Sunday, June 28, 2009

నా బ్లాగు పుట్టిన రోజు

నా బ్లాగు పుట్టిన రోజు

28-6-2009 న నా బ్లాగు పుట్టిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం ఈ రోజు ప్రాణం పోసుకున్న నా బ్లాగు ప్రయాణంలో ఎన్నో మజిలీలు, ఎన్నో పరిచయాలు, ఎన్నో గుర్తింపులు..అన్నీ మధురమైన జ్ఞాపకాలే. ఎందరో సలహాదారులు, ఇంకెందరో స్నేహితులు అందరికీ కృతజ్ఞతాపూర్వక అభివందనలు. ప్రమదావనంలో ఎన్నో సరదాలు, ఎంతో సందడి...అవ్వన్నీ అతి మధురాలు. వెరసి రిటైరయిన తర్వాత కూడా ఖాళీ లేకుండా, సమయం వృధా చేయకుండా గడిపాను ఈ ఏడాదీ. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా తెలుగు బ్లాగర్ల గుంపుకు పరిచయం చేసిన శ్రీ దూర్వాసుల పద్మనాభంగారికి, ప్రమదావనం సందడిలోకి ఆహ్వానించటమేగాక నా బ్లాగు డిజైన్ చేసి, అవసరమైనప్పుడల్లా సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న శ్రీమతి జ్యోతి వలబోజుగారికు ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని, తోటి బ్లాగర్ల ప్రోత్సాహ ప్రవాహం నిరాటంకంగా వుండాలనీ కోరుకుంటున్నాను. ఈ బ్లాగు ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ, ఇంకా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న మావారు శ్రీ వెంకటేశ్వర్లు కీ నమస్సుమాంజలులు. మా పిల్లలకి ఆశీస్సులు.

చివరిగా ఒక్కమాట..వయసు లో పెద్దవారమని, ఏమంటే ఏమనుకుంటారోనని కొంతమంది దూరంగా వుంటున్నారు. ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగర్ల మధ్య వుండాల్సినది అభిమానం, సద్విమర్శ వగైరాలేగానీ పెద్దవారని దూరంగా వుంచటంకాదు. పెద్దవాళ్ళు బ్లాగు ప్రపంచంలో అడుగు పెట్టటానికి కారణం ఇవ్వన్నీ మర్చిపోవటానికే. ఇక్కడ అందరూ సమానులే అని కొందరు బ్లాగు మిత్రులు ఇదివరకే చెప్పిన మాటలు నిజంగా నిజంకావాలని కోరుతున్నాను.

మిత్రులందరూ నా బ్లాగుకి ఆశీర్వచనం పలకమని కోరుతున్నాను.

Sunday, June 21, 2009

శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, వాడపల్లి

ఆలయం లోపల దృశ్యం
ఆలయ గోపురం

శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్ధానము, వాడపల్లి

ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి తీర్ధం గురించి చాలామంది వినే వుంటారు. ప్రతి సంత్సరం చైత్రశుధ్ధ ఏకాదశినాడు ఈ వాడపల్లిలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం, తీర్ధం జరుగుతుంది. ఈ వేడుకలు చూడటానికి వేలాదిమంది భక్తులు తరలి వస్తారు.

పూర్వం దండకారణ్యంగా పిలువబడిన ఈ ప్రాంతంలో అనేక మంది ఋషిపుంగవులు తపస్సుచేశారు. ఎందరో మహాఋషుల తపస్సుతో పావనమైన ఈ ప్రదేశంలో, పవిత్ర గోదావరి నదిలో 300 సంవత్సరాలక్రితం లభ్యమైన స్వామి విగ్రహాన్ని మేళతాళాలతో తోడ్కొనివచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రతిష్ట చేశారు. తర్వాత పెద్దాపురం సంస్ధానాధీశులు శ్రీ వత్సవాయి తిమ్మజగపతిరాజు స్వామివారిని దర్శించి స్ధిరాస్తులు సమర్పించారు.

స్వయంభూ అయిన ఈ స్వామి విగ్రహం రక్తచందనం చెక్కలో మూర్తీభవింపబడ్డది. ఇటువంటి చెక్క విగ్రహం ఒక్క వాడపల్లిలోనే వుందంటారు.

భారతదేశ ప్రజలు గర్వించదగిన విషయం ఇంకొకటి జరిగింది ఇక్కడ. 1931వ సంవత్సరంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు ఈ స్వామివారి ఉత్సవంలో రధంపై స్వరాజ్యకేతనాన్ని బాపూజీ చిత్రపటంతో సహా ఊరేగించి మనవారి వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పారు. అంతటి పుణ్యభూమి ఇది.

