Monday, July 4, 2011

శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయం, జొన్నవాడ, నెల్లూరు జిల్లా




కోరికలు తీర్చే కామాక్షీతాయి

నెల్లూరుకి 18 కి.మీ. ల దూరంలో వున్నది శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయం. స్కాంద పురాణంలో శ్లాఘించబడిన ఈ దేవతామూర్తుల ఆవిర్భావం కృతయుగంలో జరిగింది. దానికీ ఒక కధ వున్నది. అదేమిటంటే….

ఆ కాలంలో ఋషీశ్వరులు, రాజులు, లోక కళ్యాణంకోసం యజ్ఞాలు చేసేవారు. ఒకసారి కశ్యప ప్రజాపతి ప్రజాక్షేమం కోసం ఒక యజ్ఞాన్ని చేయాలనుకుని తగిన ప్రదేశంకోసం వెతుకుతూ పినాకినీ నదీతీరాన వున్న ఈ ప్రాంతాన్ని చూసి యజ్ఞానికి అనువైన ప్రదేశమనుకుని ఇక్కడ తూర్పు, నైరుతి, వాయవ్యాలలో యజ్ఞకుండాలను స్ధాపించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు. ఈ యజ్ఞంమూలంగా అప్పుడు జరిగిన లోక కళ్యాణం సంగతి ఎలా వున్నా, ఇన్ని యుగాలయినా భక్తుల కోరికలు తీరుస్తూ, వారి కొంగు బంగారమై పూజలందుకుంటున్న మూడు దేవతామూర్తుల ఆవిర్భావం జరిగింది.

యజ్ఞం పూర్తయిన వెంటనే తూర్పున ప్రతిష్టింపబడ్డ ఆహవనీయాగ్నియందు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీరంగనాధుడు ఆవిర్భవించాడు. ఆయనే ప్రస్తుతం నెల్లూరులోవున్న తల్పగిరి రంగనాధస్వామి. నైరుతిలోప్రతిష్టింపబడ్డ వైవస్వతాగ్నిలో శ్రీలక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువుతీరాడు. వాయువ్యానవున్న గార్హస్పత్యాగ్నియందు పరమశివుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు. కశ్యప ప్రజాపతి మహాశివుణ్ణి అక్కడనే కొలువుండి ప్రజలను కాపాడమని ప్రార్ధించగా పరమశివుడు అంగీకరించాడు. అదే నాటి రజతగిరి. యజ్ఞము చేసిన ప్రదేశముగనుక యజ్ఞవాటిక, అదే కాలక్రమేణా జన్నవాడ, జొన్నవాడ అయింది.

కైలాసంలో పార్వతీదేవి శివుడు కనబడక తన మనోనేత్రంతో అసలు విషయం తెలుసుకుని తానూ అక్కడికి వచ్చి పరమశివుణ్ణి కైలాసానికి రమ్మని కోరుతుంది. అందుకు శివుడు అత్యంత సుందరమైన ఆ ప్రదేశాన్ని వీడలేనని పార్వతీదేవినికూడా అక్కడే కొలువుతీరి భక్తుల కోర్కెలు తీర్చమని ఈశ్వరుడు ఆదేశించగా పార్వతీదేవి కూడా అక్కడే కొలువుతీరింది. ఇది పురాణగాధ. కాలక్రమంలో పినాకినీ నది (పెన్నా నది) వరదలలో ఈ ప్రదేశమూ, ఆలయమూ నీట మునిగాయి. మేటలు వేసి, బీళ్ళుగామారిన ఈ ప్రాంతంలో మనుమసిధ్ధి రాజుల పాలనా కాలంలో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి పశువులు ఇక్కడికి మేతకివచ్చేవి. వాటిలో సమీప గ్రామమయిన పెనుబల్లి జమీందారుకి చెందిన ఒక ఆవు సరిగా పాలు ఇవ్వక పోవటంతో ఒకనాడు పశువుల కాపరి ఆ ఆవుని వెంబడించి, ఆ ఆవు ఒక పుట్టలోకి పాలను వదులుతూండటం చూసి, చేతిలోని గునపాన్ని విసిరాడు. ఆవు తప్పించుకుందిగానీ, గునపం పుట్టలోదిగి పుట్టనుంచి రక్తంరావటం మొదలయింది. అది చూసిన పశువుల కాపరి భయపడి పరుగున వెళ్ళి జమీందారుకి విషయం తెలియజేశాడు. వెంటనే జమీందారు ఆ ప్రదేశానికి చేరుకుని పనివాళ్ళతో ఆ పుట్టని తవ్వించగా రక్తపు మడుగులో శివలింగము కనిపించింది. జమీందారు వెంటనే ఆ లింగాన్ని పినాకినీ నది నీళ్ళతో శుభ్రపరిచి, ఆ పరిసరాలన్నీ శుభ్రంచేయించి, లింగానికి పూజలు జరపటానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించాడు.

