గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడిశక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి.. అందులో ముఖ్యమైన శరీర భాగాలు పడిన ప్రదేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు. గయలో అమ్మవారి తొడ భాగం పడ్డది.
ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది. మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన చిన్న ఆలయం ఇది.
గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి. గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు.
ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా ముఖ్య కేంద్రం గయ. గయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది పితృ కార్యాలు. చనిపోయినవారికి ఇక్కడ శ్రాధ్ధ కర్మలు చేస్తే చాలా మంచిదని, పితృదేవతలు తరిస్తారని అంటారు. కొందరైతే ఇక్కడ ఒకసారి శ్రాధ్ధ కర్మలు చేస్తే తిరిగి ప్రతి ఏడాదీ చెయ్యక్కరలేదు అంటారుగానీ అది నిజం కాదని అక్కడివారన్నారు.
గయకు చేరుకోవటానికి రైలు, బస్ సౌకర్యాలున్నాయి. సాధారణంగా కాశీ వెళ్ళినవాళ్ళు అక్కడనుండి ప్రైవేటు వాహనం మాట్లాడుకుని గయ వెళ్ళి వస్తారు. మేమూ అలాగే ఒక వాహనంలో రాత్రి 1 గం. కి బయల్దేరి ఉదయం 7 గం. లకు గయ చేరుకున్నాము. మా వేన్ డ్రైవరు సరాసరి ఒక తెలుగు బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు పెద్దదే. 4, 5 ఆవులు కూడా ఆ ఇంట్లో వున్నాయి.
గయలో వుండటానికి అనేక వసతులు వున్నట్లే ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులుకూడా యాత్రీకుల అవసరానికి ఉచితంగా వసతి ఇస్తారు. ముందే చెప్పి డబ్బు కడితేకార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇవ్వన్నీ ఎలా వుంటాయని అడగద్దు. మన అవసరార్ధం ఒక రోజు గడిపి వచ్చెయ్యటమే.
వెళ్ళిన వెంటనే అక్కడవున్న బ్రాహ్మణుడు మా గ్రూప్ లో వారంతా వచ్చిన పని, మా కార్యక్రమాలు తెలుసుకుని మా కందరికీ ఒక గది ఇచ్చి స్నానాలు కానిచ్చి త్వరగా వస్తే కార్యక్రమాలు మొదలు పెట్టచ్చన్నారు. బయట 5, 6 స్నానాల గదులు, వాష్ బేసిన్లు, పంపులు వున్నాయి. కొందరు మగవారు పంపుల దగ్గరే స్నానాలు కానిస్తున్నారు.
అక్కడ రేట్లు బేరం ఆడటం లేదు. బాగానే వుంది. కానీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుని, కూర, కాయ, పండు వదలనన్నానని నా మీద ఆ బ్రాహ్మణునికి కొంచెం కోపం వచ్చింది. అలా వదిలితే మళ్ళీ ఆ వస్తువు తిన కూడదు. మే మా దేశ దిమ్మరులం. ఏ రోజు ఎక్కడ తింటామో తెలియదు. వెళ్ళిన చోటల్లా ఆ వంటల్లో నేను వదిలేసినవి వేశారేమో ఎక్కడ కనుక్కోను. ఆ అవస్తలు పడేకన్నా ఆ పని చేయకపోవటమే నాకు ఉచితం అనిపించింది. పైగా ఈ మధ్య నలుగురూ చెప్పేవి విని కొంచెం బుఱ్ఱ పెంచుకుంటున్నానులెండి. మన అహంకార మమకారాలన్నీ వదిలి భగవంతుని చేరుకోవటానికి చేసే ప్రయత్మంలో అలా మనకిష్టమయిన వస్తువులు వదిలిపెట్టటం మొదటి మెట్టు అని ఎక్కడో విన్నాను. ఏదో పండూ, కూరా బదులు నా అహంకారం కొంచెంకాకపోతే కొంచెమన్నా వదలటమే నాకు తేలిక అనిపించింది.
అన్నట్లు గయలో పితృకార్యాలేకాక, మనం అప్పటిదాకా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పండూ, కూరా వగైరాలను వదిలి పెట్టటం చేస్తారు.
