Saturday, March 19, 2011

శ్రీ పద్మాక్షీ ఆలయం, హనుమకొండ




పూర్వం ఇక్కడ సిధ్ధులు మోక్ష సాధనకై ఈశ్వరుడికోసం తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై, శక్తి లేనిదే మోక్షంలేదని, ఆవిడకోసం తపస్సు చెయ్యమని చెప్పగా మునులు అలాగే చేశారు. శక్తి ప్రత్యక్షమై తన పాదాల దగ్గర ఈశ్వరుడు వుంటే అలాగే సిధ్ధలు అభీష్టంమేరకు అక్కడ వెలుస్తానన్నది. ఈశ్వరుడు దానికొప్పుకుని కొండ దిగువను సిధ్ధేశ్వరస్వామిగా వెలిశాడు. అమ్మవారు కొండపైన చిన్న గుహలో పద్మాక్షీదేవిగా వెలిసింది. ఆ చిన్న గుహనే గర్భాలయంగా మలిచారు.

కాకతీయ వంశానికి కాకతీయులు అనే పేరుకూడా అమ్మవారే పెట్టిందట. 5 వ శతాబ్దంలో కాకతీయరాజుకి ఖడ్గాన్నిచ్చి, ఆ ఖడ్గం ఆయన దగ్గరున్నంతమటుకూ విజయం లభిస్తుందని ఆశీర్వదించింది. కాకతీయ రాజులలో జైనమతావలంబులున్నారు. అందుకే కొన్ని జైన శిల్పాలను కూడా కొండమీద దర్శించవచ్చు.

పద్మాక్షీ అమ్మవారు ఓరుగల్లువాసుల ఇలవేల్పు. కొండముందు కాకతీయులకాలంనాటి చెరువు. ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం చాలా వైభవంగా జరుగుతుంది.

మార్గం

హనుమకొండ కొత్త బస్టాండు ముందునుంచి కొంత దూరం వెళ్తే కుడివైపు చిన్న ఆంజనేయస్వామి ఆలయం వస్తుంది. అక్కడ కుడివైపు తిరిగి కొంతదూరం వెళ్ళాక కుడివైపున చిన్న కొండమీద ఆలయం కనబడుతుంది. ఆలయం చేరుకోవటానికి కుడివైపు చిన్న మట్టిరోడ్డులో కొంత దూరం వెళ్ళాలి. దోవలో చెరువు కనబడుతుంది

ఒక చిన్న మాట

కాకతీయ రాజుకి ఖడ్గం ఇచ్చిన అమ్మవారి ఆలయాన్ని దర్శించాలనే ఆశతో ఈ ఆలయానికి మేము రెండుసార్లు వెళ్ళి అమ్మవారిని దర్శించలేక వచ్చేశాము. కారణం ఆలయం అన్ని సమయాలలో తీసి వుండదు. ఎప్పుడు తీసి వుంటుందో తెలిపే బోర్డులేమీ లేవు. కొత్తవారికి కష్టమే. ఉదయం 10గ. లకి వెళ్ళినప్పుడు అక్కడివారు కలిసి సాధారణంగా ఈ సమయంలో తెరిచే వుంటుంది. పూజారి ఉదయం 9 గం. ల ప్రాంతంలో వచ్చి 11 గం. ల దాకా వుంటారు, మేమీ సమయంలోనే వస్తామెప్పుడూ అన్నారు. కానీ మేము వెళ్ళినప్పుడు ఆ సమయంలో కూడా మూసి వున్నది. కొండ దిగువదాకా కారు వెళ్ళినా ఆలయం చేరుకోవటానికి తప్పనిసరిగా మెట్ల మార్గాన వెళ్ళాలి. 30 పైన ఎత్తయిన మెట్లు వుంటాయి. పైకి ఎక్కే ముందు ఆలయం తెరచివుందో లేదో తెలుసుకుని వెళ్ళండి. అక్కడ జన సంచారంకూడా తక్కువే వుంటుంది.



1 comments:

మాలా కుమార్ said...

మా చిన్నప్పుడు ఎప్పుడూ వెళుతూ వుండేవాళ్ళము . కాని ఈకథ తెలీదు .
బాగారాసారు .