కొన్నాళ్ళకి శివుడు జమీందారు కలలో కనిపించి తనకి శిరోవేదనగావున్నదనీ, మల్లెపూవుల చల్లదనంతో తన శిరో వేదన తీర్చమని ఆదేశించాడుట. జమీందారు తన కలని గురించి పెద్దలకి తెలియజేసి, తన తోటలోని మల్లెపూవులతో శివుణ్ణి అర్చించాడుట. అప్పటి పండితులు ఆలోచించి మల్లెపూవులతో పూజించమని శివుడు ఆజ్ఞాపించాడుగనుక, మల్లెపూవుల నడుమ విలసిల్లుతున్న ఆ దేవదేవునికి మల్లికార్జునుడని పేరుపెట్టారు.

మరికొంతకాలము తర్వాత పార్వతీదేవి ఆ జమీందారుకి స్వప్న దర్శనమిచ్చి తాను వస్తున్నానని, తనని పరమేశ్వరుని చెంత ప్రతిష్టించమని ఆదేశించింది. తర్వాత ఒకనాడు పెనుబల్లి గ్రామ సమీపంలో పినాకినీ నదిలో చేపలు పడుతున్న బెస్తవారికి అమ్మవారి విగ్రహం కనబడింది. వారు అమిత సంతోషంతో ఆ తల్లిని గంగమ్మతల్లిగా భావించి తమకు చేతయిన విధంగా పూజించి, తమకు లభించిన ఆహారాన్ని ఆ తల్లికి నివేదించి తాము తినసాగారు. (అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో సంకల్పంలో గంగా, కామాక్షీ అనుగ్రహసిధ్ధ్యర్ధం అని చెబుతారు). జమీందారుకి ఈ విషయం తెలిసి అక్కడికివెళ్ళి, తన కలసంగతి చెప్పి, వారి అంగీకారంతో అమ్మవారినితెచ్చి స్వామి దగ్గర ప్రతిష్టించారు. అమ్మవారి విగ్రహం పెనుబల్లి సమీపంలో దొరికిందికనుక అమ్మవారిని పెనుబల్లి ఆడబడుచుఅని, ఈనాటికికూడా బ్రహ్మోత్సవాలలో కళ్యాణమునాడు అమ్మవారికి ఆ గ్రామమునుంచి సారె తీసుకువస్తారు. కళ్యాణము తర్వాత అమ్మవారుకూడా ఊరేగింపుగా ఆ గ్రామానికి వెళ్తారు.

అమ్మవారిని శివుని పక్కన ప్రతిష్టించిన తర్వాత ఆలయంలో బ్రాహ్మణుడు నివేదన చేస్తే బయట పామరులయిన భక్తులు తాము వండుకున్న మాంసాదులు నివేదించేవారు.ఆ నివేదనలు అలవాటుపడ్డ అమ్మవారు మాంసాహార నివేదన లేని రోజు అర్ధరాత్రి ఊరిలో ప్రవేశించి పశువులను ఆరగించటం మొదలుపెట్టింది. భయపడిన భక్తులు రాత్రిళ్లు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బతికేవారు.

ఆ సమయంలో ఆది శంకరాచార్యులు ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తులద్వారా అమ్మవారి ఆగడాలు విన్న శంకరాచార్యులవారు ఆలయం తలుపులు తెరిపించి రాత్రికి అక్కడే విశ్రమించారు. అర్ధరాత్రి బయటకు వెళ్ళబోతున్న అమ్మని ప్రార్ధించి, అనేక విధముల స్తోత్రములు చేసి, శాంతపరచి, తిరిగి గర్భగుడికి చేర్చారు. అమ్మ ఉగ్ర రూపాన్ని శాంత రూపంగా మార్చటానికి తన తపశ్శక్తిని ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాలచెంత ప్రతిష్టించారు.

