పండు వదులుతున్నారు, కింద కూర్చున్నవారు కర్మకాండలు చేస్తున్నారు)
విష్ణుపాదం ఆలయం
ఆలయ ఆవరణలో వటవృక్షం (బుధ్ధుడు తపస్సు చేసినచోటు)

Monday, September 13, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 15




సీతా మడి

అలహబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుంచి సుమారు 50 కి.మీ. తర్వాత రహదారినుంచి 10 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది సీతామడి.  ఈ ప్రదేశాన్ని అభివృధ్ధి చేసి 15 ఏళ్ళు అవుతోంది.  సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం ఇదని కొందరి నమ్మిక.  రెండంతస్తుల సీతమ్మవారి ఆలయంలో ఆవిడ విగ్రహాలు, వెనుక అద్దాలతో లవ కుశులు, రాముడు వగైరా చిత్రాలు వున్నాయి. 

ఈ ఆలయ ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు వున్నాయి.  ఈ రెండు ఆలయాలలో ప్రదక్షిణ మార్గాలు సొరంగ మార్గంలా ఏర్పాటు చేయబడి యాత్రీకులను ఆకర్షిస్తుంటాయి.  ఆంజనేయస్వామి ఆలయం ముందు అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వుంది.

సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు వుంది.  సుందర ప్రాకృతిక దృశ్యాల మధ్య  లాయడ్స్ స్టీల్ గ్రూప్ వారిచే అభివృధ్ధి చెయ్యబడ్డ ఈ ఆలయాలను ప్రయాగ వెళ్ళివచ్చే యాత్రీకులంతా తప్పక దర్శిస్తారు.
  
సీతా దేవి ఆలయం
పై అంతస్తులో సీతాదేవి విగ్రహం
క్రింది అంతస్తులో సీతాదేవి విగ్రహం
100 అడుగుల పైన ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం