Thursday, April 15, 2010

కాశీ యాత్ర మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు---3గంగా స్నానం

ఉదయం 5 గం. కల్లా  గంగాస్నానానికి బయల్దేరాము.  సుప్రసిధ్ధ దశాశ్వమేధ ఘాట్ కి పది నిముషాల నడక.  గంగ ఒడ్డుకి చేరాం.  ఈ ఒడ్డున జనం ఎక్కువ వున్నారు.  బోటు వాళ్ళ హడావిడి.  గంగ మధ్యలో ఇసుక మేట వేసి వుంది.  కొంతమంది బోట్ లో అక్కడదాకా వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నారు.  ఈ గందరగోళంలోకన్నా మధ్యదాకా వెళ్ళి అక్కడ  స్నానం చేద్దామనిపించింది.  బోటులో అక్కడ దాకా  తీసుకెళ్ళి, దగ్గర దగ్గర ఒక గంట అక్కడ ఆగి, తిరిగి ఈ ఒడ్డుకి చేర్చటానికి మనిషికి 20 రూపాయలు తీసుకున్నాడు .  అక్కడ కూడా నీళ్ళు కలుషితంగానే అనిపించాయి.  కానీ ఆ బోటు అతను, మా సత్రం లోను చెప్పారు నీళ్ళు అలా కనిపించినా చాలా స్వఛ్ఛమైనవి, చేతిలోకి తీసుకుని చూడండి.  దేన్లోనన్నా పట్టి చూడండి ఏమైనా వైరస్ వగైరా వుంటుందేమో చెక్ చేసుకోండి అని నీళ్ళు మంచివని ఘట్టిగా చెప్పారు.  ఏదైనా ఇంత దూరం వచ్చి గంగ స్నానం చెయ్యకుండానా....సెంటిమెంటొకటి.  సరే స్నానం చేశాం. 

ఇక్కడ బయల్దేరేముందన్నారు..పెద్ద నదుల్లో స్నానం చేసేటప్పుడ ఆ చీరె నదిలో వదిలి పెట్టాలని.  మా పెద్దవాళ్ళెవరూ చెప్పకపోయినా చేస్తే పోలా అనిపించి ఆ పనీ చేశాం.  చక్కగా పడవతను అన్నీ తీసుకుని దాచుకున్నాడు.  పోనీలే ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయని సంతోషించాం.  అక్కడ ఫోటోగ్రాఫర్ రెడీగా వున్నాడు.  ఘాట్ కూడా వచ్చేటట్లు ఫోటో తీసి కాపీ వెంటనే ఇచ్చేస్తానన్నాడు.  ఒక్కో ఫోటోకి 20 రూపాయలు.  తీయించుకున్నాం.  ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి గంగ నీరు నింపుకుని అక్కడనుండీ  విశ్వనాధుని గుడికి బయల్దేరాము.