తన ధ్యానములో కృతయుగములో అమ్మవారు స్వామిని చూడవలెనని కోరికతో కైలాసమునుంచి వచ్చి ఇచ్చట కొలువుతీరిన వృత్తాంతము, తరువాత జరిగిన విషయములు గ్రహించి, స్వామిని చూడవలెననే కోరికతో వచ్చినది కావున ఆనాడే పరమేశ్వరుడు కామాక్షీ అని పిలిచిన పలుకులు గ్రహించి, అమ్మకి కామాక్షీతాయి అని నామకరణము చేసెను. తాయి అంటే అమ్మ అని అర్ధము. ఆది శంకరాచార్యులవారు కాలడివారు, జన్నవాడ ఆ కాలములో మదరాసు ప్రాంతములో వున్నది కనుక తాయి అని అనివుండవచ్చు.

ఆది శంకరులవారు కొంతకాలము అక్కడే వుండి అమ్మవారికి మాంసాహరము పూర్తిగా నిషేధించి, పైదీక మార్గమున శ్రీచక్రమును నవావరణములతో పూజించే విధానాన్ని అక్కడి బ్రాహ్మణులకు బోధించారు. అప్పుడు గ్రామస్ధులు ఆదిశంకరులవారిని “అయ్యా, మేము మాసాహారులం, ఏ ఆహారమైనా భగవంతునికి చూపించిన తరువాత భుజించాలి అంటారు..మరి మేము తినే ఆహారము అమ్మవారికి చూపించకూడదు అంటున్నారు..దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి” అని అడిగారు. అందుకు శంకరాచార్యులవారు దేవాలయమునకి సమీపములోవున్న వేపమానును చూపించి దీనిని కనకదుర్గ అవతారముగా భావించి, మీ నైవేద్యములు ఇక్కడ సమర్పించుకోండి అని చెప్పి తమ యాత్రని కొనసాగించారు.

కొంతకాలం తర్వాత పల్లవరాజు నరసింహవర్మ తురుష్కలమీద దండయాత్రకి వెళ్తూ తోవలో
ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారు నరసింహవర్మకు స్వప్న దర్శనమిచ్చి, నీకు యుధ్ధములో విజయం చేకూరుతుంది, తిరుగు ప్రయాణంలో ఈ ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. యుధ్ధములో విజయము సాధించిన పల్లవరాజు తిరుగు ప్రయాణంలో ఈ దేవాలయమును దృఢముగా నిర్మింపచేసి, దేవీ కైంకర్యమునకు అనేక భూములను దానము చేసెను.

సంతానము లేనివారు ఈ ఆలయములో నిదురించితే అమ్మ స్వప్న సాక్షాత్కారమిచ్చి వారి కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మిక.

ఈ దేవాలయంలో జరిగే నవావరణ పూజ బీజాక్షరములతో కూడివున్నది. కొన్ని తరముల క్రితం సాక్షాత్తూ అమ్మవారిచేత గుడిలోని ప్రధాన పూజారికి ఉపదేశింపబడిన బీజాక్షరముల సంపుటీకరణమే ఈ నవావరణయని ప్రసిధ్ధి. ఈ పూజ ప్రపంచంలో కేవలం ఈ దేవాలయమునందుమాత్రమే జరుపబడుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి వున్నదని భక్తుల నమ్మకం. అమ్మవారికి ఈ పూజ అంటే ఎంతో ప్రీతి అని ఇక్కడికి వచ్చే భక్తులు ఈ పూజ జరిపించుకుంటారు.


ఇక్కడ శివాలయంలో శివునికి జరిగే సహస్రనామం కూడా సాక్షాత్తూ వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదములలోని సారమంతా క్రోడీకరించి సహస్రనామాలుగా ఉపదేశించారని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన నాలుగు వేదములు పారాయణ చేసినంత ఫలితం వస్తుందిట. ఈ సహస్రనామం వేరే ఏ దేవాలయంలో జరుగదు. వ్రాత ప్రతి తప్ప ఏ గ్రంధములోను ఈ సహస్రనామం లేదు. దీనిని ఇక్కడి అర్చకులు ఎవరికి చెప్పరు. అది వారి నియమము.

ఇన్ని విశేషాలు వున్న ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.

