వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది. ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు. కానీ అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడుట. విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.
తరువాత కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు. తరువాత కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించి, ఆలయానికి కొంత భూమిని కూడా ఇచ్చాడు. కాలగమనంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో, ఈ దేవస్ధానం వైభవం కూడా క్షీణించింది. సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది. ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి.
భారతదేశ స్వాతంత్ర్యానంతరం శ్రీ మగన్ లాల్ సమేజగారి స్వప్నంలో భద్రకాళి
అమ్మవారు దర్శనమిచ్చి ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. ఆయన పెద్దలందరి సహకారంతో ఆలయం పునర్నిర్మించగా, 29-7-1950న సంప్రోక్షణ గావింపబడి నాటినుంచీ నిత్య పూజలతో దినదినాభివృధ్ధి అవుతోంది.
10 అడుగుల పైనే ఎత్తయిన అమ్మవారి విగ్రహం అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూంటుంది. పూర్వం ఈ విగ్రహం భీకరంగా వుండేదట. భక్తుల సౌకర్యార్ధం అమ్మవారిని ప్రశాంతంగా వుండేటట్లు తీర్చి దిద్దారు. ఇప్పుడు ఆ తల్లిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.
ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పక్కనే వున్నా తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.