పడవ దిగి ఘాట్ లో మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చేసరికి కొంచెం అలసట అనిపించింది.  వేడి వేడి పాలు తాగి గుడికి బయల్దేరాము.  సన్నటి సందులగుండా అడుగుతూ అడుగుతూ మొత్తానికి చేరాం కాశీ విశ్వనాధుని ఆలయం...ఎన్నాళ్ళనుంచో చూడాలని తపించిన ఆలయం...అతి పురాతన నగరంలోని  విశ్వ విఖ్యాతి చెందిన ఆ విశ్వేశ్వరుని ఆలయం దగ్గరలో
 కనీసం రెండు చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది.  సెల్ ఫోన్లు, కెమేరాలు తీసుకెళ్తే తప్పనిసరిగా బయట షాపులో లాకర్ లో పెట్టి వెళ్ళాలి, అలా పెడితే ధ్యాస వాటిమీదే వుంటుంది, అవి తీసుకెళ్ళద్దని మాకు హైదరాబాదులోనే సలహాలొచ్చాయి.  సలహాని పాటించి, ఇచ్చినందుకు వారికి, పాటించినందుకు మాకు శబాష్ చెప్పుకున్నాం.  పెన్నులు కూడా తీసుకెళ్ళద్దు.  మా పిన్నికి సెంటిమెంట్ వున్న ఒక పెన్ను లోపలకి తీసుకువెళ్ళనియ్యకుండా సెక్యూరిటీ వారి దగ్గర పెట్టుకుని తర్వాత ఇవ్వలేదు.  పిన్ని ఒక పెన్ను చూసి తనదేమోనని చూడబోతుంటే, ఎప్పుడు పెట్టారు అని అడిగింది సెక్యూరిటీ లేడీ.  చెబితే, ఇది మీదికాదు, అప్పుడు నేను లేను, ఎవరికిచ్చావో వాళ్ళనే అడుగు, దిక్కున్న చోట చెప్పుకో పో టైపులో మాట్లాడింది చాలా దురుసుగా.  సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీలు మారుతూ వుంటారుగా, ఎవరికిస్తే వాళ్ళనే అడగాలంటే ఎలా  పైగా కొత్త వూళ్లో కొత్త మనుష్యులని గుర్తు పెట్టుకోవటం కష్టంకదా.  ఆ స్ధలంలో వున్న సెక్యూరిటీ వాళ్ళు అని గుర్తుపెట్టుకుంటారుగానీ, వాళ్ళ మొహాలు, వాళ్ళ పేర్లు ఎంతమందికి గుర్తుంటాయి. 

ఈ చెక్ లు దాటుకుని వెళ్తే విశ్వనాధుని ఆలయం.  నా ఖ్యాతే విశ్వవిఖ్యాతి చెందిందిగానీ, నే వుండే స్ధలం మాత్రం ఇంతే అనే అమాయకుడు భోళా శంకరుడి గుడి చిన్నదే.  మేము తీసుకెళ్ళిన గంగ నీరు శివయ్యకి అభిషేకం చేసి తాకి నమస్కారం చేసుకున్నాము.  మొత్తానికి ఆ తోపులాటనుంచి బయటపడి ప్రక్కనే వున్న ఇంకొక శివాలయంలో (ఉపాలయం) కూడా నమస్కరించి బయట పది నిముషాలు కూర్చున్నాము. ఆ పది నిముషాలు కూడా రేపు చేయించబోయే అభిషేకం గురించి అక్కడ మహారాష్ట్ర బ్రాహ్మణునితో మాట్లాడటానికి తప్పనిసరిగా ఆగవలసి వచ్చింది కనుక వుండనిచ్చారు.    ప్రదేశం చిన్నదవటంతో లోపల ఎక్కువసేపు కూర్చోనివ్వరు. లోపల కూడా సెక్యూరిటీ చాలా వున్నది.  సాధన చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఈ గుళ్ళో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనుభవించగలరు.

బయటకొచ్చి 1 కి.మీ దూరంలో వున్న విశాలాక్షి గుడికి నడిచాము.  ఆ సందుల్లో రిక్షాలు కూడా రాలేవు.  విశాలాక్షి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  ఆలయం చిన్నదే.  అసలు విగ్రహానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.  ప్రతిష్టించిన విగ్రహం వెనకనుంచి వంగి చూడాలి ఒరిజనల్ అమ్మవారిని.  ముందు శ్రీ చక్రం ప్రతిష్టింపబడివుంది.  భక్తులు ఇక్కడ కుంకుమపూజ చేసుకోవచ్చు, అక్కడవున్న పండాకి 151 రూ. ఇస్తే పూజ రుసుంతో సహా  పూజా ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు.  20 రూ. ఇస్తే అమ్మవారి ఫోటో, కుంకుమ ఇస్తారు.

