Thursday, January 28, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా--4



పెనుగొండ


మర్నాడు ఉదయం హిందూపూర్ నుంచి ఒక గంట ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి పెనుగొండ వచ్చాం. పేరుకి తగ్గట్లే పెద్ద కొండ.  కొండమీద కోట.  కొండ దిగువ శ్రీకృష్ణ దేవరాయలవారి సమ్మర్ పేలెస్..(.చిన్నదే)..వున్నది.  అక్కడ గైడ్ వున్నారు.  గైడ్ సహాయంతో పేలెస్ చూశాం.  ఆయన ఇచ్చిన సమాచారంతో ఈ పెనుకొండ గుత్తికొండకన్నా పెద్దదనీ, కొండమీద కోటశిధిలాలు, లక్ష్మీ నరసింహస్వామి గుడి వున్నాయని తెలుసుకున్నాము.  అలసిపోయి వున్న మేము కొండ ఎక్కటం కష్టమని ఆ ప్రయత్నం చెయ్యలేదు.

ఈ ఊళ్ళో ఇంకో విశేషం...శ్రీ కాళేశ్వరరావు అనే ఆయన చాలా అందంగా, ఆధునాతనంగా షిర్డీసాయి గుడి కట్టించారు.  ఉదయం, సాయంకాలాలలో కొంచెంసేపు మాత్రమే అందరికీ దర్శనం.  విదేశీయులు చాలామంది వచ్చి అక్కడే వుండి, గుళ్ళో మెడిటేషన్ చేసుకుంటారు.  అందుకే వాళ్లకి అంతరాయం లేకుండా అందర్నీ దర్శనానికి కొంచెంసేపు మాత్రమే అనుమతిస్తారు.  మేము వెళ్ళిన సమయం దర్శన సమయం కానందున లోపల చూడలేకపోయాము.  బయటనుంచి చూస్తేనే ఆకర్షణీయంగా వుంది.

అక్కడనుంచి  ఆ ఊళ్ళోనే వున్న కుంభకర్ణ గార్డెన్స్ కి వెళ్లాం.  చాలా పెద్ద కుంభకర్ణుడి విగ్రహం,....నిద్రిస్తున్న కుంభకర్ణుణ్ణి నిద్రలేపే దృశ్యం.....ఆ శిల్పం ఒక్కటే అక్కడి ఆకర్షణ  ఆ గార్డెన్స్ ప్రక్కనే చిన్న ఆంజనేయస్వామి ఆలయం వుంటే చూసి, మధ్యాహ్నం 2-40 కల్లా బస్సులో హిందూపూర్ చేరుకున్నాం.  రాత్రి 7 గంటల బస్ లో హైదరాబాద్ తిరిగి రావటానికి రిజర్వు చేసుకున్నాం.  ఈ లోపల అక్కడికి దగ్గరలోనే వున్న లేపాక్షి చూడాలనుకున్నాం.

3-00 గంటలకు హిందూపురం బస్టాండులో ఒక ఆటో అతనికి మా హైదరాబాద్ బస్ సంగతి చెప్పి, ఈ లోపల లేపాక్షి చూపించి తీసుకు రావాలని చెప్పి ఆ ఆటోలో లేపాక్షి బయల్దేరాం.  రేపు ఆ ముచ్చట్లు.     



   కుంభకర్ణుడి విగ్రహం


కృష్ణదేవరాయల సమ్మర్ పెలేసు


0 comments: