Thursday, May 6, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు—7





ప్రయాగ (అలహాబాద్)

27-3-2010 ఉదయం 5 గంటలకల్లా  సుమో లో బయల్దేరి  10 గంటలకు ప్రయాగ చేరాము.  అశోకుడు కట్టించిన కోట దగ్గర నది ఒడ్డున మమ్మల్ని దింపి అక్కడ బోటు వాళ్ళని, పాండాలనీ మాట్లాడుకోమని మా సుమో డ్రైవరు వీలయినంత దూరం పారిపోయాడు.  కాశీలో సత్రం వాళ్ళు చెప్పిన తెలుగు బ్రాహ్మణుడి దగ్గరకి తీసుకెళ్ళమంటే మీ కార్యక్రమాల్లో  పిండ ప్రదానం వగైరాలు  లేవుకదా, ఇక్కడ మాట్లాడుకోండి, తొందరగా అవుతుందని ఓ ఉచిత సలహా పారేశాడు.  ఇంక చూడండి మా తిప్పలు.  ఎందుకులెండి...మీరెళ్ళినప్పుడు ఎటూ పడతారుగా.  అవేమీ మాకొద్దంటారా,  బుధ్ధిగా మీరు దిగిన సత్రం వాళ్ళు చెప్పిన తెలుగు బ్రాహ్మలు ఎవరైనా వుంటే వారి దగ్గరకు వెళ్ళండి.  మీరు నేరుగా పండాలతో మాట్లాడుకునేదానికన్నా సమయం, శ్రమ, డబ్బు ఆదా అవుతాయి.  నేను సేకరించిన ఒక అడ్రసు కింద ఇస్తున్నాను.  కేవలం మీకు సమాచారం ఇవ్వటం తప్ప నాకూ వీరికీ ఎటువంటి పరిచయమూ లేదు.  నేను కనీసం వీరిని చూడలేదుకూడా.  గయ వెళ్ళినప్పుడు మా వాన్ డ్రైవరు ఇచ్చాడు.  తెలుగు వాళ్ళు సాధారణంగా ఇక్కడికే వెళ్తారు అని.  ఇంక మా కధలోకి వస్తాను.

బ్రాహ్మణుడిని, బోట్ నీ మాట్లాడుకుని ఎక్కాము.  బోట్ ఎందుకంటే నీళ్ళల్లో కొంచెం దూరం తీసుకెళ్తారు.  అక్కడ మూడు నదులూ, గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహిని) సంగమ ప్రదేశమని.  అన్నిరకాల కార్యక్రమాలు, స్నానాలు అక్కడే.  పిండ ప్రదాన కార్యక్రమం చేయిస్తే బ్రాహ్మణుడికి రూ. 850, సంకల్పం, వేణీ దానాలకి రూ. 250 కి మాట్లాడాము.  బోటు తమాషా చూడాలి.  ఒకతను తీసుకెళ్ళి, కార్యక్రమం అయ్యేదాకా అక్కడవుండి తిరిగి తీసుకు రావటానికి ఐదుగురికి రూ. 2000 అడిగాడు, మేము రూ. 1200కి బేరం కుదుర్చుకున్నాము.  అతనడిగినది కాదు విడ్డూరం, ఇంకో ఇద్దరు ముగ్గురు పడవల వాళ్ళు అతను మళ్ళీ తీసుకు రాడు, ఒక సారికే ఆ డబ్బు, తీసుకురావటానికి మళ్ళీ అంత అడుగుతాడు, మేము చాలా చౌకగా రూ. 2000 కే తీసుకెళ్ళి తీసుకొస్తామని, మమ్మల్ని పెద్ద ఆపదనుంచి కాపాడే ధీరోదాత్తుల్లా మాట్లాడుతుంటే, మేము ఆ ప్రదేశానికి కొత్తవాళ్ళం, ఆ గందరగోళంతో తలవాచిపోయి వున్నవాళ్ళం, అయినా వాళ్ళ మాటల్లో పాయింటు కేచ్ చేసి, వాళ్ళు మాట్లాడుతున్నదంతా తనగురించి కాదు అని అతి మామూలుగా వున్న మా పడవతనితో ఎందకైనా మంచిదని, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకున్న డబ్బు తీసుకెళ్ళి, అక్కడ హడావిడి చెయ్యకుండా ఆగి, తిరిగి తీసుకు రావటానికి, ఇక్కడికి వచ్చాకే డబ్బు ఇస్తాము, ముందు ఇవ్వము అని గట్టిగా చెప్పాము.  ఏ మాటకామాటే చెప్పాలి.  మా బోటతను చాలా నెమ్మదస్తుడు.  ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు.  పైగా నీళ్ళల్లో దిగేటప్పుడు, పైకి రావటానికి సహాయం చేశాడు.  అతనికి ఫోటోగ్రాఫీ కూడా తెలుసు, అక్కడ మా ఫోటోలు అతనే తీశాడు.  చివరిగా ఒడ్డుకి చేర్చాకే డబ్బు తీసుకున్నాడు.  మేము సంతోషంగా ఎక్కువ ఇచ్చింది సంతోషంగా తీసుకున్నాడు.  పండా మాత్రం అక్కడ పళ్ళెం సర్దాలి (పూజా ద్రవ్యాలకి, మాట్లాడింది దానితో సహా అయినా,) అని ఒకసారి, దేనికో కావాలి అడ్వాన్సు ఇవ్వమని ఒకసారి రూ. 200 తీసుకున్నాడు.  అక్కడ వాళ్ళు చేసిన హడావిడికి అవ్వి మర్చిపోయాం.  ఇవ్వన్నీ ఎందుకింత వివరంగా చెబుతున్నాను అంటే మీరెళ్ళినప్పుడు మీకు కొంత తలనొప్పి తగ్గుతుందని.