దర్శన సమయాలు ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా తిరిగి సాయంత్రం 5-00 గం. ల నుంచి రాత్రి 9-00 గం. ల దాకా.

Wednesday, May 11, 2011

భద్రకాళి ఆలయం, వరంగల్

భద్రకాళి ఆలయం వెలుపల గుట్టమీద శివ పార్వతులు
ఉత్సవ సమయంలో ఆలయంలో పాట కచ్చేరీ
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE


వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది. ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు. కానీ అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడుట. విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.

తరువాత కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు. తరువాత కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించి, ఆలయానికి కొంత భూమిని కూడా ఇచ్చాడు. కాలగమనంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో, ఈ దేవస్ధానం వైభవం కూడా క్షీణించింది. సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది. ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి.

భారతదేశ స్వాతంత్ర్యానంతరం శ్రీ మగన్ లాల్ సమేజగారి స్వప్నంలో భద్రకాళి
అమ్మవారు దర్శనమిచ్చి ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. ఆయన పెద్దలందరి సహకారంతో ఆలయం పునర్నిర్మించగా, 29-7-1950న సంప్రోక్షణ గావింపబడి నాటినుంచీ నిత్య పూజలతో దినదినాభివృధ్ధి అవుతోంది.

10 అడుగుల పైనే ఎత్తయిన అమ్మవారి విగ్రహం అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూంటుంది. పూర్వం ఈ విగ్రహం భీకరంగా వుండేదట. భక్తుల సౌకర్యార్ధం అమ్మవారిని ప్రశాంతంగా వుండేటట్లు తీర్చి దిద్దారు. ఇప్పుడు ఆ తల్లిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.

ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పక్కనే వున్నా తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.

Friday, May 6, 2011

వెయ్యి స్ధంబాల గుడి, హనుమకొండ





హనుమకొండ, వరంగల్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది వెయ్యి స్ధంబాల గుడి, భద్రకాళి ఆలయం. అందులో ఇప్పుడు వెయ్యి స్ధంబాల గుడి గురించి చెప్పుకుందాము. ఇది హనుమకొండలో వున్నది. ఈ ఆలయాన్ని ఇంతమటుకూ చూడనివాళ్ళు వెయ్యి స్ధంబాల గుడి అంటే అతి విశాలమైన ఆలయం, వెయ్యి స్ధంబాలతో వుంటుంది, ఇంచక్కా వెళ్ళి లెక్కబెట్టేద్దామని అంకెలన్నీ అర్జంటుగా గుర్తుచేసుకునే కష్టం పడకండి. పూర్వం దీనిపక్కనే వెయ్యిస్ధంబాలతో వున్న మండపం వుండేదని కొందరంటారు. కొందరేమో, అదేమీకాదు..ప్రస్తుతం వున్న ఆలయంలోనే అన్ని స్ధంబాలు వున్నాయంటారు. ఎలాగంటే కనబడే ఒక్కొక్క స్ధంబంమీదా పక్కపక్కనేనూ, ఒకదానిమీద ఇంకొకటి అనేక స్ధంబాలు వున్నట్లు చెక్కబడ్డాయి. ఫోటోలు చూడండి. ఇవ్వన్నీ కలిపితే వెయ్యి అవుతాయి, అందుకని ఆ పేరు అంటారు ఇంకొందరు. ఏది ఏమైనా, ఇంత అద్భుత సంపదల చరిత్రలు కూడా కనుమరుగయిపోతున్నాయనేది వాస్తవం.

అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని 1163 ఎ.డి. లో కాకతీయ రాజైన రుద్రదేవుడు నిర్మించాడు. అందుకనే ఆయన పేరుమీద ప్రధాన దైవమైన శివుడిని రుద్రేశ్వరుడన్నారు. నిత్య పూజలందుకుంటున్న రుద్రేశ్వరుడేకాక ఈ త్రికూటాలయంలో విష్ణు, సూర్యుడు వున్నారు.

