అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో. త్రేతా యుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది. తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు.
ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది.
ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి. ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట. సమయాభావంవల్ల పార్కు చూడలేదు.