స్నానాలయ్యాక కొంచెం దూరంలో వున్న విష్ణుపాదం ఆలయానికి నడిచే వెళ్ళాము. కొంచెం ఎత్తులో ఆలయం. ఆ ఆలయానికి చేరుకునే లోపలే వున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు పురోహితులు. చాలామందే వున్నారు. పురోహితుడు మా కార్యక్రమాలకని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళటంతో మేము గుడికి వెళ్తున్నట్లు, అక్కడ ఆలయం వున్నట్లుకూడా ముందు తెలియలేదు. మా వాళ్ళ కార్యక్రమాలయ్యాక దేవాలయానికి వెళ్ళిరమ్మని పురోహితుడు చెబితే ఇక్కడే వుందా అనుకున్నా. ఈ ప్రదేశానికి ప్రక్కనే ఫల్గుణీ నది. ఒక్క చుక్క కూడా నీరు లేదు.
దేవాలయంలో ఒక పెద్ద బేసిన్ లాంటి దాని మధ్యలో పెద్ద విష్ణు పాదం ఆకారం వుంది. ఆ బేసిన్ చుట్టూ వెండి రేకు తాపడం చేశారు. అందరూ ఆ పాదం తాకి నమస్కారం చేస్తున్నారు. మేమూ ఫాలో అయిపోయాము. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 1787 లో రాణీ అహల్యాబాయి పునర్నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ పునర్నిర్మాణమే.
ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలేకాక ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది. భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు. ఈ వృక్షం కింద గౌతమ బుధ్ధుడు చాలాకాలం తపస్సు చేశాడుట. అందుకే ఈ క్షేత్రం హిందువులకేకాక బౌధ్ధ మతస్తులకు కూడా పుణ్య క్షేత్రం.
ఈ విష్ణుపాదం ఆలయం గురించి ఒక చిన్న కధ....పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు. శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి తన పాదంతో తొక్కి చంపాడుట. అప్పుడు గయాసురుడి శరీరం చిన్న కొండలుగా రాళ్ళ గుట్టలుగా మారిందిట. గయాసురుడు రాక్షస శ్రేష్ఠుడు. ఆయనవంక చూసినా, ఆయనని తాకినా వారి పాపాలన్నీ పటాపంచలయిపోయేవిట. అందుకే, అంత పుణ్యాత్ముడయిన గయాసురుడి శరీరం కొండలు గుట్టలుగా మారిపోయాక అనేక దేవీ దేవతల ఆలయాలు అక్కడంతా వెలిశాయిట. ఇక్కడ అనేక ఆలయాలు వున్నాయి. సమయం వున్నవారు వాటిగురించి కనుక్కుని దర్శించవచ్చు.
ఇక్కడ షాపుల్లో విష్ణుపాదాలు అమ్ముతారు. అవి దేవుడిదగ్గర పెట్టి పూజిస్తే మంచిదని అందరూ తెచ్చుకుంటారు. కొందరు శ్రాధ్ధ కర్మ చేసేటప్పుడు పిండాలని వాటిమీద పెడతారు.
ఉదయం 11 గం. కల్లా అక్కడ కార్యక్రమం అయిపోయి మా విడిదికి వచ్చాము. భోజనం, కొంచెం విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం 2 గం. లకు తిరుగు ప్రయాణం మొదలైంది.
గయలో వెలిసిన మంగళ గౌరి ఆలయం గురించి వచ్చే పోస్టులో. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.
ఫల్గుణీ నది (నీళ్ళు లేవు)
కార్యక్రమాలు (ఎడమవైపు స్త్రీలు పండు వదులుతున్నారు, కింద కూర్చున్నవారు కర్మకాండలు చేస్తున్నారు)
అలహబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుంచి సుమారు 50 కి.మీ. తర్వాత రహదారినుంచి 10 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది సీతామడి. ఈ ప్రదేశాన్ని అభివృధ్ధి చేసి 15 ఏళ్ళు అవుతోంది. సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం ఇదని కొందరి నమ్మిక. రెండంతస్తుల సీతమ్మవారి ఆలయంలో ఆవిడ విగ్రహాలు, వెనుక అద్దాలతో లవ కుశులు, రాముడు వగైరా చిత్రాలు వున్నాయి.
ఈ ఆలయ ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు వున్నాయి. ఈ రెండు ఆలయాలలో ప్రదక్షిణ మార్గాలు సొరంగ మార్గంలా ఏర్పాటు చేయబడి యాత్రీకులను ఆకర్షిస్తుంటాయి. ఆంజనేయస్వామి ఆలయం ముందు అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వుంది.
సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు వుంది. సుందర ప్రాకృతిక దృశ్యాల మధ్య లాయడ్స్ స్టీల్ గ్రూప్ వారిచే అభివృధ్ధి చెయ్యబడ్డ ఈ ఆలయాలను ప్రయాగ వెళ్ళివచ్చే యాత్రీకులంతా తప్పక దర్శిస్తారు.
ఈ భవనం చర్చ్ లేన్ ప్రాంతంలో వున్నది. భారత దేశ ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి 1899 లో ఈ భవనం కొని వుండసాగారు. అప్పుడు ఈ భవనం పేరు ఆనంద భవన్ అని పెట్టుకున్నారు. తర్వాత పక్కనే వున్న ఖాళీ స్ధలంలో వేరొక భవనం నిర్మించుకుని 1927 లో ఆ భవనంలోకి మారారు. కొత్త భవనం పేరు కూడా ఆనంద భవన్ అనే పెట్టారు. పాత భవనాన్ని నేషనల్ కాంగ్రెస్ కి ఇచ్చారు. అప్పుడు దాని పేరు స్వరాజ్ భవన్ గా మార్చారు. 1931 లో పండిట్ మోతీలాల్ నెహ్రూ మరణించిన తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత దేశ ప్రజల పురోభివృధ్ధి గురించి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఈ స్వరాజ్ భవన్ ని ఆ ట్రస్టుకి అప్పగించారు. ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ వుంటే, మరి కొంత భాగాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వుపయోగించుకుంటోంది.
భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి సాక్షీభూతంగా నిలిచిన ఈ సువిశాల భవనంలోనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. అనేక ముఖ్య రాజకీయ సంఘటనలకి వేదిక అయిన ఈ భవనంలోనే దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జన్మించింది.
ఇందులో వున్న మ్యూజియం సందర్శన సమయాలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా. ప్రతి సోమవారం సెలవు దినం.
ఆనంద భవన్
భారతదేశ స్వాతంత్ర్య సమరంలోని అనేక ముఖ్య సంఘటనలకు ఆనంద భవన్ కూడా సాక్షీ భూతంగా నిలిచింది. ఈ భవనంలోనే అప్పటి జాతీయ నాయకులు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి.
మహాత్మా గాంధీ అలహాబాద్ వచ్చినప్పుడల్లా ఈ భవనంలోనే వుండేవారు. ఆయనకి సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు.
దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వివాహం ఈ భవనంలోనే జరిగింది. 1970 లో శ్రీమతి ఇందిరా గాంధీ ఈ భవనాన్ని దేశ ప్రజలకి అంకితం చేయటంతో ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం సందర్శన వేళలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-00 గంటలదాకా. సోమవారం, ఇంకా ప్రభుత్వ సెలవదినాలలో మూసి వుంటుంది.
ప్రయాగలో ఇతర సందర్శనీయ ప్రదేశాలు
సమయం వున్నవారు సందర్శించదగ్గ ఇతర ప్రదేశాలు.....నాగ వాసుకీ దేవాలయం, మన్ కామేశ్వర్ మహా దేవ్ మందిరం (ఈ మందిరం నుంచి యమునా నది అందాలు చూడవచ్చుట..ఇక్కడ శివునికిచ్చే హారతి, వెనువెంటనే జరిగే ప్రార్ధనలు చాలా బాగుంటాయిట), వేణీ మాధవ మందిరాలున్నాయి. వీటిని మేము చూడలేదు కనుక ఇంతకన్నా చెప్పలేను.
దీనితో ప్రయాగ విశేషాలు అయినాయి. వచ్చే పోస్టులో ప్రయాగనుంచి వారణాసికి వెళ్ళే త్రోవలో వున్న సీతా మడి గురించి.
యాత్ర చేసొచ్చామని తెగ సంబర పడుతున్నారు....ఇదేమన్నా కొత్త విషయమా, ఓ పది రోజులు ఇంట్లో కుదురుగా కూర్చుంటే చెప్పండి అదొక విశేషమవుతుంది మీ విషయంలో అంటారా? అనండి అనండి...మీరు కాకపోతే ఎవరంటారు? అయినా ఈ మధ్య మనుషుల మాటలు పట్టించుకోవటం మానేశానులెండి. ఇంతకీ ఈ ఉత్సాహానికి కారణం చెప్పమంటారా?
