Thursday, January 14, 2010

తాడిపత్రి -- ఆకట్టుకునే అనంతపురం – 3


తాడిపత్రి  --  ఆకట్టుకునే అనంతపురం – 3

మర్నాడు ఉదయం 9-30కి కాఫీ ఫలహారాలయ్యాక ఆటోలో  తాడిపత్రిలో వున్న దేవాలయాల దర్శనానికి బయల్దేరాం.

బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం

పురాతనకాలంనాటి శివాలయం ఇది.  శివలింగం ముందునుంచి ఎంత తోడినా వెంటనే నీరు  ఊరుతూ వుంటుంది.  అందుకే ఈ స్వామికి బుగ్గరామలింగేశ్వరుడని పేరు.  రెండు గాలి గోపురాలు కొంత శిధిలమయ్యాయి.  కానీ అద్భుతమైన శిల్ప సంపద బేలూరు, హొళెబీడు దేవాలయాలను గుర్తు తెచ్చింది.
 తర్వాత కన్యకాపరమేశ్వరి దేవాలయం.. కొత్తదే, వెళ్ళాం.  ఉదయం 10 గంటలకే మూసేస్తారుటు, దర్శనం కాలేదు.  అలాగే మార్కండేయస్వామి గుడి కూడా మూసి వున్నది.

చింతల వెంకట రమణమూర్తి ఆలయం

ఈ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి చింతలే వుండవంటారు.  అందరి చింతలూ తీర్చేవాడు కనుక ఆ స్వామికి ఆ పేరు.  ఈ ఆలయం శిల్పకళ కూడా బాగుంది. 


ఇక్కడనుంచీ దగ్గరలోనే వున్న ఆదూరుకోన శ్రీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు మా ఆటో డ్రైవర్.  లోకల్ ఆటోవాళ్ళు మనకి చూడదగ్గ ప్రదేశాల గురించి మంచి సమాచారం ఇస్తారు.  మేము చూసిన ఈ ఆదూరుకోనలోని పురాతన నరసింహస్వామి ఆలయం, దీని తర్వాత కట్టబడిన ఓబులేశుకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూడగలిగామంటే మా ఆటో డ్రైవర్ వల్లనే.

మధ్యాహ్నం 2-15 గం. లకి హోటల్కి చేరుకుని రెండు గంటల విశ్రాంతి తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు.  అనంతపూర్ దాకా ఒక బస్ (1 గంట 15 నిమిషాల ప్రయాణం), ఆక్కడనుంచీ హిందూపూర్ బస్ ఎక్కి పెనుకొండలో దిగేసరికి రాత్రి 8 గంటలు దాటింది.  అక్కడ వుండటానికి సరైన హోటల్ దొరక్కపోవటంతో మళ్లీ వేరే బస్ ఎక్కి హిందూపూర్ చేరుకుని (ఒక గంట ప్రయాణం) అక్కడ హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

తదుపరి పోస్టులో పెనుకొండలో చూసినవీ చూడనివీ.

5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.మీటపాలో చిన్న సవరణ.ఆదూరు కోనకాదు ఆలూరు కోన,అక్కడ కొలువై ఉన్నస్వామి రంగనాథుడు.

psm.lakshmi said...

విజయమోహన్ గారూ,
మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.
మేము చూసిన వూరు పేరు ఆదూరుకోన అనే ఆటో డ్రైవర్ చెప్పాడు. అక్కడ మేము చూసింది నరసింహస్వామి గుడే (పాతది). అలాగే ఓబులేశుకోనలో లక్ష్మీ నరసింహస్వామి గుడి. సిమెంటు ఫ్యాక్టరీల దోవలో వెళ్ళాం. చూసిన వూళ్ళ మరియు గుళ్ళ వివరాలు ఎప్పటికప్పుడు రాసుకుంటాను అందరికూ చెప్పే విషయాలు సాధ్యమైనంత మటుకూ తప్పులు లేకుండా చెప్పాలనే వుద్దేశ్యంతో. రంగనాధస్వామి గుడి తాడిపత్రిలో చూశాం. ఇదీ కొత్త గుడే.
psmlakshmi

చిలమకూరు విజయమోహన్ said...

ఆలూరుకోన రంగనాథుని ఆలయానికి రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు .ఒకటి పెన్నా సిమెంట్స్ ఉన్న మార్గం.ఈ మార్గంలోనే కొండ ఎక్కేటప్పుడు ఓబులేశు కోన వస్తుంది.అక్కడ కొలువై ఉన్నస్వామి ఓబులేశుడు అనగా నరసింహస్వామి. రెండవ మార్గం ఆలూరు గ్రామం వైపు నుంచి వెలుతుంది. తాడిపత్రికి సమీపంలోనే తిమ్మనచెరువు గ్రామ సమీపంలోవజ్రగిరి లక్ష్మీ నరసింహుల దేవాలయం ఉంది. తాడిపత్రి పట్టణంలో రంగనాథ,కోదండరామ స్వామి ఆలయం ఉంది. అక్కడ రంగనాథుడు,సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముడు,రామానుజులు,ఆళ్వారులు వేంచేసి ఉన్నారు.నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఆదూరు కోన లేదు. తప్పు పట్టాలని కాదు సరిదిద్దాలని.

psm.lakshmi said...

విజయమోహన్ గారూ
తప్పు సరిచేయటానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. నేను సరిగ్గానే అర్ధం చేసుకుంటున్నాను. ఆటో డ్రైవర్ ముందు ఒక నరసింహస్వామి గుడికి తీసుకెళ్లాడు. అది ఆదూరుకోన అని చెప్పాడు. అక్కడనుంచి తాడిపత్రికి తిరిగి వచ్చేటప్పుడు ఓబులేశుకోనకి వెళ్ళాం. అంటే ముందు మేము చూసింది ఆదూరుకోన కాదేమో అదే మీరు చెప్పే ఆలూరు కోన కాదేమో. ఆ పేరంటే సరిగ్గా వినలేదేమో అనుకునేదాన్ని. కానీ నరసింహస్వామికీ, రంగనాధ స్వామికీ పొరపడే అవకాశం లేదు. కనుక మీరు చెప్పే ఆలూరు కోన కి మేము వెళ్ళ లేదు. అయితే మేము చూసిన నరసింహ స్వామి గుడి తిమ్మన చెరువుదేమో. తాడిపత్రి వూళ్ళో మేము చూసిన రంగనాధస్వామి, మీరు చెప్పినదీ ఒకటే.
psmlakshmi

రవి said...

ఆలూరు కోన లో ఆలయం వెనుకవైపు బండరాళ్ళ మధ్యగా నీరు పారుతుంటుంది. ఆ నీటివల్ల ఏర్పడ్డ చిన్న కొలను, అదీ కూడా అక్కడ ఉంటాయి. ఆలయం బయట బ్రాహ్మలు ముందుగా చెబితే భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తారు.