బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా ముఖ్య కేంద్రం గయ. గయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది పితృ కార్యాలు. చనిపోయినవారికి ఇక్కడ శ్రాధ్ధ కర్మలు చేస్తే చాలా మంచిదని, పితృదేవతలు తరిస్తారని అంటారు. కొందరైతే ఇక్కడ ఒకసారి శ్రాధ్ధ కర్మలు చేస్తే తిరిగి ప్రతి ఏడాదీ చెయ్యక్కరలేదు అంటారుగానీ అది నిజం కాదని అక్కడివారన్నారు.
గయకు చేరుకోవటానికి రైలు, బస్ సౌకర్యాలున్నాయి. సాధారణంగా కాశీ వెళ్ళినవాళ్ళు అక్కడనుండి ప్రైవేటు వాహనం మాట్లాడుకుని గయ వెళ్ళి వస్తారు. మేమూ అలాగే ఒక వాహనంలో రాత్రి 1 గం. కి బయల్దేరి ఉదయం 7 గం. లకు గయ చేరుకున్నాము. మా వేన్ డ్రైవరు సరాసరి ఒక తెలుగు బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు పెద్దదే. 4, 5 ఆవులు కూడా ఆ ఇంట్లో వున్నాయి.
గయలో వుండటానికి అనేక వసతులు వున్నట్లే ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులుకూడా యాత్రీకుల అవసరానికి ఉచితంగా వసతి ఇస్తారు. ముందే చెప్పి డబ్బు కడితే కార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇవ్వన్నీ ఎలా వుంటాయని అడగద్దు. మన అవసరార్ధం ఒక రోజు గడిపి వచ్చెయ్యటమే.
వెళ్ళిన వెంటనే అక్కడవున్న బ్రాహ్మణుడు మా గ్రూప్ లో వారంతా వచ్చిన పని, మా కార్యక్రమాలు తెలుసుకుని మా కందరికీ ఒక గది ఇచ్చి స్నానాలు కానిచ్చి త్వరగా వస్తే కార్యక్రమాలు మొదలు పెట్టచ్చన్నారు. బయట 5, 6 స్నానాల గదులు, వాష్ బేసిన్లు, పంపులు వున్నాయి. కొందరు మగవారు పంపుల దగ్గరే స్నానాలు కానిస్తున్నారు.
అక్కడ రేట్లు బేరం ఆడటం లేదు. బాగానే వుంది. కానీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుని, కూర, కాయ, పండు వదలనన్నానని నా మీద ఆ బ్రాహ్మణునికి కొంచెం కోపం వచ్చింది. అలా వదిలితే మళ్ళీ ఆ వస్తువు తిన కూడదు. మే మా దేశ దిమ్మరులం. ఏ రోజు ఎక్కడ తింటామో తెలియదు. వెళ్ళిన చోటల్లా ఆ వంటల్లో నేను వదిలేసినవి వేశారేమో ఎక్కడ కనుక్కోను. ఆ అవస్తలు పడేకన్నా ఆ పని చేయకపోవటమే నాకు ఉచితం అనిపించింది. పైగా ఈ మధ్య నలుగురూ చెప్పేవి విని కొంచెం బుఱ్ఱ పెంచుకుంటున్నానులెండి. మన అహంకార మమకారాలన్నీ వదిలి భగవంతుని చేరుకోవటానికి చేసే ప్రయత్మంలో అలా మనకిష్టమయిన వస్తువులు వదిలిపెట్టటం మొదటి మెట్టు అని ఎక్కడో విన్నాను. ఏదో పండూ, కూరా బదులు నా అహంకారం కొంచెంకాకపోతే కొంచెమన్నా వదలటమే నాకు తేలిక అనిపించింది.
అన్నట్లు గయలో పితృకార్యాలేకాక, మనం అప్పటిదాకా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పండూ, కూరా వగైరాలను వదిలి పెట్టటం చేస్తారు.