తర్వాత అన్నపూర్ణ తల్లి దర్శనానికి బయల్దేరాము.  ఎవరినడిగినా విశ్వనాధుడి గుళ్ళోనే వుందికదా అన్నారు. (గుడిలో ఉపాలయం వుంది).    చాలామంది అన్నపూర్ణా ట్రస్టుని చూపించారు.  చివరికి ఒక చీరెల షాపు ఏజెంటు వెంటబెట్టుకుని తీసుకెళ్ళి చూపించాడు.  సమయం ఉదయం 9-40 అయింది.  ఆయన తీసుకెళ్ళినదీ అన్నపూర్ణా ట్రస్టు వాళ్ళ భోజనశాలకే.  ఏం చెయ్యాలా అనుకుంటుండగానే, అక్కడున్నవాళ్ళు గుమ్మానికి అడ్డపెట్టే చిన్న గేటులాంటిది తీసి, మా పిన్నినీ నన్నూ చూసి కింద కూర్చోలేనివాళ్ళు ఇటురండి, కూర్చోగలిగినవాళ్ళు అటెళ్ళండని చూపించారు.  వెళ్ళాం.  అక్కడ మా ఆఫీసువాళ్ళు కనబడి పలకరించేలోపల వాళ్ళపని వాళ్ళు చేసేశారు.  అదేనండీ మమ్మల్నందర్నీ కూర్చోబెట్టి వడ్డించేశారు.  భోజనం ఎంత బాగున్నదంటే, భోంచెయ్యగానే మా అంతట మేమడిగి డొనేషన్ ఇచ్చి వచ్చాం,  అక్కడివాళ్ళెవరూ దాని గురించి చెప్పకపోయినా.  ఇంతకీ దాన్లోనే ఇంకో పక్క అన్నపూర్ణ ఆలయం అని తర్వాత తెలిసింది.  చూశారా, కాశీ చేరగానే అన్నపూర్ణమ్మ ఎలా ఆదరించి భోజనం పెట్టించిందో.  ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటలనుంచీ సాయంకాలం 4 గంటలదాకా.  తర్వాత వుండదు.

కానీ మా సత్రం వాళ్ళకి కోపం వచ్చింది మామీద.  వాళ్ళకి చెప్పకుండా బయట తిని వచ్చినందుకు.  కాశీలో మీ పేర్లతో అన్నం వృధా అయింది.  ఆ పాపం మీదేనన్నారు.  అక్కడికీ జరిగిందంతా చెప్పాము.  పొద్దున్న 9-30 కల్లా వెళ్ళి భోంచెయ్యంకదా అన్నా మళ్ళీ మళ్ళీ అనేసరికి కోపం వచ్చి గట్టిగా అన్నాను.  కావాలని చేసింది కాదు, పైగా మీకు చెప్పాలని మాకు తెలియదు.  ఇప్పుడే చెప్పారు.  తెలియక చేసినదానికి ఆ దేవుడు ఏ శిక్ష వేస్తే అది మేమే అనుభవిస్తాం, ఇంక ఈ విషయం గురించి మాట్లాడద్దు అని.  అప్పుడు వూరుకున్నారు.  కాశీలో మన సహనానికి పరీక్ష చాలా చోట్ల వుంటుంది.  దీంతో ఒక విషయం అర్ధమయివుంటుంది మీకు.  మీరు దిగిన సత్రంలో భోజన, ఫలహార సదుపాయం వుంటే మీరు అక్కడ తినేది లేనిది వారికి  ఏ రోజుకారోజు ముందు చెప్పి మీ పేర్లు రాయించుకోవాలి.

మధ్యాహ్నం కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం మళ్ళీ బయల్దేరాం.  సాయంకాలం చూసిన శ్రీ కేదారనాధ్ ఆలయం, ఇంకా కొన్ని విశేషాలు వచ్చే పోస్టులో. 

  కాశీ విశాలాక్షి

2 comments:

మాలా కుమార్ said...

మీ కాశీ కబుర్లు బాగున్నాయండి .

psm.lakshmi said...

సంతోషం మాలాగారూ
psmlakshmi