Thursday, December 9, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 25



వ్యాస కాశీ
పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ.  వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? 
పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.
తర్వాతకాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది.  ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు.  ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే.  మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది.  సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.





 వ్యాస కాశీ  ప్రవేశ ద్వారమ

గంగకవతల ఒడ్డున రాజుగారి కోట


2 comments:

voleti said...

I regularly read ur experiences and found your narrations are true and just like our feelings

psm.lakshmi said...

thank you Voleti garu