కాకతీయులు శివ భక్తులు. వారు ఉదయించే సూర్యుని కిరణాలు ఆలయంలో లింగం మీద పడేటట్లు ఈ ఆలయం నిర్మించారు. తూర్పు అభిముఖంగావున్న రుద్రేశ్వరునిమీద ఉదయభానుని కిరణాలు పడతాయి. ఇక్కడ నందీశ్వరుడు నల్లని బసాల్ట్ రాతితో నిర్మింపబడిన ఏక శిలా విగ్రహం. ఈ విగ్రహం నిగనిగలాడుతూ శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంది. అంతేకాదు నాట్య మండపంలోవున్న స్తంబాలమీద అనేక విధములైన ఆభరణాల డిజైనులు, పువ్వులు వగైరాలు అద్భుతంగా చెక్కబడ్డవి.

అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని అవకాశమున్న ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి.


Saturday, April 9, 2011

శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయం, వరంగల్


యమ్.జి.యమ్. ఆసుపత్రి సమీపంలోవున్న ఈ అతి చిన్న ఆలయం వెనుక ఒక కధ వున్నది. పూర్వం ఇదంతా అడవి. లోగేశ్వరమ్మ అనే బాల వితంతువు ఇక్కడ ఒక గుడిసె వేసుకుని దేవతా విగ్రహాలను పెట్టుకుని, భగవన్నామస్మరణ చేస్తూ వుండేది. అప్పుడు ఇక్కడికి అనేక సర్పాలు, నాగుపాములతో సహా వచ్చేవి. లోగేశ్వరమ్మ పోసిన పాలు తాగి పోయేవి. అవి ఎంత అలవాటయినాయంటే ఎప్పుడన్నా అవి రాకపోతే లోగేశ్వరమ్మ పిలిస్తే వచ్చేవి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఊరి పెద్దలు కొందరు అక్కడ సత్యన్నారాయణ విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. ఏవో కారణాలవల్ల కుదరలేదు.

శ్రీ భద్రకాళి జన్నయ్య శాస్త్రి శిధిలావస్ధలోవున్న దేవాలయ పునరుధ్ధురణకోసం చేసిన కృషి వలన ధర్మారం జమీందార్లు ఇక్కడ ఒక చిన్న గది వేసి ఆలయ నిర్వహణకు 5 ఎకరాల భూమి ఇచ్చారు. అప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నాగు పడగ, శివలింగం మాత్రమే వుండేవి. ఆలయం సుబ్రహ్మణ్య ఆలయమని పేరుపొందింది. శ్రీ గణేశ శాస్త్రిగారనే విద్వాంసుడు ఇక్కడ కొన్నాళ్ళు అనుష్టానం చేసుకున్నారు. ఆయన ఇక్కడ శ్రీ రాజేశ్వరీ అమ్మవారిని ప్రతిష్టించాలని, అమ్మవారి విగ్రహంకోసం ఆయనా, జమీందారూ రెండుసార్లు జయపూర్ వెళ్ళారుకానీ సరైన అమ్మవారి విగ్రహం కనబడలేదు. మూడోసారి వెళ్ళినప్పుడు ముందు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం కనబడింది. అప్పుడు వారు అంతకుముందునుంచీ అది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంకదా..దానిలో అమ్మవారిని ప్రతిష్టించాలనుకునేసరికి అమ్మవారి విగ్రహంకూడా దొరకటంలేదని అనుకుని, ఆ ఆలయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం కూడా స్ధాపిస్తామని దణ్ణం పెట్టుకున్నారుట. వెంటనే వారికి కావలసిన అమ్మవారి విగ్రహంకూడా కనబడి ఆ రెండు విగ్రహాలనూ తీసుకొచ్చి పక్కపక్కనే ప్రతిష్టించారు. ఇక్కడ రాజేశ్వరీ అమ్మవారి విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం వుంటుంది.

నిత్య పూజలతోపాటు వినాయక నవరాత్రులు, శరన్నవరాత్రులూ, సుబ్రహ్మణ్య షష్టికి 3 రోజుల ఉత్సవాలు వగైరా ఘనంగా జరుపుతున్నారు ఈ ఆలయంలో.

ఇప్పటికీ ఆలయంలోకి అప్పుడప్పుడూ పాము వస్తూవుంటుంది.

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, రామన్నపేట, వరంగల్



రద్దీగా వుండే మైన్ బజారులో వున్న ఈ ఆలయానికి భక్తుల తాకిడీ ఎక్కువే. ముఖ్యంగా పర్వదినాలూ, శనివారాలూ. స్వామి వెండి కవచం అలంకరణలో అద్భుతంగా దర్శనమిస్తాడు.