Thursday, December 11, 2008

శ్రీ హరి హరసుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఆలయ ప్రాంగణంలో గంగాధరుడు, అంజనీ పుత్రుడు (రెండు విగ్రహాలకీ ఎత్తులో చాలా తేడా వుంది)
ఒకే పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు

బయటనుంచి ఆలయ దృశ్యం


పాలేరు ప్రాజెక్టు



శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఖమ్మం నుంచి 23 కి.మీ. ల దూరంలో వున్నది వైరా గ్రామం. 14 ఏళ్ళ క్రితం శ్రీ యండ్రపూడి కృష్ణారావు స్వామి గారి సంకల్పంతో కట్టబడి ఆయనతో సహా 18 మంది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో దిన దిన ప్రవర్ధమానమవుతున్న క్షేత్రమిది. దూరంనుంచే రా రమ్మని పిలుస్తున్నట్లున్న 54 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం, చుట్టూ అందమైన ఆలయ సముదాయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయం

1995 లో ఈ దేవాలయంలో శబరిమల ఆలయానికి చెందిన శ్రీ కేశవన్ నంబూద్రి, శ్రీ వాసుదేవన్ నంబూద్రి గార్ల ఆధ్వర్యంలో 9 రోజుల పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో 18 సార్లు ప్రదక్షిణ చేసి విద్య, వ్యాపారం, వివాహం వగైరా విషయాలలో ఏమైనా కోరుకుని, కోరిక తీరిన తర్వాత 108 సార్లు ప్రదక్షణలు చేస్తారు భక్తులు. కొందరు కోరిన కోర్కెలు తీరితే రూపాయ నాణేలు, బెల్లం, ధాన్యాలు వగైరా తులాభారం తో తమ మొక్కు చెల్లించుకుంటారు.

ఇక్కడ అయ్యప్ప దీక్షా సమయంలో బుధ, శని వారాల్లో దీక్ష తీసుకున్న స్వాములకు రోజూ వెయ్యి మందికి దాకా అన్నదానం జరుగుతుందట.


అభయాంజనేయ స్వామి

దూరంనుంచే భక్తులకు కనువిందు చేసే ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ పీఠం ఎత్తు నేల మీదనుంచి 9 అడుగులు, స్వామి విగ్రహం ఎత్తు పీఠం మీద నుంచి 45 అడుగులు, అంటే మొత్తం 54 అడుగుల ఎత్తు విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ గుడి. పీఠానికి ముందు చిన్న మందిరంలో స్వామి చిన్న విగ్రహానికి పూజలు చేస్తారు. 2-12-1999 న శ్రీ చిన్న జియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 5 రోజులు సుదర్శన యాగం చేసిన తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఇంత ఎత్తు విగ్రహం తెలంగాణాలో ఇంక ఎక్కడా లేదని శ్రీ కృష్ణారావుగారన్నారు.

ఇప్పటిదాకా ఈ 54 అడుగుల ఎత్తైన స్వామికి అభిషేకం కేవలం వాన వచ్చినప్పడే. ఇప్పడు ఈ స్వామికి పైన గొడుగు కట్టి దానిలోంచి షవర్ ద్వారా అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారుట. డిశంబరు మొదటి వారంలో దీనికి ప్రారంభోత్సవం జరుగుతుందిట. అప్పుడు కోటి పూలతో స్వామికి పూజ చేస్తారుట.

రామ మందిరం.

2002 లో ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడా నిత్యపూజలు జరుగుతుంటాయి.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము

ఇక్కడ గర్భాలయంలో ఒకే పీఠం మీద 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ తరహా ఆలయం తెలంగాణాలో ఇక్కడే కనిపిస్తుంది. దేవాలయ ఆవరణలో, శివుడు, విఘ్నేశ్వరుడు, అంభిమాత, నవగ్రహాలు, లక్ష్మీనారాయణులకి చిన్న ఆలయాలు వున్నాయి. ఇది శివ పంచాయతనం. అంటే, శివుడు, విష్ణువు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు వుంటారు. ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

వెంకటేశ్వరస్వామి దేవాలయం
శ్రీ చిన్నజియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 7 రోజులపాటు విష్ణు సహస్రయాగం చేసిన తర్వాత 28-2-2008 న విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ ప్రతి శనివారం స్వామికి కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

ఇంక ముందు సాయిబాబా దేవాలయం, కళ్యాణ మంటపం కూడా కట్టే ఆలోచన వున్నదట.