కాళ్ళు నేలమీద ఆన్చలేక పోయినా వైష్ణోదేవి దాకా ప్రయాణం పెట్టుకున్నామా, వెళ్ళేవరకూ వెళ్ళగలనో లేదో అనే భయం. పోనీ వాయిదా వేసుకోండని హితుల సలహా. సాయిబాబా లాగానే వైష్ణోదేవి కూడా ఆవిడ పిలిపించుకుంటేనే వెళ్ళగలమట. ఆవిడ నన్ను చాలా ఘట్టిగా రమ్మని ఆర్డరు వేసింది. అందుకే బయల్దేరాను. మా వారు ముందే ఆపీసు పనిమీద ఢిల్లీ వెళ్ళారు...వెనకే నేను. ఢిల్లీలో కూడా మూసిన కన్ను తెరవనంత జ్వరం. అయితే ఒకసారి యాత్ర ప్రారంభం అయ్యాక కాళ్ళు మాత్రం ఏ ఇబ్బందీ పెట్టలేదు. జ్వరం ఇద్దరినీ చెరో రెండు రోజులూ ఇబ్బంది పెట్టినా యాత్రలో ఏ ఒక్కటీ వదిలి పెట్టకుండా అన్నీ చూశాము. ఆ విశేషాలు కుంటుపడ్డ కాశీ కబుర్లు పూర్తి చేశాక చెబ్తాను.
ఈ లోపల ఒక విశేషం మీతో పంచుకోవటానికి అప్పటిదాకా ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా. యాత్రలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ బార్డరు (వాఘా బార్డరు అంటారు) వెళ్ళాము. మన వైపు ప్రతి రోజూ కనీసం 30,000 మంది జనం వస్తారుట. పాపం పాకిస్తాన్ వైపు మేము వెళ్ళిన రోజు ఒక రెండు వందల మందికూడా లేరు..బహూశా రంజాన్ ప్రభావమేమో. ఇంతమంది జనం భారత దేశం గురించి జయజయధ్వానాలు చేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. ఉత్సాహం ఉరకలు వేసింది.
అక్కడ ప్రతి రోజూ సాయం సమయంలో ఏ దేశం జెండాని ఆ దేశంవారు అవనతం చేసి భద్రపరుస్తారు. ఆ కార్యక్రమం మొదలయ్యేలోపల పిల్లలు పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని పాకిస్తాన్ బార్డరు దాకా పరిగెత్తి తిరిగి వచ్చారు. వాళ్ళని చూస్తుంటే మేమింక ఆగలేకపోయాము. అంతమంది జనంలో పైనెక్కడో వున్నవాళ్ళం నేనూ, మరో ఇద్దరు, శ్రీమతి హైమవతీ, శ్రీమతి వాణి, (వీళ్ళిద్దరూ కూడా హైదరాబాదునుంచి మాతో టూర్ కి వచ్చినవారే ... దోవలో బాగా స్నేహంకలిసింది...ట్రిప్ అంతా సరదాగా గడిచింది) అందరి మధ్యనుంచీ దోవ చేసుకుని కిందకి దిగి వచ్చి మేమూ జెండా తీసుకెళ్తామని అడిగాం. వెంటనే ఒక జెండా మాచేతిలో.....మేము వాఘా బార్డరుదాకా పరుగెత్తలేదుకానీ, ఆ జెండా పట్టుకుని నడిచాం. ఆ జెండాలో ఏముందో, మా అందరి ముఖాలలో గర్వం తొణికిసలాడింది. ఏదో సాధించినట్లే, చెప్పలేనంత సంతోషం వేసింది. ఐదు నిముషాలు జెండా పట్టుకున్నందుకే మాకంత సంతోషం, గర్వం వేస్తే, దేశం కోసం అనేక ఇబ్బందుల్లో ప్రాణం ఒడ్డి పోరాడుతున్న రక్షణ దళాలు ఇంకెంత గర్వపడాలి. నిజంగా వాళ్ళ జన్మలు ధన్యంకదా. మెరుపులా కదిలే వారి శరీరాలను చూస్తుంటే అనిపించింది ఆ వేగాలు సాధించటానికి ఎంత కష్టపడతారోనని.
మరి ఒక్కసారి మీరంతాకూడా మన వీర జవాన్లకి, మన భారత దేశానికీ జేజేలు చెప్పండి.