ఏటా వాడపల్లి తీర్ధంనాడేకాక నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే ఈ దేవస్ధానం రావులపాలెంనుంచి లొల్లమీదుగా ప్రయాణిస్తే కేవలం 8 కి.మీ. ల దూరంలోనే వుంది.

దేవాలయం ఫోన్ నెంబరు 08855 271888





Friday, June 19, 2009

క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో, రాయల్ ఒోక్, మిచిగన్

క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో, రాయల్ ఓక్, మిచిగాన్

వాషింగ్టన్ ఎవెన్యూ, రాయల్ ఓక్ డౌన్ టౌన్, మిచిగాన్ లో జూన్ 11, 12, 13న క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో జరిగింది. దీనికోసం ఒక రోడ్డుని ట్రాఫిక్ రాకుండా మూసి వేశారు. షుమారు 120 మంది కళాకారులు తమ కళలని ఇక్కడ ప్రదర్శించారు. రోడ్డు మొత్తం చిన్న చిన్న గుడారాలలో స్టాల్స్ పెట్టారు. స్త్రీల ఆభరణాలు, గృహాలంకరణ వస్తువుల స్టాల్స్ ఎక్కువ వున్నాయి.

అందరినీ ఆకర్షించినది గాజు అలంకరణ వస్తువులు తయారు చేయటాన్ని ప్రదర్శించిన స్టాల్.

చిన్న పిల్లలని ఆకర్షించటానికి చిన్న చిన్న రాళ్ళతో వస్తువులను తయారు చేయటం, మోటారుతో తిరిగే కుమ్మరి చక్రం మీద కుండ తయారు చెయ్యటం, ఇంకా తెల్ల షర్టులమీద స్ప్రే పెయింట్ చెయ్యటం ఇలాంటి స్టాల్స్ వున్నాయి. 10 డాలర్లు ఇచ్చి తెల్ల షర్టుమీద పిల్లలు వాళ్ళకిష్టమైన రంగులు స్ప్రే చేశారు. అవి పడ్డ ఆకారాలు చూసి తాము అద్భుతంగా పైంట్ చేశామనుకుని మురిసిపోయారు పిల్లలు. మనవాళ్ళు కాయితాలమీద ఇంకు జల్లి వాటిని మడిచి రకరకాల ఆకారాలను చూసి మురిసిపోతారుకదండీ. అలాగే.

షో అంటే తినుబండారాలు తప్పనిసరికదా. కేండీలు, ఐస్ క్రీమ్సూ, ఇవేకాక ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక ప్రత్యేక తినుబండారం, మన పూరీలు పెద్ద సైజులో వున్నట్లుంటాయి..వాటిమీద చక్కెర వగైరాలు వేసి ఇస్తారు..అవీ, ఇంకా రకరకాలు.

వీటన్నింటి మధ్యలో ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి సంగీత కచేరీలు (సంగీత కచేరీ అన్నానని మనవి వూహించుకోకండి. ఇప్పుడు చెబుతున్నది అమెరికా గురించి..అందుకని వెస్ట్రన్ మ్యూజిక్ వూహించుకోండి.)

వీటన్నిటి మధ్యలో ఒకాయన ప్రక్క వాయిద్యాలేమీ లేకుండా ఎలక్ట్రిక్ గిటార్ మీద అక్కడివారు కోరిన పాటలు వాయిస్తున్నాడు. అలాగే ఆయన ఆల్బమ్స్ అమ్మకానికి వున్నాయి. వివరాలన్నీ ఒక బోర్డుమీద రాసి పక్కన పెట్టాడు.

ఈ షోలో ఆడంబరమైన వస్తువులేమీలేకపోయినా ఇక్కడివారిలోని అభిమానాలు పెల్లుబికాయనిపించింది. చాలామంది తమ పెంపుడు కుక్కలని తెచ్చారు. ఎంత భయంకరమైన కుక్కలైనా తమ యజమానులతో హాయిగా తిరిగాయి ఎవరినీ భయపెట్టకుండా. పిల్లలు ప్రదర్శనకన్నా ఈ కుక్కలతో ఆడటానికి ఎక్కువ ఇష్టపడటం, ఒకరినొకరు పలకరించుకోవటం, వీటన్నింటితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

సందర్శకులతో వచ్చిన ఒక బుల్లి కుక్క ఒక పెద్దకుక్కని భయపెట్టటానికి చేసిన విశ్వ ప్రయత్నం అందర్నీ ఆకర్షించింది. మీ కోసం ఆ ఫోటోలు..చూడండి మరి.