Wednesday, April 29, 2009

మురమళ్ళ

శ్రీ వీరేశ్వరస్వామి దేవస్ధానం

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవస్ధానం, మురమళ్ళ

యానాంనుంచీ మా తదుపరి మజిలీ మురమళ్ళ బయల్దేరాము. దోవలో రొయ్యల చెరువులలో ఫౌంటెన్ల తో నీరు వెదజల్లబడుతోంది. రొయ్యల చెరువులో ఫౌంటెన్లేమిటని అడిగితే, మా టాక్సీ డ్రైవర్ చెప్పాడు. రొయ్యలు కదిలే నీళ్ళల్లో పడుకోవట. పైగా తిని తిరుగుతుంటే రొయ్యలు తొందరగా పెరుగుతాయట. అందుకని పౌంటెన్ల ద్వారా నీటిని కదిలిస్తూ వాటిని నిద్రపోనీయకుండా చేస్తారు. పాపం.

శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్ధానం, మురమళ్ళ

దక్ష యజ్ఞం ధ్వంసం చేయటానికి శివుని జటాజూటంనుంచి ఉద్భవించిన మూర్తి వీరభద్రుడు. దక్షుని సంహరించిన తర్వాత యజ్ఞ పరిసమాప్తికై దక్షుని తిరిగి బ్రతికించుటకు పలు దేవతలు వేడగా అంగీకరించాడు. గొఱ్ఱె తలను దక్షుని శరీరమునకు అంటించి దక్షుని బ్రతికించి యజ్ఞాన్ని పూర్తి చేయించారు. తర్వాత కూడా వీరభద్రుడు శాంతించలేదు. కారణం సతీదేవి ఆత్మాహుతి. వీరభద్రుని శాంతింపచెయ్యటం ఎవ్వరితరమూకాక జగదంబను ప్రార్ధించారు. ఆవిడ తన షోడశ కళలలో ఒక కళ
అయిన భద్రకాళిని పంపింది. ఆమె ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడు భద్రకాళి పక్కనేవున్న ఒక తటాకమునందు మునిగి అత్యంత సుందరమైన ఒక కన్య రూపమున సాక్షాత్కరించినది. ఆమెను చూసి వీరభద్రుడు శాంతించి ఆమెను వివాహమాడాడు. ఆ నాటినుంచీ మహామునులందరూ శ్రీ స్వామివారికి గాంధర్వ వివాహ పధ్ధితిన నిత్యకళ్యాణను చేయసాగారు. ఆ పధ్ధతి నేటికీ కొనసాగుతున్నది. ఆ కాలంలో మహామునులందరూ గౌతమీనదీ తీరంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని వున్న ప్రదేశాన్ని మునిమండలి అనేవారు. అదే ప్రస్తుతం మురమళ్ళ.

తమ సంతానం వివాహం ఆలస్యం అయిందనుకున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే తమ సంతానం వివాహం త్వరగా అవుతుందని నమ్ముతారు. అలా కళ్యాణం చేయించే భక్తులకు ఇక్కడ సత్రంలో వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.


Sunday, April 26, 2009

యానాం

పిల్లల పార్కు
ప్రవేశ ద్వారం

యానాం బీచ్

యానాం

ఆంధ్ర ప్రదేశ్ లోని ఫ్రెంచ్ కాలనీ

చుట్టూ తూర్పు గోదావరి జిల్లా ... మధ్యలో యానాం .. మన దేశంలో వున్న మూడు ఫ్రెంచ్ కాలనీల్లో ఒకటి.. 30 స్క్వేర్ కిలో మీటర్ల విస్తీర్ణంలో వున్న ఈ ఫ్రెంచ్ కాలనీలో బీచ్, చిన్న పిల్లల పార్కు,, వెంకటేశ్వర స్వామి కోవెల, పోచమ్మ కోవెల వగైరా దర్శనీయ ప్రదేశాలున్నాయి.

కాలనీ లోకి వెళ్ళి రావటానికి ఆటోలు దొరుకుతాయి. మన వాహనాలలో వెళ్ళాలంటే కొంత రుసుము చెల్లించాల్సి వుంటుంది. మేము వెళ్ళింది మధ్యాహ్న సమయంలో. సమయాభావం వల్ల ఆటోలోనే ఒక రౌండ్ వేసి వచ్చాము