ఇంతమటుకూ ఇక్కడ చండీయాగం, సుదర్శన యాగం, రుద్రయాగం, విష్ణు సహస్రయాగం, లక్ష్మీ నారాయణ యాగం అనే అయిదు యాగాలు జరిగాయట.

ఆలయ ప్రాంగణంలో చిన్న ఉద్యానవనం, అందమైన అనేక దేవతా విగ్రహాలు ఆలయాల అందాన్ని మరింత పెంచుతూ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతాలకెళ్ళిన ప్రతి ఒక్కరూ, దూరమైనా అవకాశాన్నిబట్టి వెళ్ళాలనుకునేవాళ్ళూ తప్పక చూడవలసిన ఆలయ సమూహమిది.

ఈ ఆలయాల్లోకూడా కొన్ని రోజులలో మాత్రమే భోజన సదుపాయం వుంటుంది కనుక మీ జాగ్రత్తలో మీరు వెళ్ళండి. అలాగే వసతి కూడా ఖమ్మంలోనే.

అదనపు ఆకర్షణలు

ఖమ్మం రోడ్డులో షుమారు 30 కి.మీ. వెళ్ళాక పాలేరు ప్రాజెక్టు వస్తుంది. విశాలమైన ఈ జలాశయం ప్రక్కనే వున్న చిన్న పార్కు దగ్గర కొంచెంసేపు సేద తీరవచ్చు.

వైరా దాటిన తర్వాత జంక్షన్ లో ఎడమ వైపు తిరిగి లోపలికి 3, 4 కి.మీ. లు వెళ్తే వైరా రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు దాకా వెళ్ళేటప్పుడు వాహనం లో బండ్ పైనించి వెళ్ళచ్చట తిరిగి వచ్చేటప్పుడు ప్రక్కనే వున్న రోడ్డు మీదనుంచి రావాలిట. బండ్ మీదనుంచి వెళ్తే సరదాగా వుంటుంది. మాకు తెలియక రెండుసార్లూ ప్రక్క రోడ్డు మీదనుంచే వెళ్ళాము.










4 comments:

కొల్లూరి సోమ శంకర్ said...

మంచి సమాచారం అందించారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న నాకు ఆ గుడి ప్రాంగణం ఫొటొలు చూడగానే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుండనిపించింది.
కొల్లూరి సోమ శంకర్

lakshmivenkateshwarlu said...

సోమశంకర్ గారూ,
మీకు వీలైతే తప్పక వెళ్ళిరండి. అక్కడ కృష్ణారావుగారు (తాతయ్య గురు స్వామి గారు) వుంటారు. ఆయన అక్కడ గురు స్వామి. స్వాములకు అక్కడ భోజన సదుపాయం కూడా వున్నది. అయితే అది బుధ, శని వారాలలేనా, దీక్ష అన్ని రోజులూనా కనుక్కుంటే మీకు ఇబ్బంది వుండదు. దీక్షలో అన్ని చోట్లా తినరు కదా. వెళితే మా నమస్కారాలు చెప్పండి. లక్ష్మీ వేకటేశ్వర్లు, హైదరాబాదునుంచి వచ్చారు, మీ గుడి గురించి ఆంధ్రభూమిలో వాశారు అంటే గుర్తు పడతారు. తాతయ్య గురుస్వామి ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను
(T)251618 (R) 251363 Cell 98669 77333
మీ దీక్ష దిగ్విజయంగా సాగాలనే శుభాకంక్షలతో
psmlakshmi
psmlakshmi.blogspot.com

THOTAKURI SRINIVAS said...

సార్, దయచేసి జీళ్ళచెరువు గ్రామం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం గురించి వ్రాయండి.ఇది చాలా పురాతనమైన మాహత్తుగల దేవాలయం. ఇది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఖమ్మానికి 16 కి.మి. దూరం లో ఉంటుంది.

psm.lakshmi said...

తప్పకుండా ప్రయత్నిస్తాను శ్రీనివాస్ గారూ. ప్రాచీన లయాలుగురించి ఇలా ఒకరికొకలు తెలియజేసుకోవటంవల్ల అనేఆక విశేష ఆలయాలగురించి అందరికీ తెలుస్తుది. ఇంకొక ముఖ్య విషయం..అలాంటి ఆలయాలగురించి మీకు తెలిసిన సమాచారంకూడా తెలియజేస్తే బాగుంటుంది. చాలా ఆలయాల్లో ఎప్పటిదోకూడా తెలియదు, చాలా మహత్యంకలది అనే సమాచారం మాత్రమే వస్తోంది.