వేణీ దానం

ఈ వేణీ దానం ప్రక్రియ  ప్రయాగలో మాత్రమే వున్నదంటారుగానీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి కూడా ఆడవాళ్ళు సాధారణంగా మూడు కత్తెర్లనీ, ఐదు కత్తెర్లనీ, బెత్తెడనీ జుట్టు ఇస్తూ వుంటారు.  అయితే అక్కడ ఏ తతంగాలు లేకుండా, కామ్ గా కానిచ్చేస్తారు.  ఇక్కడ దానికో సంకల్పం, పూజ వగైరాలన్నీ.  నిజం చెప్పద్దూ, నాకు మాత్రం పండా చెప్పిన మంత్రాలు అస్సలు అర్ధం కాలేదు, నన్నవ్వి చెప్పమంటే, ప్రయత్నించీ మానేశాను తప్పులు చెప్పేకన్నా చెప్పకుండా వుండటం వుత్తమమని.  వాళ్ళు మాత్రం అనేక విధాల డబ్బు గుంజటానికి ప్రయత్నిస్తారు.  తతంగం జరిగేటప్పుడు ఒకతన్ని పిలిచి నన్నతనికి 10 రూ. ఇమ్మన్నాడు.  అది అతను నా కొంగుకి ముడి వేస్తాడని, వేసినందుకు ఆ బ్రాహ్మణుడికి ఏమైనా ఇమ్మని అన్నాడు.  నాకెందుకో చాలా కోపం వచ్చింది.  బ్రాహ్మణుడు వెయ్యాలంటే సంకల్పం చెప్తున్నాయన వెయ్యాలి, మధ్యలో ఎవరినో పిలిచి అతను వేసేదేంటి, ఠాట్ వల్లకాదు పొమ్మన్నా.  కావాలంటే నా కొంగుకి నేనే వేసుకుంటానని నేనే వేసుకున్నా.  పైగా నాకే పాపం చుట్టుకున్నాసరే, నాకనిపించింది చెబుతున్నాను.  అసలు వాళ్ళు బ్రాహ్మణులేనా అనే అనుమానం కూడా.  వాళ్ళ అవతారాలు అలా వున్నాయి.  అదే అనేశాను కూడా.  నా ఈ కాశీ ప్రయాణంవల్ల ఒక్కటి మాత్రం రూఢి అయిపోయింది.  నరకం, శిక్షలు వుంటే, నా కాశీ యాత్ర నాకు పెద్ద శిక్షలు తయారుగా పెట్టి వుంటుంది. 