Wednesday, April 15, 2009

హంసలదీవి

సాగర తీరాన పీతలు పెట్టిన డిజైన్లు

సాగర తీరం
సాగర తీరాన కారులో షికారు

శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం

శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం

హంసలదీవి

ఈ పేరు మీరెప్పుడన్నా విన్నారా? కృష్ణానది సాగరుణ్ణి చేరే ఈ అత్యంత సుందర ప్రదేశంలో దేవతలచే నిర్మింపబడిన శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం వుంది. అంతేకాదు, మహర్షుల, దేవతలకు సంబంధించిన అనేక సంఘటనలు జరిగిన ప్రదేశం ఇది. పెద్దలనూ, పిన్నలనూ ఒకేలాగా ఆకర్షించే ప్రదేశమిది. దేవతలచే కట్టబడిన ఆలయ దర్శనానికి పెద్దవాళ్ళు ఎంత సంబర పడతారో, సముద్రంలో ఆడుకోవటానికీ, సముద్రం ఒడ్డున కెరటాలతో పోటీపడుతూ కారులో తిరగటానికీ పిన్నలు అంతే సరదా పడతారు.

హంసలదీవి కృష్ణా జిల్లాలో విజయవాడకు 110 కి. మీ., అవనిగడ్డకు 25 కి.మీ. దూరంలో వుంది. విజయవాడ నుంచి పామర్రు, కూచివూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఈ ప్రదేశం చేరుకోవచ్చు. అలాగే మచిలీ పట్నం నుంచి కూడా. అయితే ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం కొంచెం తక్కువ. అవనిగడ్డనుంచి హంసలదీవి దాకా బస్సులున్నాయిగానీ ఫ్రీక్వెన్సీ తక్కువ. దారి బాగుంటుంది. మన వాహనాల్లో వెళ్తే ఏ అలసట లేకుండా జాం జాంమని కృష్ణానదీ, సాగర సంగమాల ప్రదేశందాకా కూడా వెళ్ళిరావచ్చు. మనకి కావలసిన ఆహారం, మంచినీరు వగైరాలన్నీ తీసుకు వెళ్ళాలి. అక్కడ ఇంకా అన్ని సౌకర్యాలూ లేవు. వెలుతురువున్న సమయంలో వెళ్తే ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. హమ్మయ్య. రూటు చెప్పేశాను కదా. ఇది చదివి ప్రయాణం విరమించుకోకండి. మన వాహనంలో వెళ్తే ఎంతో సరదా అయిన ప్రదేశం ఇది. సరే ఇప్పుడు ఇక్కడ జరిగిన పౌరాణిక విశేషాలు తెలుసుకుందాము.

పౌరాణిక విశేషాలు

ముందు ఇక్కడి కృష్ణా నదీ విశేషాలు చెప్పుకుందాం. పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టకునే వాళ్ళు. గంగానది, పాపం, వీళ్ళందరి పాపాలతో అపవిత్రమైంది. ఆ పాపాలనుంచి విముక్తికై ఆవిడ మహావిష్ణువుని ప్రార్ధించింది. అప్పడాయన, పాపాత్ముల పాపాలమూలంగా నువ్వు నల్లగా మారి పోయావు, అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ వుండు. ఏ తీర్ధంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదలి హంసలా స్వచ్ఛంగా మారుతావో, అది దివ్య పుణ్య క్షేత్రం అని చెప్పాడు. గంగ కాకి రూపంలో వివిధ తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసింది. వెంటనే ఆవిడకి కాకి రూపం నశించి హంస రూపం వచ్చింది. అందుకని ఈ ప్రాంతాన్ని హంసలదీవి అన్నారని ఒక కధ.

పులిగడ్డ దగ్గర కృష్ణ చీలి దక్షిణ కాశియని పేరు పొందిన కళ్ళేపల్లి (నాగేశ్వర స్వామి) మీదుగా హంసలదీవికి వచ్చినవైనం గురించి ఒక కధ వుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో వున్నది.

పూర్వం దేవతలు సముద్ర తీరంలో ఒక విష్ణ్వాలయం నిర్మించి అక్కడ వారు పూజాదికాలు నిర్వర్తించాలనుకున్నారు. మరి దేవతలు వచ్చి పూజలు చెయ్యాలంటే వారికి ఏ ఆటంకం లేని ప్రదేశం కావాలి కదా. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిర్మానుష్యంగా వుండేది. అందుకని దేవతలు ఇక్కడ వేణు గోపాల స్వామి ఆలయం కట్టి పూజలు చెయ్యసాగారు.

