హనుమకొండ, వరంగల్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది వెయ్యి స్ధంబాల గుడి, భద్రకాళి ఆలయం. అందులో ఇప్పుడు వెయ్యి స్ధంబాల గుడి గురించి చెప్పుకుందాము. ఇది హనుమకొండలో వున్నది. ఈ ఆలయాన్ని ఇంతమటుకూ చూడనివాళ్ళు వెయ్యి స్ధంబాల గుడి అంటే అతి విశాలమైన ఆలయం, వెయ్యి స్ధంబాలతో వుంటుంది, ఇంచక్కా వెళ్ళి లెక్కబెట్టేద్దామని అంకెలన్నీ అర్జంటుగా గుర్తుచేసుకునే కష్టం పడకండి. పూర్వం దీనిపక్కనే వెయ్యిస్ధంబాలతో వున్న మండపం వుండేదని కొందరంటారు. కొందరేమో, అదేమీకాదు..ప్రస్తుతం వున్న ఆలయంలోనే అన్ని స్ధంబాలు వున్నాయంటారు. ఎలాగంటే కనబడే ఒక్కొక్క స్ధంబంమీదా పక్కపక్కనేనూ, ఒకదానిమీద ఇంకొకటి అనేక స్ధంబాలు వున్నట్లు చెక్కబడ్డాయి. ఫోటోలు చూడండి. ఇవ్వన్నీ కలిపితే వెయ్యి అవుతాయి, అందుకని ఆ పేరు అంటారు ఇంకొందరు. ఏది ఏమైనా, ఇంత అద్భుత సంపదల చరిత్రలు కూడా కనుమరుగయిపోతున్నాయనేది వాస్తవం.
అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని 1163 ఎ.డి. లో కాకతీయ రాజైన రుద్రదేవుడు నిర్మించాడు. అందుకనే ఆయన పేరుమీద ప్రధాన దైవమైన శివుడిని రుద్రేశ్వరుడన్నారు. నిత్య పూజలందుకుంటున్న రుద్రేశ్వరుడేకాక ఈ త్రికూటాలయంలో విష్ణు, సూర్యుడు వున్నారు.
కాకతీయులు శివ భక్తులు. వారు ఉదయించే సూర్యుని కిరణాలు ఆలయంలో లింగం మీద పడేటట్లు ఈ ఆలయం నిర్మించారు. తూర్పు అభిముఖంగావున్న రుద్రేశ్వరునిమీద ఉదయభానుని కిరణాలు పడతాయి. ఇక్కడ నందీశ్వరుడు నల్లని బసాల్ట్ రాతితో నిర్మింపబడిన ఏక శిలా విగ్రహం. ఈ విగ్రహం నిగనిగలాడుతూ శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంది. అంతేకాదు నాట్య మండపంలోవున్న స్తంబాలమీద అనేక విధములైన ఆభరణాల డిజైనులు, పువ్వులు వగైరాలు అద్భుతంగా చెక్కబడ్డవి.
అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని అవకాశమున్న ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి.
3 comments:
ఫోటోలు బాగున్నాయి. థాంక్స్.
మంచి ఫోటోలు! రామప్ప గుడి కూడా అదే సమయంలో కట్టారు. అక్కడ కూడా గుడి ఇలాగే ఉంటుంది.
మొన్న సెప్టెంబరులో నేను వరంగల్ వెళ్ళినపుడు భద్రకాళి గుడి, వెయ్యిస్థంబాల గుడి చూసాను. చాలా బాగున్నాయి.
Post a Comment