ఆ పండా చెప్పినది నాకర్ధం కాకపోయినా ఏ దేవుడు కరుణించాడో, ఆ తతంగం కొంచెం సంతోషాన్నే మిగిల్చింది.  ముందు సంగమంలో స్నానం చేశాక (నడుం లోతు నీళ్ళే వుంటాయి.  నీళ్ళంత బాగాలేదు) ఎఱ్ఱ గులాబీలు దోసిటనిండా పోసి సంకల్పం చెప్పించాడు. ఆ పూలని చూసి మనసు కుదుటపడింది.   రెండు పసుపు ముద్దలిచ్చి ఒకటి గౌరీ దేవి, ఒకటి మా వారిని తల్చుకుని శివుడు ఆకారం చెయ్యమన్నాడు (ఆయన రాలేదుకదా).  అది ఆకులో పెట్టి, మా వారి తుండు గుడ్డ (మా పిన్ని ముందునుంచీ పోరుతోంది తీసుకురా అని) నా చీరె కొంగుకి ముడి వేసి, రెండో చివర ఆ పసుపు ముద్దకి చుట్టి పెట్టాడు.  అంటే ఆయన కూడా అక్కడే వున్నట్లు.  తర్వాత బొట్టు, పసుపు రాసుకుని, పారాణి పెట్టుకోమన్నాడు.  జడ చివరిదాకా వేసుకుని పువ్వు పెట్టుకోమన్నాడు.  తర్వాత జడ చివర కొంచెం కత్తిరించాను (ఇది భర్త చేస్తాడు.  ఆయన రాలేదని వేరే ఎవరినో కట్ చెయ్యమన్నాడు నేను వద్దని నేనే చేశాను).  తర్వాత ఆ వెంట్రుకలు పసుపు ముద్దలో కలిపి అదీ, 3 కొబ్బరి కాయలు, పువ్వులు, నేను తీసుకెళ్ళిన జాకెట్ బట్ట అన్నీ గంగమ్మకి సమర్పించి, మళ్ళీ స్నానం చేయమన్నాడు.  (మనం కొబ్బరి కాయలు సమర్పించగానే అక్కడే కాచుకుని వుంటారు వాటిని తీసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి.) అక్కడికి కార్యక్రమం పూర్తయినట్లే.  భార్యా భర్తలు ఇద్దరూ వస్తే ఈ తతంగం అంతా భర్త ఒడిలో భార్యని కూర్చో పెట్టి చేస్తారు.

మొత్తానికి త్రివేణీ సంగమంలో కార్యక్రమం పూర్తయ్యి ప్రయాగ (అలహాబాద్) లో మిగతా ప్రదేశాలు చూడటానికి బయల్దేరాము.  ఆ విశేషాలు వచ్చే పోస్టులో.

ప్రయాగలో తెలుగు బ్రాహ్మణుడి అడ్రసు, ఫోన్ నెంబరు

బ్ర.వే. హరి జగన్నాధ శాస్త్రి, వారి కుమారులు శ్రీ లక్ష్మణ శాస్త్రి
110/105, బక్షీ దారాగంజ్, అలహాబాద్211006

ఫోన్  మొబైల్  94152 38615  మరియు  93891 95851

లేండ్ లైన్   0532  2501729  మరియు  0532  2506058
              

4 comments:

Telugu said...

లక్ష్మి గారు చాలా ధన్యవాదములు అండి మీకు , ఈ విషయాలు చెప్పినందులకు .
మీరు ఒక్క సారి telugukingdom.net చూసి మీ అభిప్రాయం చెప్పగలరు
ఇట్లు
జ్యోతి

Anonymous said...

oh boy..we had such a bad experience with that lakshmana sastri..he is like any other panda in the town.

Gopal said...

ఇన్నాళ్ళనుండి ఇక్కడ ఉంటున్నా ప్రయాగ వెళ్ళి త్రివేణీ స్నానం చెయ్యాలంటే ఇప్పటికీ నాకు హడలే. కారణం అక్కడ ఉండే పడవవాళ్లు, పండాలు. ఈమధ్య నేను వెళ్లలేదు కాని నాకు మీరు బోటు వాడికిచ్చినది చాలా ఎక్కువ అనిపిస్తోంది. సాధారణంగా మనిషికి 100 – 150 ఇస్తే సరిపోతుందేమో. అంతేకాదు అలహాబాదులో భోజనానికి కూడా ఇబ్బందే. అలహాబాదు కన్నా నాకు కాశీయే నచ్చుతుంది. గంగదగ్గిర అంత ఏడిపించరు, భోజనానికి కూడా ఇబ్బందిలేదు.

Unknown said...

psmlakshmiblogspotcom గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.