అక్కడ చాలామంది మహర్షులు, పరమ హంసలు తపస్సు చేసుకుంటూ వుండేవారు. అందుకని కూడా హంసల దీవి అనే పేరు. వాళ్ళు అక్కడ ఒక యజ్ఞం చేయాలని శౌనకాది మహర్షులను ఆహ్వానించారు. వారందరూ వచ్చారు. ఆ యజ్ఞాన్ని చూడటానికి ప్రజలు ఎక్కడెక్కడినుండో రాసాగారు. గోదావరి తీరాన నివసించే కవశుడు అనే మహర్షికి కూడా ఆ యజ్ఞం చూడాలనిపించింది. ఆయన బ్రాహ్మణ మహర్షికీ, శూద్ర జాతి స్త్రీకి జన్మించినవాడు. గొప్ప తపస్సంపన్నుడు. అనేకమంది శిష్యులకు మోక్ష మార్గాన్ని బోధించేవాడు. కొందరు శిష్యులను వెంటబెట్టుకుని యజ్ఞం చూడటానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళిన సమయంలో యజ్ఞం జరిగేచోట పెద్దలెవరూ లేరు. శిష్యులు కొందరు కార్యక్రమ నిర్వహణలో నిమగ్నులయి వున్నారు. వాళ్ళు కవశ మహర్షిని చూడగానే వేద మంత్రోఛ్ఛారణ ఆపేసి కుల భ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమయినదని అనేక విధాల దూషించి, అగౌరవ పరచారు. కవశుని శిష్యులు కోపంతో వారించబోగా, కవశుడు వాళ్ళని అడ్డుకుని, అక్కడి మునులకు క్షమాపణ చెప్పి, దేవతలు నిర్మించిన వేణు గోపాలస్వామి ఆలయం ముందు నిలిచి విచారిస్తూ, కృష్ణ స్తోత్రాలు చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు జరిగిన విచిత్రమిది. నిర్మలంగా ప్రవహిస్తున్నకృష్ణానది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఇప్పటి పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలయి ఒక చీలిక ఉధృతంగా బయల్దేరి కళ్ళేపల్లి మీదుగా హంసలదీవి వచ్చి వేణు గోపాలస్వామి పాదాలను తాకి, కవశ మహర్షి చుట్టూ తిరిగి యజ్ఞ వాటికని ముంచెత్తింది. యజ్ఞకుండాలు నీటితో నిండిపోయాయి. ఋత్విక్కులు నీటిలో కొట్టుకుపోయారు.

భయంకరమైన ఈ అకాల ప్రళయానికి కారణం శౌనకాది మహర్షులు దివ్య దృష్టితో చూసి కవశ మహర్షికి జరిగిన అవమానంవల్ల ఇది జరిగిందని గ్రహించి కవశుని దగ్గరకు పరుగున వెళ్ళి క్షమించమని వేడుకున్నారు. ఆయన, క్షమించటానికి నేనెవరిని నా అవమానం చెప్పుకుని కృష్ణుడి దగ్గర బాధపడ్డాను. దానికి ఆ దేవదేవుని పేరుతోనే వున్న ఈ నదీమ తల్లి వచ్చి నన్ను వూరడించింది. మీరు ఆ కృష్ణుణ్ణి, నదీమతల్లిని ప్రార్ధించండి అన్నాడు. తర్వాత వీరి ప్రార్ధనలు విన్న కృష్ణమ్మ శాంతించింది. కవశ మహర్షి కోరిక మీద అక్కడ సాగరంలో కలిసింది. అప్పడు కవశ మహర్షి ఈ స్ధలం చాలా పవిత్రమైనది. ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళయినా ఈ సాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడ వేణు గోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారు అని చెప్తుండగానే ఒక కాకి ఆ సంగమంలో స్నానం చేసి హంసలా మారి, వేణు గోపాలునికి ప్రదక్షిణలు చేసింది. ఇది చూసిన వారంతా అక్కడ స్నానం చేసి, వేణు గోపాలుని దర్శించి, కవశ మహర్షికి ప్రణమిల్లారు.

ఆగండాగండి. ఈ కధ చదివి అర్జంటుగా స్నానం చెయ్యటానికి ఎక్కడ పడితే అక్కడ నీటిలో దిగద్దు. ఇక్కడ కొన్ని ప్రదేశాలు ప్రమాద భరితాలు. అందుకనే మన పాపాలు పోయినా పోకపోయినా నిర్ణీత ప్రదేశాల్లోనే స్నానం చేయండి.

కృష్ణమ్మ సంగతి తెలుసుకున్నాము, సంగమంలో స్నానం చేశాము. ఇంక ఆలస్యమెందుకు వేణు గోపాలుని దర్శించి, ఆలయ విశేషాలు తెలుసుకుందాం పదండి.