స్నానాలయ్యాక కొంచెం దూరంలో వున్న విష్ణుపాదం ఆలయానికి నడిచే వెళ్ళాము. కొంచెం ఎత్తులో ఆలయం. ఆ ఆలయానికి చేరుకునే లోపలే వున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు పురోహితులు. చాలామందే వున్నారు. పురోహితుడు మా కార్యక్రమాలకని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళటంతో మేము గుడికి వెళ్తున్నట్లు, అక్కడ ఆలయం వున్నట్లుకూడా ముందు తెలియలేదు. మా వాళ్ళ కార్యక్రమాలయ్యాక దేవాలయానికి వెళ్ళిరమ్మని పురోహితుడు చెబితే ఇక్కడే వుందా అనుకున్నా. ఈ ప్రదేశానికి ప్రక్కనే ఫల్గుణీ నది. ఒక్క చుక్క కూడా నీరు లేదు.
దేవాలయంలో ఒక పెద్ద బేసిన్ లాంటి దాని మధ్యలో పెద్ద విష్ణు పాదం ఆకారం వుంది. ఆ బేసిన్ చుట్టూ వెండి రేకు తాపడం చేశారు. అందరూ ఆ పాదం తాకి నమస్కారం చేస్తున్నారు. మేమూ ఫాలో అయిపోయాము. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 1787 లో రాణీ అహల్యాబాయి పునర్నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ పునర్నిర్మాణమే.
ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలేకాక ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది. భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు. ఈ వృక్షం కింద గౌతమ బుధ్ధుడు చాలాకాలం తపస్సు చేశాడుట. అందుకే ఈ క్షేత్రం హిందువులకేకాక బౌధ్ధ మతస్తులకు కూడా పుణ్య క్షేత్రం.
ఈ విష్ణుపాదం ఆలయం గురించి ఒక చిన్న కధ....పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు. శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి తన పాదంతో తొక్కి చంపాడుట. అప్పుడు గయాసురుడి శరీరం చిన్న కొండలుగా రాళ్ళ గుట్టలుగా మారిందిట. గయాసురుడు రాక్షస శ్రేష్ఠుడు. ఆయనవంక చూసినా, ఆయనని తాకినా వారి పాపాలన్నీ పటాపంచలయిపోయేవిట. అందుకే, అంత పుణ్యాత్ముడయిన గయాసురుడి శరీరం కొండలు గుట్టలుగా మారిపోయాక అనేక దేవీ దేవతల ఆలయాలు అక్కడంతా వెలిశాయిట. ఇక్కడ అనేక ఆలయాలు వున్నాయి. సమయం వున్నవారు వాటిగురించి కనుక్కుని దర్శించవచ్చు.
ఇక్కడ షాపుల్లో విష్ణుపాదాలు అమ్ముతారు. అవి దేవుడిదగ్గర పెట్టి పూజిస్తే మంచిదని అందరూ తెచ్చుకుంటారు. కొందరు శ్రాధ్ధ కర్మ చేసేటప్పుడు పిండాలని వాటిమీద పెడతారు.
ఉదయం 11 గం. కల్లా అక్కడ కార్యక్రమం అయిపోయి మా విడిదికి వచ్చాము. భోజనం, కొంచెం విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం 2 గం. లకు తిరుగు ప్రయాణం మొదలైంది.
గయలో వెలిసిన మంగళ గౌరి ఆలయం గురించి వచ్చే పోస్టులో. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.
ఫల్గుణీ నది (నీళ్ళు లేవు)
కార్యక్రమాలు (ఎడమవైపు స్త్రీలు పండు వదులుతున్నారు, కింద కూర్చున్నవారు కర్మకాండలు చేస్తున్నారు)
విష్ణుపాదం ఆలయం
ఆలయ ఆవరణలో వటవృక్షం (బుధ్ధుడు తపస్సు చేసినచోటు)
1 comments:
లక్ష్మి గారూ,
చాలా ఉపయోగకరమైన విషయాలు రాస్తున్నారు.....
మా ఇంట్లో సంక్రాంతికి,శ్రాద్ధకర్మలప్పుడు మా పురోహితుడు చెప్పే అక్షయావటం ఇదేనన్నమాట!
Post a Comment