Wednesday, February 11, 2009

పాపి కొండలు, తూర్పు గోదావరి జిల్లా

పేరంటాలపల్లి నుంచి పాపి కొండల అందాలు
కొండల నడుమ


పాపిడి కొండలు (తర్వాత జనాల నోళ్ళల్లో పాపి కొండలు అయ్యాయి) మధ్య లాంచీల షికారు

దేవీ పట్నం పాత, కొత్త పోలీసు స్టేషన్లు

భోజనం తయార్


గండి పోచమ్మ ఆలయం


పట్టిసీమ వీరభద్ర స్వామి గుడి


ప్రయాణానికి జాబిలి రెడీ


(ఆంధ్ర భూమి 12-2-2009 సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసం)



పాపికొండలు

అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? అయితే మీరు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూసేవుంటారు. ఇంకా చూడలేదా అదేమిటండీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ కొండలలో సగందాకా మునిగిపోతాయి.. మన రాష్ట్రంలో వుండి, కనుమరుగు కాబోతున్న ఈ అందాలను మనం చూసి ఆ ఙాపకాలను పదిలపరుచుకుని మన వారసులకు అందివ్వాలికదా. అయితే వెంటనే బయల్దేరండి.

రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 500 రూ.లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు. మరి రెండవ ప్రయాణం భద్రాచలం దాకా. ఇది రెండు రోజుల ప్రయాణం. భద్రాచలంలో శ్రీ రామచంద్రుని ప్రత్యేక ధర్శనం చేయించాక తిరుగు ప్రయాణంలో ప్రసిధ్ధి చెందిన మద్ది ఆంజనేయస్వామి దర్శనం చేయించి తీసుకు వస్తారు. బహుశ తిరుగు ప్రయాణం బస్ లో అనుకుంటా రిజర్వు చేసుకునేటప్పడు ముందు కనుక్కోండి. ఈ ప్రయాణంలో పాపి కొండలు ఇంకా అందంగా వుంటాయంటారు. ఇప్పడు మేము వెళ్ళిన ఒక రోజు ప్రయాణం వివరాలు.


ఉదయం 7-30 కి రాజమండ్రి లోని లాంచీల రేవు దగ్గర వున్న మారుతీ ట్రావెల్స్ వారి ఆఫీసు దగ్గరనుంచి బస్ లో బయల్దేరి 8-50 కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న జాబిలి అనే లాంచీ ఎక్కాము. 9-10 కి జాబిలి బయల్దేరింది. అల్ప పీడన ప్రభావంతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా వున్నది. మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరిగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.

నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట.

రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపోతాయట. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది.


కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు.

దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.

కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు.

ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి.

ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు రోజులో చాలా భాగం సన్నగా కురుస్తూనే వున్నాడు. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు మాలాగే.

మా తరువాత మజిలీ పేరంటపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట. ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 6-10కి పట్టిసం, అక్కడనుండి బస్సులో రాత్రి 8-00 గం. లకు లాంచీల రేవు చేరుకున్నాము.


శ్రీ కొవ్వలిగారు మారుతీ ట్రావెల్స్ వాళ్ళ ఫాను నెంబరు అడిగారు. అందరికీ పనికి వస్తాయని పూర్తి వివరాలు క్రింద ఇస్తున్నాను.
ఇది ఆంధ్ర భూమిలో ప్రచురించబడిందికదా. ఒక పాఠకుడు వ్రాశారు. వాళ్ళు వేరే ట్రావెల్స్ లో బుక్ చేసుకున్నారుట. టికెట్ డబ్బు ఎక్కువ తీసుకున్నారని సంబంధించిన వాళ్ళందరికీ ఆంధ్రభూమి వ్యాసం కాపీ పంపించి రిప్రజెంటు చేశారు. తర్వాత సంగతి తెలియదు. ఆయన రిప్రజెంటు చేసినట్లు వ్రాసిన ఉత్తరం మాత్రం తరువాత వారం ప్రచురించబడింది. మేము వెళ్ళింది 15-11-2008న.
Maruthi Mini Tours & Travels
(Franchise A.P. Tourism & Ministry of Indian Tourism,
Godavari Bund Road, Beside Shankara Mattam
Near BPCL Petrol Bunk, Rajahmundry, E.G. Dist, Andhra Pradesh.
for River & Road Packages
Phone 0883-2424577 (O)
2460749 (O)
Cekk 98661 46177, 94401 79377
For rent a cab service
phone 0883-2473118
Cell 98661 47177, 98661 49177










7 comments:

పరిమళం said...

లక్ష్మి గారూ !మాది రాజమండ్రి దగ్గర పల్లే .కాని పాపికొండలు చూడలేదు .కళ్ళకు కట్టినట్టు చూపించారు .కృతజ్ఞతలండీ .

సత్యసాయి కొవ్వలి said...

బాగుంది. మేముకూడా ప్లానులేస్తూనే గడిపేసాం. టూర్ ఆపరేటర్ల కాంటాక్ట్ నంబర్లేమైనా ఇవ్వగలరా.

S.VENKAT REDDY said...

Madam,
The photos and the narration of journey on SACRED RIVER GODAVARI is inspiring to expedite my old wish to fulfill the intended journey along with my friends in AG Office. Surely, we will able to enjoy every bit of moments when we undertake the journey in the coming raining season.
I am thankful to you for posting such a highly useful material.
Further I have gone through your prize winning article, Ms JYOTHIRMAYEE's event at our Open Air Auditorium - both the events attended by me. Fantastic spirit drives you to be so energetic and speedy in sharing your experiences and knowledge.
I wish to see many more contributions on your BLOG.
Yours,
S.Venkat Reddy
Accounts Officer
AG(A&E)AP Hyderabad
Email ID: s_venkat_reddy@yahoo.com

psmlakshmi said...

పరిమళ భరితమైన మీ వ్యాఖ్యలకి కృతజ్ఞతలు పరిమళంగారూ.

సత్యసాయిగారూ, మేము రాజమండ్రి, లాంచీల రేవులో వున్న మారుతీ ట్రావెల్స ద్వారా వెళ్ళాము. వారి విజిటింగు కార్డు తెచ్చానుగానీ వెతికిన వెంటనే కనిపించలేదు. దొరికిన వెంటనే ఇవ్వగలను.

వెంకట రెడ్డిగారూ, మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలండీ. తెలుగులో బ్లాగు ఏమైనా మొదలు పెట్టారా
psmlakshmi

psmlakshmiblogspotcom said...

సత్యసాయిగారూ, ఇవాళ దేనికోసమో వెతుకుతూ వుంటే మారుతీ ట్రావెల్స్ వాళ్ళ బ్రోచర్ కనబడిందండీ. వెంటనే మీరడిగిన వివరాలు ఇక్కడ ఇస్తున్నాను అందరికీ పనికి వస్తాయికదాని.
Maruthi Mini Tours & Travels (Franchise A.P.Tourism & Ministry of Indian Tourism, Govt. of India

web site www.maruthitourism.com

See post for further details.
psmlakshmi

బొల్లోజు బాబా said...

మీ బ్లాగు చాలా బాగుంది.
పాపికొండలు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న మాకు మంచి సమాచారం ఇచ్చారు. థాంక్యూ

ravi kanth said...

Chala baga rasaru ,chaduvuthunte nijanga ala velli vachinatundi