ఆలయ విశేషాలు

వూర్వం దేవతలు సముద్రతీరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకున్నాము కదా. వాళ్ళు ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించారుట. కోడి కూసే సమయానికి రాజగోపురం సగమే పూర్తయింది. అయినా తెల్లవారిందని వారు గోపురాన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుధ్ధరణ జరిగినా, అసంపూర్తిగా వున్న గాలి గోపురాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్ధానం వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని నూతన గాలి గోపురాన్ని నిర్మించారు. పురాతన గాలి గోపుర శిధిలాలు కొన్ని ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి.

స్వామి ఆవిర్భావం గురించి కధ. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో ఆవులు ఎక్కువగా వుండేవు. అందులో కొన్ని ఆవులు ఇంటి దగ్గర పాలు సరిగ్గా ఇవ్వక పోవటంతో వాటిని జాగ్రత్తగా కాపలా కాశారు. అవి వెళ్ళి ఒక పుట్ట దగ్గర పాలు వర్షించటం చూసి గోపాలురు కోపంతో అక్కడున్న చెత్తా చెదారం పోగుచేసి ఆ పుట్టమీద వేసి తగులబెట్టారు. పుట్టంతా కాలిపోయి అందులో స్వామి శరీరం తునాతునకలయింది. స్వామిని చూసిన గోవుల కాపరి వెంటనే మంట ఆపివేశాడు. అందరూ వచ్చి పుట్ట తవ్వి చూడగా ముఖం తప్ప మిగతా శరీరమంతా ఛిన్నా భిన్నమయిన స్వామిని దర్శించారు. అదిచూసి వారంతా సతమతమవుతున్న సమయంలో స్వామి ఒకరికి కలలో కనిపించి పశ్చిమ గోదావరి జిల్లాలో కాకరపర్తి అనే గ్రామంలో భూస్వామి ఇంటి ఈశాన్యమూలగల కాకర చెట్టుకింద వున్న నన్ను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించమని ఆనతినిచ్చారు. ఆ విగ్రహమే ఇది. నల్లశానపు రాతిలో చెక్కిన విగ్రహంలాగా కాక నీలమేఘ ఛాయతో విలసిల్లుతోంది.

దేవాలయంపై పెద్ద రాతి దూలాలు అమర్చబడివున్నాయి. ఈ ప్రాంతంలో కొండ గుట్టలు కానీ, పర్వతాలుగానీ లేవు. ఆ రాతి దూలాలను ఇప్పుడు తీసుకు రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. మరి ఎటువంటి సౌకర్యాలూ లేని ఆ కాలంలో వాటిని ఎక్కడనుంచి తెచ్చారో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆలయ కుడ్యాలపై గరుత్మంతుడు, లక్ష్మీ నారాయణులు, నరసింహుడు, ఆంజనేయ స్వామి మొదలగు విగ్రహాలున్నాయి.

ఉత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘ శుధ్ధ నవమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

సరదాలు
ఆలయం దగ్గరనుండి సాగర సంగమందాకా సముద్రం ఒడ్డునే మన వాహనంలో సరదాగా తిరగచ్చు. నేల గట్టిగా వుంటుంది.


చీరెల మీద డిజైన్లు కొత్తవి కావాలనుకుంటున్నారా డిజైనర్లు పేపర్లూ పెన్నులూ పట్టుకెళ్ళండి. మీకు తిండీ తిప్పలూ గుర్తు రావు. సముద్రం ఒడ్డున పీతలు పెట్టే గుడ్లు ఎన్ని రకాల డిజైనలుగా వుంటాయో. అందులో కొన్ని పిల్లలయి కను రెప్పపాటులో నేలలోకి వెళ్ళటం చూసి తీరవలసిందే.
(ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక 16-4-2009 సంచికలో ప్రచురించబడింది.)

Friday, March 20, 2009

ద్వారపూడి

ప్రకృతి సౌందర్యంలో అందాల నంది విగ్రహం
మూడంతస్తుల శివాలయం, ఎదురుగా నంది

సాయిబాబా దేవాలయం

అయ్యప్ప దేవాలయం

అయ్యప్ప దేవాలయం పై అంతస్తు

దేవాలయం ముందు హరి హరుడు

ద్వారపూడి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ఈ ఊళ్ళో 10 సంవత్సరాల క్రింతం కట్టబడిన అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు.

అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న వెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా మూడు అతస్తుల శివాలయం వున్నది. ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా 3 వ అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి.

అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే.

Saturday, March 14, 2009

మావుళ్ళమ్మవారి దేవాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

మావుళ్ళమ్మవారి ఆలయ దృశ్యం

మావుళ్ళమ్మవారి ఆలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి.

చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.

ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.

ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ. ల లోపే వుటుంది.

బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం, యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10—15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.