
శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి
ముక్తేశ్వరంలో సాయంకాలం 5-30 కి బయల్దేరి తర్వాత మజిలీ ర్యాలి చేరుకునేసరికి సాయంకాలం 6-50 అయింది.  చీకటిపడటంవల్ల  దోవలో ప్రకృతి అందాలు చూడలేకపోయాం.  
శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది.  విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో.
 భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే.  మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు.  మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట.  దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడుట.  మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక  రాలి క్రమంగా ర్యాలి అయిందంటారు.  ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు.
ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు.  అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి.  చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు.  కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు.  ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు.  ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు.
విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు.
ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ।
నేను మరచిన ఇంకో విషయాన్ని శ్రీ డి। వేణుగోపాల్ గారు గుర్తు చేశారు   ఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న గుంటలో  ఎప్పుడూ నీరు వుంటుంది।  ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.
స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారిమూర్తిని చూసి అద్భుతమని చేతులు జోడించవససినదే.
ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం -- శ్రీ ఉమా కమండలేశ్వరాలయం.  పూర్వం అక్కడ త్రిమూర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట.  ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట.  అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కింది.
ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది.  ఇది చదివిన తర్వాత వెళ్ళినవాళ్ళు గమనించండి.  ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట.  మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.
ట్రాన్సఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఒకసారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే త్వరలో ట్రాన్సఫర్ అవుతుందిట.
తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం (పూతరేకులకు ప్రసిధ్ధి) మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి బస్సులున్నాయి. రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు।
 
 





 

6 comments:
మీ యాత్రా విశేషాలు బాగున్నాయి. ఒక విషయం రాయడం మరిచిపోయారు. విష్ణుమూర్తి పాదాల వద్ద అస్తమాను (నీరు) గంగ ఊరుతూ ఉంటుంది.
ట్రాన్సఫర్ కావాలనే నేను ర్యాలి వెళ్లి ప్రార్థించి వచ్చాను. సంవత్సరం అవుతోంది. ఇంతవరకూ కాలేదు.
జగన్మోహినీ విగ్రహ వర్ణనా ...రాలి స్థల పురాణ విశేషాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు . ధన్యవాదాలు .
నిజమే వేణుగోపాల్ గారూ
గుర్తు చేసినందుకు సంతోషం. పోస్ట్ లో కూడా రాస్తున్నాను. ధన్యవాదాలు.
psmlakshmi
ధన్నవాదాలు పరిమళంగారూ
psmlakshmi
మేము వెళ్ళేసరికి కూడా చీకటి పడింది.కాని బాగానే చూడ కలిగాము.
బాగుంది.
మాలా కుమార్ గారూ,
చీకటిపడ్డా గుడి మూసేదాకా గుడీ, గుళ్ళో దేవుణ్ణీ చక్కగా చూడచ్చు. అయితే మొట్టమొదటిసారి వెళ్ళేటప్పుడు కొత్త ప్రదేశంలో బయట ప్రదేశాలు అన్నీ తెలియవు. ప్రకృతి అందాలనూ ఆస్వాదించలేము.
psmlakshmi
Post a Comment